పుల్లయ్య బజ్జి
ఉదయం ఐదు గంటలు అయింది.
ఎప్పటిలాగే ఆ పల్లెకి తెల్లారింది. అగ్రహారంలోని సందు చివరన ఉన్న కాఫీ హోటల్ వైపు అరుపులు, చప్పుళ్లు వినిపిస్తున్నాయి.
అదేమీ పెద్ద హోటల్ కాదు. చిన్న పాక హోటల్. మధ్యాహ్నం వరకే తెరిచి ఉంటుంది. హోటల్ లోపల కర్రబల్లల మీద పొలాలకు వెళ్లే రైతులు కూర్చుని ప్రతిరోజూ ఒక్క కప్పు టీ తాగి, అప్పుడు పొలాలకు వెళ్లడం వారికి నిత్యకృత్యం.
ఉదయాన్నే రైతులతో, కాస్త ఆలస్యంగా వ్యాపారులతో, టిఫిన్ సమయానికి అగ్రహారంలోని ప్రతి ఇంటి వాళ్లతో – ఆ హోటల్‌లో ఖాళీ అనే మాటకే చోటుండదు.
ఒకప్పుడు పల్లెల్లో ఉదయాన్నే చద్దన్నం తినేవారు. కానీ కాలం మారింది. ఇప్పుడు అందరూ పుల్లయ్య హోటల్‌లో టిఫిన్ కోసం ఎగబడుతున్నారు.
అతడే ఆ పాక హోటల్ యజమాని – పుల్లయ్య. హోటల్ ఎప్పుడు పెట్టాడో ఎవరికీ తెలియదు. కానీ అప్పటి నుంచి అదే పాకలో, అదే ధోరణిలో కొనసాగుతోంది.
పాకా మారలేదు – పుల్లయ్య మారలేదు.
వయసు పెరుగుతున్నా టిఫిన్ల రుచి మాత్రం తగ్గడంలేదు.
ప్రతి తెల్లవారుజామున మూడు గంటలకు లేచి, కాలకృత్యాలు తీర్చుకొని, కట్టెల పొయ్యి వెలిగించి పని మొదలుపెడతాడు. సహాయులు ఎవరూ ఉండరు – అంతా తన సొంతంగా.
"ఏమయ్యా పుల్లయ్య, ఎవ్వరినైనా పనికి పెట్టుకోవచ్చు కదా?" అని అడిగితే —
“ఈ పనులు ఎవరు చేస్తారండీ ఇప్పుడు? ఎవరూ రావట్లేదండి…” అంటూ అసలు బాధను ఆ మాటల వెనక దాచేస్తాడు.
పాపం, అతనికి ఉన్న బాధ్యతలే అటువంటివి. కుటుంబాన్ని నెట్టుకోవాలిగా!
ఉదయం ఎనిమిది అయ్యేసరికి పుల్లయ్యకి ఊపిరి సలపదు.
“ఏరా పుల్లయ్య! మైసూర్ బజ్జీ అయిందా? మా అల్లుడుకి టిఫిన్ పెట్టాలి!”అంటూ శాస్త్రిగారి అరుపు వీధంతా వినిపిస్తోంది.
వ్యాపారులు ఒకపక్క “మైసూర్ బజ్జీ రెండు ప్లేట్లు టేబుల్ మీదకి… నాలుగు ప్యాకెట్లోకి వేయ్!” అని
“మా మనవడు నీ బజ్జీ లేకుండా తినడు…” అంటూ తాయారమ్మ
“మా వియ్యాలవారు వచ్చారు, పది బజ్జీలు ప్యాకెట్‌లో కట్టు!” అంటూ రవి శాస్త్రి గారు
పుల్లయ్య గారు రెడీనా అంటూ ఆ ఊరి కుర్ర కారు తొందర పెడుతున్నారు.
ఒకపక్క వచ్చిన వాళ్లకి సమాధానం చెబుతూ, సరుకులు పట్టించి, బాణలిలో వేగుతున్న బజ్జీలను తిప్పుతూ,
పద్మవ్యూహంలో చిక్కిన అభిమన్యుడిలా అటూ ఇటూ తిరుగుతున్నాడు పుల్లయ్య.
ఆ హోటల్‌లో ఆ సమయంలో బజ్జి నామస్మరణ తప్ప మరొకటి ఉండదు.
నిజంగా ఆ హోటల్‌లో తినకపోయినా, కొత్త అల్లుడికి చేసే మర్యాదల్లో – నా స్వీయ అనుభవంలో – పుల్లయ్య బజ్జీ ఓ ప్రత్యేక స్థానం సంపాదించింది.
పల్లె వంటలకే కాదు, పుల్లయ్య బజ్జీకి కూడా పెద్ద పేరు.
నాకు అందిన టిఫిన్ ప్లేట్లలో నాలుగు బజ్జీలు.
గుండ్రంగా, బంగారంలా మెరిసిపోతూ – ముక్క విరిచి నోట్లో పెట్టుకోగానే అబ్బా! అమృతంలా అనిపించింది.
నాలుగు బజ్జీలు నాలుగు నిమిషాల్లో కడుపులోకి. మళ్లీ వస్తాయేమో అనిపించినా – మొహమాటం అడగనివ్వలేదు.
రేపటిదానిమీద ఆశ.
ఇంకా నాలుగు రోజులు ఉండాలి కదా అన్న ఆనందం.
ఆ నాలుగులో రెండు రోజులు నా కోరిక తీరింది.
ఆ ఊరు ఎప్పుడెళ్లినా పుల్లయ్య బజ్జీ తినకుండా తిరిగి రాలేదు.అందులో వేసే పదార్థాలన్నీ సాధారణంగానే ఉంటాయి,కానీ పుల్లయ్య చేతిలో ఏదో ప్రత్యేకత ఉంది.
ఒక్కోసారి ఆ ఊరి ఆడవాళ్లు అడిగేవారు:
“ఏమండీ పుల్లయ్యగారు! మీరు వేసినట్టు బజ్జీ రావడం లేదు. ఏమైనా ప్రత్యేకంగా కలుపుతారా?” కానీ పుల్లయ్య అన్నిటికి ఒకటే సమాధానం అదే పెదవుల మీద చిరునవ్వు. అది తప్పితే ఎవరికీ చెప్పలేదు తన రహస్యం. ఎవరికీ నేర్పలేదు ఆ బ్రహ్మవిద్యని.
ఇవాల్టి రోజుల్లో చిన్న పాక హోటల్స్ కూడా యూట్యూబ్‌లో వీడియోలు పెడుతున్నారు, రహస్యాలు చెప్పేస్తున్నారు.
కానీ అప్పట్లో పుల్లయ్య – కేవలం తన చేతివాటుతో – తన సరుకు రుచితో – అనేకమందిని ఆకర్షించాడు.
ఈ కాలంలో పుల్లయ్య లైవ్‌లో ఉంటే... ఎంతమంది ఫాలోవర్స్ వచ్చేవారో!
ఒకసారి సంక్రాంతికి ఊరు వెళ్లినప్పుడు,
సందు మొదట్లో అలవాటుగా తల తిప్పి చూశాను.
పాక ఖాళీగా ఉంది. జనం లేదు. మైసూర్ బజ్జీ వాసన లేదు.
అప్పుడు తెలిసింది –
ఆ బ్రహ్మవిద్యను ఎవరికీ చెప్పకుండా తనలోనే ఉంచుకుని, పుల్లయ్య ఈ లోకాన్ని వదిలిపోయాడని.
ఆ వార్త విన్న నా హృదయం గుండెల్లో తడిసి పోయింది.
అయినా…
ఆ ఊరికి వెళ్లినప్పుడల్లా పుల్లయ్య బజ్జీ రుచి గుర్తుకొస్తూనే ఉంటుంది.అలాంటి రుచి ఇక ముందు దొరుకుతుందో లేదో తెలియదు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి