ఎందుకు ఈ శాపం
ఎందుకు ఈ శాపం
మనం పుట్టినప్పుడే మనతో పాటు మన మరణం కూడా పుడుతుందిట. మరణం మన పక్కనే ఉంటుంది ఎప్పుడు. అది ఎప్పుడు ఎలా ముంచుకొస్తుందనే విషయం ఎవరికీ తెలియదు. శత్రువులా పొంచి ఉంటుంది. సమయం చూసి కాటేస్తుంది. ఏ రూపంలో వస్తుందో ఎవరికి తెలుసు. దానికి వయసుతో సంబంధం లేదు ఊరు వాడతో అసలు సంబంధం లేదు. సమయం వచ్చిందంటే క్షణం కూడా ఆలస్యం చేయదు అది మరణ రహస్యం.
ఏదో వేసవి తాపాన్ని తట్టుకోవడానికి ఒక తీయని అనుభూతిని పొందడానికి విహారయాత్రలకు వెళ్తారు. పుణ్యక్షేత్రాలకు వెళ్తారు. మంచు కొండలకు వెళ్తారు. లోయను చూసి ఆనంద పడుతుంటారు. అయితే ఆ విహారయాత్రే ఆఖరి యాత్ర అవుతుంది అని ఎవరికి తెలుస్తుంది.
ఏదో ఒక బస్సు ప్రమాదమో, లోయలో కాలుజారి పడటం జరిగితే లేదంటే ఏదో ఒక అనారోగ్యం వలన మరణించారంటే అర్థం ఉంది. ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్న మంచుకొండల్లో అందమైన ప్రకృతి శబ్దాలు కాకుండా తుపాకీ గుళ్ళ మో తలు వినిపిస్తాయని ఎవరనుకుంటారు. అనుకుంటే ఆగిపోతారు కానీ ముందుకు వెళ్లారు కదా.!
అమాయకులైన విహారయాత్రికులు అన్యాయంగా బలైపోయారు.అసలు వ్యక్తిగతంగా శత్రువులు ఈ రకమైన పనిచేశారు అనుకుంటే ఏదో ఒక అర్థం ఉంది. ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్లు మతం పేరు అడిగి తెలుసుకొని మరణ శాసనం అమలు జరిపారు.
దేశ విదేశాల నుంచి వచ్చిన యాత్రికుల రక్తం మంచు కొండల గోడల పైబడి మంచు కరిగి ఎర్రగా మారిపోయింది. ఎప్పుడు యాత్రికుల ఆనందం అనుభూతితో నిండిపోయే మంచుకొండ యాత్రికుల ఆర్తనాదంతో ప్రతిధ్వనించింది. మంచు కరిగి కన్నీరు అయిపోయింది. పచ్చిక బయళ్ళు యుద్ధభూమిలా మారిపోయాయి.
అందమైన కుటుంబాలు బంధాలను కోల్పోయి బంధువులను కోల్పోయి తీవ్రమైన కడుపుకోత మిగిలింది. ఎవరిదీ పాపం .ఎందుకు ఈ శాపం. తలుచుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది. అడుగు తీసి అడుగు వేయాలంటే భయం వేస్తోంది
మనం ఆనందించేందుకు వెళ్తాం… ప్రకృతి ప్రేమతో చేరేందుకు వెళ్తాం. కానీ అక్కడే మన అనుభవాల చివరి పుటలుగా మారిపోతుందని ఎవరు ఊహించారు?
ఒక్కసారి ఆ కన్నీళ్లు తుడిచినా… మనసులో మిగిలేది మాత్రం ఆ ప్రశ్నే – ఎవరిది తప్పు? ఎవరిది బాధ? ఈ మతమూర్ఖత, ఈ ద్వేషరూప మారణకాండకు అంతం ఉందా?
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి