అరిటాకు భోజనం

అరిటాకు భోజనం .

విందు భోజనానికి ముఖ్య అతిథి అరిటాకు.ఆకుపచ్చటి అరిటాకు ఆంధ్రుల భోజనానికి అది ట్రేడ్ మార్క్.

ఆకాశంలోని హరివిల్లు వలె మెరిసిపోతుంది  అరిటాకులోని ఆతిథ్యం. ఆకులోని పదార్థాలు చూడగానే ఆత్మా రాముడికి రెక్కలు వస్తాయి. ఆకుపచ్చటి అరిటాకులో కుడివైపు చివర పసుపు పచ్చటి ముద్దపప్పు మెరిసిపోతూ ఉంటుంది. దాని పక్కనే చెరువులోని కలువ పువ్వుల మెరిసిపోతూ నూనెలో తేలియాడుతున్న ఆవకాయ. ఇంకా కోనసీమ భోజనం అంటే పనసపొట్టు లేకుండా ఎలా ఉంటుంది. మంచి సువాసనలు వెదజల్లుతూ ఆకులో అందంగా కుదురుగా ఉంటుంది . మాకు విందు భోజనంలో కంద బచ్చలి తప్పనిసరి అది లేకపోతే విందు ఏమిటి నా బొంద అంటుంది ఓ ఇల్లాలు. 

కూరలు దాటికి ముందుకు చెయ్యి చాపితే  మచ్చు కోసం వేసిన దప్పలం ,దాని పక్కనే తెల్లగా మెరిసిపోతూ అప్పడం, బాగా వేగిపోయిన గుమ్మిడి వడియం అలా ఎడం పక్కకి ప్రయాణం సాగిస్తే పండు వెన్నెల లాంటి అన్నం, అన్నం దాటుకుని చేయి చాపితే పులిహార పక్కనే పూర్ణం బూర్లు ఇవన్నీ ఆకుని ఆక్రమించుకుని మనల్ని రెచ్చగొడుతూ ఉంటాయి .
 అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఆంధ్రుల అభిమాని గోంగూర పచ్చడి అడవులో
 దున్నపోతులా మెరిసిపోతూ ఆవకాయ పక్కన తిష్ట వేసి ఉంటుంది.

ఇంకా ఆలస్యం ఏముంది కూర్చోండి అంటారు. కూర్చునే ఉన్నాం కదా అని కొంతమంది జోకులు వేస్తారు. పర్మిషన్ ఇచ్చారు కదా అని కార్యక్రమం మొదలుపెడితే మూలనున్న ముద్దపప్పు కమ్మని వాసనతో ఆవు నెయ్యి కలుపుకుని మొదటి ముద్ద తినిపించింది .

పప్పుకు తోడు ఆకుపచ్చ అరిటాకులోఎర్రటి ఆవకాయ
ఆంధ్రులకు ముద్ద దిగదు ఆవకాయ లేకపోతే.ఆకులో పంచభక్ష పరమాన్నాలు ఉన్న నోరూరించే ఆవకాయ లేకపోతే చిన్న పోతుంది. పప్పులో ఆవకాయని నంచుకుని పప్పు ని ఖాళీ చేశాను.

వెతికి వెతికి మరీ తెచ్చుకుంటారు పనసకాయ,కత్తి నూరి యుద్ధాలు చేసి పొట్టు చేస్తారు ,యుద్ధంలో గెలిచినంతగా సంతోషం కళ్ళల్లో యుద్ధ వీరులు కొంతమందే.మిగిలిన వాళ్ళు ప్రేక్షకులే .ఆవదట్టించిన పనస పొట్టుకూర ముద్ద ఆహా అనిపిస్తుంది. ఒళ్ళు మర్చిపోతే వేడి చేస్తుంది. కూరలోకి అన్నం అండి అటు అన్నం బుట్ట కనపడగానే అన్నం వడ్డించుకుని పనసపొట్టు కూరలోకి నువ్వుల నూనె కలుపుకుని ముద్ద గొంతు దిగుతుంటే స్వర్గం కనిపించింది. కోనసీమలో ఉండిపోవాలనిపించింది.
ముక్క దురద పెట్టి భయ పెట్టిన కంద బచ్చలితో కలిస్తే నాలుక పట్టుకుని వదలదు.ఆవపెట్టి కాస్తంత బెల్లం జోడిస్తే స్వర్గమే కనబడుతుంది.విందు భోజనపు మెనూలో టక్కున ముందుకొస్తుంది. ఆహా ఇందుపల్లి వారి చేతిలో అమృతం అంటే ఇదేనేమో అనిపించింది

కూరముక్కలన్నీ కలుపుకొని గిన్నెలో అందంగా మెరిసిపోతుంది
దప్పళం. కొత్తిమీర వాసనతో దప్పలం అప్పడంతో కలిపి తింటే అదుర్స్.ఆకులోని అన్నంలో పోస్తే ముత్యాలులాగ పరిగెత్తుతుంది.ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరీ మరీ వడ్డించారు
ఆకులోని అన్నపు గుంటలో తగినంత పోస్తారు. అదొక విచిత్రమైన రుచి ఎర్రగా మెరిసిపోతూ గుమ్మడికాయ ముక్కలు తింటే తియ్యగా ఉండే దుంప ముక్కలు నములుతుంటే నీరు దిగే ఆనపకాయ ముక్కలు కొంచెం పుల్లదనం కొంచెం తీయదనం ముక్కు అదిరిపోయే వాసన ఇచ్చే కొత్తిమీర కలిపిన పులుసులోకి అన్నం మారు అడిగితే మొహమాట పడలేదు.

 పచ్చటి అడవిలో దున్నపోతులా మెరిసిపోతుంది
 ఆకులోని గోంగూర పచ్చడి.ఆంధ్రుల భోజననానికి అది రారాజు.
ఆతిథ్యానికి వన్నె తెచ్చిన మహారాజు.కమ్మటి పప్పు నూనె వాసనతో కవ్విస్తుంది.నోటిలోకి దూరిన ముద్ద స్వర్గమే చూపిస్తుంది. గోంగూర పచ్చడి అలా తయారు చేసిన వాళ్ళు ఎవరు ఉంటారు అందుకుని దాన్ని ఒక పట్టుపట్టా

పూర్వీకులు కాలం నుండి వచ్చింది పులిహార ఆవపెట్టి వండితే విందు భోజనం అద్భుతం.పులిహార కు తోడు పూర్ణం బూరెలు.
గుంటలో పోసిన నెయ్యి దానికి అదే సరిజోడు. బూర్లు పులిహారది తరతరాల అనుబంధం.అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ప్రతి విందుకు హాజరు. అతిధి దేవుళ్లు మనసు మెచ్చిన ప్రసాదం. నాలుగు బూర్లు గుప్పెడు పులిహార లాగించేటప్పటికి మూడు వంతులు అరిటాకు భోజనం పూర్తయింది.

అరెరే ఇందాక నీ గురించి చెప్పడం మర్చిపోయాను ఆటల్లో అరటిపండు కాదు ఆకులోని చక్కర కేళి అరటిపండు కదా మరి.పచ్చగా ఉండి చివరలో పలకరిస్తుంది.కథ కంచికి చేరే వేళ అన్నంలోకి గడ్డ పెరుగు.ఆకు వూర్చి చెయ్యి నాకి తింటే 
అంకం పూర్తయినట్లే. ఆహ్వానించిన వారి కళ్ళల్లో
అంతులేని వెలుగు.ఆంధ్రుల భోజనమా మజాకా
మరిచిపోలేము మరి ఎప్పటికీ.  

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
          కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట