దివాన్ బుచ్చిరాజు
రాత్రి పది గంటలయింది.
మండువేసవి కాలం.
గోడ గడియారం శబ్దం తప్పితే ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అందులో ఉండే వ్యక్తులు ఒకరు తప్ప అంతా నిద్రలో మునిగిపోయి ఉన్నారు. వీధిలో ఎటు చూసినా చిమ్మచీకటి. లాంతరు వెలుగు తప్ప ఇంకేమీ కనపడటం లేదు. కాపలాదారులు అటూ ఇటూ పచార్లు చేస్తున్నారు. ఏ మూల నుంచి ఎవరు దాడి చేస్తారో అనే భయంతో చాలా జాగ్రత్తగా అటూ ఇటూ చూస్తూ, కళ్లకు మూతలు పడకుండా విశ్వప్రయత్నం చేసుకుంటూ తమ విధి నిర్వహణలో మునిగిపోయారు.
అవును… అది మామూలు వ్యక్తి ఇల్లు కాదు. రాజుగారి తర్వాత రాజుగారంతటి గౌరవ మర్యాదలు ఇవ్వాల్సిన ఒక సంస్థానంలోని దివాన్ గారి ఇల్లు.
“దివాన్” అంటే ఈ రోజుల్లో మన ఇళ్లలో వాడే మంచం ఆకారంలో ఉండే వస్తువు గుర్తుకొస్తుంది. కానీ ఆ రోజుల్లో రాజ్యాలలో, సంస్థానాలలో “దివాన్” అనేది ఒక పదవి పేరు. రాజుగారి తర్వాత రాజుగారంతటి వాడు దివాన్. ప్రధానమంత్రి లాంటివాడు అన్నమాట. రాజ్య పరిపాలనంతా ఆయన చేతిమీద నడిచేది. రాజు చెప్పిన ఆజ్ఞలను అమలు చేయడమే దివాన్ గారి పని. చాలా అధికారాలు ఉన్నప్పటికీ, ప్రతి విషయంలో రాజుగారి అనుమతి తీసుకోవాలి.
నివసించడానికి మంచి ఇల్లు, ఇంటినిండా పనివాళ్లు, వీధిలో కాపలాదారులు, ఒక గుర్రపు బండి, మంచి జీతం — ఇవన్నీ ఆయనకు ఇచ్చే సౌకర్యాలు. అంతేకాదు, నిత్యం రాజుగారి పక్కనే ఉండే అదృష్టం ఎంతమందికి కలుగుతుంది? ఆ దివాన్ అనే పదవికి అలాంటి గౌరవం ఉండేది.
బ్రిటిష్ వారి కాలంలో రెండు రకాల పాలన వ్యవస్థలు ఉండేవి — బ్రిటిష్ పాలిత ప్రాంతాలు, సంస్థానాలు. సంస్థానాలంటే భారతదేశపు రాజులు, నవాబులు, మహారాజులు పాలించిన రాజ్యాలు. ఇవి పూర్తిగా స్వతంత్ర రాజ్యాలు కాకపోయినా, బ్రిటిష్ ఆధీనంలో ప్రత్యేక హోదాతో కొనసాగేవి.
తూర్పుగోదావరి జిల్లాలో ఉండే అలాంటి ప్రముఖ సంస్థానంలో రాజభవనం, దేవాలయాలు, వ్యవసాయ భూములు, ఆదాయ వ్యవస్థ నిర్వహణ కోసం పెద్ద వ్యవస్థ ఉండేది. అలాంటి సంస్థానంలో మొత్తం పరిపాలన వ్యవస్థను చూసేవాడు దివాన్.
ఆయన పేరు బుచ్చిరాజు.
పేరులో “రాజు” ఉన్నప్పటికీ క్షత్రియ వంశానికి చెందినవాడు కాదు. సద్బ్రాహ్మణుడు. పరమ నిష్టాగరిష్ఠుడు. ఆరడుగుల పొడవైన మనిషి. తెలుగువారి గౌరవానికి తగినట్టుగా పంచకట్టు, అందమైన మీసకట్టు, నుదుటన బొట్టు, తలపై తలపాగా, భుజంపై జరీ అంచుతో ఉన్న ఉత్తరీయం — ఆయనను ఒక్కసారి చూస్తే గౌరవంగా తలవంచాలనిపించేది.మాట తక్కువ. చూపు గంభీరం. హృదయం మాత్రం వెన్నపూస లాంటిది. ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా చేయడానికి ఆయన ఎప్పుడూ ముందుండేవాడు.
ఒక పెద్ద సంస్థానంలో దివాన్‌గా ఎన్నో రాజభోగాలు అనుభవిస్తున్నప్పటికీ, ఆరోజు ఎందుకో ఆయనకు నిద్ర పట్టలేదు. మంచం మీద అటూ ఇటూ దొర్లుతున్నాడు.
ఇంతలో వీధిలో అలికిడి శబ్దం వినిపించింది.
కాపలాదారులు అందరూ అటువైపు దృష్టి సారించారు. దూరం నుంచి చేతుల్లో కర్రలు, లాంతర్లు పట్టుకుని వస్తున్న గుంపు కనబడింది.
“ఇదేమిటి? ఈ వేళలో ఇంతమంది జనం?”
“ఏదైనా దివాన్ గారి మీద దాడి చేయడానికి వస్తున్నారా?”
అని అనుమానంతో కాపలాదారులు గట్టిగా అరిచారు.
అంతలో—
“కాపాడండి… కాపాడండి… దివాన్ గారూ…” అంటూ హాహాకారాలు చేస్తూ ఆ గుంపు దగ్గరకు వచ్చింది.
ఆ అరుపులు విని బయటకు వచ్చారు దివాన్ బుచ్చిరాజు.
లాంతరు వెలుగులో వాళ్ల ముఖాలు చూసేసరికి, వారి ఆందోళన, ఆత్రుత చూసి ఏదో ప్రమాదం జరిగిందని అర్థమైంది.
“ఏమైంది?” అని ప్రశ్నించారు బుచ్చిరాజు.
నిజానికి రాజుగారి దర్శనం లాగే దివాన్ దర్శనం కూడా దొరకడం చాలా కష్టం. కానీ బుచ్చిరాజు అలాంటి మనస్తత్వం కలవాడు కాదు. ప్రజాసేవ అంటే మక్కువ.
“అయ్యా… పల్లపు వీధిలో ఉండే మా గూడెం నుంచి వస్తున్నాం. మా గూడెంలో అగ్నిప్రమాదం జరిగింది. ఇళ్లన్నీ కాలి బూడిదయ్యాయి. కట్టుబట్టలతో వీధిలో నిలబడి ఉన్నాం. తిండి తిప్పలు లేవు. మీరే మమ్మల్ని కాపాడాలి…” అంటూ వాళ్లు ఆయన కాళ్ల మీద పడ్డారు.
వాళ్ల పరిస్థితి చూసి బుచ్చిరాజు మనసు కరిగిపోయింది. అయినప్పటికీ ఆయన ఆలోచనలో పడ్డాడు.
“ముందు వీళ్లకి తిండి పెట్టాలి. ఈ రాత్రికి తలదాచుకునే చోటు కల్పించాలి. కానీ ఇవన్నీ చేయడానికి నాకు అధికారముందా? ఇంత అర్ధరాత్రి వేళ రాజుగారిని లేపడానికి ఎవ్వరూ ధైర్యం చేయరు. మరి ఏం చేయాలి?”
ఒకవైపు రాజాజ్ఞ. మరోవైపు ప్రజల ఆర్తనాదం.
కొన్ని క్షణాలు తలవంచుకుని ఆలోచించిన ఆయన ఒక్కసారిగా తలెత్తి కాపలాదారుల వైపు చూశాడు.
“ముందు వీళ్లందరినీ రాజవీధి చివర ఉన్న ధాన్యశాలకు తీసుకెళ్లండి. అక్కడ పెద్ద మేడ ఉంది. ఈ రాత్రికి అందరూ అక్కడే ఉండాలి. వెంటనే వంటశాలలో ఉన్న బియ్యం, పప్పు, నెయ్యి తీసుకెళ్లి అన్నం వండించండి. చిన్నపిల్లలు, వృద్ధులకు ముందుగా భోజనం పెట్టండి,” అన్నాడు గంభీరంగా.
కాపలాదారులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.
“అయ్యా… రాజుగారి అనుమతి లేకుండా…” అని ఒకడు భయంగా అన్నాడు.
బుచ్చిరాజు కళ్లలో మెరుపు మెరిసింది.
“ప్రజల ఆకలి ముందు ఆజ్ఞలు తరువాత. ఈ రాత్రి వాళ్లు బతకడం ముఖ్యం,” అన్నాడు నెమ్మదిగా.
ఆ మాటల్లో కోపం లేదు. కానీ ధర్మం ఉంది.
అంతే… పనివాళ్లు పరుగులు తీశారు. కొందరు బియ్యపు బస్తాలు మోశారు. కొందరు నీళ్లు తెచ్చారు. ఇంకొందరు పెద్ద పెద్ద మంటలు వెలిగించి వంట మొదలుపెట్టారు.
అర్ధరాత్రి నిశ్శబ్దంలో పాత్రల చప్పుళ్లు, పిల్లల ఏడుపులు, ఆడవాళ్ల ఓదార్పు మాటలు కలిసిపోయాయి.
గూడెం ప్రజలు మాత్రం ఇంకా భయంతోనే ఉన్నారు.
ఒక ముసలమ్మ చేతులు జోడించి—
“నాయనా… దేవుడే వచ్చి ఆదుకున్నట్టు ఉంది,” అంది.
బుచ్చిరాజు చిరునవ్వు నవ్వాడు.
ఆ రాత్రంతా ఆయనకు నిద్రలేదు. అందరికీ స్వయంగా ఏర్పాట్లు చూస్తూ, సౌకర్యాలు కల్పిస్తూ తెల్లవారుజామున వరకూ ఒక సేవకుడిలా పనిచేశాడు.
ఉదయం సూర్యుడు ఉదయించేలోపే ఈ వార్త రాజభవనానికి చేరింది.
“దివాన్ బుచ్చిరాజు రాజుగారి అనుమతి లేకుండా ధాన్యశాల తెరిపించి ప్రజలకు అన్నం పెట్టించారట…”
అని కొందరు ఆస్థానంలోని ఈర్ష్యాపరులు రాజుగారి చెవిలో వేసారు. మరికొందరు మాత్రం రాజుగారి దాతృత్వాన్ని వేనోళ్ల కీర్తించారు.
ఈ రెండు వార్తలూ రాజుగారికి చేరాయి.
రాజుగారి ముఖం గంభీరంగా మారింది.
“వెంటనే దివాన్‌ను సభకు పిలవండి,” అని ఆజ్ఞ వెలువడింది.
ఆ వార్త వినగానే రాజభవనం అంతా గుసగుసలతో నిండిపోయింది.
“ఇప్పుడు ఏమవుతుందో…”
“రాజుగారి కోపం భయంకరం…”
“దివాన్ గారి పదవి పోతుందేమో…”
అని అందరూ చర్చించుకున్నారు.
కానీ బుచ్చిరాజు మాత్రం ప్రశాంతంగా స్నానం చేసి, పంచకట్టు కట్టుకుని, నుదుటన తిలకం పెట్టుకుని సభకు బయలుదేరాడు. ఆయన ముఖంలో భయం లేదు. ఎందుకంటే తాను చేసిన పని తప్పు కాదనే నమ్మకం ఆయనకు ఉంది.
రాజసభలో రాజుగారు సింహాసనం మీద కూర్చున్నారు.
“దివాన్ గారు… నా అనుమతి లేకుండా రాజధాన్యాన్ని ప్రజలకు పంచిపెట్టావట. నిజమేనా?” అని గంభీర స్వరంతో అడిగారు.
సభ మొత్తం నిశ్శబ్దమైంది.
బుచ్చిరాజు చేతులు జోడించి నమస్కరించాడు.
“నిజమే మహారాజా,” అన్నాడు ధైర్యంగా.
“అధికారాలను అతిక్రమించినందుకు శిక్ష ఏమిటో తెలుసా?” అని రాజుగారు అడిగారు.
“తెలుసు మహారాజా,” అన్నాడు.
“అయినా ఎందుకు చేశావు?”
బుచ్చిరాజు క్షణం తలవంచి మెల్లగా అన్నాడు—
“ఆ రాత్రి నేను రెండు మార్గాల మధ్య నిలిచాను మహారాజా… ఒకటి రాజాజ్ఞను కాపాడటం… రెండోది ప్రజల ప్రాణాలను కాపాడటం. నేను దివాన్‌గా శిక్షకు అర్హుడినై ఉండవచ్చు. కానీ మనిషిగా వాళ్లను వదిలేయలేకపోయాను.”
ఆ మాటలు విన్న సభలోని అందరూ నిశ్శబ్దంగా తలవంచారు.
రాజుగారు మాత్రం చిరునవ్వు నవ్వారు.
“మీరు చేసిన పని వల్ల ప్రజల్లో మా కీర్తి ప్రతిష్ఠలు ఇనుమడించాయి. ఉద్యోగులు బాధ్యతతో పనిచేయడం మాకు ఎంతో ఆనందం కలిగించింది. ప్రజల కష్టసమయంలో ఆదుకోవడం నిజంగా గొప్ప విషయం. మీలాంటివారు ఉండడం నాకు గర్వకారణం. మీకేం కావాలో కోరుకోండి,” అన్నారు మహారాజు.
బుచ్చిరాజు వినమ్రంగా నమస్కరించాడు.
“వ్యక్తిగతంగా నాకేమీ అవసరం లేదు మహారాజా. ఆ గూడెం ప్రజలకు న్యాయం చేయండి. రేపటినుంచి తలదాచుకోవడానికి గూళ్లు ఏర్పాటు చేయించండి,” అన్నాడు.
ఇంకేముంది… రాజు తలుచుకుంటే జరగని పని ఏముంటుంది?
కొన్ని రోజులలోనే ఆ గూడెం ప్రజలకు కొత్త ఇళ్లు కట్టించారు. మళ్లీ వారి జీవితాల్లో వెలుగు వచ్చింది.
ఆ రోజునుంచి ప్రజలు ఒక మాట చెప్పుకునేవారు—
“రాజ్యం గొప్పది కాదు… మనసుతో పనిచేసే మనుషులు ఉన్న రాజ్యమే గొప్పది.”
అలాంటి అధికారులు, ప్రభువులు ఆ రోజుల్లో ఉండేవారు.
ఈ కథ నిజంగా జరిగింది. మా అమ్మ చెబుతూ ఉండేది. ఆ సంస్థానం పేరు పిఠాపురం. ఆ బుచ్చిరాజు మా అమ్మగారి బంధువు. ఎంతో మంది కవులకు, కళాకారులకు ఆశ్రయం ఇచ్చిన సంస్థానం అది.
కథ కోసం చిన్న మార్పులు, చేర్పులు చేశాను.
— రచన: మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి