మా ఊరి జ్ఞాపకం



చూడ్డానికి క్రికెట్ వీరుడులా, పొట్టిగా గవాస్కర్ లా ఉండేవాడు మా వెంకన్న.

ఆ గవాస్కరు ఎప్పుడు చేతిలో క్రికెట్ బ్యాట్ పట్టుకుంటే, ఈయన నోట్లో పొగాకు చుట్ట — చేతిలో ఎప్పుడు పదమూడు ముక్కల పేక పట్టుకుని ఉండేవాడు.


లుంగీ, పంచ కట్టుకుని, దానిమీద చొక్కా తొడుక్కుని, నోట్లో చుట్ట పెట్టుకుని ఉదయమే లేచి సైకిల్ ఎక్కాడంటే — ఏ అరుగుదగ్గర ఆగుతాడో ఎవరికీ తెలిసేది కాదు.

అరుగు దగ్గర ఆగాడంటే భాగవతం, భారతం, రామాయణం వినడానికి కాదు. ఈయన పారాయణం వేరే ఉంది. అదే చతుర్ముఖ పారాయణం.


---


అందరూ సంక్రాంతి పండుగకి, పెళ్లిళ్లకి, వేసవికాలం సెలవులకి పేకాట ఆడడం మామూలే ఆ ఊర్లో.

కానీ మన వెంకన్న 365 రోజులు అదే ప్రవృత్తి. వృత్తి వ్యవసాయం అంటాడు.

ఎప్పుడు పొలం గట్టు ఎక్కిన పాపాన పోలేదు. తలపాగా చుట్టిన సందర్భం చూడలేదు.


“ఏవండీ వెంకన్న గారు ఉన్నారా ఇంట్లో?” అంటూ మూడు వందల అరవై ఐదు రోజులలో ఎప్పుడు ఎవరు అడిగినా —

“లేదండి, పేకాటలో ఉన్నారండి” అని ఇంట్లోంచి అదే సమాధానం.

అదేదో పెద్ద ఉద్యోగం లాగా చెప్పేవారు.


చివరికి ఏ వీధిలో ఉన్నాడు, ఎవరు అరుగు మీద ఉన్నాడు వెతుక్కుని ఆ వచ్చిన పెద్దమనిషి తన పని పూర్తి చేసుకునేవాడు.

ఆ ఊర్లో నాలుగైదు అరుగులు ప్రత్యేకంగా ఈ చతుర్ముఖ పారాయణానికి పెట్టింది పేరు.

అగ్రహారంలో అలాంటి అరుగులు ఉండడం ఒక ప్రత్యేకమైన విశేషం.


సదరు వెంకన్నగారి ఇంటిపేరు మర్చిపోయారు — పేకాట వెంకన్న అనే పేరు సార్ధకం అయిపోయింది.

ఎప్పుడు భోజనం చేసే వాడో, ఎప్పుడు కాలకృత్యాలు తీర్చుకునేవాడో తెలీదు గానీ, కళ్ళు ఎప్పుడు నిద్రకు జోగుతున్నట్టుగా ఉండేవి.

సదరు వెంకన్న రైతు కుటుంబానికి చెందినవాడయినా, నేను ఎరుగున్నప్పటినుంచి ఎప్పుడు పేకాటలోనే జీవితం గడిపేసాడు.


---


కొందరు వ్యసనాన్ని చాటుమాటుగా అనుభవిస్తారు.

ఈ వ్యసనానికి ఆ ఊరిలో అటువంటి గొడవేమీ లేదు.

అటువంటి వారిలో మా వెంకన్న ఒకరు.


ఎన్ని దస్తావేజులు చేతులు మారాయో తెలియదు కానీ వెంకన్న మాత్రం సంపూర్ణంగా ఆటలోని మజాని అనుభవించాడు, ఆస్వాదించాడు.

కొంతమంది వ్యసనం ద్వారా కూడా ఆస్తులు సంపాదించిన వాళ్లు ఉన్నారని మా ఊరిలోనే చెప్పుకునేవారు.


---


గెలుపు ఓటమిలు దైవాధీనం అనే సూత్రాన్ని పూర్తిగా విశ్వసించే మా వెంకన్నకు ఎప్పుడు తన మొహంలో ఒకే భావం ఉండేది —

గెలిచానని సంతోషంగానీ, ఓడిపోయానని విచారంగానీ ఎప్పుడూ కనబడేది కాదు.


అంత మజా ఇచ్చే ఆటని పేకాట అనేకాకుండా “చతుర్ముఖ పారాయణం” అని కూడా అంటారు.

మన బ్రహ్మగారి పేరు ఎందుకు వచ్చిందో తెలియదు గానీ —

బహుశా ప్రతి ముక్కకి నాలుగు మూలల్లోనూ ఆ ముక్కకు సంబంధించిన బొమ్మలు ఉంటాయి.


అంటే ఆట ఆడుతున్నంత సేపు ఆ ముక్కల పేర్లు నామస్మరణ చేస్తూ ఉంటారు.

అందుకేనేమో పారాయణం అన్నారు.

ఆధ్యాత్మికంగా చూస్తే పారాయణం అంటే పదేపదే భగవంతుని నామాన్ని స్మరించడం అని అర్థం.


---


సినిమాల్లో, క్లబ్బుల్లో పేకాట ఆడుతున్నట్లు చిత్రీకరిస్తారు.

నిజజీవితంలో ఊరిలో అరుగుల మీద తాటాకు చాపలేసుకుని వృత్తాకారంలో కూర్చుని, వ్యసనానికి చక్కగా “కాలక్షేపం” అనే అందమైన అబద్ధపు పేరు తగిలించుకుని —

ఆ పదమూడు ముక్కల ఆటతో కాలం గడిపేవారు.


నిద్రాహారాలు ఉండేవి కాదు.

రాత్రి పగలు తేడా తెలిసేది కాదు.

అలా ఉండేది ఆ రోజుల్లో మా ఊరిలో.


ఒక పెట్టెలో మన జీవితాలను తారుమారు చేసే 52 ముక్కలు — నాలుగు రంగుల గుర్తులతో!


సర్కస్‌లో జోకర్ని చూసి మనం నవ్వుకుంటాం.

కానీ ఈ ఆటలో జోకర్ వస్తే గర్వపడతాం.

ధైర్యంగా ఉంటాం.

ఆటలోని రూల్స్ మనకెందుకు? అవి పక్కన పెడతాం.


ప్రతి ఆటకి గెలిచేవాడు ఒకడు, ఓడిపోయేవాళ్లు దురదృష్టవంతులు.

ఎందుకంటే ఏ కూటమిలోనూ చేరకుండా మిగిలిపోయిన పేకాటముక్కల విలువకి మూల్యం చెల్లించవలసి ఉంటుంది.

అదే గెలిచిన వాడి ప్రైజ్ మనీ.


పేకాట ముక్కల మీద ఉండే అంకెల విలువ దేని విలువ దానిదే.

రాజ్యం ఉంటేనే రాజు విలువ ఎక్కువ — కానీ ఈ సామ్రాజ్యంలో రాజుగారికి, రాణిగారికి ఒక్కొక్కరికి పది పాయింట్లు!


నాతోటే ఆంగ్ల భాషలోని అక్షరాలు మొదలు అని గర్వపడిన ఆసుగారికి కూడా 10 పాయింట్లు.

“నా పేరు జాకీ, పేకాటలో నా విలువ పది పాయింట్లే. కానీ నా పేరు గల దాని సామర్థ్యం గురించి, విలువ గురించి నేను చెప్పక్కర్లేదు. నేను పేక ముక్కనే కానీ బయట పెద్ద పెద్ద వాహనాల్ని పైకి లేపగల సామర్థ్యం ఉన్నదాన్ని” — అని అన్నట్టే!


---


భూమి గుండ్రంగా తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుడు చుట్టూ తిరుగుతున్నట్టే — ఆటగాళ్లు వృత్తాకారంలో కూర్చుని, ఒకరి తర్వాత ఒకరు ముక్కలు పంచుతారు.

13 ముక్కలు సరిపోయాయో లేదో చూసుకుని, మిగిలిన ముక్కలు ఒక పెట్టుడు జోకర్‌తో మధ్యలో పెడతారు.

ఆట మొదలవుతుంది ఉత్సాహంగా!


ముక్కలు తెరవగానే కొంతమంది ముఖం మతాబులా వెలిగిపోతుంది, మరికొందరి ముఖం వెలవెలబోతుంది.

ఎన్ని లెక్కలు వేసినా, ఎన్ని సమీకరణాలు చేసినా — ఈ ఆటలో ముక్కలు సంపాదించడం కష్టం అనుకుని కొందరు ఆట నుంచి పక్కకు తప్పుకుంటారు.


తెలివైన వాళ్లు పక్కకు తప్పుకుంటారు.

కానీ కొంతమంది ధైర్యంగా ముక్కలు పట్టుకుని ఆటలో పాల్గొంటారు.

అలాంటి ఆట సంపూర్ణమవాలంటే ఎన్ని ముక్కలు కావాలో వాళ్లకే తెలుసు.


అయినా ఎక్కడలేని ధైర్యం!

చివరికి ఆటగాళ్లలో ఒకరు విజయానికి దగ్గరగా ఉన్నారని తెలుసుకుని మధ్యలో ఆటలోంచి తప్పుకుంటారు.

మధ్యలో నుంచి తప్పుకోవడమే మేలు ఆ పరిస్థితులలో —

ఎందుకంటే ఆ పేకలోని స్వతంత్ర అభ్యర్థులందరికీ విలువ కట్టే మూల్యం చెల్లించవలసి ఉంటుంది.


---


పక్కకు తప్పుకున్న వాళ్లు ఊరుకునే కూర్చోలేరు;

పక్కనున్న వాళ్లకి గైడెన్స్ ఇస్తూ ఉండేవారు.

అది అదోరకమైన మజా.


కొంతమంది నాలుగు డబ్బులు సంపాదించగానే ఆటలోంచి లేచి వెళ్లిపోవడం అలవాటు.

కొంతమంది ఓడిపోతున్నా, లేచి వెళ్లిపోకుండా అప్పు పెట్టి మరీ ఆట కొనసాగించేవారు.

“ఎప్పటికైనా విజయం సాధించలేమా?” అనే నమ్మకం వాళ్లలో ఉండేది.


మధ్యలో ఎవరో కిట్టని వాళ్లు ఖాకీలకు కాకి చేత కబురు అందిస్తే, వాళ్లని చూసి పెద్దలు సరదాగా —

“పండక్కి ఆడుకుంటున్నాము” అని చెప్పేవారు.


వాళ్లు కూడా పెద్దల సమాధానంలో నిజం లేదని తెలిసినా, చూసి చూడనట్టు వెళ్ళిపోయేవారు.


మా అగ్రహారంలో గజ ఆటగాళ్లు కూడా ఉన్నారు.

పేకాటంటే అంత పిచ్చి, అంత మోజు!

నలుగురు కలిస్తే చేతులు ఖాళీగా ఉండేవి కాదు.


---


ఆ ఆట ఉత్సాహంలో సందర్భం కాని మాటలు, నవ్వులు, హేళనలతో నోరు కూడా ఖాళీగా ఉండేది కాదు.

కొంతమంది పేకాటప్రియులే కాదు, ధూమపానప్రియులు కూడా.


సంధ్యాసమయం అయింది — వీధి అరుగులు ఊడ్చుకోవాలి, పందిరిలో కల్లాపి జల్లుకోవాలి, ముగ్గు వేసుకోవాలి.

“వాళ్లు ఇంకా లేవలేదు!” అనుకుంటూ ఉండేది మా అమ్మ ఎప్పుడూ.


ఎందుకంటే మా నాన్నగారు కూడా గజ ఆటగాడే.

కానీ ఎప్పుడూ ధైర్యంగా చెప్పలేదు; ఆవిడకి పతిభక్తి ఎక్కువ.


---


మా అరుగు కూడా ఒకప్పుడు చతుర్ముఖ పారాయణానికి నిలయమే.

ఎప్పుడూ సందడిగా ఉండేది.

పండగ రోజుల్లో, పెళ్లిళ్ల సమయంలో అయితే ఆటగాళ్ల సంఖ్య పెరుగుతుంది కదా.


ఆటగాళ్లలో దగ్గరి బంధువులు, వరసకి మేనల్లుళ్లు, ఊరిలోని ప్రముఖులు, పొరుగురి నుంచి వచ్చే వాళ్లు — ఇలా రకరకాలుగా ఉండేవారు.


వెంకన్న గురించి ఎందుకు ప్రత్యేకంగా చెప్పావంటే —

365 రోజులు విసుగు, విరామం లేకుండా ఎప్పుడూ ఇష్టమైన కూర ముక్కలు తిన్నాడో లేదో కానీ పేక ముక్కలు మాత్రం వదలలేదు.


---


ఇవన్నీ మా ఊరి జ్ఞాపకాలు — మర్చిపోలేని మధుర అనుభూతులు.

అది తప్పని తెలుసు, వ్యసనం అని తెలుసు — అయినా కాలక్షేపం కోసమో కాలం పెట్టే బాధలు భరించలేకో పెద్దలు ముక్కలు పట్టుకుని వేళ్లాడేవారు.


ఊరి నుండి వచ్చేసిన ఊరు మిగిల్చిన మధుర జ్ఞాపకాలు, అనుభూతులు మన మనసులో అలాగే ఉండిపోతాయి గదా.


ఒక తప్పు పని చిన్నపిల్లవాడు చేస్తే చేతెత్తి కొడుతుంది తల్లి.

జ్ఞానం నేర్పవలసిన వాళ్లు తప్పు చేస్తే — ఎవరు చెబుతారు?


---


✍️ రచన: మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు

📍 కాకినాడ

📞 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

సామర్లకోట

కుటుంబం