ఆడపిల్ల

అమ్మను మించిన అమ్మ యుగానికో రాక్షసుడిని చంపడానికి అవతారం ఎత్తినా , ఇంకా నరరూప రాక్షసులు కళ్లు నిన్ను వెతుకుతూనే ఉన్నాయి.
ఎంతమంది సజ్జనారులు వలయాలు గీసినా, అవి నీకు రక్షిత వలయాలు మాత్రం కాలేకపోయాయి.
అమ్మ రక్షరేకులు కట్టించిన నీ మీద రాక్షస దృష్టి పడుతూనే ఉంది.నువ్వు జంతువు కాదు, జూలో ఉంచలేను.

నువ్వు లక్ష్మణరేఖలు దాటకపోయినా, రాక్షసులే నీ తలుపు తడుతూనే ఉంటే — కాపాడవలసిన కాళిక కళ్లు తెరవకపోతే — నీకు ఎవరు రక్ష?
ప్రభుత్వ చట్టాలు అందరికీ చుట్టాలే. సమాజమే నీకు శత్రువు. నీ మానాన నిన్ను బ్రతకనివ్వడం లేదు.
సైన్స్, టెక్నాలజీ రెండూ నీకు శత్రువులే.
గర్భస్థ పిండంలోనే నీ పీక పిసికితున్నారు.
సృష్టి ఆపే శక్తి ఆ పరమేశ్వరుడికి తప్ప ఎవరికీ లేదు.

అమ్మ నాన్న నిత్యం జాగ్రత్తల దండకం చదువుతూ, డ్రెస్సింగ్ రిహార్సల్ వందసార్లు చేస్తూ, బడికి పంపుతూ — నువ్వు తిరిగి వచ్చేవరకు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తూ — నిత్యం దేవుడిని ప్రార్థిస్తూ భయంగా బ్రతుకుతున్నారు.
చదువు కంప్లీట్ చేయించి, క్యాంపస్ నుండి ఆఫీస్ మెట్లెక్కించి, ఒక అయ్య చేతిలో పెట్టి హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు.

పెళ్లి లాటరీ లాంటిది. ఏ నంబరు లక్కీ నంబరో ముందే తెలియదు. మన లక్కీ నంబర్ ఏ శాస్త్రమూ ముందుగా చెప్పదు.అయ్య మనసున్న మారాజు అయితే, ప్రతి ఆడపిల్ల తండ్రి జన్మ సార్థకం అయినట్లే.

పెళ్లయిన తర్వాత తన సంసారం గుట్టు విప్పలేక “నాన్న బై” అంటూ గాల్లో పంచప్రాణాలు కలుపుకుంటున్న ఒక చెల్లి, ఒక అక్క వార్తలు రోజూ చూస్తున్నాము.
అత్తవారిల్లింటే ఆమడ దూరం పారిపోయేలా చేశాయి మన అత్తవారిల్లు.ముక్కు మొఖం తెలియని పిల్ల మనింటికి వచ్చి అడ్జస్ట్ కావడానికి కొంచెం సమయం పడుతుంది.

అత్త కూడా ఒకింటి ఆడపిల్లే. సాదక బాధకాలు తెలుసుకోవాలి.దొరికిందని దోచుకోవద్దు. డబ్బు ఎవరికీ కష్టపడితే గాని రాదు.
ఆడపిల్లకి ఎందుకీ కష్టాలు?
నవ్వితే తప్పు, నవ్వకపోతే తప్పు. కూర్చుంటే తప్పు, నిలబడితే తప్పు.
తప్పుల దండకం చాలానే ఉంది. దానికి కూడా మనస్సు ఉంటుంది.

"మనసు ఎరిగినవాడు మా దేవుడు" అంటూ తన భర్త గురించి తన గుండెలోనుండి ఆనందంగా మాట బయటకు రావాలి.అప్పుడే తల్లితండ్రులకు ఆనందం.

ఆడపిల్ల తల్లితండ్రులు కూడా ఉదయం లేచిన దగ్గర నుంచీ వీడియో కాల్‌లో ఉంటూ కూతురి కాపురానికి ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వకూడదు.
ఎవరి పద్ధతులు వాళ్ళవి, ఎవరి సమస్యలు వాళ్ళవి.
పిల్ల తల్లితండ్రులు కూడా లక్ష్మణరేఖ దాటకూడదు.
అన్ని విషయాలు పట్టించుకోకూడదు.

ఎవరింటికి వెళ్లినా ఎలా ఉండాలో నేర్చుకోవాలి.
అవసరమైతే కౌన్సిలింగ్ తీసుకోవాలి — తప్పు కాదు.
ఇవన్నీ ఎందుకు చెప్పడం అనుకోకండి; ఇవే ముఖ్యాంశాలు. వీటికి కూతురి కాపురానికి చాలా సంబంధం ఉంది.

"నేనే గొప్ప" అంటూ స్టేట్‌మెంట్‌లు ఇవ్వకూడదు.
ఎంతైనా అల్లుడు పైవాడే.
పెదవులు చిన్నవిగానే ఉంటాయి, దాని నుండి వచ్చే మాట కూడా ముద్దుగా ఉండాలి.
చిలక పలుకులు వినడానికి సొంపుగా ఉంటాయి; కాకి బావను ఎవరు మెచ్చరు!
ఇవన్నీ కూడా ఆడపిల్ల మనుగడకు అవసరం.

ఆడపిల్ల కూడా పుట్టినింటినీ, మెట్టినింటినీ సమాన దృష్టితో చూడాలి.
అత్తవారిల్లు తన ఇల్లని గుర్తు ఉంచుకోవాలి.
అత్తవారింట్లో జరిగే ప్రతి విషయం పుట్టింట్లో చెప్పకూడదు.

ప్రతి మగపిల్లవాడిని విలువలతో పెంచాలి.
"ఆడదంటే సుఖాలిచ్చే ఆటబొమ్మ కాదు, మనసున్న అందాల రాణి" అని తెలియచేయాలి.
సమాజ దృక్పథం కూడా మారాలి.
స్త్రీ తన కాళ్ల మీద తాను నిలబడేలా అవకాశం కల్పించాలి.అప్పుడే ఒక స్త్రీకి మగజాతి మీద నమ్మకం పెరుగుతుంది.

రాబోయే కాలంలో అయినా స్త్రీని నిర్భయంగా తిరగనిస్తూ, తన మానాన తానుగా బ్రతకనిస్తే — జాతికి తిరుగులేదు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

సామర్లకోట

కుటుంబం