రాజమహేంద్రవరం_ గోదావరి తీరాన శ్వాసించే చరిత్ర


గోదావరి తీరాన విరాజిల్లే రాజమహేంద్రవరం ఒక పట్టణం కాదు, అది పౌరాణిక ప్రాణం. ఎన్నిసార్లు పేర్లు మారినా, చరిత్ర తన మూలాలను చెరపనీయలేదు. రాజరాజ నరేంద్రుని రాజధాని అన్న గౌరవం ఈ నేలకే లభించింది. ప్రతీ వీధి వెనుక ఒక వ్యక్తిత్వం, ప్రతీ చెరువు వెనుక ఒక జ్ఞాపకం, ప్రతీ గుట్ట వెనుక ఒక పురాణం నిద్రిస్తున్నాయి.


ఆంధ్ర మహాభారతo పుట్టిన ప్రదేశం.. ప్రముఖ సంఘసంస్కర్త కందుకూరి నడయాడిన ప్రదేశం . ఎంతోమంది దేశభక్తులు కళాకారులు పండితులు నివసించిన పుణ్యభూమిది.


ఈ నగరం కేవలం ఇటుకలతో కట్టబడిన వీధుల సమాహారం కాదు. ఇది కవుల కలల సౌధం, సంఘసంస్కర్తల పోరాటాల వేదిక, కళాకారుల ప్రేరణ స్థలం.


  ప్రతిరోజు కొన్ని వందల మంది ప్రయాణికులను ఇక్కడ నుంచి వారి గమ్యస్థానాలకు చేర్చే బస్సులు ఆగే స్థలం . అది ఒక పుణ్యక్షేత్రం పేరు పెట్టుకుంది. అదేనండి కోటిపల్లి బస్టాండ్. కానీ దాని వెనక చరిత్ర ఎంతో ఉంది . బిపిన్ చంద్రపాల్, మహాత్మా గాంధీ ఈ ప్రదేశంలో పర్యటించి ఉపన్యాసాలు ఇచ్చారట. 


 బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో ఈ ప్రాంతం వారికి స్థావరంగా ఉండేది. స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వారు దేశం విడిచి వెళ్లిపోయిన సబ్ కలెక్టర్ గారి పేరు మీద ఇన్నిసుపేట నిలిచింది. 


 ఇక్కడేమీ పూల తోటలు ఏవి ఉండవు. కానీ ఆల్కాట్ గార్డెన్స్ అని పేరు పెట్టుకుంది ఈ ప్రదేశం. కారణం ఏమిటంటే దివ్య జ్ఞాన సమాజ నాయకుడు సమావేశాలు సభలు ఎక్కువగా నిర్వహించేవారు అందుకు కృతజ్ఞతగా తన పేరు ఆల్కాట్ గార్డెన్స్ గా పెట్టుకుంది. 


రాజమహేంద్రవరంలో మరొక ముఖ్య ప్రదేశం రామదాసు పేట 

భక్త రామదాసు అంటే అందరికీ తెలుసు. కానీ ఈ ప్రదేశం ఆయన పేరు మీద వచ్చింది కాదు. జానపద గీతాలు ఆలపించే ఎడ్ల రామదాసు గారు అక్కడ నివసించేవారట అందుకే ఆ పేరు.


ఇది ఒకప్పుడు పొట్ట చేత పట్టుకుని విజయనగరం జిల్లా జామి నుండి వలస వచ్చిన వారు ఎక్కువగా ఉన్న ప్రదేశం. నిజానికి అది జామిపేట. వాడుకలో జాంపేటగా మారిపోయింది. 


ఏమిటో బ్రిటిష్ కాలంలో ఈ నగరంలో పనిచేసే సబ్ కలెక్టర్లు వీధులకు తమ పేర్లు పెట్టుకునేవారు. ఒకప్పుడు అది లిస్టర్ పేట అప్పుడు ఎక్కువగా పండితులు బ్రాహ్మణులు ఇక్కడ నివసించే వారట తర్వాత కాలంలో అది ఆర్యాపురం గా మారిపోయింది.


ఈ ప్రదేశం లంకలోని సీతమ్మ పేరు మీదగా ఏర్పడిన వీధి కాదు. కాండ్రేగుల వంశం వారు ఉచితంగా ఈ ప్రదేశాన్ని కొంతమంది పండితులకి శాస్త్రజ్ఞులకి పూజారులకి తమ తల్లి సీతమ్మ గారి పేరు మీదుగా దానంగా ఇచ్చారట. అది సీతంపేట గా మారింది. 


ఇది రాజమహేంద్రవరంలోని ప్రముఖ ప్రదేశమే గానీ చరిత్ర శోధించిన కనపడలేదు. అదే దానవాయిపేట.


  ఇది నాగుల చెరువు కానీ చెరువులో పాములు ఉండవు. ఒకప్పుడు నాగులు అనే వ్యక్తి ఈ చెరువు త్రవ్వించాడట. ఆయన పేరు ఆ ప్రదేశానికి అలా స్థిరపడిపోయింది. ఇప్పుడు చెరువులు మూసుకుపోయి ప్రభుత్వం ఆటలాడుకునే స్థలంగా మార్చింది


సాహిత్య పరంగా రాజమహేంద్ర వరానికి ఎంతో ప్రాముఖ్యత ఉండడమే కాకుండా పేపర్ తయారీ పరిశ్రమ, పెన్నులు తయారీ పరిశ్రమ కూడా ఇక్కడ ప్రసిద్ధమైనవి. రత్నం పెన్నులు కొనాలంటే రంగరాజుపేట వెళ్ళవలసిందే.


శతాబ్దాలు గడిచిన ఏదైనా ఒక వస్తువు కానీ స్థలం కానీ దానంగా ఇచ్చిన వ్యక్తి పేరు చిరకాలం చరిత్రలో నిలిచిపోయి ఉంటుంది. ఎప్పుడో 1910 వ సంవత్సరంలో మాట . తన సొంత స్థలం 100 ఎకరాల భూమిని బ్రాహ్మణులకు విశ్వబ్రాహ్మణులకు రజకులకి దానంగా ఇచ్చారట ఒక మహానుభావుడు దువ్వూరు వీరభద్ర రావు గారు. ఆయన పేరు మీద నిలిచింది ఈ వీరభద్రపురం. రాజమండ్రి చరిత్ర చదువుతుంటే మహాభారతంలోనే కాదు రాజమహేంద్రవరంలో కూడా అపర కర్ణులు ఉండేవారిని తెలుస్తోంది. 


శేషయ్య మెట్ట, మెరక వీధి, చరిత్ర నాకు తెలియలేదు. ప్రముఖ స్వాతంత్ర యోధుడు బ్రహ్మ జోష్యుల సుబ్రహ్మణ్యం గారి పేరు మీద ఏర్పడిన ప్రదేశం సుబ్రహ్మణ్య మైదానం. శ్రద్ధానంద ఘాట్ ఆర్య సమాజ ప్రధానాచార్యుడు శ్రద్ధానంద పేరు మీదుగా వచ్చింది. 


ఈ రాజమహేంద్రవరం పరిపాలించిన చాళుక్యులు నిర్మించిన కట్టడాలకు సాక్ష్యంగా నిలిచింది ఈ కోట గుమ్మం. ఈ ప్రదేశంలో ఇప్పుడు ఒక పెద్ద కందకం కనిపిస్తుంది. ఇది పూర్వకాలంలో గోదావరి నది నుండి తవ్వబడిన పెద్దకాలువ. శత్రువులు ఈ కందకంలోకి ప్రవేశించకుండా అడ్డుగా ఉండేది. అదే కోట గుమ్మం.


ఆ కాలంలో సమాజంలోని చాలామంది పెద్దలకి దూరదృష్టి సమాజ శ్రేయస్సు పై దృష్టి చాలా ఎక్కువ. చనిపోయిన వారికోసం అపరకర్మలు చేసుకోవడం కోసం తన సొంత నిధులతో కంభం నరసింగ రావు గారు ఒక సత్రము చెరువు నిర్మించారట. అదే కంభం సత్రం, కంబాల చెరువు

ప్రతి వీధి పేరు వెనుక ఒక కథ, ఒక జ్ఞాపకం, ఒక సమాజపు సంతకం నిలిచింది.


కానీ ఈ నగరానికి నిజమైన ప్రాణం గోదావరి. రైలు దిగగానే కనిపించే ఆ నదీ తల్లి స్నేహస్పర్శ, గోదావరి మాత విగ్రహం, రాజరాజ నరేంద్రుడు విగ్రహం, గలగల పారే జలధారలు, పుష్కర ఘాట్లలో ప్రతిధ్వనించే ఘంటానాదాలు—ఇవే రాజమహేంద్రవరం హృదయ స్పందనలు. వారధి నగరాన్ని రెండు దరులనుండి కలుపుతూ ఒక జ్ఞానసేతువుగా నిలుస్తుంది. ధవలేశ్వరంలోని కాటన్ మ్యూజియం, రాళ్లబండి సుబ్బారావు మ్యూజియం, ఆర్యభట్ట సైన్స్ మ్యూజియం—ఈ కాలానికి ఈ నగరం అందించిన జ్ఞాన దీపాలు.


భక్తి స్రవంతి కూడా ఇక్కడే ప్రవహిస్తుంది. సారంగధర మెట్టలోని శిలలు సారంగధరుని గాథ చెబుతాయి. సారంగధీశ్వరుడి ఆలయం మోక్షకథలు చెప్పుతుంది. మార్కండేయుడు ఇక్కడ అజేయుడై నిలిచాడు. మహాకాలేశ్వరుని వద్ద నిత్యం జరిగే భస్మాభిషేకం ఈ నగరానికి ఆధ్యాత్మిక శోభను ఇస్తుంది. సోములమ్మ నగర రక్షకురాలు, వేణుగోపాలుడు క్షేత్రపాలకుడు.


సంస్కృతి విషయానికి వస్తే—ఇది నన్నయ్య అడుగుల నేల. కందుకూరి కలల తోట. ఆదుర్తి కెమెరా చూపిన సాంస్కృతిక శిల్పం. గరిమెళ్ల గాత్రంలో ప్రతిధ్వనించిన నూతన గీతం. టంగుటూరి ప్రకాశం పంతుల జయగర్జన. దామెర్ల తులిక, సూర్యకుమారి అందాలు, దుర్గాబాయి సేవ—ఇవి రాజమహేంద్రవరం గర్వకారణాలు.


ఇక్కడ వీధులు కవిత్వం ఊసెత్తుతాయి. చెరువులు చరిత్రను ప్రతిబింబిస్తాయి. గోదావరి తల్లి మాతృత్వం ప్రసాదిస్తుంది. ప్రతి మలుపు ఒక జ్ఞాపకం, ప్రతి ప్రదేశం ఒక పాఠం, ప్రతి అడుగు ఒక గాథ.


ఈ నగరం అతి పురాతనమైన నగరమైనప్పటికీ ఆధునికతను సంతరించుకుంది. అయినప్పటికీ ఈనాటికి సామాన్య మానవుడు హాయిగా బ్రతకగలిగే వాతావరణం అంటే స్వచ్ఛమైన తాజా కాయగూరలు పండ్లు ఫలాలు పువ్వులు తోపాటు అధునాతనమైన తినుబండారాలు అందించే అనేక హోటల్స్ వెలిసే యి. అయినప్పటికీ ఈ నగరం సందర్శించిన వాళ్ళు గంగరాజు పాలకోవా, రోజ్ మిల్క్ రుచి చూడకుండా రాలేరు.


చెన్నై కలకత్తా ప్రధాన జాతీయ రహదారి మీద నగరం నిలిచి ఉంది. రోడ్డు రైలు విమాన సౌకర్యాలు పుష్కలంగా ఉన్న నగరం.

ప్రతిరోజు కొన్ని వందల మంది ఈ నగరాన్ని సందర్శిస్తుంటారు. కొంతమంది పర్యాటకులు అయితే మరి కొంతమంది తమ బంధువుల ఆఖరి యాత్ర గోదావరి నది తీరంలో జరపాలని వచ్చేవాళ్ళు ఎక్కువ. గోదావరిలో పడవ ప్రయాణం మీద సరదాతో పాపికొండల పర్యాటకులు కూడా ఇక్కడి నుంచి బయలుదేరుతారు.  


ఇక విద్యా విషయానికి వస్తే కందుకూరి వీరేశలింగం గారు స్థాపించిన స్త్రీ కళాశాల అతి పురాతనమైనది. వీరేశరంగం గారి పేరు మీదుగా ఎన్నో విద్యాసంస్థలు ,పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం, ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం , హోమియోపతి కళాశాల, ప్రైవేట్ రంగంలో ఇంజనీరింగ్ మెడికల్ కళాశాలలు అద్భుతమైన విద్యను అందిస్తున్నాయి. అతి పురాతనమైన గౌతమి గ్రంథాలయం ఈ రాజమహేంద్రవరానికి ఒక వరం. ఏపీ పేపర్ మిల్స్, సెంట్రల్ టొబాకో రిసర్చ్ ఇన్స్టిట్యూట్, ఐలాండ్ నేచురల్ గ్యాస్ కమిషన్ వంటి పెద్ద సంస్థలు ఇంకా ఎన్నో ప్రైవేట్ పారిశ్రామిక సంస్థలు ఉపాధికి సహాయం చేస్తున్నాయి. రాజమహేంద్రవరం సాంస్కృతిక నగరమే కాకుండా పారిశ్రామిక నగరంగా కూడా అభివృద్ధి చెందింది.

 


ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే పుష్కర మహోత్సవం లక్షలాది భక్తులను ఈ నగరాన్ని సందర్శించేందుకు వీలుగా అవకాశం కల్పిస్తోంది. ఇది అత్యంత భారీ మహోత్సవం.


✨ భవిష్యత్తు దృశ్యం – రాజమహేంద్రవరం


రాజమహేంద్రవరం గతం గర్వకారణమైతే, భవిష్యత్తు స్ఫూర్తిదాయకం. స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతున్న ఈ నగరం నదీ ఆధారిత పర్యాటకానికి ప్రధాన కేంద్రంగా మారుతోంది. గోదావరి తీరాన్ని ఆధునికంగా అభివృద్ధి చేసి నది క్రూజ్‌లు, రివర్ ఫ్రంట్ పార్కులు, పాపికొండల పర్యటనలకు మరింత ప్రాధాన్యం కల్పిస్తున్నారు.


విమాన సౌకర్యాల పరంగా రాజమండ్రి విమానాశ్రయం రోజురోజుకి విస్తరించి, హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాలతో నేరుగా అనుసంధానం పొందుతోంది. రైలు సౌకర్యాలలో ఇప్పటికే రైల్వే జంక్షన్ ఒక కీలక కేంద్రం కాగా, రాబోయే రైలు ప్రాజెక్టులు మరింత కనెక్టివిటీని అందించనున్నాయి.


పరిశ్రమల పరంగా ఇప్పటికే ఏపీ పేపర్ మిల్స్, టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కమిషన్ వంటి సంస్థలు ఉన్నా, భవిష్యత్తులో గోదావరి ఇండస్ట్రియల్ కారిడార్ ద్వారా కొత్త పారిశ్రామిక విస్తరణలు రావనున్నాయి. ఇది యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించనుంది. 

అలాగే వస్త్ర వ్యాపారానికి కూడా ప్రముఖ ప్రదేశంగా మారింది మన రాజమహేంద్రవరం.


విద్యారంగంలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, వ్యవసాయ విశ్వవిద్యాలయం వంటి సంస్థలు దేశవ్యాప్తంగా ప్రతిష్ట తెచ్చే కేంద్రాలుగా మారతాయి. గౌతమి లైబ్రరీ ఆధునిక డిజిటల్ లైబ్రరీగా రూపాంతరం చెందుతూ భవిష్యత్తు విద్యార్థుల జ్ఞాన దీప్తిని మరింత పెంచనుంది.


పర్యావరణ పరంగా గోదావరి తీరాన్ని శుభ్రపరిచే పథకాలు, పచ్చదనం పెంచే యత్నాలు నగరానికి కొత్త ఊపిరి ఇస్తున్నాయి. నది పుష్కరాల ద్వారా వచ్చిన ఆధ్యాత్మికతతో పాటు ఆధునిక పర్యాటక అభివృద్ధి—ఈ రెండూ కలగలిపి రాజమహేంద్రవరం భవిష్యత్తును ప్రత్యేకంగా నిలబెట్టనున్నాయి.


అందుకే రేపటి రాజమహేంద్రవరం ఒక “చరిత్రలో మునిగిపోయిన సాంస్కృతిక పుణ్యక్షేత్రం” మాత్రమే కాదు,

ఒక “ఆధునిక ఆత్మవిశ్వాసంతో ముందుకు పరిగెత్తే నగరం” కూడా.


అందుకే అంటారు—రాజమండ్రి అనేది నా పరిచయం కాదు; రాజమండ్రే నా గుర్తింపు. ఇది గోదావరి ఒడ్డున శ్వాసించే ఒక చరిత్ర, భవిష్యత్తుకి స్ఫూర్తినిచ్చే ఒక సంస్కృతి.


—మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు

కాకినాడ

📞 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట