జ్ఞాపకాలు
ఊరంటే ఒక బడి, తపాలా కార్యాలయం, పంచాయతీ కార్యాలయం ముఖ్యంగా ఉంటాయి. గోడ మీద ఎర్ర డబ్బా తగిలించి ఉన్న కార్యాలయానికి ప్రతిరోజు ఏదో ఒక పని మీద వెళుతూనే ఉండేవాళ్ళం. క్షేమ సమాచారం పంపడానికి అదొక్కటే ఆధారం. ముఖ్యంగా అక్కడ ఇద్దరు వ్యక్తులు ప్రజా సేవలో మునిగి తేలిపోయేవాళ్ళు. ఒకరు పోస్ట్ మాస్టారు రెండవది పోస్ట్ మాన్ గారు. "మాస్టారు, హైదరాబాద్ ట్రంకాల్ ఒకటి బుక్ చేయాలండి!" అని అడిగితే "నెంబర్ చెప్పండి..." అని అనేవారు పోస్టుమాస్టారు. ఆ మాటల్లో ఒద్దిక ఉండేది, ఆ స్వరం ఓ అధికారి మాదిరిగా ఉండేది కాదు. ఒక ట్రంకాల్ కాల్ బుక్ చేస్తే... పోస్టాఫీసు ముందు కుర్చీలు ఉండేవి, ఒక పట్టరాని ఆశతో కూర్చొని ఉండేవాళ్లం. అరగంట...ఒక్క గంట... ఏ టైమ్ అన్నా వచ్చే గ్యారంటీ లేదు. "లైన్ బిజీ", "కనెక్ట్ కాలేదు", "రిపీట్ చేయాలి"... ఇవన్నీ మామూలే. కాల్ కలిస్తే – అదో గోల్డెన్ ఛాన్స్! ఒకవేళ ముంబైలో ఉన్న అక్కతో మాట్లాడాలి అనుకుంటే, "బాగున్నావా? పిల్లలు బాగున్నారా?" అన్న రెండు ప్రశ్నలకే కాల్ అయిపోతుండేది. కాస్త ఎక్కువ మాట్లాడారంటే, "హలో! హలో! వినిపించట్లేదు!" అ...