చినుకులో సాయం
నగరంలో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా రెండు రోజులు స్కూళ్లు, కాలేజీలన్నిటికీ సెలవులు ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటికి తిరగవద్దు అనే వార్తలు విని పిల్లలు ఎగిరి గంతేశారు.
వాళ్లకేం తెలుసు పాపం! నగరంలోని పరిస్థితి. గుమ్మం బయట కాలు పెట్టకపోతే ఎవరికీ బ్రతుకు జీవనం గడవదు. అందులో ఈ ఏడాది మరీ ఎక్కువగా కురుస్తున్నాయి వర్షాలు. దానికి తోడు ట్రాఫిక్ జాము, వర్షపు నీరు ఎక్కడికి కదులకుండా ఉండిపోవడం. రోడ్డుమీద ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియట్లేదు.
ఆఫీసుకి వెళ్లి రావడం అంటే తల ప్రాణం తోక వచ్చినట్టే ఉంది. “ఎలాగురా బాబు, ఈ వర్షంలో సెలవు పెట్టమంటే బాసు ఊరుకోడు” అనుకుని బాధపడుతూ, రైన్‌కోట్ వేసుకుని బయలుదేరబోతుంటే, గుమ్మం దగ్గర ఆటో ఆగిన శబ్ధం వినిపించింది.
“ఎవరబ్బా ఈ వర్షంలో?” అనుకుంటూ బయటికి వెళ్లాడు. ఆటో డ్రైవర్ రాజు నమస్కారం చేసి, “ఇవాళ సెలవు కదా సార్?” అని అడిగాడు.
“సెలవే రాజూ, మరి బేరాలు ఏమీ లేవా?” అని రామారావు.
“లేదు సార్… ఇంటిదగ్గర కష్టంగా ఉంది,” అంటూ చేతులు నులిపాడు రాజు. రామారావుకి విషయం అర్థమైంది. ప్రతినెల ఒకటో తారీకు రాకుండానే జీతం మధ్యలో పట్టుకెళ్తుంటాడు. అలాంటిది, ఈ వర్షంలో బేరాలు ఎక్కడ ఉంటాయి పాపం! జేబులో నుంచి ఐదు వందల రూపాయల నోటు తీసి ఇచ్చాడు రామారావు.
“మరి, రెండు రోజులుగా లత రావడం లేదు ఏమిటి?” అని అడిగాడు. రాజు భార్య లత, రామారావు ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తుంది.
“మా బస్తీ అంతా మునిగిపోయింది సార్… ఇంటి నుంచి బయటకు రావడం లేదు. నేను తప్పక బయటకు వస్తున్నాను. పాపం పిల్లలు, లత — ఇంటి దగ్గరే అలాగే ఉంటున్నారు. సాయంకాలానికి వరద ముంపు బాగా పెరిగి ఇల్లు కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉంది సార్…” అని కన్నీళ్లు పెట్టుకున్నాడు రాజు.
రామారావు మనసులో జాలి కలిగింది. బస్తీ పరిస్థితి ఎలా ఉంటుందో అతనికి తెలుసు. రోడ్డు మీద మోకాల లోతు నీరు, అందులో మురుగు కాలువ నీరు కలిసిపోయి కంపు కొడుతుంటే, దోమల ముసురు కమ్ముతుంటే… అయినా గుమ్మం బయటకు అడుగుపెట్టకుండా జీవనం గడపలేని ఆ బస్తీ వాసుల పరిస్థితి ఊహించుకుంటేనే మనసు బాధపడ్డాడు.
ఆ బస్తీ ప్రజలు రెక్కాడితే కానీ డొక్కాడని జీవులే. జోరున కురుస్తున్న వర్షం చినుకులు రేకు షెడ్డు లోంచి పడుతుంటే, ఆ గదిలో తల దాచుకోవడానికి చోటు దొరకదు. పిల్లలు ఆకలితో ఏడుస్తుంటే సమాధానం చెప్పలేక, కురిసే వర్షాన్ని తిట్టుకుంటూ కాలక్షేపం చేస్తారు. ప్రతి ఏట వర్షాకాలం — ఇదే సన్నివేశం.
అలా తడుస్తూ సమయానికి ఆఫీసుకి చేరుకున్న రామారావు, సీట్లో కూర్చోగా వేడి వేడి టీ అందించాడు ఆఫీస్ బాయ్. అసలే వర్షానికి తడిసి ఉన్నాడు కాబట్టి, వేడివేడి టీ తాగగానే ప్రాణం లేచినట్లైంది.
రామారావు కలెక్టర్ ఆఫీస్‌లో ఒక సెక్షన్ ఆఫీసర్. ప్రతిరోజూ ఎంతోమంది తమ సమస్యలు తీర్చమని అర్జీలు సమర్పిస్తారు. ఇవాళ వర్షం మూలంగా ఎవరూ రాలేదు. కానీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి గంటగంటకి వర్షం వివరాలు, జాగ్రత్తలు, సహాయ కార్యక్రమాల గురించి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. సహాయం కోసం పోలీస్ సిబ్బందిని, ప్రత్యేక దళాలని, సైన్యాన్ని పంపించినట్లు సమాచారం.
ఇలాంటి సహాయ కార్యక్రమాలన్నీ మొదలయ్యేటప్పటికి మధ్యాహ్నం అవుతుంది. అంతవరకు బస్తీ వాసులకు తిండి తిప్పలు తప్పవు. వెంటనే రామారావు తన ఆఫీసులో అందరినీ సమావేశపరచి, తన మనసులోని ఆలోచన చెప్పాడు.
మనసు ఉన్నవాళ్లు ముందుకు వచ్చి బృందంగా ఏర్పడి, బస్తీ వైపు వాహనాలు తీసుకుని పరిగెత్తారు. బస్తీ వాసులందరినీ ఇళ్లు ఖాళీ చేయించి, ఆ ఊరిలోని ఒక కళ్యాణమండపంలో బస ఏర్పాటు చేసి, భోజనం కల్పించారు.
ఇంత చేస్తున్న రామారావు మనసులో భయం వెంటాడుతూనే ఉంది. ఎందుకంటే కలెక్టర్‌కి విషయం చెప్పలేదు. కారణం — కలెక్టర్‌గారు ఊర్లో లేరు.
రామారావుతో పాటు బృందంగా ఏర్పడిన ఉద్యోగులు కూడా ఆ రాత్రి కల్యాణమండపంలోనే ఉండి, వాళ్ల బాగోగులు చూసుకుంటూ కాలం గడిపారు. తెల్లవారుజామున కూడా వర్షం కురుస్తూనే ఉంది.
ఉదయం పిడుగులాంటి వార్త — బస్తీలోని ఇళ్లు పూర్తిగా మునిగిపోయాయి! పాపం, ఆ రాత్రి అక్కడే ఉంటే ఎన్ని ప్రాణాలు పోయి ఉండేవో!
మరునాడు దినపత్రికలో — “బస్తీ వాసులను కాపాడిన కలెక్టర్ ఆఫీస్ ఉద్యోగులు” అని పెద్ద అక్షరాల్లో వచ్చింది. ప్రభుత్వ సహాయం లేకుండానే, కేవలం మానవత్వంతో ప్రజల సహకారం తీసుకుని మంచి పని చేసిన ఉద్యోగులను కలెక్టర్‌తో సహా అందరూ అభినందించారు. అడిగిన వెంటనే సహాయం చేసిన ఆ ఊరి పెద్దలను ప్రభుత్వం తగిన రీతిలో సన్మానించింది.
ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, ప్రభుత్వ సహాయం అందేలోపే మనలో దాగి ఉన్న మానవత్వాన్ని బయటికి తీస్తే ఎంతోమందికి సహాయం చేయగలం.
వర్షం వస్తే, కిటికీ పక్కన కూర్చుని వేడి పకోడీలు తింటూ ఆస్వాదించడం — జీవన సౌకర్యాలు ఉన్నవారికి బాగుంటుంది. పసిపిల్లలకు కాగిత పడవలు వేయడం ఆనందం ఇస్తుంది. రైన్‌కోట్ వేసుకుని ఆఫీసుకి వెళ్ళే ఉద్యోగికి వర్షం, ఎండ రెండూ ఒకేలా అనిపించవచ్చు. కానీ డొక్కాడితే కానీ రెక్కాడని జీవులకు జోరున కురిసే వర్షం ఒక శాపమే.
బహుళ అంతస్తుల భవనంలో నివసిస్తున్న మనం, పక్కనున్న రేకు షెడ్డు కుటుంబానికి ఆశ్రయం కల్పిస్తే? ఆలోచించండి మరి
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ
9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి