శ్రీకృష్ణ నిర్యాణం



కౌరవులకి పాండవులకి మధ్య కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. ధర్మరాజు రాజ్యపాలన సాగించడం మొదలుపెట్టాడు. దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కోసం అవతారం ఎత్తిన మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మ చిన్నతనం నుండి అనేక మంది రాక్షసులని సంహరించాడు. ఆ దుష్ట శిక్షణ చూసి అనేకమంది మునీశ్వరులు సంతోషించారు. కంసుడు వంటి రాక్షసులను సంహరించి భూభారం తగ్గించి శ్రీకృష్ణ పరమాత్మ ప్రసిద్ధుడయ్యాడు. 

అదే సమయంలో యాదవ సైన్యం విజృంభించి భూమి మోయలేని స్థితికి వచ్చింది. శ్రీకృష్ణ భక్తులైన యాదవులకు బుద్ధి చెప్పడానికి పరమాత్మ ఆలోచనలో పడ్డాడు. అదే సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ చూడ్డానికి విశ్వామిత్రుడు దూర్వాసుడు మొదలగు ఋషులు ద్వారకా నగరానికి వస్తారు. అలా వచ్చిన మునులకు సకల మర్యాదలు చేసి బంగారు ఆసనం పై కూర్చోబెడతాడు. తర్వాత పరమాత్ముని అనేక విధాలుగా స్తుతిస్తూ కొనియాడతారు.అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తాడు. మీ పాదపద్మ సందర్శనార్థం వచ్చాం మా కోరిక తీరింది ఇక సెలవు అంటూ ద్వారక సమీపంలోని పిండారకతీర్థం సందర్శించడానికి బయలుదేరుతారు.

అక్కడ కొంతమంది యాదవ బాలురు మదమెక్కి శ్రీకృష్ణ పరమాత్మ కుమారుడైన సాంబుడికి అందమైన గర్భవతిగా ఉన్న స్త్రీ వేషం వేస్తారు. ఆ యాదవ బాలలందరూ ఆ మునివర్యుల దగ్గరికి స్త్రీ వేషంలో ఉన్న సాంబుడిని తీసుకెళ్లి ఈ పిల్ల కడుపులో ఉన్నది ఆడపిల్ల ఉన్నదా !మగ పిల్లవాడు ఉన్నాడా! అని మునులను అడుగుతారు. ఆ యాదవ బాలకుల అపహాస్యానికి మునులకు బాగా కోపం వచ్చింది. యాదవ కులాన్ని నాశనం చేసే రోకలి ఒకటి వీడి కడుపున పుడుతుంది అని శపించి వెళ్లిపోతారు.

మునుల శాపం విని గజగజ వణుకుపోతూ యాదవ బాలకులు సాంబుడు చీర విప్పగా అందులోంచి ఇనప రోకలి ఒకటి బయట పడుతుంది. ఇంకేముంది శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్లి జరిగిన విషయం అంత చెప్తారు. శ్రీకృష్ణ పరమాత్మ ఏమీ తెలియని వాడిలా నటిస్తూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సైతం బ్రాహ్మణుల శాపాన్ని అడ్డుకోలేరు. మీరు గర్వంతో చెయ్యరాని తప్పు చేశారు. బుద్ధిహీనులు. అని చివాట్లు పెట్టి మందలించి పూర్వజన్మ పాపాలను ఎవరు తొలగించలేరు. అయినప్పటికీ మీరు ఈ రోకల్ని తీసుకువెళ్లి సముద్రం దగ్గర ఉన్న కొండమీద అరగదీసి ఆ రోకలి పొడిని సముద్రంలో కలిపి వేసి రండి అని చెప్పి పంపుతాడు. శ్రీకృష్ణుని ఆజ్ఞ ప్రకారం ఆ రోకలినంత ఆ కొండ మీద అరగదీసి చివరికి ఒక ముక్క సముద్రంలో పడవేయగా అది వచ్చి ఒక చే ప మింగుతుంది . ఆ చేపని ఒక వేటగాడు పట్టుకోగా ఆ ఇనుప ముక్కని తన బాణానికి చివర ములికిగా మలుచుకున్నాడు.
ఇది ఇలా ఉండగా ఒకరోజు సురలు ,గరుడలు విద్యాధరులు, రుద్రుడు, బ్రహ్మదేవుడు , మునులు శ్రీకృష్ణ పరమాత్మను చూడడానికి సంతోషంగా ద్వారకా పట్టణానికి వచ్చారు. "పరమాత్మ నువ్వు భూలోకంలో జన్మించి నూట ఇరవై ఐదు సంవత్సరాల అయింది. ఇక చాలు ఇక నువ్వు వైకుంఠానికి రావలసి ఉంది అని చెప్పి ప్రార్థిస్తారు. 

అప్పుడు శ్రీకృష్ణుడు గర్వమధాంధులైన యాదవులకు బుద్ధి చెప్పడం ఒకటే మిగిలి ఉంది . అది పూర్తి చేసుకుని వస్తాను అని చెప్పి పంపిస్తాడు ఆ వచ్చిన వారిని..

ఆ తర్వాత యాదవులందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ నాకెందుకో ద్వారకలో అనేక అపశకునాలు గోచరిస్తున్నాయి. ఏదో ఒక ఉపద్రవం సంభవించే అవకాశం ఉంది. కాబట్టి మీరంతా ద్వారకని విడిచిపెట్టి కుటుంబాలతో సహా ప్రభాస తీర్థానికి వెళ్లిపోండి అని చెప్పగా యాదవులు తమ కుటుంబాలతో సహా ప్రభాస తీర్థానికి వెళ్లిపోతారు.

ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ తనగా అత్యంత సన్నిహితుడైన ఉద్దవుడి సందేహాలన్నీ తీర్చి బలరాముడు తో కలిసి ద్వారక విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఇంకా ప్రభాసతీర్థంలో యాదవుల మధ్య వైషమ్యాలు పెరిగి ఆ సముద్రపు ఒడ్డున పెరిగిన తుంగ గడ్డితో కొట్టుకుంటూ దుర్భాషలాడుకుంటూ కత్తులతో నరుకుకుంటూ చనిపోతారు. ఆ ప్రాంతమంతా రక్తమయం అయిపోతుంది. శ్రీకృష్ణుడి తోటి బయలుదేరిన బలరాముడు కొంతసేపటికి విడిపోయి తన యోగ మాయచే అవతార సమాప్తి చేస్తాడు. ఇంకా కృష్ణుడు కొంత దూరం వెళ్లిన తర్వాత ఒక చెట్టు కింద పడుకుని కాలు మీద కాలు వేసుకుని ఆడిస్తూ ఉంటాడు. అది దూరంగా ఉన్న వేటగాడికి జింక చెవిలో కనపడుతుంది. వెంటనే తన అమ్ముల పొది నుంచి బాణం ఒకటి తీసి కొడతాడు. వెంటనే శ్రీకృష్ణుడు హాహాకారం చేయసాగాడు. జరిగిన తప్పు తెలుసుకుని బోయవాడు బాధపడుతూ కన్నీరు కారుస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు నువ్వు బాధపడవలసిన అవసరం లేదు పూర్వజన్మ కర్మలు ఎవరికైనా తప్పవు. వాటి ఫలితాలు అనుభవించక తప్పదు. కేవలం నువ్వు నిమిత్తమాత్రుడవే అని చెప్పి ఊరడించి ప్రాయోపవేశం చేసి ప్రాణాలు వదిలి వైకుంఠానికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ద్వారకానగరం సముద్రంలో కలిసిపోతుంది. ఇది శ్రీకృష్ణ అవతార సమాప్తి కథ.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట