పుట్టిన ఊరు _ మధురస్మృతులు


పుట్టిన ఊరు అంటే అందరికీ ఇష్టమే. ఏ సౌకర్యాలు ఉన్నా లేకపోయినా, బాల్యంలో మధురమైన అనుభూతులు మిగిల్చిన ఆ గ్రామం మాకు ఇప్పటికీ ఎంతో ఇష్టం.

గ్రామం గురించి చెప్పుకోవాలంటే చుట్టూ అందమైన పొలాలు, మామిడి తోటలు, పిల్ల కాలువలు, పెద్ద కాలువలు. ఊరి మొదట్లో అమ్మవారి గుడి, అగ్రహారంలో వ్యాసేశ్వర స్వామి గుడి, గోపాల స్వామి గుడి. ఊరి లోపలికి వెళ్తే రామాలయాలు—ఇవన్నీ చల్లగా దర్శించగలిగే దేవాలయాలు.


మా పల్లిపాలెం గ్రామంలో ఒక పంచాయతీ కార్యాలయం, అప్పర్ ప్రైమరీ స్కూలు, కచేరి సావిడి ఇవి ముఖ్యమైన ప్రదేశాలు. కొన్నిచోట్ల కంకర రోడ్లు, మరికొన్ని చోట్ల అవి కూడా లేవు. వర్షాకాలం వస్తే పరిస్థితి చెప్పక్కర్లేదు.


చిన్ననాటి వినోదం

అప్పట్లో రేడియో ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్. అది కొద్దిమంది ఇళ్లల్లో మాత్రమే ఉండేది. మరి మిగిలిన వాళ్లు రెండు కిలోమీటర్లు నడిచి టూరింగ్ టాకీస్‌కి వెళ్లి సినిమా చూసి ముచ్చట తీర్చుకునేవారు.


అలాంటి ఊర్లో ఏడాదికోసారి జరిగే తొమ్మిది రోజుల గణపతి నవరాత్రి ఉత్సవాలు మాత్రం అందరికీ పెద్ద వినోదం. రెండు రోజులు ముందుగా పెద్ద పందిరి కట్టి, గ్రామఫోన్ రికార్డులు, మైక్ సెట్ పెట్టేవారు


తొలిరోజు సాయంకాలం ఘంటసాల గారి “నమో వెంకటేశా” పాటతో ఊరంతా సందడి మొదలయ్యేది. మొదట భక్తి రసగానాలు, ఆ తర్వాత అన్ని రకాల పాటలు రికార్డుల ద్వారా పలికేవి. అరుగు మీద కూర్చుని పాటలు వింటూ గడిపిన ఆ రోజులు మధురానుభూతులు.


ఉదయం 6 గంటలకు మొదలైన గ్రామఫోన్ రికార్డులు, మధ్యాహ్నం ఒక గంట విశ్రాంతి ఇచ్చి, రాత్రి 8 వరకు సాగేవి. అందులో సుబ్బిశెట్టి సంభాషణలు, దివిలి పొడుగు మనిషి పాటలు ప్రత్యేక ఆకర్షణ. ఎవరి అభిమాన నాయకుడి పాటలు ఉంటే, వాళ్లు గర్వంగా వినిపించేవారు.


వినాయక నవరాత్రి ఉత్సవాలు

“రేపటి నుంచి వినాయక చవితి ఉత్సవాలు మొదలవుతాయి” అనే అనౌన్స్మెంట్ వినగానే ఒళ్లు పులకించిపోయేది. మర్నాడు ఉదయం బాజా-భజంత్రీలు, బాణసంచాతో వినాయకుడిని ఊరేగించి మండపం దగ్గరికి తీసుకెళ్లి పూజలు మొదలుపెట్టేవారు.


ప్రతిరోజు ఉదయం సాయంకాలం పూజలు జరిగి, తర్వాత ప్రసాదం పంచేవారు. వినాయక చవితి రోజు స్కూల్‌కు సెలవు, కానీ ఆ తర్వాతి రోజుల్లో పిల్లల హాజరు తగ్గేది. ఎందుకంటే పిల్లలంతా పందిళ్లలో ఆడుకుంటూ, పాటలు వింటూ, ప్రసాదాల కోసం ఎగబడేవారు.కొన్ని కుటుంబాల్లో పరిస్థితి కష్టంగా ఉండేది. అలాంటి పిల్లలకు ఈ ప్రసాదమే పూట గడిపే భోజనం. అందుకే దేవుడి కృప అని అనుకునే వారు.


ఇంక వినాయక చవితి మధ్యాహ్నం మా నాన్నగారు కీర్తిశేషులు మధునా పంతుల వెంకట చలపతిరావు గారు ఓలేటి సీతన్నగారు ఇద్దరూ కలిసి భాగవతంలోని శమంతకమణి కథ శ్రావ్యంగా చదివి వినిపించేవారు.


సాంస్కృతిక కార్యక్రమాలు

మధ్యాహ్నం పూట ఒక ప్రత్యేక అనౌన్స్మెంట్ కోసం అందరూ ఎదురుచూసేవారు. అది ఆ రాత్రి జరగబోయే సాంస్కృతిక కార్యక్రమం గురించే.


ఆ తొమ్మిది రోజులు రాత్రి ఎనిమిది గంటలకు హరికథ, బుర్రకథ, నాటకాలు, రికార్డింగ్ డాన్సులు, ప్రొజెక్టర్‌తో సినిమాలు—రోజుకు ఒకటి.


రాత్రి ఎనిమిది గంటలయితే చాలు, గోనె సంచి తీసుకుని పందిరి దగ్గరికి చేరేవాళ్లం. పందిరికి దూరంగా రోడ్డుమీద సంచి పరిచి కూర్చుని ఆ కార్యక్రమాన్ని ఆస్వాదించేవాళ్లం.

అందంగా అమర్చిన చెక్కబల్లల వేదిక మీద, పట్టు పంచ కట్టుకుని, కాళ్లకు గజ్జెలు, చేతిలో చిడతలు, మెడలో పూదండతో హరికథ దాసుగారు పురాణ గాథలు చెబుతుంటే పిల్లలు, పెద్దలు శ్రద్ధగా వినేవారు. అలాంటి వాతావరణం వల్ల మా తరం వారికి కొంత పౌరాణిక విజ్ఞానం వంటబట్టింది అనడంలో సందేహం లేదు.


వినోదం – ఆ రోజుల్లో, ఈ రోజుల్లో


ఆ రోజుల్లో రికార్డింగ్ డాన్స్ అంటే ప్రత్యేక ఆకర్షణ. సినిమాల్లో హీరో–హీరోయిన్లు వేసే వేషాలు వేసుకుని స్టేజిపై పాటలకు తగ్గట్టు డాన్స్ చేసేవారు. కుర్ర కారుకి అది మక్కువ.


ఇంక సినిమాలు ఆ రోజుల్లో రోడ్డుమీద తెర అడ్డంగా కట్టి ప్రొజెక్టర్తో సినిమాలు నడిపించేవారు. మేము సినిమా చూడాలంటే రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంజరం గ్రామంలో ఉన్న టూరింగ్ టాకీస్ కి వెళ్ళవలసి వచ్చేది. అందుకే హరికథలు బుర్రకథలు కన్నా సినిమాలకి రికార్డింగ్ డాన్స్ లకి ఎక్కువగా జనం వచ్చేవారు. ఇష్టమైన పాటలు వస్తే తెర మీదకి నాణేలు వేయడం రంగురంగుల కాగితాలు విసరడం అభిమానానికి తార్కాణాలు.


 నిట్టల బ్రదర్స్‌ బుర్రకథ, చింతామణి నాటకం కూడా మా ఊర్లో చూడడం జరిగింది. నాటకాలలో పద్యాలు, హరికథల్లో చారిత్రక గాథలు మాకు చిన్నతనంలోనే పరిచయం అయ్యాయి. అక్షరజ్ఞానం లేని రైతుకూడా లౌడ్‌స్పీకర్‌లో పద్యం వినగానే ఆనందించేవాడు.

కార్యక్రమాల మధ్యలో జరిగే “చదివింపులు” కూడా వినోదాత్మకంగా ఉండేవి.


తొమ్మిది రోజులు సాంస్కృతిక విందు జరిగి, చివరి రోజు వినాయకుడిని ఊరేగించి కాలువలో నిమజ్జనం చేసేవారు. ఆ రోజు అన్న సమారాధన కూడా ఘనంగా జరిగేది.


ఆ రోజులు – ఈ రోజులు


ఇప్పుడంటే సెలవులు వస్తే పిల్లలు, పెద్దలు టూర్లకి పరిగెడుతున్నారు. కానీ మేమున్న గ్రామమే మాకు ఎప్పటికీ ఎంటర్టైన్మెంట్.


అరుగు మీద కూర్చుని సూర్యోదయం–సూర్యాస్తమయాన్ని చూడడం, పక్షులను ఆస్వాదించడం, కాలువలో ఈత, పశువులతో ఆట, సీజన్‌కి తగిన పండ్లు తినడం—ఇవే మా వినోదాలు.


రాత్రివేళ సాంస్కృతిక కార్యక్రమాలు చూసి అర్ధరాత్రి ఇంటికి వచ్చి పడుకుంటే, మరుసటి ఉదయం స్కూలు పోవడం కష్టమే. అయినా ఇష్టమైన పనికి కష్టాలు భరించేవాళ్లం.

ముగింపు

అవి మా ఊరి వినాయక ఉత్సవాలు. ఇప్పుడు అక్కడ వినాయకుడికి ప్రత్యేక ఆలయం నిర్మించారు .కానీ ఆ రోజులు వేరు, ఆ అనుభవాలు వేరు, ఆ ఆప్యాయతలు వేరు.


ఆ బాల్య స్మృతులు గుర్తొచ్చినప్పుడల్లా హృదయం ఆనందంతో నిండిపోతుంది. మనుషులు మాయమైపోతుంటారు. కానీ అక్షర రూపం మాత్రం పదికాలాలు నిలిచిపోతుంది.


జై గణేష్ మహారాజ్!


— మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు,

కాకినాడ (9491792279)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట