అవ్వ మళ్లీ పుట్టింది

అవ్వ మళ్ళీ పుట్టింది.

కాలకూట విష o. ఈ పేరు తలుచుకుంటేనే వెన్నులోంచి వణుకు  పుట్టుకొస్తుంది. ఒళ్ళు జలదరిస్తుంది. పాలసముద్రంలో నుంచి పుట్టింది గాని ఏ ప్రాణి జీవితాన్ని అయినా క్షణంలో బుగ్గిపాలు  చేస్తుంది ఈ కాలకూట విషం .అటువంటి హాలాహలాన్ని గొంతులోనే బంధించాడు ఆ త్రినేత్రుడు. విచిత్రం చూడండి భగవంతుడు గొంతులో ఉన్న విష o బయటకు వదిలితే లోకానికి ప్రమాదం. సామాన్య మానవుడు విషం మింగితే ఆఖరి చుక్క వరకు బయటకు వచ్చేవరకు విశ్వ ప్రయత్నం చేస్తారు వైద్యులు. లేకపోతే ఆ మనిషి మనుగడకు ప్రమాదం. 

మానవ శరీర నిర్మాణంలో గొంతు అనే భాగానికి ఉన్న ప్రాముఖ్యత చాలా ఎక్కువ. తీసుకున్న ఆహారాన్ని కడుపులోకి పంపించి మనిషి మనుగడకు చాలా సహాయం చేస్తుంది ఈ గొంతు. ఒక్కొక్కసారి తీసుకున్న ఆహారం పడక గొంతు బొంగురు పోతుంది. గొంతులో ఏదో అడ్డు పడినట్లు ఉంటుంది. అయితే ఆ బాధ నుండి విముక్తి పొందడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. 

ఇంతకీ ఈ సమస్య గొంతుకు సంబంధించినదా. కాదు గొంతులో దాగున్న సీతాకోకచిలుక ఆకారంలో ఉన్న శరీర భాగం. మామూలుగా పైకి కనపడదు కానీ మానవ శరీరానికి అది అతి ముఖ్యమైన శరీర భాగం. అటువంటి శరీర భాగం తన పని తాను చేసుకున్నంతకాలం ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు. ఏమో ఏ కారణం ఎవరికీ తెలియదు. ఆ శరీర భాగం అసలు పని చేయకపోవడం గాని ఎక్కువగా పని చేయడం గాని జరిగితే అనర్ధాలు ఇదిగో ఇలా. శివుడు గొంతులో విషం ఉందని మనకు ఎలా తెలుస్తుంది? ఆ గొంతు భాగం నీలం రంగులో ఉంటుంది. అయితే ఈ సత్యవతమ్మ గొంతు భాగం పున్నమి చంద్రుడిలా దినదిన ప్రవర్ధమానము అవుతూ వచ్చింది. లోపల ఉన్న సీతాకోకచిలుక ఆకారంలో ఉన్న ఆ శరీర భాగం రెక్కలు విప్పిన సీతాకోకచిలుకలా అయిపోయింది.  

 భగవంతుడు కాబట్టి ఆ హాలాహలాన్ని భరించాడు. మానవ మాత్రుడికి అబ్బా అంత శక్తి ఎలా ఉంటుంది.? ఎంత బాధ పెట్టింది. నిజంగానే ఒక చుక్క విషo తీసుకోవాలని అనిపించేటంత. మానవ శరీరంలో ఏ భాగానికి బాధ కలిగిన దాని ప్రభావం అన్ని శరీర భాగాల మీద ఉంటుంది. ఆ బాధను వర్ణించలేం. శాస్త్రం చదువుకున్న వైద్యులు కూడా చెప్పలేరు. అనుభవిస్తున్న ఆ రోగి తప్ప

సాధారణ సమస్య కాదు ఈ గొంతు ది. సమస్య తెలిసింది. దానికి పరిష్కారం కూడా చెప్పారు.కానీ విశ్వ ప్రయత్నాలు చేసిన ఆ గొంతు సమస్యకి సమయం రాలేదు. కాలం అనుకూలించలేదు. ఏ మనిషికైనా కాలం చాలా విలువైంది. కాలం పెట్టే బాధలకి మనం మౌనంగా ఉండడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. మంచి కాలం రావాలని దేవుడిని ప్రార్థించడం తప్పితే. ఎందుకంటే కాలస్వరూపమే ఈశ్వరుడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్కొక్కసారి కలిసి రాదు.
మన చుట్టూ ఉన్న వాళ్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా పరిష్కారం కానీ కొన్ని సమస్యలు మనకి భగవంతుడు ఎవరో తెలియని వ్యక్తిని పరిచయం చేసి మనకి పరిష్కార మార్గం చూపిస్తాడు. ఆయనే భాస్కరాచార్యులు. ఆరోగ్య ప్రదాత పేరు ఒక్కటే కాదు పని చేసేది కూడా ఆరోగ్యాన్ని ఇచ్చే ఆలయంలోనే. రోజు ఆ రహదారి వెంట వెళుతూ ఉంటాం. దారి పక్కనే ఉన్న ఆ ఆలయంలో అంత మంచి ఆరోగ్య ప్రదాతలు ఉన్నారని మనకు తెలియదు.

 ఈ సమస్య ఎంత పెద్దదంటే నిపుణుడైన ఒక వైద్యుడు కూడా భయపడినంత. ఈ సమస్యని తమ సొంత సమస్య లాగా భావించి, ఆ రోగికి వయస్సు రీత్యా ఉన్న ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని పొంచి ఉన్న ప్రమాదాన్ని అందరికీ విపులంగా చెప్పి, ధైర్యం చెప్పి వాళ్లు గుండె ధైర్యం తెచ్చుకొని ,చదువుకున్న చదువుని సంపాదించిన అనుభవాన్ని మరొకసారి జ్ఞప్తికి తెచ్చుకుని ముందుకు అడుగు వేయడానికి అంటే కత్తులతో యుద్ధం చేయడానికి కుటుంబ సభ్యుల దగ్గర అన్ని రకాల అంగీకారాలు తీసుకుని యుద్ధానికి సన్నద్ధం అయ్యారు.

ఈ యుద్ధంలో కత్తిపట్టేవాళ్ళు ఒకళ్ళు మాత్రమే. మామూలుగా యుద్ధంలో ఇరుపక్షాల వాళ్లు ఆయుధాలతో యుద్ధాలు చేస్తారు. ఆ రోగి ని ఇన్ని సంవత్సరాల పాటు బాధించిన ఆ శరీర భాగమే శత్రుపక్షం. ఆ శత్రువుని మత్తులో ముంచేసి కత్తులతో యుద్ధం చేసి విజయం సాధించడమే ఈ నారాయణ స్వరూపుల పని. 

అది అలా ఉంచితే ఆ మాట ఈ మాటలన్ని చెవికి వినపడి ఎదుర్కొన్నపోయే ప్రమాదం గురించి తెలుసుకుని తన మనుగడకు వచ్చే ప్రమాదం గురించి విన్న ఆ రోగి గుండె ఎలా ఉంటుంది? అనుభవిస్తే గాని తెలియదు. ఎవరు ఎంత ధైర్యం చెప్పినా చుట్టుపక్కల ఎంతమంది కావలసిన వాళ్లు ఉన్న అక్కడ యుద్ధంలో పాల్గొనవలసింది ఒంటరిగానే. చుట్టుపక్కనున్న వాళ్లు కొంత సమయం వరకు కనపడిన ఆ తర్వాత మత్తులో మునిగిన తర్వాత ఏం జరుగుతుందో ఒక భయం. ఆ భయం ఎవరూ తీర్చలేనిది.   

చిన్నప్పుడు అమ్మ కొన్న కొత్త గౌను చూసి మురిసిపోతారు పసిపిల్లలు. ఈ వయసులో ఈ ఆరోగ్యాలయం వాళ్ళు ఇచ్చిన గౌను చూస్తేనే భయం. అలాగే చిన్నప్పుడు మూడు చక్రాల సైకిల్ అంటే చిన్న పిల్లలందరికీ సరదా. కానీ ఈ చక్రాల బండిలో యుద్ధ భూమికి ఒంటరిగా వెళుతుంటే ఆ బండిలో కూర్చున్న రోగికి సరే, చుట్టూ ఉన్న ఆత్మీయుల కళ్ళల్లో కన్నీళ్లు కనిపించే యి. విచిత్రం అందరి మనసుల్లో ఒకటే బాధ పైకి చెప్పుకోలేని బాధ. ఏదో తెలియని అలజడి. ఒకరికొకరు ధైర్యం చెప్పుకోలేని పరిస్థితి. ధైర్యం చెప్పుకున్న ఆ భయాన్ని పోగొట్టుకోలేని పరిస్థితి. ఒకసారి తప్పు చేశామా అనే ప్రశ్న అందరిలోనూ ఉదయించింది.ఈ వయసులో అంత బాధ పెట్టాలా అనే ప్రశ్న ఆత్మీయులు ఎక్కడ ఉన్నా అందరిలోనూ ఉదయించింది. కానీ ధైర్యం చెప్పిన అనుభవజ్ఞులైన ఆ వైద్యుల మాటలే ముందుకు నడిపించాయి.

మొత్తానికి యుద్ధ రంగ ప్రవేశం జరిగింది. కనపడినంతసేపు ఆ రోగిని చూస్తూ ఆ తర్వాత కనపడని దేవుడికి మొక్కుకుంటూ ఆ యుద్ధభూమికి బయట పది అడుగుల దూరంలో కూర్చుండిపోయారు ఆత్మీయులందరూ.

కాలం స్తంభించిపోయింది. క్షణం ఒక యుగముగా నడుస్తోంది. అందరూ ఆ గుమ్మం వైపు చూసేవాళ్లే. మనలాగే ఎంతమందో. అందరి కళ్ళల్లో ఒకే రకమైన భావం ,భయం. గుండె ధైర్యం ఉన్న వాళ్లు కూడా కన్నీళ్లు దాచుకోలేని సమయం. ఏదో మాట్లాడాలనే ఉత్సాహం కూడా ఏమాత్రం లేని సందర్భం. ప్రయత్నం చేసాం. ఫలితం కోసం ఎదురు చూస్తున్నా o. గంటలు గడుస్తున్నాయి. గుండెలు వేగం పెరుగుతున్నాయి. ఒక్కొక్క సందర్భం అనుభవించినప్పుడు తెలియదు. తర్వాత ఆరోజు ఎలా గడిచిందని అనుకుంటూ ఉంటాం. 

అక్కడ కూర్చున్న వాళ్ళందరూ లోపల నుంచి వచ్చే కబురు కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్న వాళ్లే. తలుపు చప్పుడైతే చాలు ఆ గుమ్మం వైపు ఎన్నో చూపులు. వచ్చేది మనవాళ్లు కాదని తెలుసుకుని నిరాశ పడే వాళ్ళు, వచ్చిన మత్తు మనిషి కనబడగానే అందరి కళ్ళల్లో ఆనందం డాక్టర్ చెప్పిన కబురు వినగానే ఒక రకమైన సంతోషం ఉద్వేగం ఒక పని సాధించామని ఆనందం ప్రతిరోజు ఆ చోటులో కూర్చున్న వాళ్ల అనుభవం.

అలా నాలుగు గంటలు గడిచింది. లోపలి నుంచి కబురు తెలిసింది కానీ అది అధికారిక వార్త కాదు. మనిషిని కళ్ళతో చూస్తే గాని మనకు భయం పోదు. మొత్తానికి నాలుగు చక్రాలు బండిమీద మత్తులో ఉన్న ఆ అవ్వ కనబడగానే అందరి కళ్ళల్లో వర్ణించలేని ఆనందం. ఇన్నేళ్లపాటు బాధపెట్టిన శత్రువుని చూసి అందరూ అయ్య బాబోయ్ అనుకున్నారు. సీతాకోకచిలుకను చూడగానే అందరికీ ఆనందం వస్తుంది.సీతాకోకచిలుక ఆకారంలో ఉండే ఈ మాంసం ముద్ద చూడగానే భయం వేసింది. కంద దుంప ని భూమి లోంచి తీసే రైతులా అంత సులువుగా ఆ దుంపని బయటకు తీసిన డాక్టర్లను చూడగానే చేతులెత్తి మొక్కాలనిపించింది. ఆ రోగికి పునర్జన్మిచ్చిన దేవుడు లాంటి డాక్టర్ కి నోరు తీపి చేయడం తప్పితే మనం ఏం చేయగలం. ఒక చంటి బిడ్డ 9 నెలలపాటు అమ్మ కడుపులో ఉంటాడు. ఆ రోగి 24 గంటలు మత్తులో ఉండి కళ్ళు తెరిచినప్పుడు అమ్మ కడుపులో నుంచి పుట్టిన పసిబిడ్డను చూసినప్పుడు కలిగిన ఆనందం కలిగింది ఆత్మీయులు అందరికీ. ఒక చుక్క పాలు తాగినప్పుడు ఒక స్పూను అల్పాహారం తీసుకున్నప్పుడు నాలుగు అడుగులు వేసినప్పుడు ఆమె బాల్యాన్ని మళ్లీ మనం చూసినట్లు అనిపించింది. హాయిగా ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకువస్తుంటే పెద్దాపరేషన్ చేసిన తర్వాత ఇంటికి తీసుకువచ్చే బాలింతరాల్లాగా చంటి పిల్లల్లాగా ఆనందపడ్డారు.
 కుటుంబ సభ్యులు.

ఇంతకీ నేను వ్రాసింది కథ కాదు. ఒక నిజ జీవిత గాధ. ప్రధాన పాత్రధారి పేరు ఆకొండి సత్యవతి W/ చిరంజీవి. తూర్పుగోదావరి జిల్లా కాకరపర్రు గ్రామ వాసి. ఎన్నో రకమైన ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ అవి మందులకు లొంగి జీవితాన్ని ముందుకు నడిపిస్తున్న ఈ రోగానికి శస్త్ర చికిత్స తప్ప వేరొక దారి లేక ప్రస్తుతం ఉన్న ఆరోగ్య సమస్యలకు భయపడి శస్త్ర చికిత్స ఆలస్యం చేసుకుంటే రోగం రెట్టింపు అయింది. గోటితో పోయేదాన్ని గొడ్డలితో నరకవలసి వచ్చింది. 

సరే ఇంత సాహసోపేతమైన కార్యక్రమానికి పూనుకున్న ఆ డాక్టర్ల బృందo గురించి కూడా మనం చెప్పుకో పోవడం వల్ల మనం చేసిన మేలు మర్చిపోయిన వాళ్ళు అవుతాం. ఆ డాక్టర్ల బృందానికి నాయకుడు డాక్టర్ సమీర్ రంజన్ నాయక్ నిజానికి ఈ శస్త్ర చికిత్స విజయవంతం చేసిన కారణంగా అతను చాలా తెలివైన అనుభవమున్న డాక్టర్ గా మనం ఒప్పుకోక తప్పదు. ఆ అనుభవజ్ఞుడైన నాయకుడి ఆధ్వర్యంలో మిగతా బృందం కూడా చాలా బాగా పనిచేసింది అని చెప్పుకోవాలి. ఇన్ని సమస్యలున్న ఆ రోగికి విజయవంతమైన శస్త్ర చికిత్స చేసి మన ముందు మన మనిషిలా నిలబెట్టిన ఆ డాక్టర్ని ఎలా మర్చిపోగలం? ఇది వారి పూర్వీకులు చేసిన పుణ్యఫలం. ఆమె నమ్ముకున్న సాయి రాముడు దయ. 

కడుపున పుట్టిన వాళ్లు ఐదుగురు , ఎనిమిది మంది మనుమలు, ముగ్గురు ముని మనవలు పెంచి పెద్ద చేసి చంటి పిల్లల పెంపకంలో విశేష అనుభవం గడించిన ఆ అవ్వ పెద్ద కోడలు చేతిలో ఒక పసిపాపలా సేవలు అందుకోవడం అది ఆమె అదృష్టం. ఆ గ్రామ దేవత ఆశీర్వచనం. 

నాకు రక్తసంబంధం లేదు. మంత్రం కలిపిన బంధం. కొన్ని క్షణాలు మనసులో చెలరేగిన అలజడి ఆందోళన మూత్రశాల వైపు నన్ను పలుసార్లు పరుగులెట్టించే యి. గూగుల్ తల్లి చెప్పిన సంగతులు మరింత ఆందోళన పెంచేసేయి. ఇంక రక్తసంబంధీకులు మనసు ఎలా ఉంటుందో ఊహించలేం.

ఇంతమంది కుటుంబ సభ్యులు ప్రతిరోజు ఆమె యోగక్షేమాలు తెలుసుకోవడం నిజంగా చాలా ఆనందించదగ్గ విషయం. వయసు మళ్లిన వాళ్ళని సరిగా పట్టించుకోని రోజులివి. ఇది అంతా పెద్దల పుణ్యఫలం.

అందుకే ఈ కథకి "అవ్వ మళ్లీ పుట్టింది " అని నామకరణం చేసిఆపరేషన్ సంగతులన్నీ పిల్లలకి కథలుగా చెబుతూ ఈ కథ ముగిస్తున్న. 

రచన మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు 
కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సామర్లకోట

ఆరోగ్యం వర్సెస్ ఆహారపు అలవాట్లు

కుటుంబం