పాట కాదు_ తల్లి గుండె దీవెన
*పాట కాదు_ తల్లి గుండె దీవెన*
అమ్మ పాడిన లాలి పాటలు, మాటలు, అమ్మ ఆత్మీయత అమ్మతో అనుబంధం ఎన్నిసార్లు గుర్తు చేసుకున్న అది కొత్తగానే ఉంటుంది. అమ్మ మీద వచ్చిన సినిమా పాటలు మనసుని ద్రవింప చేస్తాయి
అయితే ఇటీవల కాలంలో వచ్చిన ఒక సినిమా కుబేరలో అమ్మ తన కొడుకు గురించి పాడిన పాట సాహిత్యం మనసుని హత్తుకుంది. మళ్లీ మళ్లీ ఆ పాట వినాలి అనిపించింది. సాధారణ పదాలతో హృదయాన్ని హత్తుకునేలా రాసిన ఈ పాట మనల్ని మన అమ్మను గుర్తుకు తెచ్చింది.
నేను సినిమా చూడలేదు. కేవలం పాట మాత్రమే విన్నాను. మొదటిసారి పాట విన్నప్పుడే సాహిత్యం నన్ను ఆకట్టుకుంది. ఇందులో అర్థం కాని పెద్దపెద్ద పదాలు ఏమీ లేవు. ఈ సినిమాలో ఈ పాట ఏ సందర్భంలో పాడారో నాకు తెలియదు కానీ నేను కేవలం సాహిత్యం గురించి చెబుతున్నాను
పాటకి పల్లవి చరణం రెండు గుండెకాయలు లాంటివి. "నా కొడుకా "అనే పల్లవి తోటి బిచ్చగాడి పాత్రలో ధనుష్ అనే నటుడు మీద పాడిన పాట.
ఒక కొడుకుకి ధైర్యాన్ని ఇచ్చే పాట. ప్రేమ పంచే పాట. జీవితంలో ఎలా జాగ్రత్తగా నడుచుకోవాలి తెలిపే పాట. అమ్మ ప్రేమ అంతా ఇందులో కనిపించింది. అమ్మ ప్రేమంటే ఏముంది కొడుకు జాగ్రత్తగా ఉండాలని. పది కాలాలపాటు పచ్చగా ఉండాలి అని కదా!
🌿 **పచ్చ పచ్చని చెలల్లో
పూసేటి పువ్వుల తావుల్లో
నవ్వులు ఏరుతూ నడిచేద్దాం
చేతులు పట్టుకో నా కొడుకా…**
ఇది చిన్నపిల్లలు తల్లుల చేతిని పట్టుకొని తిరిగే, కలల లోకాన్ని ప్రతిబింబిస్తుంది. తల్లి కుమారుడితో కలిసి జీవన పయనంలో నవ్వుతూ నడవాలనుకుంటోంది.
🌙 **కడుపున నిన్ను దాచుకొని
నీడల్లే నిన్ను అంటుకొని
కలిసే ఉంటా ఎప్పటికీ
నీ చేతిని వదలనూ నా కొడుకా…**
వ్యాఖ్యానం:
ఇది తల్లితనం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. తన కడుపులో బిడ్డను పెట్టుకొని పెంచిన అనుభవం, అలాగే ఎప్పటికీ విడిచిపెట్టకుండా పక్కనే ఉండాలన్న తల్లి సంకల్పాన్ని స్పష్టంగా వెలిబుచ్చుతుంది.
💫 **పదిలంగా నీవు నడవాలే
పది కాలాలు నీవు బతకాలే
చందమామకూ చెబుతున్నా
నిన్ను చల్లగా చూస్తది నా కొడుకా…**
వ్యాఖ్యానం:
ఈ పంక్తులు మాతృదీవెన యొక్క రూపకాలు. కొడుకుని చల్లగా చూడమని చందమామ చల్లగా చూస్తుందని అర్థం
🌾 **ఆకలితో నీవు పస్తుంటే
నీ డొక్కలు ఎండిపోయేలా
చెట్టు చెట్టుకి చెబుతున్నా
నీ కడుపు నింపమని నా కొడుకా…**
వ్యాఖ్యానం:
ఇది ఒక తల్లి యొక్క విచారం, కుమారుడు ఆకలితో ఉండకూడదన్నది. కడుపు నింపే బాధ్యత చెట్టుకి అప్పచెప్తున్నట్టుగా అర్థం.
🌧️ **నిద్రలేక నీవుంటే
నీ కన్నులు ఎర్రగా మారేలా
నీలి మబ్బుతో చెబుతున్నా
నీ జోల పాడమని నా కొడుకా…**
వ్యాఖ్యానం:
తల్లి కుమారుడి ఆలోచనల మధ్య చుట్టబడిన బాధను గమనించి, నీలి మబ్బులతో కూడిన ప్రకృతిని కూడా జోలపాటల కోసం అడుగుతోంది. ఇది తల్లిని ప్రకృతి శక్తిగా, ఆరాధించేలా చూపుతుంది.
🪷 **ఏ దారిలో నీవు పోతున్నా
ఏ గండం నీకు ఎదురైనా
ఏ కీడు ఎన్నడు జరగదు నీకు
అమ్మ దీవెనిది నా కొడుకా…**
వ్యాఖ్యానం:
ఇది పాటలో అత్యంత శక్తివంతమైన మాతృప్రార్థన. జీవితంలో ఎలాంటి అడ్డంకులు వచ్చినా, తల్లి దీవెనలు కాపాడతాయని అర్థం.
🧭 **మనిషికీ మనిషే దూరమురా
ఇది మాయా లోకపు ధర్మమురా
బడిలో చెప్పని పాఠం ఇదిరా
బతికే నేర్చుకో నా కొడుకా…**
వ్యాఖ్యానం:
ఈ మాయా లోకంలో మనిషికి మనిషికి మధ్య అనుబంధాలు ఉండవు. దీని గురించి పాఠాలు ఎక్కడ బడిలో నేర్చుకోలేము. కేవలం బతుకులోనే ఈ విషయం అనుభవం మీద తెలుస్తుంద
💪 **తిడితే వాళ్ళకి తగిలేను
నిన్ను కొట్టిన చేతులు విరిగేను
ఒద్దిక నేర్చి ఓర్చుకునుండు
ఓపికతోటి నా కొడుకా…**
వ్యాఖ్యానం:
ఎవరు నిన్ను తిట్టినా కొట్టిన ఓర్పుగా ఉంటే నిన్ను బాధ పెట్టిన వాళ్లకే తిరిగి తగులుతాయి అని తల్లి చెబుతున్న మాటలు
🪨 **రాళ్ళు రప్పల దారులు నీవి
అడుగులు పదిలమ్మో కొడుకా…
మెత్తటి కాళ్ళు ఒత్తుకుపోతాయి
చూసుకుందా నడువురా నా కొడుకా…**
వ్యాఖ్యానం:
జీవిత మార్గం మరింత కఠినంగా ఉంటుంది—మెల్లగా అడుగులెత్తి జాగ్రత్తగా నడవాలని మాతృసూక్తి.
🌌 **చుక్కలు దిక్కులు నేస్తులు నీకు
చక్కగా బతుకు ఓ కొడుకా…
ఒక్కని వనుకొని దిగులైపోక
పక్కన ఉంటా నా కొడుకా…**
వ్యాఖ్యానం:
ప్రకృతి మరియు స్నేహితుల నేపథ్యంలో జీవితం అనుభవించాలో, బాధ సమయంలో తల్లితనమే తోడుగా ఉంటుందని హృదయపూర్వక వాగ్దానం
🥀 **పాణము నీది పిట్టల తోటిది
ఉచ్చుల పడకు ఓ కొడుకా…
ముళ్ళ కంపలో గూడు కట్టేటి
నేర్పుతో ఎదగర నా కొడుకా…**
ఒక బిడ్డ అక్కకి తల్లి చెప్పి జాగ్రత్తలు ఇవన్నీ. నిజజీవితంలో కూడా ఒక పాటలా కాకుండా సందర్భాన్ని బట్టి ప్రతి తల్లి సరైన మాటలు చెబుతూనే ఉంటుంది. అదే ఈ పాటగా మారింది. తల్లితో అనుబంధం ఎక్కువగా ఉన్నవాళ్ళకి ఆ మాటలు గుర్తుండిపోయి పదాలుగా మారిపోయి పాటలైపోతాయి.
---
🚫 **ఏ దారిలో నువ్వు పోతున్నా
ఏ గండం నీకు ఎదురైనా
ఏ కీడు ఎన్నడు జరుగదు నీకు
అమ్మ దీవెనిది నా కొడుకా…**
వ్యాఖ్యానం:
ఇది బిడ్డకు తల్లి ఇచ్చే ఆశీర్వాదం. ఒక నమ్మకం. ప్రతి తల్లి ఇలాగే కోరుకుంటుంది.
🛡️ **ఈ దిక్కులు నీతో కదిలేను
ఆ చుక్కలే దిష్టి తీశాను
ఏ గాలి ధూళి సోకదు నిన్ను
అమ్మ దీవెనిది నా కొడుకా…**
వ్యాఖ్యానo
ఈ నాలుగు పదాలు చాలు పాట గొప్పదనం తెలియడానికి. నాలుగు దిక్కులు, ఆకాశం మీద చుక్కలు, వీచే గాలి తల్లిలా ఆ బిడ్డను రక్షిస్తాయని తల్లి దీవిస్తోంది
⚡ **ఏ పిడుగుల చప్పుడు వినబడినా
ఏ భూచోడికి నువ్వు భయపడినా
ఏ చీకటి నిన్నే చేయదులేరా
అమ్మ దీవెనిది, నా కొడుకా…**
వ్యాఖ్యానం:
చిన్నప్పుడు సాధారణంగా బూచోడు అంటే భయం, పిడుగులు అంటే భయం, చీకట్లోకి వెళ్లాలంటే తోడు కావలసి వచ్చేది అటువంటి సందర్భాలు అన్నీ కూడా నిన్ను ఏమీ చేయలేవు ఇది అమ్మ దీవెన అని తన కొడుకుకి చెబుతోంది తల్లి.
తల్లి ప్రేమ అంతా ఈ పదాల్లోనే ఉంది. మన చిన్నతనం మనం గుర్తు చేసుకుంటే మనని అమ్మ చూసిన విధానం ఈ పాటలో ప్రతిబింబిస్తుంది. పాట విన్నప్పుడు అమ్మ గుర్తుకొస్తుంది. గుండె లో నుంచి దుఃఖం పొంగుకొస్తుంది. అన్నీ చెప్పాను బానే ఉంది ఈ రచయిత శ్రీ నందకిషోర్ మాటలతో గుండెను తడి చేసేసాడు.
దానికి తోడు సంగీత దర్శకుడు స్వరాలతో కళ్ళు నీళ్లు తెప్పించాడు. చాలా రోజులు తర్వాత ఒక మంచి పాట విన్నట్టు అనిపించింది. సినిమా చూడకపోయినా పాట పదేపదే వినాలనిపించింది. ఇంక మరి పాటను సెలెక్ట్ చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రతిభ ఏమని వర్ణిస్తాం. పాట వింటే పాట గురించి వ్యాఖ్యానం చేయాలనిపించాలి.
పాట సామాన్యుడికి కూడా అర్థం అవ్వాలి. పదాలు గుండెను హత్తుకునేలా ఉండాలి. అప్పుడే పాట ప్రజల్లోకి వెళుతుంది. పదం యొక్క అర్థం తెలియకపోతే పాటను పట్టించుకోరు జనం. ఈనాటికీ మనం పాత సినిమా పాటలను అభిమానిస్తున్నావంటే అర్థవంతమైన సాహిత్యం హాయి గొలిపే సంగీతం ఇవే కారణం . అధునాతన సంగీత పరికరాల హోరులో ఏవో నాలుగు పదాలు పాటగా పెట్టి సినిమాలు తీస్తే లాభం లేదు.
ఆఖరుగా ఈ పాట గురించి ఒక మాట. ఈ పాట తల్లి ప్రేమకు గేయ రూపం.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి