శమంతక మణి
శమంతక మణి
పూర్వకాలంలో సత్రాజిత్తు , ప్రసేనుడు అనే ఇద్దరు యదు వంశ రాజులు ఉండేవారు. సత్త్రాజిత్తు సోదరుడు ప్రసేనుడు . అయితే ఈ సత్రాజిత్తు ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు భక్తుడు. ఈ సూర్య భగవానుడు ఎల్లప్పుడూ మెడలో శమంతకమణిని ధరించి ఉండేవాడు. ఈ శమంతకమణి కెంపు రంగులో ఉండేది. ఈ శమంతకమణి ఎక్కడ ఉంటే అక్కడ కరువు కాటకాలు లేకుండా దేశం సుభిక్షంగా ఉంటుందట. అయితే ఈ సూర్య భగవానుడు సత్రాజిత్తు కోరిక మేరకు తన మెడలోని శమంతకమణిని ఇచ్చి వేస్తాడు.
ఆ మణిని ధరించి సత్రాజిత్తు ద్వారకా నగరానికి వస్తుంటాడు. అలా వస్తున్న సత్రాజిత్తుని చూసి సూర్యుడు వస్తున్నాడని భ్రమించి ద్వారకవాసులు పరమాత్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి విషయం విన్నవిస్తారు. అది విన్న శ్రీకృష్ణ పరమాత్మ దివ్యదృష్టితో చూసి వస్తున్నవాడు పంచముఖ బ్రహ్మ కానీ, సూర్యదేవుడు కాదని చెబుతాడు.
ఆ తర్వాత సత్రాజిత్తు బ్రాహ్మణుల వేదమంత్రాలు చదువుతుండగా ఆ శమంతకమణిని తన పూజ మందిరంలో ఉంచుతాడు. అది సామాన్యమైన వస్తువు కాదు. ఒక రోజుకి ఎనిమిది బారువుల బంగారాన్ని ఇస్తూ ఉంటుంది.
ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఆ శమంతకమణిని యాదవుల రాజైన ఉగ్రసేన మహారాజుకి ఇమ్మని సత్త్రాజిత్తుని అడుగుతాడు. అయితే శ్రీకృష్ణ పరమాత్మ కోరికని సత్రాజిత్తు నిరాకరిస్తాడు.
ఆ తర్వాత సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ శమంతకమణి ధరించి అడవికి వేటకు వెళ్తాడు. అక్కడ ఒక క్రూరమైన సింహం ప్రసేనుడు మెడలోని శమంతకమణిని ఒక మాంసపు ముద్దగా భావించి ప్రసేనుడిని చంపేస్తుంది. ఆ తర్వాత శమంతకమణి నీ నోట కరుచుకుని వెళ్తున్న ఆ సింహాన్ని చూసి జాంబవంతుడు సింహాన్ని చంపేసి దానిని తీసుకుని పక్కనే ఉన్న కొండ గుహలోనికి వెళ్లి అక్కడ తన కూతురి ఉయ్యాలకి అలంకరణ చేస్తాడు.
ఆ తర్వాత సత్రాజిత్తు తన తమ్ముడు ప్రసేనుడు అడవి నుండి తిరిగి రాకపోయేసరికి విలపిస్తూ ఆ శమంతకమణి కోసం శ్రీకృష్ణ పరమాత్మ ప్రసేనుడు నీ వధించాడని దూషిస్తూ విలపిస్తూ ఉంటాడు.
తనపై పడిన ఈ నీలాపనిందని ఏ రకంగా తొలగించుకోవాలో ఆలోచిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ అడవిలోకి వెళతాడు. అలా కొంత దూరం వెళ్లేసరికి చనిపోయి ఉన్న ప్రసేనుడు , గుర్రం , సింహం కనబడతాయి. ఆ తర్వాత రక్తపు జాడలు ఆధారంగా చేసుకుని ఒక కొండ గుహలోనికి ప్రవేశిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. అక్కడ ఉయ్యాలో పడుకుని ఉన్న పసిపిల్లని ఆ ఉయ్యాల కలంకరించి ఉన్న శమంతకమణిని చూస్తాడు పరమాత్మ. ఆ శమంతకమణిని తీసుకుందామని ఉయ్యాలవైపు వస్తున్న శ్రీకృష్ణ పరమాత్మను చూసి అక్కడ ఉన్న పరిచారిక గట్టిగా కేకలు వేస్తుంది. ఆ కేకలు విన్న జాంబవంతుడు శ్రీకృష్ణ పరమాత్మతో యుద్ధానికి తలపడతాడు.
మాంసం కోసం పోరాడే డేగ లాగా శ్రీకృష్ణ పరమాత్మ జాoబవంతుడు ఇద్దరు ఆయుధాలతో చెట్లతో చేతులతో ఒకరినొకరు జయించాలనే కోరికతో ఇరవై ఎనిమిది రోజులపాటు అవిశ్రాంతంగా పోరాడుతారు. కత్తులు, చెట్లు విరిగిపోయిన పిడికిలి పోట్లతో వారి ఇరువురు క్రూరంగా పోరాడారు.
అలాంటి భీకర పోరు తర్వాత జాంబవంతుని బలం సన్నగిల్లిపోయింది. అవయవాలన్నీ పిండి అయిపోయాయి
అలసట అధికమైంది. అప్పుడు జాంబవంతుడికి శ్రీకృష్ణ పరమాత్మ గురించి అర్థమైంది.
వానరులు చేత సముద్రం మీద సేతువును నిర్మించి లంకా రాజ్యం చేరి రావణుని వధించి సీతమ్మను చెర విడిపించి
లంక రాజ్యానికి విభీషణుని పట్టాభిషిక్తున్ని చేసిన పరమాత్ముడు మహానుభావుడు ఇంతకాలం నేను యుద్ధం చేసిన మహావీరుడని తెలుసుకుని కృష్ణుడిని ప్రార్థిస్తాడు. ఆ తర్వాత పరమాత్మ జాంబవంతుడు ఒంటిమీద నిమిరి గాయాలన్నీ పోగొడతాడు.
అప్పుడు శ్రీకృష్ణుడు జాంబవంతుడితో ఇలా అంటాడు ఓ భల్లూక మహారాజా ఈ శమంతకమణి కోసం నేను నీలాపనిందల పాలయ్యాను. దానిని తీసుకు వెళ్లడానికి అరణ్యమంతా వెతుకుతూ నీ గుహకు చేరుకున్నాను అని చెప్తాడు. ఆ తర్వాత జాంబవంతుడు శమంతకమణితో పాటు జాంబవతి అనే తన కుమార్తెను కూడా ఇచ్చి వివాహం చేసి ద్వారకకు సాగనంపుతాడు.
ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ శమంతకమణితో పాటు జాంబవంతుని కూడా తీసుకుని ద్వారకా నగరానికి చేరి సత్రా జిత్తుకి ఆ మణిని అప్పగిస్తాడు. ఆ తర్వాత సత్రాజిత్తు తన తొందరపాటుతనానికి పశ్చాత్తాపo పడి అనవసరంగా బలవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మతో విరోధం పెట్టుకున్నానే అని మదనపడి తన తప్పుకు ప్రాయశ్చిత్తంగా శమంతకమణిని తన కుమార్తె సత్యభామను శ్రీకృష్ణ పరమాత్మకు ఇచ్చి వివాహం చేస్తాడు.
అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ తో ఇలా అంటాడు ఈ శమంతకమణిని నీకు సూర్య భగవానుడు ప్రసాదించాడు. మాకు మణులకు కొదవలేదు . ఈ కన్యా మణి మాత్రమే నాకు చాలు అని చెప్ప శమంతకమణి తిరిగి ఇచ్చివేస్తాడు.
అయితే సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణ పరమాత్మ కి ఈ నీలాప నిందలు రావడానికి గల కారణం ఏమిటి అంటే భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక వ్రత కల్ప కథాక్షతలు తల మీద ధరించకుండా పాలు పితుకుతున్న సమయంలో చవితి చంద్రుడిని చూశాడట అని చెబుతారు.
అయితే చంద్రుడికి ఆ రకమైన శాపం ఎందుకు వచ్చింది అనే విషయం ఆలోచిస్తే మనం గణేష్ మహరాజ్ వృత్తాంతం గురించి తెలుసుకోవాల్సిందే.
ఒకప్పుడు గజ (ఏనుగు) రూపంలో వున్న గజాసురుడు అనే రాక్షస రాజు పరమ శివుడిని గురించి తీవ్ర తపస్సు చేయటం ప్రారంభించాడు. అతని తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఏదన్నా వరం కోరుకోమన్నాడు.
అప్పుడు గజాసురుడు "స్వామీ, మీరు ఎప్పుడూ నా ఉదరం లోపలే వుండాలి" అని కోరుకున్నాడు. మహేశ్వరుడు అతని కోర్కె తీర్చేందుకోసం గజాసురుడి పొట్ట లోపలికి ప్రవేశించి అక్కడే వుండటం మొదలు పెట్టాడు.
ఇదిలా వుంటే, కైలాసం (శివుడి ఇల్లు)లో వున్న పార్వతీదేవి భర్త గురించి తెలియక అన్ని చోట్లా వెతుకుతూ కొంతకాలానికి శివుడు గజాసురుడి పొట్టలో వున్నాడని తెలుసుకుంది. కానీ, శివుడిని ఏ విధంగా బయటకు రప్పించాలో తెలియక ఎంతో బాధపడి, చివరికి విష్ణుమూర్తిని ప్రార్ధించి, తన భర్త విషయం చెప్పింది.
"ఓ మహానుభావా, పూర్వం భస్మాసురుని బారినుంచి నా భర్తని కాపాడి నాకు ఇచ్చావు. ఇప్పుడు కూడా ఏదన్నా ఉపాయం ఆలోచించు” అని కన్నీళ్ళు కార్చింది. విష్ణుమూర్తి పార్వతీ దేవిని ఓదార్చి పంపేశాడు.
అప్పుడు శ్రీహరి బ్రహ్మ మొదలైన దేవతలను పిలిచి గజాసురుని చం పేందుకు గంగి రెద్దులను ఆడించేవాడిగా వెళ్ళటమే సరైనది అని నిర్ణయించాడు.
శివుడి వాహనం నందిని ఒక గంగి రెద్దుగా చేసి, బ్రహ్మ మొదలైన దేవతల చేత తల కొక వాయిద్యం ఇచ్చాడు. తాను చిరు గంటలు, సన్నాయి తీసుకుని గజాసురుడు వుండే గజాసురపురం దగ్గరకు వెళ్ళాడు. అక్కడ గజాసురుడి ఎదురుగా చక్కగా నందిని ఆడించాడు. ఆ గంగి రెద్దు ఆట చూచి గజాసురుడు ఆనందం పొంది, “మీకు ఏం కావాలో కోరుకోండి. నేను ఇస్తాను" అని చెప్పాడు.
అప్పుడు శ్రీహరి “ఇది శివుడి వాహనం నంది. శివుడిని వెదికేందుకే వచ్చింది కాబట్టి శివుడిని ఇవ్వు" అని కోరాడు.
ఆ మాటలకు నిర్ఘాంతపడిన గజాసురుడు గంగి రెద్దులను ఆడించేందుకు వచ్చిన వాడు శ్రీహరి అని తెలుసుకుని, తనకు చావు తప్పదని అర్ధం చేసుకున్నాడు. అపుడు తన పొట్టలోపల వున్న శివుడిని “నా శిరస్సు అందరికీ పూజ్యనీయంగా వుండాలి. నా చర్మం నువ్వు ధరించాలి" అని కోరుకున్నాడు. తర్వాత తనను చంపేందుకు శ్రీహరికి అనుమతి ఇచ్చాడు. నంది తన కొమ్ములతో గజాసురుడిని పొట్ట చీల్చగా, లోపలనుంచి శివుడు బైటకు వచ్చాడు.
హరి శివుడితో "చెడ్డవారికి ఇలాంటి వరాలు ఇవ్వకూడదు. ఇస్తే పాముకు పాలు పోసినట్టే అవుతుంది” అని చెప్పాడు. తర్వాత బ్రహ్మ, ఇతర దేవతలకు వీడ్కోలు పలికి తాను కూడా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. శివుడు కైలాసానికి వెళ్ళిపోయాడు.
కైలాసంలో వున్న పార్వతీదేవి శివుడు వస్తున్నాడన్న వార్త విని తల స్నానం చేయాలని నిర్ణయించుకుని నలుగు పిండితో ఒక పిల్లవాడిని తయారు చేసింది. అతనికి ప్రాణం పోసి గుమ్మం ముందు వుంచింది. స్నానం చేసిన తర్వాత నగలతో అలంకరించుకుని శివుడి కోసం ఎదురు చూడటం మొదలు పెట్టింది.
ఇది ఇలా వుండగా, శివుడికి లోపలికి వస్తుండగా గుమ్మంలో వున్న పిల్లవాడు అడ్డు చెప్పాడు. కోపం తెచ్చుకున్న శివుడు త్రిశూలంతో ఆ బాలుడి కంఠం నరికాడు.
లోపలికి వెళ్ళిన శివుడికి పార్వతీదేవి ఎదురువచ్చి పూజించి, కూర్చోబెట్టి మాట్లాడుతుండగా గుమ్మంలో వున్న పిల్లవాడి ప్రసక్తి వచ్చింది. అప్పుడు శివుడు తాను చేసిన పనికి బాధపడి, తాను తీసుకు వచ్చిన గజాసురుడి శిరస్సును ఆ బాలుడికి అతికించి ప్రాణం పోశాడు.
అతనికి 'గజాననుడు' అనే పేరు పెట్టి, పెంచుకోవటం ప్రారంభించారు.
గజాననుడు కూడా భక్తితో తల్లి తండ్రులకు సేవలు చేయసాగాడు. అనింద్యుడు అనే ఎలుకను వాహనంగా చేసుకుని తిరగటం మొదలు పెట్టాడు. కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు. అతడు మహా వీరుడు. నెమలి అతని వాహనము.
ఒకరోజు దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుని సేవించి, “విఘ్నములకు ఒక అధిపతిని ఇవ్వండి” అని కోరారు. తాను పెద్దవాడు కాబట్టి ఆ నాయకత్వ పదవి తనకే వుండాలని గజాననుడు కోరాడు. గజాననుడు పొట్టిగా వుంటాడు, తగిన అర్హతలు లేవు కాబట్టి అధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని కోరాడు.
శివుడు వారితో “మీలో ఎవరు మూడు లోకాల్లోని పుణ్య నదుల్లో స్నానం చేసి ముందుగా నా దగ్గరికి వస్తారో వారికి ఆ ఆధిపత్యం ఇస్తాను" అని చెప్పాడు.
కుమారస్వామి తన నెమలి వాహనం మీద ఎక్కి వేగంగా ముల్లోకాలూ తిరగటానికి వెళ్లిపోయాడు. గజాననుడు బాధపడుతూ తండ్రి దగ్గరికి వెళ్ళి నమస్కరించి "అయ్యా, నా గురించి తెలిసి కూడా ఈ విధంగా చెప్పటం మీకు సరైనదా? మీ పాద సేవకుడిని. నాయందు దయ చూపి తగిన ఉపాయం చెప్పండి" అని కోరుకున్నాడు.
శివుడు "నారాయణ మంత్రం జపిస్తూ మూడు సార్లు మా చుట్టూ ప్రదక్షిణం చేయాలి. ఇది అన్ని తీర్ధాలలో తిరిగిన స్నాన ఫలితాన్ని ఇస్తుంది" అని చెప్పాడు. వినాయకుడు అదే విధంగా చేశాడు. ఆ మంత్ర ప్రభావం వల్ల గంగానదిలో స్నానమాడేందుకు వెళ్ళిన కుమారస్వామికి తనకంటే ముందుగానే గజాననుడు ఆ నదిలో స్నానమాడి తనకు ఎదురుగా వస్తున్నట్టు అనిపించింది. అతనికి మూడు కోట్ల ఏభై లక్షల నదులో కూడా తనకంటే ముందుగానే గజాననుడు స్నానం చేస్తున్నట్టు కనిపించాడు.
ఇది చూసి ఆశ్చర్యపోయి, కైలాసానికి వెళ్ళి తండ్రి దగ్గర వున్న అన్నను చూసి, నమస్కరించి, తన బలాన్ని తిట్టుకుని "తండ్రీ, అన్నగారి మహిమ తెలియక ఆ విధంగా అన్నాను. క్షమించి ఆ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వండి అని ప్రార్ధించాడు.
భాద్రపద శుద్ధ చతుర్ధి రోజున పరమేశ్వరుడు గజాననుడికి విఘ్నాధిపత్యం ఇచ్చాడు. ఆ రోజు అన్ని దేశములవాళ్ళూ విఘ్నేశ్వరుడికి తమ స్థాయిని బట్టి కుడుములు, మిగిలిన పిండి వంటలు, కొబ్బరికాయలు, పాలు, తేనె, అరటి పళ్ళు, పానకము, వడపప్పు మొదలైనవి సమర్పించి పూజించారు. విఘ్నేశ్వరుడు సంతోషపడి కుడుములు కొన్ని తిని, కొన్ని తన వాహనం అనింద్యుడికి ఇచ్చి, కొన్ని చేతిలో పట్టుకుని, నిదానంగా సూర్యాస్తమయం అవుతుండగా కైలాసానికి వెళ్ళాడు.
తల్లి తండ్రులకు నమస్కారం చేయబోగా పొట్ట భూమికి తగిలింది కానీ, చేతులు మాత్రం భూమిమీద ఆనలేదు. అతి కష్టం మీద చేతులు ఆన్చినా నమస్కారం మాత్రం చేయలేకపోయాడు. ఈ విధంగా గణపతి కష్టాలు పడుతుండగా శివుడి తల మీద వున్న చంద్రుడు పగలబడి, ఎగతాళిగా నవ్వాడు. 'రాజదృష్టి సోకితే, రాళ్ళు కూడా నుగ్గవుతాయి' అన్న సామెత అనుసరించి వినాయకుడి పొట్ట పగిలి లోపల వున్న కుడుములు మొదలైనవి చుట్టుపక్కల దొర్లాయి. వెంటనే వినాయకుడు మరణించాడు.
పార్వతి ఏడుస్తూ చంద్రుని చూసి "పాపాత్ముడా! నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు. కాబట్టి నిన్ను చూసిన వాళ్ళు పాపాత్ములై నీలాపనిందలు పొందుతారు" అని శపించింది.
ఆ తర్వాత దీనికి పరిష్కార మార్గం ఏమిటంటే ప్రతి భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుని భక్తితో పూజ చేసుకుని కథాక్షతలు శిరస్సును ధరించి చంద్రుడిని చూసిన ఎటువంటి నిలాప నిందలు రావు అని పెద్దల అభిప్రాయం.
ఈ వ్రతాన్ని పిల్లలు పెద్దలు కులమతాలకు అతీతంగా భక్తి పూర్వకంగా చేసుకోవచ్చు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి