రహస్యం



సాయంకాలం నాలుగు గంటలు అయ్యింది.

కాకినాడలోని జన్మభూమి పార్క్ సందర్శకులతో కిటకిటలాడుతోంది. పిల్లలు అరుపులు, కేకలు, గోలలు, ఈలలతో సందడిగా ఉంది.

ఇంతలో ఒక యువ జంట అలా పార్కులో నడుచుకుంటూ వెళుతున్నారు. తెల్లగా, బొద్దుగా ఉన్న మూడేళ్ల వయస్సు ఉన్న కుర్రాడు ఆ అమ్మాయి కాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు.

ఆ అబ్బాయిని చూడగానే ముచ్చటేసింది అమ్మాయికి. వెంటనే ఎత్తుకుని పక్కనే ఉన్న భర్త వైపు చూసింది. ఆ చూపులో ఉన్న అర్థం భర్త రాకేష్‌కు అర్థమైంది. ఆ చూపు రాకేష్‌కి ఏమీ కొత్త కాదు.

పార్కుకి వెళ్లినప్పుడల్లా ఎవరో ఒకరు పిల్లవాడు కనపడడం, ఆ పిల్లవాడి వైపు భార్య రమ ఆశగా చూడడం, లేదంటే ఎత్తుకొని ముద్దాడడం, చివరకి రమ రాకేష్‌ వైపు ఆశగా చూడడం ప్రతిసారి జరుగుతున్నదే.

రమ అలా చూసినప్పుడల్లా రాకేష్ గుండెల్లో గునపం గుచ్చినట్లు అవుతుంది. మనసు బాధపడుతుంది.

ఇంతలో ఆ చంటి పిల్లాడు తల్లి వచ్చి పిల్లవాడిని తీసుకు వెళ్లిపోయింది. "అవును! మన పిల్లవాడు అయితే మన దగ్గరే ఉంటాడు" అనుకుని రమ నిట్టూర్చి, "ఇంటికి వెళదామా?" అంటూ భర్తను ఉద్దేశించి చెప్పింది.


అంటే రమ బాధపడుతోందన్నమాట. చేసేదేమీ లేక ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోయారు

రాత్రి నిద్ర పట్టలేదు రాకేష్‌కి. ఆ డాక్టర్ గారు చెప్పిన మాటలు నాలుగు సంవత్సరాలయినా చెవుల్లో గింగుర మంటున్నాయి:

> "చూడు రాకేష్, ఈ అమ్మాయిని నిరభ్యంతరంగా పెళ్లి చేసుకోవచ్చు. కానీ పిల్లలు కనడం అంత మంచిది కాదు. ఎందుకంటే పుట్టబోయే పిల్లలకు కూడా ఈ వ్యాధి రావడానికి అవకాశం ఉంది. అంతేకాదు, ఈ అమ్మాయికి గర్భం దాల్చి బిడ్డను కనే శక్తి లేదు. అందుకనే నువ్వు పెళ్లికి ముందుగానే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకోవడం చాలా మంచిది. లేకపోతే జీవితాంతం జాగ్రత్తలు తీసుకోలేవు కదా!"

అన్నీ విన్న రాకేష్ తల ఊపి, రమని పెళ్లి చేసుకున్నాడు


రమ, రాకేష్ ఇద్దరూ ఒకే కాలేజీలో డిగ్రీ వరకు చదువుకున్నారు. సన్నంగా, తెల్లగా ఉండే రమ అంటే రాకేష్‌కి డిగ్రీ మొదటి సంవత్సరం నుండే ఇష్టం ఏర్పడింది. రమ కాలేజీలో చదువుతో పాటు, ఆటల్లో, పాటల్లో, బొమ్మలు గీయడంలో చాలా ఉత్సాహంగా ఉండేది.


ఒకసారి కాలేజీ వార్షికోత్సవాల్లో పోటీల కోసం రోజూ కష్టపడి ప్రాక్టీస్ చేస్తూ ఉన్న రమ, ఒక్కరోజు అకస్మాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయింది. అందరూ "డాక్టర్ దగ్గరకి తీసుకెళ్లండి" అనేవాళ్లే తప్ప, ఎవరూ ముందుకు రాలేదు.


రాకేష్ మాత్రం వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి, ఊర్లో ఉన్న తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు.


ఇలా ప్రతిసారి శ్రమ పడినప్పుడల్లా రమకి కళ్ళు తిరిగి పడిపోవడం అలవాటైపోయింది. డాక్టర్ పరీక్షలు చేసి,


> "గుండెకు రక్త సరఫరా సరిగా లేదు. ఇది పుట్టుకతో వచ్చిన వ్యాధి. మందులు వాడడం తప్ప ఇంకెలాంటి వైద్యం లేదు."

అని చెప్పాడు


ఈ విషయం రమ తల్లిదండ్రులు తెలిసి మూర్ఖులయ్యారు. "మా ముద్దుల బిడ్డకి దేవుడు ఇలాంటీ శిక్ష ఎందుకిచ్చాడు?" అని నిత్యం బాధపడేవారు.


పెళ్లి చేసి అత్తారింటికి పంపవలసిన పిల్ల ఇలా అయిపోతే ఏంటని ఏడుస్తూ ఉండేవారు.


ఇంతలో రమ–రాకేష్ మధ్య అనుబంధం బాగా పెరిగింది. సెలవుల్లో సినిమాలు, షికార్లు, పార్కులు, హోటల్ డిన్నర్లు—ఇలా ఒకరంటే ఒకరు విడిచి ఉండలేని పరిస్థితి ఏర్పడింది.


కానీ రాకేష్ రమ అనారోగ్యం గురించి తల్లికి ఎప్పుడూ చెప్పలేదు. కానీ రమ వేరే కులానికి చెందిన అమ్మాయినని మాత్రం తల్లికి చెప్పాడు.


రమ తల్లిదండ్రులు తెలివైనవారు. రోజూ రమ మాటల్లో తొమ్మిది పదాలు రాకేష్ గురించేనని అర్థం చేసుకున్నారు. నిలదీసి అడిగితే,

> "ఆ అబ్బాయిని తప్ప వేరే ఎవ్వరిని పెళ్లి చేసుకోను.

అని ఖచ్చితంగా చెప్పేసింది.


రమకి మొండిపట్టు ఎక్కువ. ఆమె పరిస్థితి తెలిసిన బంధువుల్లో ఎవరూ పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేదు.


చేసేదేమీ లేక రాకేష్ తల్లితో మాట్లాడి, అంగరంగ వైభవంగా పెళ్లి చేసి, పిల్లని అత్తారింటికి పంపించారు రమ తల్లిదండ్రులు. కానీ డాక్టర్ చెప్పిన విషయాలు రమకి చెప్పలేదు. అత్తగారికి కూడా చెప్పలేదు.


నాలుగు సంవత్సరాలు అయినా పిల్లలు పుట్టకపోవడంతో రమ ప్రతి రోజు బాధపడుతూ ఉండేది. అత్తగారి సూటి మాటలు భరించలేక పోతుండేది. ఇష్టపడి పెళ్లి చేసుకున్న రాకేష్ పిల్లల గురించి అసలు మాట్లాడడం లేదు

"డాక్టర్ దగ్గరకి తీసుకెళ్లవూ?" అని కూడా అడగడు. అంటే ఏమన్నా లోపమా రాకేష్‌కి?


ఇలా అనుమానాలు రావడం ప్రారంభమయ్యాయి రమకి

ఒకరోజు ధైర్యంగా చెప్పింది:


> "రాకేష్, నాకు చిన్న పిల్లలంటే ఇష్టం. ఎవరిలో లోపం ఉందో మనకి తెలియదు. డాక్టర్ దగ్గరకి కూడా మనం వెళ్లలేదు. అందుకే అనాధ శరణాలయం నుంచి ఒక పిల్లవాడిని తెచ్చుకుని పెంచుకుందాం అనుకుంటున్నాను. నీ అమ్మగారిని ఒప్పించే బాధ్యత నీదే.


రాకేష్‌కి ఈ మాట వింటే గుండెల్లో రాయి పడినట్టైంది. తల్లి ఒప్పుకుంటుందా? అనాధ పిల్లవాడిని వంశోద్ధారకుడిగా అంగీకరిస్తుందా? అన్న సందేహం అతన్ని నిద్రలేకుండా చేసింది.

ఒక ఏడాది వరకు తల్లితో చెప్పకుండా కాలం గడిపాడు.

చివరికి రమే ఒకరోజు ధైర్యంగా అత్తగారితో మాట్లాడింది. మాట విన్న వెంటనే అత్తగారి మొహంలో రంగులు మారాయి

తడబడుతూ:

> "ఎందుకమ్మా! మీరు ఇద్దరూ ఒకసారి డాక్టర్ గారికి చూపించుకోండి."

అంది. కానీ వెంటనే గుర్తొచ్చింది—"డాక్టర్ దగ్గరికి వెళ్తే కొడుకు విషయం బయటపడిపోతుందే!" అని. వెంటనే మాట మార్చేసి:

> "సరే అమ్మా, మీ ఇష్టప్రకారం చేసుకోండి."

అంది.

అసలు విషయం ఏమిటంటే—రాకేష్ చిన్నప్పుడు చెట్టు ఎక్కి కింద పడిపోయి తగలరాని చోట దెబ్బతిన్నాడు. దాంతో అతను తండ్రి అయ్యే అర్హత కోల్పోయాడు. ఈ నిజం రాకేష్‌కి, అతని తల్లికి తప్ప ఎవరికీ తెలియదు.


రమ వేరే కులానికి చెందినదని తెలుసుకున్న వెంటనే తల్లి ఒప్పుకుంది. పైసా కట్నం లేకుండా అన్నింటికీ అంగీకరించింది 


తల్లిని ఒప్పించగలిగిన రాకేష్ ఆనందంగా రమకు తెలియజేశాడు. కానీ రమ మాత్రం ఇంతకాలం భర్తను తప్పుగా అర్థం చేసుకున్నందుకు పాపంగా తలపడింది.


ఆమె ఇంటర్నెట్‌లో చదివిన విషయాలు గుర్తుకొచ్చాయి—తన వంటి వారిలో పుట్టే పిల్లలకు కూడా వ్యాధి వచ్చే అవకాశం ఉందని, అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్లి పరీక్షలు చేయించుకోవడం ప్రయోజనం లేదని అర్థమైంది


చివరికి ఒక శుభ ముహూర్తంలో అనాధ శరణాలయం నుంచి బాబును తీసుకురాగలిగారు. అప్పటి నుండి ఆ దంపతులు ఆనందంగా కాలక్షేపం చేస్తున్నారు.

ఈ కథలో రమ తప్పితే మిగిలినవాళ్లందరూ సమస్యను తప్పించుకోవడానికి వేసిన నాటకమే... ఇదంతా ఒక రహస్యం.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట