భగినీ హస్త భోజనం
“తమ్ముడు, ఎల్లుండి తప్పకుండా భోజనానికి రా” అంటూ ఫోన్ చేసింది — ప్రతి సంవత్సరం లాగానే దీపావళి నాడు పక్క ఊర్లో ఉన్న మా అక్క.
ఆరోజు భగినీ హస్త భోజనం. అందుకే మా అక్క ఆహ్వానం.
ఉదయం లేచి ఫస్ట్ బస్సులో ఆ ఊరు బయలుదేరాను. మేమిద్దరం పుట్టి పెరిగింది అదే ఊరు. అక్క నా కంటే రెండేళ్లు పెద్దది.
చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో చదువుతూ, ఆడుతూ, పాడుతూ, కలిసిమెలిసి పదో తరగతి వరకు పెరిగాము. నేను ఇంటర్మీడియట్ చదువుల కోసం హైదరాబాద్ వెళ్ళిపోయాను. అక్క పదవ తరగతి తోటే చదువు ఆపేసింది. మేనమామకు ఇచ్చి పెళ్లి చేసేశారు. ఆ ఊర్లోనే కాపురం. బావగారు ఏదో కంపెనీలో చిన్న ఉద్యోగం. ఇప్పుడు ఇద్దరు పిల్లల తల్లి అయింది.
అయినా ప్రతి ఏటా నన్ను భగినీ హస్త భోజనానికి పిలుస్తూనే ఉంటుంది. దాని పరిస్థితి చూసి ఏదైనా సహాయం చేద్దాం అంటే ఎంతో మొహమాటం. ఒక చిన్న మాట కూడా తన సంసారం గురించి చెప్పదు. తన లేనితనం గురించి అసలు చెప్పదు. బావగారు బాగా చూసుకుంటున్నారని అంటుంది. ఎప్పుడూ ఆ మూడు గదుల కొంపలోనే కాపురం. ఇంట్లో కుర్చీ కూడా ఉండదు కూర్చోడానికి. ఇద్దరు పిల్లలు చదువులు. ఎలా నెట్టుకొస్తుందో ఏమిటో!
పెద్దయ్యాక ఎవరి జీవితాలు వాళ్ళవే. చిన్నప్పుడు ఎంత అన్యోన్యంగా తిరిగినా, పెళ్లి అయ్యాక మనసులో కొన్ని దాచేసుకుంటారు. చిన్నప్పుడు దాపరికాలు ఉండవు. అమ్మ పెట్టిన తాయిలం దగ్గర నుంచి ఇంట్లో జరిగిన గొడవల వరకు అన్నీ పంచుకునే వాళ్ళం.
వీధిలో ఉన్న పిల్లలు ఎవరైనా నన్ను కొట్టడానికి వస్తే, అక్క ఆరిందలా అడ్డుపడేది. నాన్న నన్ను తిడుతూ ఉంటే మధ్యలో అడ్డుపడి తానే దెబ్బలు తినేది. స్కూల్లో నేను చేసిన అల్లరి అమ్మకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకునేది.
అక్క గురించి ఆలోచనలతో బస్సు గమ్యం చేరిపోయింది.
గుమ్మం లోపలికి అడుగుపెట్టిన నన్ను చూసి అక్క మొహం వెలిగిపోయింది. “రా రా లోపలికి, ఇలా కూర్చో” అంటూ అటు ఇటు చూసి సిగ్గుపడుతూ మూలన ఉన్న తుంగ చాప నేలమీద పరిచి, మంచినీళ్ల గ్లాసు అందిస్తూ కుశల ప్రశ్నలు వేసింది.
“సరే రా, కాళ్లు కడుక్కుని రా, భోజనం వడ్డిస్తాను” అంది.
“బావగారు, పిల్లలతో కలిపి తింటాను” అన్నాను.
“వాళ్ళు తిని వెళ్లారు, బావగారు సాయంకాలం వరకు రారు” అంది.
ఏడాది అయింది అక్కని చూసి. కుటుంబ పరిస్థితుల్లోనూ, అక్కలోనూ ఏమీ మార్పు లేదు. గత సంవత్సరం కంటే అక్క బాగా చిక్కిపోయింది. కానీ అభిమానం, ఆప్యాయత, ప్రేమలో ఏమాత్రం మార్పు లేదు — ప్రతి ఏటా పెరుగుతూనే ఉన్నాయి.
ప్రేమగా ఆహ్వానించింది. అరిటాకులో అభిమానంగా వడ్డించింది. పీట పక్కన కూర్చుని మారు అడుగుతూ కొసరి కొసరి వడ్డించింది.
“నువ్వు కూడా కూర్చోకూడదా?” అని అడిగేలోపే, గబుక్కున అన్నం గిన్నె మూత వేసేసింది.
అంటే పరిస్థితి నాకు అర్థమైంది.
అన్నం, పప్పు, వంకాయ కూర, ముక్కల పులుసు, కొబ్బరికాయ పచ్చడి, అప్పడాలు, వడియాలు, సేమియా పాయసం, పెరుగు — అక్క చేతి వంట నిజంగా అమృతం. అనుకుని కొంచెం ఎక్కువగా తినేసా.
ఇంతలో పిల్లలు స్కూల్ నుండి వచ్చారు. “సాయంకాలం వరకు రాము అన్నారు కదరా?” అని అడిగింది అక్క వాళ్ళని
“ ఎవరో వచ్చి స్ట్రైక్ చేయించారు ” అన్నారు పిల్లలు.
“వాళ్లకు కూడా పెట్టకూడదు?” అన్నాను.
“లేదురా, నువ్వు తినేయి ముందు” అంది అక్క.
నేను భోజనం చేసి హాల్లోకి వచ్చి మంచం మీద వాలేటప్పటికీ, పిల్లల అన్నం దగ్గర మాటలు వినిపిస్తున్నాయి.
“అమ్మ, కొంచెం పాయసం వెయ్యవే” అని అడిగింది చిన్నపాప.
“లేదమ్మా, మావయ్య కోసమే చేశాను” అంటోంది అక్క.
ఒకసారి గుండె కెలికినట్టయింది.
కాసేపటికి అక్క రాని తేనుపును తెచ్చుకుంటూ చేతులు తుడుచుకుంటూ పిల్లల్ని తీసుకుని హాల్లోకి వచ్చింది. వెంటనే నా సంచిలో ఉన్న స్వీట్ ప్యాకెట్లు, పళ్ళు పిల్లలకు అందించాను. పాపం — వెంటనే పిల్లల మొహం వెలిగిపోయింది. నా ముందరే ప్యాకెట్లు విప్పి స్వీట్లు తినడం ప్రారంభించారు.
మనసు చాలా బాధపడింది. అక్క మొహం చూస్తే, పిల్లలు చేసిన పనికి సిగ్గుపడుతున్నట్లు కనిపించింది.
“ఎన్నోసార్లు అమ్మానాన్నలతో చెప్పాను అక్క పరిస్థితి గురించి. కానీ ఆయన ఎప్పుడూ ‘తనింటి సంగతులు తానే చూసుకుంటుంది’ అని చెప్పేసేవారు.”
కానీ ఆ మూడుగదుల ఇంట్లో, పావు పప్పు, అరకప్పు బియ్యం మీద నడుస్తున్న ఆ జీవితం... తలుచుకుంటేనే బాధగా ఉంది.
అమ్మ పోయి ఆరు నెలలు అయింది. నిన్న అక్క దగ్గరికి వెళ్లి వస్తానని నాన్నతో చెప్పినప్పుడు, నాన్న గదిలోకి పిలిచి తన వీలునామా చూపించినప్పుడు అసలు విషయం అర్థమైంది.
అక్క తన ముందు భార్య కూతురనే పచ్చి నిజం ఇన్నాళ్లు దాచానని, ఈ ఆస్తిని అమ్మకు భయపడి పంపకాలు జరపలేదని చెబుతూ, కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ కాగితాలు అక్కకి ఇవ్వమని నా చేతిలో పెట్టాడు.
వంటింట్లో నుంచి హాల్లోకి వచ్చిన అక్క చేతిలో నాన్న ఇచ్చిన వీలునామా కాగితాలు పెట్టగానే, అక్క అదోరకంగా నవ్వి ఆ కాగితాలు పక్కన పెట్టేసింది.
“నాకెందుకురా ఆస్తులు! ఆడపిల్లకి పెళ్లయిన తర్వాత పుట్టింటి నుంచి కావలసింది అభిమానం, ఆప్యాయత — ‘ఎలా ఉన్నావ్?’ అనే పలకరింపు, అది చాలు. పెళ్లి చేసి పంపిన తర్వాత నిజానికి ఈ పలకరింపులు లేకపోతే బంధాలు తెగిపోతాయి. రాకపోకలు లేకపోతే మనుషులు దూరమవుతారు. మనసులు సరే సరి. ఏదో వంకతో కలుస్తారని భగినీ హస్త భోజనం లాంటి పండగ పరమార్థం” అని చెప్పి, లోపలకు వెళ్లి ఒక కవర్ తీసుకొచ్చి నా బ్యాగ్‌లో పెట్టింది.
పేదరికంతో బాధపడుతున్న ఏ ఒక్కరోజు పుట్టింటి నుండి గుప్పెడు బియ్యం కూడా ఆశించని అక్క మీద గౌరవం ఇంకా ఎక్కువ పెరిగింది.
సవితి తమ్ముడైనా, సొంత తమ్ముడు కంటే ఎక్కువగా ఆదరించిన అక్క నాకు దైవంలా కనిపించింది.
“సరే అక్క, నేను వెళ్లి వస్తాను” అని చెప్పి బయలుదేరిన నాకు, అక్క బయట గుమ్మం దగ్గర నిలబడి కన్నీళ్లతో వీడ్కోలు చెప్పింది.
బస్సులో కూర్చున్నాక, సంచిలోంచి తినమని పెట్టిన చిన్న డబ్బా తీసి తెరిచాను. లోపల సేమియా పాయసం — నాకోసమే ఉంచింది అక్క.
కళ్లల్లో నీళ్లు వచ్చే యి… దానితో పాటు నేను ఇచ్చిన కవర్ భద్రంగా అందులోనే కనిపించింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి