మార్పు
మార్పు
నాన్న ఈసారి మీరు తప్పకుండా నాతో పాటు రావాలి. నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను మీరు దాటేస్తున్నారు. మా కొలీగ్ తల్లిదండ్రులందరూ వచ్చి ఆరేసి నెలలపాటు ఉంటారు.
మీరేమో నా మాట వినరాయే. నాకు చాలా బాధగా ఉంది అంటూ అమెరికా కొడుకు సురేష్ మాటలు విని చూద్దాం లేరా అoటు గొణుక్కుంటూ తన గదిలోకి వెళ్లిపోయారు చిరంజీవి గారు.
సురేష్ కిఅమెరికాలో ఉద్యోగం వచ్చి ఆరు సంవత్సరాలు అయింది. సురేష్ ఉద్యోగం వచ్చినప్పటి నుంచి తండ్రి బాధ్యతలు పంచుకుంటూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటూ వచ్చాడు. చిరంజీవి గారికి నలుగురు మగపిల్లలు ఒక అమ్మాయి . చిరంజీవి గారి భార్య నాలుగు సంవత్సరాల క్రితమే చనిపోయింది. ముగ్గురు కొడుకులు భార్యలు మన వళ్ళతో ఆ ఊర్లోనే కాలక్షేపం చేస్తున్నాడు చిరంజీవి గారు. సురేష్ చదువు కోసం తండ్రి చేసిన అప్పులు తీర్చి అన్నగారి కొడుక్కి గుండె ఆపరేషన్ చేయించి తండ్రి కోరిక ప్రకారం ఆ గ్రామంలో ఒక మంచి ఇల్లు కట్టించాడు. అయితే సురేష్ తనకంటూ ఒక పది పైసలు దాచుకోలేదు. పెళ్లి కూడా అయ్యింది .ఇద్దరు పిల్లలు. పాపం డబ్బంతా మనం వాడేస్తే ఎలాగా అనేది సురేష్ తండ్రి చిరంజీవి గారి ఆలోచన.
చిరంజీవి గారు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వాడు. సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు అంటే బాగా నమ్మకం ఉన్నవాడు. రోజు సంధ్యా వందనం చేస్తే గాని పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోడు.
దానికి తోడు ఆయనకి ఆరోగ్యం బాగా ఉండదు.జీవితాంతం మందులు వాడాలని డాక్టర్ గారి సూచన. ఆరోగ్యం కోసం ఆహార నియమాలు ఎక్కువగా పాటిస్తాడు. పైగా తీరా ఇలా అక్కడికి వెళ్లిన తర్వాత ఆరోగ్యం బాగా లేకపోతే వైద్యం ఖర్చు చాలా ఎక్కువ. పుట్టి పెరిగిన ఊర్లోనే ఆ గోదావరి తీరంలోనే కన్ను మూయాలన్నది ఆయన కోరిక.
ఆ పల్లెటూర్లో ఒక పద్ధతిగా జీవిస్తున్న చిరంజీవి గారికి విదేశాలకు వెళ్లడం అంటే మనస్ఫూర్తిగా ఇష్టం లేదు. విదేశాలకు వెళ్తే దారి ఖర్చులు లక్షల్లో ఉంటాయి. అయినా ఒక రాత్రి ఒక పగలు తిండి తిప్పలు ఉండవు. ఆ పిజ్జాలు బర్గర్లు మనం తినలేము . పైగా విమానo గాల్లోనే ఇరవై నాలుగు గంటలు ప్రయాణం.రోజు అనేక వార్తలు వింటున్నాం.
తీ రా మనం వెళ్ళిన తర్వాత అక్కడికి సెలవు వచ్చిందంటే చాలు టూర్లకి వెళదామని అంటారు. దానికి కూడా అనవసరంగా ఖర్చు. వెళ్ళిన తర్వాత అక్కడ హోటల్ ఖర్చు తిండి ఖర్చు మళ్లీ షాపింగ్. మనం ఖర్చు పెట్టలేము. వాళ్లు ఖర్చు పెడుతుంటే చూడలేం.
అందుకే కొడుకు ఎప్పుడు అడిగినా ఏదో సాకు చెప్పి
వాయిదా వేస్తుంటాడు. ఇలా ఆలోచిస్తూ చిరంజీవి గారు మంచం మీద పడుకున్నారు గాని నిద్ర పట్టలేదు.
చిన్నప్పుడు సురేష్ ఎప్పుడు ఏం అడిగినా చిరంజీవి గారు కాదనే వారు కాదు. పది కిలోమీటర్ల దూరంలో ఉన్న టౌన్ కి వెళ్ళినప్పుడు సురేష్ ఎప్పుడు హోటలుకి తీసుకెళ్ళమనే వాడు.
తనకు ఆచార వ్యవహారాలు ఉన్నప్పటికీ చిరంజీవి గారు ఎప్పుడు కాదని చెప్పలేదు.
ప్రతి ఆదివారం సినిమాలు షికార్లు.అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టడం ఇష్టం లేని చిరంజీవి గారు కొడుకు కోరిందల్లా చేస్తూ ఉండేవాడు. ఆఖరున పుట్టిన వాడు కాబట్టి అంత గారాబం.
రాత్రి పది గంటలు అయింది. కొడుకు సురేష్ తలపుతోసుకొని గదిలోకి వచ్చి తండ్రి గారి పక్కన పడుకున్నాడు. ఇద్దరికి ఇద్దరే.
ఇద్దరూ పట్టుదలగల మనుషులే. నాన్న పడుకున్నారా అని ప్రశ్నించాడు. లేదమ్మా చంటి ఇంకా నిద్ర రాలేదు. రా అంటూ ప్రక్కకు జరిగారు.
నాన్న ఏమంటారు. నేను టికెట్ బుక్ చేసుకోవాలి. ఇద్దరికీ కలిపి బుక్ చేస్తాను. మీకు అక్కడ అన్ని విధాల సౌకర్యంగా ఉంటుంది. మీరు పూజ చేసుకోవడానికి ప్రత్యేకమైన పూజ గది ఉంది. మీ కోడలు మడి కట్టుకునే వండుతుంది.
మన ఆచార వ్యవహారాలు అంటే ఆమెకు చాలా ఇష్టం. మీకు అక్కడకు వస్తే అంత అర్థం అవుతుంది. ఒకవేళ ఆమె చేతి వంట తినడం మీకు ఇష్టం లేకపోతే నేను స్వయంగా వండి పెడతాను. పిల్లలు కూడా తాత ని ఎప్పుడు తీసుకొస్తావు అని అడుగుతుంటారు.
సురేష్ ఎంత బలవంత పెట్టినా చిరంజీవి గారికి ఆ అమెరికా ప్రయాణం అంటే ఇష్టం లేదు. సురేష్ ది చిన్నప్పటినుంచి మొండి పట్టుదలే. కోరుకున్నవన్నీ సాధించుకుంటాడు. ఎవరు చెప్పినా వినడు. ఆఖరికి తను ఇష్టపడిన అమెరికా అమ్మాయిని కూడా కుటుంబంలో ఎవరికి ఇష్టం లేకపోయినా అక్కడ పెళ్లి చేసేసుకున్నాడు.
సురేష్ ప్రతి ఏడాది అమెరికా నుండి వచ్చి తండ్రిని చూసి వెళ్తాడు కానీ భార్యని ఎప్పుడూ తీసుకురాడు. చిరంజీవి గారికి ఇష్టం ఉండదు అని. చిరంజీవి గారు సురేష్ భార్యతో ఫోన్లో మాట్లాడడానికి కూడా పెద్దగా ఇష్టపడడు.
ఇప్పుడు చిరంజీవి గారికి అక్కడికి వెళ్లాలంటే అదే భయం. ఆచార వ్యవహారాల కుదరవని. సరే కొడుకు అన్నిసార్లు అడుగుతున్నాడు వచ్చే ఏడాదికి ఆరోగ్యం ఎలా ఉంటుందో
ఈ ఒక్క ఆర్నెల్లు ముక్కు మూసుకుని అక్కడ కాల క్షేపం చేస్తే ఎలా ఉంటుంది అనీ ఒక క్షణం ఆలోచించాడు. పెద్దవాళ్లు పట్టుదలకి పోకూడదు. అన్నీ తెలిసిన వాళ్ళు.
కాలం ఎలా నడిపిస్తే నడవాలి. మన అభిప్రాయాలతో పిల్లల్ని బాధ పెట్టకూడదు అనుకొని సరే రా టికెట్ రిజర్వ్ చేయించు అంటూ దుప్పటి ముసుగు పెట్టాడు.
సురేష్ ఆనందానికి హద్దు లేదు. భార్య మేరీకి ఫోన్ చేసి విషయం చెప్పాడు. చిరంజీవి గారికి మనసులో దిగులుగా ఉన్న తను కూడా కావాల్సిన బట్టలన్నీ సర్దుకుని రాజమండ్రిలో ఉన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్లి చెక్ అప్ చేయించుకుని ఆరు నెలలకు సరిపడా మందులు తీసుకొని వచ్చాడు. మనవలకి కోడలికి బట్టలు కొనుక్కుని వచ్చాడు. పెళ్లయిన తర్వాత కూడా కోడలికి ఏమీ పెట్టలేదు . మనవలు ఇద్దరికీ చెరో బంగారు గొలుసు కోడలికి మెడలో హారం బ్యాగ్ లో సర్దుకున్నాడు.
పచ్చళ్ళు స్వీట్లు ప్రత్యేకంగా ప్యాక్ చేయించి కొరియర్ లో పంపించేశాడు.ఇన్ని చేశాడు కానీ మనసులో దిగులుగానే ఉంది. రాజమండ్రి నుంచి మొదలైంది విమానాల ప్రయాణం మూడు విమానాలు మారి ప్రాణాలు అర చేతిలో పెట్టుకునీ ప్రయాణం చేసి బిస్కెట్లతో జ్యూస్ లతో కాలక్షేపం చేసి కొడుకుతో సహా గమ్యం చేరాడు.
ఇంటికి చేరేటప్పుడు గుమ్మంలోకి ఎదురొచ్చి సామాన్లు అందుకున్నారు కోడలు పిల్లలు. కోడల్ని చూస్తే తెలుగు వారి పిల్లలా ఉంది కట్టుబొట్టు. రెండు చేతులతో నమస్కారం చేసి లోపలికి ఆహ్వానించింది.
మనవళ్ళు కూడా తాతగారు అంటూ అచ్చ తెలుగులోనే పలకరించి కాళ్లకు నమస్కారం చేశారు. బాగా పరిచయం ఉన్న వ్యక్తిలా కోడలు మేరీ కలివిడిగా తెలుగులో మాట్లాడుతోంది. స్నానానికి వేడి నీళ్లు రెడీ ముందు అర్జెంటుగా స్నానం చేసి రండి అంటూ భోజనాలు కూడా రెడీ ఎప్పుడు తిన్నారో ఏమో అంటూ చక చక భోజనాలు ఏర్పాట్లులలో మునిగిపోయింది.. స్నానం చేసి వచ్చేటప్పటికి ఎర్రటి పట్టు పంచి కొత్తది రెడీగా గదిలో స్టూల్ మీద రెడీగా ఉంది. ఇంకా కవర్ కూడా విప్పలేదు. పట్టుపంచికట్టుకుని చిరంజీవి గారి ఇల్లంత పరిశీలనగా చూసారు.
మంచి డూప్లెక్స్ ఇల్లు. పైన రెండు బెడ్ రూములు. కింద ఒక గెస్ట్ రూమ్ కిచెన్ హాల్ కం డైనింగ్. అధునాతన అలంకరణలతో ఇల్లంతా చాలా అందంగా ఉంది. విశాలమైన పెరడులో అన్ని కూరగాయల మొక్కలు పువ్వుల మొక్కలతో అరటి మొక్కలతో చాలా అందంగా ఉంది.
చిరంజీవి గారి ఇల్లు అంతా తిరిగి వచ్చేటప్పటికీ నేల మీద పీట వేసి అరిటాకులో మన ఆంధ్రుల భోజనం రెడీగా ఉంది. చిరంజీవి గారికి ఒకసారి ఆశ్చర్యం వేసింది. దేశం కాని దేశంలో
మన పద్ధతుల ప్రకారం నడుచుకోవడం నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం. పైగా ఈ అమ్మాయి తెలుగు అమ్మాయి కూడా కాదు.భోజనం కూడా కొసరి కొసరి వడ్డించడం అలవాటయింది ఆ అమ్మాయికి.
భోజనం చేసి వచ్చి పిల్లలకి కోడలు మేరీకి తీసుకొచ్చి న బంగారు వస్తువులు ఇచ్చాడు. స్వీట్లు పచ్చళ్ళు కూడా కొరియర్ వాడు అప్పటికే తీసుకొచ్చి ఇచ్చేసాడు. మీరు పంపించిన స్వీట్లు పచ్చ ళ్లు చాలా బాగున్నాయండి మావయ్య గారు. ఇక్కడ మాకు దొరుకుతాయి కానీ ఆ రుచి ఉండదు. చాలా స్వచ్ఛమైన నెయ్యితో చేసిన స్వీట్లు అంటూ ఎంతో ఆనందంగా చెప్పింది.
చిరంజీవి గారు ఇచ్చిన బంగారు వస్తువులు దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి పిల్లలకు వేసి తను అలంకరించుకున ని కోడలు మనవలు చిరంజీవి గారికి కాళ్లకు నమస్కరించారు.
కడుపునిండా భోజనం పడింది కాబట్టి ప్రయాణం బడలిక వలన కంటి మీదకు నిద్ర ముంచుకి వచ్చింది. అలా ఎంతసేపు పడుకున్నారో లేచేటప్పటికి ఉదయం ఎనిమిది గంటలయింది.
అప్పటికే కోడలు మేరీ గొంతులో నుంచి విష్ణు సహస్రనామం లక్ష్మీ సహస్రనామం శ్రావ్యంగా పూజ గదిలో నుంచి వినపడుతున్నాయి. గబగబా కాలకృత్యాలు తీర్చుకునీ స్థానం చేసి మడి బట్ట కట్టుకొని వచ్చేసరికి పూల సజ్జ నిండా పువ్వులు పూజా సామాగ్రి తో రెడీగా ఉన్నాయి. పూజ గదిలో అన్ని హిందువుల దేవుళ్ళు. అన్నింటికీ మనస్ఫూర్తిగా తన సొంత ఊర్లో ఉన్నట్టుగానే రెండు గంటలసేపు పూజలు చేసుకున్నాడు.
పిల్లలు కూడా స్నానాలు చేసి మొహానికి కుంకుమ పెట్టుకుని చిన్న చిన్న తువ్వాళ్లు కట్టుకుని తాత గారి పక్కనే కూర్చున్నారు.
పూజ గదిలోంచి వచ్చేటప్పటికి అరిటాకులో ఇడ్లీ కారంపొడి గ్లాసుతోటి పాలు రెడీగా ఉన్నాయి. కోడలు మేరీ దూరంగా కూర్చుని చిరంజీవి గారితో కబుర్లు ప్రారంభించింది. పెళ్లయిన సంవత్సరం వరకు తను కూడా ఉద్యోగం చేసేదని పిల్లల్ని చూసుకోవడానికి ఉద్యోగo మానేశానని చెబుతూ ఇక్కడ ఇద్దరు ఉద్యోగాలు చేస్తే గాని బ్రతకడం కష్టమని కూడా చెప్పింది.
ఇంతలో సురేష్ మేడ నుంచి కిందకు దిగి టిఫిన్ చేసి ఆఫీస్ కి వెళ్ళిపోయాడు. పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోయారు. చిరంజీవి గారు హాల్లో సోఫాలో కూర్చుని ఎదురుగుండా ఉన్న పుస్తకాల షెల్ఫ్ వైపుకు చూశారు
అన్నీ తెలుగు సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు, పురాణాలు మంచి మంచి నవల లు సంగీతానికి సంబంధించిన
పుస్తకాలు ఒకటేమిటి అది మినీ లైబ్రరీ లా ఉంది. అందులోంచి రామాయణం తీసుకుని గదిలోకి వెళ్లి చదువుతుంటే నిద్ర ముంచుకొచ్చింది. లేచేటప్పటికి మధ్యాహ్నం మూడు గంటలు అయింది. సురేష్ అప్పుడే ఆఫీస్ నుండి వచ్చేసాడు. బడలికాగా ఉండి మధ్యాహ్నం సెలవు పెట్టేసానని చెప్పాడు.
మన కులం కాదని అమ్మాయి గురించి ఎంత తక్కువగా అంచనా వేశాను. చదువుకున్న తెలివైన చురుకైన పిల్ల. పిల్లల్ని చాలా శ్రద్ధగా పెంచుతోంది. అన్నీ మన పద్ధతులే. ఇంకా మన పిల్లలే ఆధునిక పద్ధతులు అలవాటు చేసుకుంటున్నారు. కట్టుబొట్టు అంతా ఆంధ్రుల పద్ధతి.
ఎప్పుడో అమెరికాలో స్థిరపడిపోయిన కుటుంబం అయినా మన ఊరి పద్ధతులు నేర్చుకుని చక్కగా కొడుకు సురేష్ గురించి పాటిస్తోంది. గోదావరి తీరం లో ఉన్న ఆ ఊర్లో ఉన్న అమెరికాలో ఉన్న పెద్దగా తేడా ఏమీ కనిపించడం లేదు.
ఆహారపు అలవాట్లు అన్ని అలాగే ఉన్నాయి. తను నమ్ముకున్న భర్త గురించి కుటుంబాన్ని వదిలి రావడమే కాకుండా పద్ధతులన్నీ కూడా మార్చుకుంది. మరి భాష కూడా ఎంత చక్కగా మాట్లాడుతుంది. మన ఆచార వ్యవహారాలన్నీ ఎలా నేర్చుకుంది. అనుకుంటాం కానీ చాలా కష్టం. ఈ ఇంట్లో అన్నిచోట్ల తెలుగుతనం ఉట్టిపడుతుంది
ఇదే విషయం సురేష్ ని అడిగితే ఇలా కులాంతర వివాహం చేసుకునేవాళ్ళు జీవితంలో గొడవలు రాకుండా ఉండడానికి ఒక ప్రత్యేక శిక్షణ ఇచ్చే శిక్షణ సంస్థలు ఉన్నాయని అందులో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పండితులు భారతదేశంలో ని ప్రతి రాష్ట్రమునకు ప్రతి కులమునకు సంబంధించిన భాష ఆచార వ్యవహారాలు పద్ధతులు వంటలు పూజలు వ్రతాలు నోములు మన దుస్తులు కట్టుకోవడం ఇలా సంవత్సరం పాటు నేర్పుతారని చెప్పాడు. ప్రాక్టికల్స్ చేసి చూపిస్తారు. భాష పట్ల భయం పోగొడతారు. దీని మూలంగా తాము అన్ని కులాల పండుగలు చేసుకుంటామని కాబట్టి తనకి కులాంతర వివాహం మూలంగా ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పాడు.
వెంటనే చిరంజీవి గారికి సొంత ఊర్లో వయసు మోజులో కులాంతర వివాహాలు చేసుకుని తదుపరి ఆ కుటుంబాల్లో ఇమడలేక విడిపోయిన ఎన్నో కుటుంబాలు గుర్తుకొచ్చాయి.
రోజు పిల్లలు స్కూల్ నుంచి రాగానే కొంచెం రిలాక్స్ అయిన తర్వాత పక్కన కూర్చోబెట్టుకుని పద్యాలు పాటలు చిన్న చిన్న కథలు నేర్పించే వారు చిరంజీవి గారు. పిల్లలు కూడా తాత తాత అంటూ చుట్టూ తిరగడం ప్రారంభించారు. ఉదయ o పూట దగ్గర్లో ఉన్న సాయిబాబా మందిరానికి వెళ్లి కాలక్షేపం చేసుకుంటున్నారు చిరంజీవి గారు. అక్కడ చాలామంది తెలుగు వాళ్ళతో పరిచయం అయింది. ఇంటికి వచ్చిన తర్వాత ఒక గంట తోట పని తో సమయం గడిచిపోతుంది. ఇలా అయిదు నెల గడిచిపోయాయి. చిరంజీవి గారి ఇండియా వెళ్ళవలసిన టైం దగ్గర పడుతోoది.
ఒకరోజు కొడుకు సురేష్ ని పిలిచి నాకు ఇండియాకు వెళ్లాలని లేదురా ఇక్కడే ఉండిపోతాను పిల్లలతో కాలక్షేపం చేస్తూ ఏదైనా అవకాశం ఉందేమో చూడు అంటూ చెప్పాడు ఆనందంగా. సురేష్ ఆనందానికి హద్దు లేదు
అవకాశం ఏదైనా ఉందేమో అని ఇంటర్నెట్ అంతా వెతుకుతూ కూర్చున్నాడు. ఇంతలో ఊరు నుంచి సురేష్ స్నేహితుడు ఫోన్ చేసాడు. చిరంజీవి గారి భార్య పోయిన తర్వాత కోడళ్ళు సరిగా చూసేవారు కాదనీ సూటిపోటి మాటలతో బాధించేవారు అని తిండి కూడా సరిగా పెట్టేవారు కాదని తన తండ్రితో చెప్పుకుని బాధపడే వారిని చెప్పాడు.
ఇన్నాళ్ళు తండ్రి ఇంత బాధపడుతున్న ఇతర కులానికి చెందిన కోడలు కాబట్టి అమెరికా రావడానికి ఒప్పుకోలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి చూసి ఇక్కడినుండి వెళ్లడానికి ఇష్టపడట లేదు. ఎప్పటికీ నాన్నని ఇక్కడే ఉంచేసుకోవాలి అనుకున్నాడు సురేష్.
ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అవుతాయంటారు. ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో ఏం చెప్పగలం. ప్రయత్నం చేస్తే ఎంతైనా మార్పు వస్తుంది. ఊహ ఎప్పుడు నిజం కాదు. మంచి మార్పుని ఎప్పుడూ ప్రోత్సహిద్దాం.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి