సాయి


సాయి


ఈ సృష్టి అంతా పరమేశ్వర ప్రసాదమే. అన్ని జన్మల్లోకి ఉత్కృష్టమైనది మానవజన్మ. ఎందుకంటే అన్ని జీవులకీ ఇంద్రియాలు ఉంటాయి. కానీ మానవుడు మాత్రమే మాట్లాడగలడు. మాట మనిషికి దేవుడిచ్చిన వరం. నోరు ఆత్మీయంగా పలకరిస్తుంది; అవాకులు చవాకులు పలికిస్తుంది.


అలాగే ఇంద్రియములన్నీ కూడా సక్రమంగా నడిస్తే ఏ బాధ ఉండదు. దారి తప్పితే మనిషి అధోగతిపాలవుతాడు. మనిషి తన నడవడికలో ఏది మంచి, ఏది చెడు తెలియజెప్పడానికి వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు తోడ్పడతాయి.


అలాగే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకి భగవంతుడు అనేక అవతారాలు ఎత్తుతూ ప్రజలను రక్షిస్తూ వచ్చాడు. రామకృష్ణ పరమహంస, వివేకానందుడు వంటి ఆధ్యాత్మిక గురువులు తమ బోధనల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేశారు. మదర్ తెరిసా వంటి కరుణామూర్తి పేదలకు సేవ చేస్తూ ఆదర్శవంతంగా నిలిచారు.


అలాగే హిందూ, ముస్లిం మతాలను రెండింటిని సమన్వయపరుస్తూ “అందరికీ ప్రభువు ఒక్కడే” అనే నినాదంతో ప్రతి ఒక్కరూ భగవంతునిపై విశ్వాసం ఉంచాలని, శ్రద్ధతో ఏ పనైనా పూర్తి చేయాలని బోధించి ప్రజల చేత ఆరాధించబడుతున్న మహాయోగి, కరుణామూర్తి — షిరిడి సాయి బాబా వారు.



---


శ్రద్ధ, సబూరి అనేవి ఆయన బోధనలో ముఖ్యమైనవి. శ్రద్ధ అనే పదానికి అనేక నిర్వచనాలు చెప్పొచ్చు — క్రమం తప్పకుండా చేసే చర్య. ఉదాహరణకు విద్యార్థిని “శ్రద్ధగా చదువుకో” అని చెప్తాం. అదేవిధంగా శ్రద్ధగా పూజలు చేస్తే ఫలితం లభిస్తుందని శాస్త్రాలు చెబుతాయి.


ఎన్ని కష్ట నష్టములు ఎదురైనా ఓర్పు వహించి, చేసే పనిపై విశ్వాసం ఉంచడమే సబూరి. దానం, కరుణ, ప్రేమ, సహనం — బాబా గారు ప్రోత్సహించిన గుణములు. ఆకలితో, దప్పికతో ఉన్నవారికి ఉన్నంతలో కొంత సహాయం చేయడం ఆయన ప్రజలందరికీ బోధించిన ధర్మం. తాను ఆచరించి ఇతరులకు ఆదర్శంగా నిలిచారు.



---


నిత్యము భిక్షాటన చేసి సన్యాసిగా జీవిస్తూ సంపాదించిన దానిని ఆకలిగా ఉన్న జీవులకు పంచి పెట్టేవారు. పాడుపడిన మసీదులో అతి నిరాడంబర జీవితం గడిపేవారు. ఆ మసీదుకు “ద్వారకామయి” అని నామకరణం చేశారు.


ముస్లిం మత గ్రంథమైన ఖురాన్, హిందూ మత గ్రంథమైన భగవద్గీతను బోధించేవారు. శ్రీరామనవమి వంటి హిందూ పండుగలను భక్తిశ్రద్ధలతో జరిపించేవారు. అంటే మతసామరస్యానికి ఎక్కువ విలువనిచ్చేవారని అర్థం అవుతుంది.



---


నిత్యము గోధుమలను తిరగలిలో వేసి విసురుతూ ఉండేవారు. అవి గోధుమలు కావు — ప్రజల యొక్క కష్టములు, మనోవిచారములు. తిరగలి యొక్క క్రింది రాయి కర్మ, పైన ఉండే రాయి భక్తి, తిరగలకుండే పిడి జ్ఞానం. ఇది తిరగలి విసరడంలో ఉన్న ఆధ్యాత్మిక అర్థం.


బాబా వారు ఏ గ్రంథమూ వ్రాయలేదు. భక్తులతో మౌఖికంగా మాట్లాడిన మాటలే ఆయన బోధన. ఇవన్నీ బాబా వారి సమకాలికుడు మరియు భక్తుడు హేమాడ్‌పంత్ రాసిన సాయి సచ్చరిత్ర గ్రంథంలో మనకు చెప్పబడుచున్నవి. ఇది అత్యంత ప్రజాదరణ పొందిన పారాయణ గ్రంథం.



---


బాబా వారి నివాసంలో ఎప్పుడూ ధుని వెలుగుతూ ఉండేది. ధుని అనగా భక్తుల పాపాలను దహించునది — ఒక నిత్య అగ్నిహోత్రం అని చెప్పొచ్చు. ఆ ధునిలోనే తన చేతిని కాల్చుకొని చంటి బిడ్డను కొలిమిలో పడకుండా కాపాడిన ఉదంతాన్ని బట్టి బాబాను నమ్ముకున్న వారిని ఆయన సమయానికి కాపాడేవారన్న విశ్వాసం ఏర్పడింది.


“నా సహాయమును కానీ, నా సలహాలు కానీ కోరిన వెంటనే ఇచ్చెదను” అని బాబా గారే స్వయంగా చెప్పేవారు.



---


ముఖ్యంగా ధుని నుండి వచ్చే ఊదీని ప్రసాదంగా పంచిపెట్టేవారు. ఊదీని ప్రసాదంగా ఇవ్వడంలో అంతరార్థం — “శరీరం శాశ్వతం కాదు, అది బూడిదగా మారిపోతుంది” అనే తత్త్వజ్ఞానం తెలియజెప్పడమే. ఈ ఊదీ ప్రసాదం అనేక వ్యాధులను నయం చేసినట్లు సాయి సచ్చరిత్ర గ్రంథం ద్వారా తెలుస్తోంది.



---


బాబా వారి మరొక అద్భుత సందేశం — “సమాధి నుండే అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తాను. నేను సమాధి నుండి మీవైపు చూస్తాను, మీతో మాట్లాడుతాను” అని చెప్పడం.


బాబా వారి సమాధి మీదే విగ్రహ స్థాపన జరగి, ఆ ప్రదేశం నేడు షిరిడి దేవాలయంగా నిత్యము ప్రజల చేత కొలవబడుతోంది.



---


నిత్యము తన దగ్గరకు వచ్చే భక్తుల నుండి దక్షిణ అడిగి తీసుకునేవారు. తీసుకున్న ధనాన్ని పేదలకు పంచిపెట్టేవారు. ఇందులో కూడా ఒక అంతరార్థం ఉంది — దక్షిణ ఇచ్చే వారి గతజన్మ ఋణాలు చెల్లించడానికి తోడ్పడేవారని సన్నిహితులు అనుకునేవారు.


బాబా గారు సమాధి చెందిన సమయంలో భక్తురాలైన లక్ష్మీబాయి సిందేకి ₹9 కానుకగా ఇవ్వడం జరిగింది. తొమ్మిది సంఖ్య నవవిధ భక్తులను తెలియజేస్తుంది — భగవంతుని చేరుకునే మార్గాలను సూచిస్తుంది. ఇదే తొమ్మిది రూపాయలు ఇవ్వడంలోని అంతరార్థం.



---


భగవంతునికి చేసే ఉపచారాలలో ముఖ్యమైనది హారతి. ఈ సాయిబాబా వారికి రోజుకు నాలుగు సార్లు హారతి ఇస్తారు. వేలాది మంది భక్తులు ఈ హారతి దర్శనం కోసం షిరిడిలో వేచిఉంటారు.



---


షిరిడి సాయి ఒక మానవతావాది, ఆధ్యాత్మిక తత్వవేత్త, గురువును మించిన గురువు. తన బోధనల ద్వారా అనేక మందికి అజ్ఞానం తొలగించి, మానవత్వాన్ని పెంచి, హిందూ–ముస్లిం సమైక్యతకు గట్టి కృషి చేసిన సాయి నిత్య పూజనీయుడు.


జై సాయినాథ్ మహారాజ్ కీ జై.



---


✍️ రచన: మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు

📍 కాకినాడ

📞 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

సామర్లకోట

కుటుంబం