నలుపు నాణ్యమే

నలుపు – నాణ్యమే

మనిషి నయనాలు పసిగట్టి చూసేది రంగుల ప్రపంచం. ఆ రంగుల్లో నలుపు అంటే చాలామందికి భయం, తిరస్కార భావన కలిగించే ఒక నీడలా అనిపిస్తుంది. కానీ ఆ నలుపు అంత తేలికైనది కాదు. అది ఒక జీవిత దర్శనం, ఒక గంభీరమైన సందేశం.

సప్తవర్ణాలు దేవుని సృష్టి. అందులో నలుపు కూడా ఒకటి. కానీ మిగిలిన రంగులకంటే నల్ల రంగుపై వ్యతిరేక భావన ఎక్కువ. ఎందుకంటే అది చీకటిని గుర్తు చేస్తుంది. కానీ అదే నలుపు చల్లని మేఘంగా మారి చినుకులుగా జలధారలు కురిపించగలదు. భూమిని పచ్చగా మార్చే మొదటి అంకురం నలుపే.

విద్యా బోర్డు - నలుపే; జ్ఞానం - వెలుగు

పాఠశాల బోర్డు నలుపే. కానీ దానిపై రాసే తెలుపు అక్షరాలే విద్యార్థుల జీవితానికి దారిదీపాలు. నల్ల బోర్డుపై తెల్ల అక్షరాలు స్పష్టంగా కనిపించడమే కాదు, వాటి ప్రాముఖ్యతను కూడా నలుపే అందిస్తుంది. అది శిక్షణకు మార్గదర్శి.

ఆరోగ్యానికి, అందానికి కూడా నలుపు అవసరం
నల్ల నేరేడు, నల్ల ముళ్లి వంటి పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రక్తహీనతను నివారించడంలో వీటి పాత్ర ఎంతో గొప్పది. కళ్లకు మెరుపు ఇచ్చే నల్లటి కాటుక ఆత్మవిశ్వాసానికి చిహ్నం. బొట్టు, చుక్కలుగా పెళ్లికూతురి ముస్తాబులోనూ నలుపు కీలకం.

భగవద్గీతలో కూడా నలుపు అర్థవంతం

పోతన్న గారి కథల్లో ‘కృష్ణుడు’ నల్లనివాడే. శరీర రంగు నల్లగా ఉన్నా, ఆత్మగా పరమాత్మ. పదహారువేల గోపికల మనసు దోచిన వాడు. దేవుడు నల్లగా ఉంటే భయం ఎందుకు? శని దేవుడికి నలుపు ప్రీతిపాత్రం. శనివారాన ఆయనకు తిలదానం చేయడం శుభఫలితాన్ని అందిస్తుంది. సూర్యుడి కొడుకు శనిశ్వరుడు – ఇది విశ్వ సత్యం. ఇలా నలుపు దేవతలకూ సంభంధమైన పవిత్ర రంగు.

కాకి, కుండ, కోయిల – నలుపు సౌందర్యానికి నిదర్శనాలు

కాకి – మన పితృకర్మలకు ప్రత్యక్ష సాక్షి. పిండం తినకపోతే ఆత్మకు శాంతి ఉండదు అంటాం. కుండ – పేదవాడి ఎసీ. అది మనల్ని చివరి ప్రయాణానికీ తీసుకెళ్తుంది. కోయిల – నల్లగా ఉన్నా, పాటలో వసంతాన్ని పిలుస్తుంది. ఆమె గొంతు గాయకులకు మేటి ఉపమానం.

నల్ల బంగారం – ఉత్సాహానికి ఇంధనం

రైలును నడిపించే నల్ల బంగారం అంటే బొగ్గు. సింగరేణి గనుల్లో దొరికే ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకం. నల్లగా ఉన్నా వేల కోట్ల సంపద అందిస్తోంది. ఇదీ నలుపు గొప్పతనం.

నలుపు – కళ్ళు చూపించే రంగు

కంటి గుడ్డు నలుపే. అదే వెలుగుని చూపిస్తుంది. అది లేకపోతే ప్రపంచమే అంధకారం. అందుకే శరీరేంద్రియాల్లో కంటికి ప్రాముఖ్యం.

భూమి, నీరు, జీవితం – అన్నింటికీ నలుపు ఆధారం
మన కాళ్లకింద నలిగే నేల నలుపే. కానీ అది వర్షపు చినుకులతో బంగారంగా మారుతుంది. అదే భూమి అన్నదాత. అది లేక మనం ఉండలేం.

ముగింపు: నలుపు అంటే భయం కాదు – భావం 

ఇంత చర్చ తర్వాత మనం తెలుసుకోవాల్సిన విషయం: నలుపు అంటే చీకటి కాదు. అది లోతు, అది నమ్మకం, అది జీవితం. నల్లదనం అంటే ధైర్యం, సంప్రదాయం, సాధన, విశ్వాసం. అలా చూస్తే నలుపు అనేది మన మనసుకు దగ్గరయ్యే రంగు.

ఒక చిన్న చుక్క నలుపు పెళ్లికూతురి నుదిటిపై అలంకారంగా మెరిసినా, ఆ గంగాజలపు నీటి తెచ్చే మేఘం కూడా నలుపే. అందుకే –
నలుపు అనేది మచ్చ కాదు – నమ్మకం.
నలుపు అనేది చీకటి కాదు – చైతన్యం!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట