పార్వతమ్మ కోరిక

పార్వతమ్మ కోరిక

" అమ్మ అమ్మమ్మ అన్నం తిందా! రాత్రి ఆఫీసు నుండి ఇంటికి వచ్చిన రఘు తల్లి అన్నపూర్ణని అడిగాడు. మజ్జిగ అన్నం తిని మందులు వేసుకుని పడుకుంది. నీ గురించి పది సార్లు అడిగింది రా. వాడు ఆఫీస్ నుంచి ఇంకా రాలేదు ఏమిటని. ఏరా ! రఘు అమ్మమ్మ ఎప్పటికైనా మంచం మీద నుంచి లేస్తుంది అంటావా! అని అడిగింది కొడుకుని. అమ్మమ్మకి ఏమి అనారోగ్యాలు లేవు. కేవలం వయస్సు తెచ్చిన నీరసం తోటి అలా పడుకొని ఉంటోంది. అయినా డబ్బై ఐదు ఏళ్ళు వయస్సు. తాతయ్య పోవడంతో మరి బెంగపెట్టుకుంది.

 మనం ఆ పోయిన వ్యక్తిని తీసుకురాలేం కానీ అమ్మమ్మని సాధ్యమైనంత వరకు ఆనందంగానే ఉంచాలమ్మ. అమ్మమ్మకి ఇంక ఎవరున్నారు. ఉన్నవాళ్లందరూ ఆడపిల్లలు ఎవరికి కాపురాలు వాళ్ళు చేసుకుంటున్నారు. చిన్నప్పటి నుంచి అమ్మమ్మకు నేనంటే చాలా ఇష్టం. ఒకటేమో పెద్ద మనవడు గాను రెండోది ఆవిడకి మగపిల్లలు లేకపోవడం తాతయ్య పోయిన తర్వాత మన దగ్గరి ఉండడంతో అమ్మమ్మ తోటి మనకు చాలా అనుబంధం పెరిగింది.ఆ రోజుల్లో చిన్న వయసులో పెళ్లిళ్లు చిన్న వయసులోనే కాన్పులు మూలంగా మనవళ్లు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు అని అన్నాడు రఘు.

" ఏమోరా ఆవిడ బ్రతికి ఉన్నన్నాళ్ళు ఏ మాట అనకుండా జాగ్రత్తగా చూసేలాగా ఓపిక ఇమ్మని భగవంతుని రోజు ప్రార్థిస్తున్నాను అంది రఘు తల్లి అన్నపూర్ణ. 

అమ్మమ్మ ప్రతి మనిషి జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చిన్నప్పుడు తల్లి కంటే ఎక్కువగా మలమూత్రాలను కడిగి తన కొడుకులు కంటే ఎక్కువ ప్రేమాభిమానాలను పంచి చంక నెత్తుకుని గోరుముద్దలు తినిపించి కథలు కబుర్లు చెప్పి సెలవులు ఇచ్చినప్పుడల్లా ఊరు రమ్మని ఆహ్వానించి ఒక ముఖ్య అతిథిలాగా ఎంతో గారాబంగా చూసే అమ్మమ్మ అంటే ప్రతి మనిషి జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తి. పెరిగి పెద్దయిన తర్వాత అమ్మమ్మగారి ఊరు వెళ్లడం తగ్గించేసిన తర్వాత ఉద్యోగ బాధ్యతలతో అమ్మమ్మతో ఫోన్లో మాట్లాడడం తప్ప ఎప్పుడో ఒకసారి వెళ్లి చూడడం తప్ప ఇంకేం అనుబంధం ఉంటుంది.   

అలాంటిది రఘు చిన్నతనం అంతా అందరిలాగే అమ్మమ్మ పార్వతమ్మ ఒళ్లో జరిగిన పార్వతమ్మకి మగపిల్లలు లేకపోవడంతో ఉన్న నలుగురు కూతుర్లకి పెద్దకూతురుకు మాత్రమే మగ పిల్లలు పుట్టడంతో రఘు మీద విపరీతమైన అభిమానం పెంచుకుంది. దానికి తోడు భర్త పోయిన తర్వాత పార్వతమ్మని పెద్ద కూతురు తన ఇంటికి తీసుకొచ్చేసింది. 

రఘు ఇంట్లో ఉన్నంత సేపు అమ్మమ్మ బాగోగులు చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత రఘు తల్లి పార్వతమ్మని కనిపెట్టుకొని ఉంటుంది. ఎప్పుడూ మంచం మీద అలా పడుకుని ఉంటుంది కానీ తను పనులు తాను చేసుకుంటూ ఉంటుంది పార్వతమ్మ. రోజు టీవీలో వార్తలు చూస్తూ ప్రపంచం గురించి రఘు తోటి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుంది. ఆవిడకి తెలియని విషయం లేదు. మధ్య మధ్యలో చిన్న చిన్న కోరికలు. గోదావరిలో స్నానం చేస్తానని పర్వదినాల్లో ఉపవాసం ఉంటానని ఇలా ఏదో ఒకటి. 

 గోదావరి స్నానానికి పెద్ద కష్టం లేదు. ఉండేది రాజమండ్రిలోనే కాబట్టి స్నేహితుడు సహాయం తీసుకుని పార్వతమ్మని కారులో గోదావరి దగ్గర తీసుకెళ్లి వీల్ చైర్ లో గోదావరి గట్టు మీద కూర్చోబెట్టి నీళ్లు తెచ్చి పోసి ఆవిడ కోరిక తీర్చాడు రఘు. ఆ మాటను వచ్చిన బంధువులందరికీ ఎంతో ఆనంద పడిపోతూ చెప్పుకుంటూ వచ్చింది. ఇంక ఉపవాసం అంటే ఒప్పుకోలేదు రఘు. ఎక్కడ నీరసం వచ్చి పడిపోతుందని రఘు భయం. చివరికి మధ్యాహ్నం పళ్ళు పలహారం తినడానికి ఒప్పించి ఉపవాసానికి ఒప్పుకున్నాడు రఘు. ఏమిటో అమ్మమ్మ కోరికలు వింటే భయంగా ఉంది అనుకున్నాడు రఘు. 

కాల కృత్యాలకి భోజనం చేయడానికి మాత్రమే మంచం మీద నుంచి లేచే పార్వతమ్మ ఒక వారం రోజుల నుండి లేచి కుర్చీలో కూర్చోవడం ప్రారంభించింది. ఏమిటి ఆకస్మిక మార్పు అనుకున్నాడు రఘు.
 టీవీలో వస్తున్న వార్తల్లో కుంభమేళా వార్తలు చూసి ఎంతో సంతోష పడిపోయింది. ఎంత పుణ్యాత్ములు వాళ్లు. ఒక నదిలో కాదు మూడు నదులు కలిసిన ప్రదేశంలో స్నానం చేస్తున్నారు. ఇంక పునర్జన్మ ఉండదుట. అయినా ఇది మహా కుంభమేళ. అంటూ మాట్లాడుతుంటే రఘు కి చాలా భయమేసింది. ఒకవేళ అమ్మమ్మ గాని కుంభమేళాకు తీసుకు వెళ్ళమని అడగదు కదా! అడిగితే ఏం చేయాలి? ఇటువంటి మనిషిని ఎలా తీసుకెళ్లాలి? అని భయపడుతూ ఉన్నాడు రఘు. అయినా ఈ మహా కుంభమేళా మళ్లీ వచ్చేసరికి అమ్మమ్మ కాదు ఇంట్లో వాళ్ళు ఎవరు ఉండరు అనుకున్నాడు రఘు. అయినా ఈ జనంలో ఈ ముసలి వాళ్లని తీసుకెళ్లడం ఎంత కష్టం అనుకుని భయపడ్డాడు. 

ఒకరోజు ఉదయo పార్వతమ్మ తన మనసులోని మాట బయట పెట్టింది. రఘు కి ఏం మాట్లాడాలో తోచలేదు. అమ్మమ్మ ఇప్పుడు చాలామంది జనాలు ఉంటారు. మనం వెళ్లడం కష్టమేమో అన్నాడు రఘు. లేదురా ఇప్పుడు ఇంక జనం తగ్గిపోతారు. ఇంకో పది రోజుల్లో కుంభమేళా అయిపోతుంది. నువ్వేం భయపడకు. మనతో పాటు అమ్మ నాన్న పిన్నిలు బాబాయిలు కూడా వస్తారు అంటూ చెప్పింది పార్వతమ్మ. అందరికీ ఫోన్ చేసి చెప్పాను నా కోరిక. మనం ఫ్లైట్లో వెళ్ళిపోదాం మనకే సమస్య లేదు కదరా బ్యాంకులో డబ్బులు ఉన్నాయి కదా అవిఖర్చు పెట్టు అంటూ ఉత్సాహంగా చెప్పింది.

మనవాళ్ళందరూ కూడా ఉంటారు కదా అందరూ నీకు సహాయం చేస్తారు నీకేమి ఇబ్బంది ఉండదు నన్ను తీసుకెళ్లడం వలన అంటూ రఘుని మాట్లాడినివ్వలేదు పార్వతమ్మ

 అసలు ఆరోగ్య సమస్య గురించి వారం రోజుల నుంచి మాట్లాడడం మానేసింది. అయినా రఘు కి భయమేసింది. ఇంత పెద్దావిడిని అక్కడికి తీసుకెళ్తే ఏమవుతుందో ఏమిటో! 
ఏదైనా జరగకూడని జరిగితే అందరూ నన్ను తిట్టుకుంటారు. అని ఆలోచించిన రఘు కి పార్వతమ్మ రఘు కనబడినప్పుడల్లా దాని గురించే మాట్లాడడంతో ఆవిడ కోరిక తీర్చాలి అనుకుని పార్వతమ్మ గారి పిల్లలందరితోటి మాట్లాడి పెద్దవాళ్ళందరికీ పార్వతమ్మ గారి కోరిక ప్రకారం ఫ్లైట్ టికెట్లు , అక్కడ ఉండడానికి, భోజనం ఏర్పాట్లు చేసాడు రఘు. ఈ రోజుల్లో డబ్బుంటే కొండమీద కోతి దిగి వస్తుంది. చేతిలో సెల్ఫోను, బ్యాంకులో డబ్బు, మనసులో కోరిక ,అన్నిటికన్నా ముఖ్యం భగవత్ సంకల్పం ఉంటే తీర్చుకోలేని కోరిక కూడా తీరిపోతుంది.

పార్వతమ్మ గారి బ్యాగు సర్దుతూ కూతురు మందులు, బట్టలు శాలువా , పెట్టాను మరి ఇంకేమైనా పెట్టాలా అని అడిగింది తల్లిని. "మీ నాన్నగారి ఫోటో ఒకటి పెట్టమ్మా! నా మరచెoబు కూడా పెట్టు అంటే ఉత్సాహంగా చెప్పింది. 

"ఒరేయ్ రఘు ఒక కాగితం తీసుకుని రా! అని చెప్పి తన అత్తగారి తరుపు తల్లి తరపు గతించిపోయిన పెద్ద వాళ్ళ పేర్లు అన్ని వ్రాయమని చెప్పి ఆ కాగితం రఘుని తన తండ్రికి ఇమ్మని చెప్పింది. రఘు తండ్రికి పరిస్థితి అర్థం అయింది.ప్రయాగరాజ్ వెళ్ళిన తర్వాత చేయవలసిన పని గుర్తు చేసింది .

రఘు భయపడుతూనే పార్వతమ్మని కూతుళ్లు అల్లుళ్లు తోటి కలిపి విమాన ప్రయాణం చేయించి ప్రయాగరాజ్ చేర్చాడు. పార్వతమ్మని ఎక్కడా కష్టపెట్టకుండా వీల్ చైర్ తోసుకుంటూ ఆ జనం మధ్యలో అతి జాగ్రత్తగా స్నానాలు ఘాట్ దగ్గరికి చేర్చి గట్టుమీద కూర్చోబెట్టి స్నానo పూర్తి చేయించాడు రఘు. దారిలో వీల్ చైర్ లో వస్తున్న పార్వతమ్మను చూసి అందరూ ఆశ్చర్యంగా చూశారు. ఆ స్నానం చేసిన తర్వాత పార్వతమ్మ మొహం వెలిగిపోయింది. ఎవరెస్టు శిఖరం ఎక్కినంత ఆనందం పొందింది. తన పూర్వీకులు ఎవరు కూడా ఇటువంటి అదృష్టాన్ని పొందలేదని గర్వపడింది . ఏదో పూర్వజన్మ సుకృతం ఉంటే గాని ఇటువంటి చోటికి తనలాంటి వాళ్ళు రాలేరని పదేపదే చెప్పడం ప్రారంభించింది. ఎన్నోసార్లు అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ ఇంతకాలం భగవంతుడు తనని బ్రతికి ఉంచాడంటే ఇటువంటివి చూడడానికి అని ఆనంద పడిపోయింది. విచిత్ర వేషధారణలో తామే శివుడని అనుకుని ఆ నాగ సాధువులను చూసి జన్మ ధన్యమైందని భావించింది. గంగా యమునా సరస్వతి మూడు నదులు కలిసిన ఆ ప్రాంతంలో స్నానం చేయడం అదృష్టంగా భావించింది.

పార్వతమ్మ స్నానం చేసేటప్పుడు తన వడిలో భర్త ఫోటో పెట్టుకుని స్నానం చేయడం చాలామందిని ఆకర్షించింది. ఆ వార్త వైరల్ అయింది. పార్వతమ్మ గారు సోషల్ మీడియాలోకి ఎక్కారు. ఒకటి ఇంత వయసు వచ్చిన కుంభమేళాకు రావడం ఒకటి ఎప్పుడో చనిపోయిన తన భర్తకి ఫోటో కూడా స్నానం చేయించడం రెండు వైరల్ అయిపోయాయి. పార్వతమ్మ గారి కోరిక తీర్చిన రఘు కూడా వార్తల్లోకెక్కిపోయాడు. 

అలా మర్నాడు కూడా భర్త ఫోటో తన దగ్గర పెట్టుకుని స్నానం చేస్తూ తల పక్కకు వాల్చి తరలిరాని లోకాలకు వెళ్ళిపోయింది పార్వతమ్మ. పార్వతమ్మ అనూహ్య మరణానికి కుటుంబ సభ్యులందరూ బాధపడిన ఇలాంటి అపురూపమైన కాలంలో చావు రావడం అందులో త్రివేణి సంగమం దగ్గర పోవడం నిజంగా పార్వతమ్మ చేసుకున్న పూర్వజన్మ సుకృతం అని మనసుకు సరిపెట్టుకున్నారు. సాధారణంగా ఇటువంటి ముసలి వాళ్లు ఎవరు తీసుకొని వెళ్లలేరు. కానీ రఘు ధైర్యానికి అందరూ అభినందించి ఆనందపడ్డారు. 

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు 
కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట