పుల్లయ్య బజ్జి
ఉదయం ఐదు గంటలు అయింది. ఎప్పటిలాగే ఆ పల్లెకి తెల్లారింది. అగ్రహారంలోని సందు చివరన ఉన్న కాఫీ హోటల్ వైపు అరుపులు, చప్పుళ్లు వినిపిస్తున్నాయి. అదేమీ పెద్ద హోటల్ కాదు. చిన్న పాక హోటల్. మధ్యాహ్నం వరకే తెరిచి ఉంటుంది. హోటల్ లోపల కర్రబల్లల మీద పొలాలకు వెళ్లే రైతులు కూర్చుని ప్రతిరోజూ ఒక్క కప్పు టీ తాగి, అప్పుడు పొలాలకు వెళ్లడం వారికి నిత్యకృత్యం. ఉదయాన్నే రైతులతో, కాస్త ఆలస్యంగా వ్యాపారులతో, టిఫిన్ సమయానికి అగ్రహారంలోని ప్రతి ఇంటి వాళ్లతో – ఆ హోటల్లో ఖాళీ అనే మాటకే చోటుండదు. ఒకప్పుడు పల్లెల్లో ఉదయాన్నే చద్దన్నం తినేవారు. కానీ కాలం మారింది. ఇప్పుడు అందరూ పుల్లయ్య హోటల్లో టిఫిన్ కోసం ఎగబడుతున్నారు. అతడే ఆ పాక హోటల్ యజమాని – పుల్లయ్య. హోటల్ ఎప్పుడు పెట్టాడో ఎవరికీ తెలియదు. కానీ అప్పటి నుంచి అదే పాకలో, అదే ధోరణిలో కొనసాగుతోంది. పాకా మారలేదు – పుల్లయ్య మారలేదు. వయసు పెరుగుతున్నా టిఫిన్ల రుచి మాత్రం తగ్గడంలేదు. ప్రతి తెల్లవారుజామున మూడు గంటలకు లేచి, కాలకృత్యాలు తీర్చుకొని, కట్టెల పొయ్యి వెలిగించి పని మొదలుపెడతాడు. సహాయులు ఎవరూ ఉండరు – అంతా తన సొంతంగా. "ఏమయ్యా పుల్లయ్య, ఎవ్వరినైనా పనికి పెట్ట...