గమ్యం తెలియని ప్రయాణం
గమ్యం తెలియని ప్రయాణం ఉదయం 5:10 అయింది కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ అంత ప్రయాణికులతో హడావుడి గా ఉంది. ఇంతలో కాకినాడ నుంచి షిరిడి వెళ్లే ఎక్స్ప్రెస్ స్టేషన్లో వచ్చి ఆగింది. ప్రయాణికుల్లో ఒక్కసారిగా సందడి మొదలైంది. అంతవరకు బెంచీల మీద కూర్చున్న జనం ఒక్కసారిగా లేచి సామాన్లు తీసుకుని బోగిల్లోకెక్కి సామాన్లు సర్దుకుంటున్నారు. అందరితోపాటు అక్కడ బెంచ్ మీద కూర్చున్న చిన్ని గాడు కుడి చేతి భుజానికి జోలి సంచి తగిలించుకుని జనరల్ కంపార్ట్మెంట్ లోకి ఎక్కాడు. ఆ బోగి ఎక్కడా ఖాళీ లేదు . విపరీతమైన జనం. అలాగే బాత్రూం దగ్గర ప్రయాణికులను గమనిస్తూ కూర్చున్నాడు. చిన్ని గాడికి వయసు ఇరవై సంవత్సరాల వయసు ఉంటుంది కానీ రైలు ప్రయాణం ఏమీ కొత్త కాదు. చిన్ని గాడిది గమ్యం తెలియని ప్రయాణం. బతుకుదెరువు కోసమే రైలు ఎక్కుతాడు. అంతెందుకు కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ పక్కన ఉన్న గుడిసెలోనే పుట్టాడు. పుట్టగానే వాడి ఏడుపు రైలు కూతలతో కలిసిపోయింది. ఆడుకోడానికి ఆటస్థలం అదే. పొట్ట నింపే స్థలం కూడా అదే. వర్షం వస్తే తలదాచుకోవడానికి చిన్ని గాడికి తెలిసిన స్థలము అదే. నాన్న అనే పదం తెలియదు. అన్నీ తానై పెంచింది తల్లి. ...