నిశ్శబ్ద సేవ
ఆ నగరంలో ఆ కాలనీ ఒక ప్రత్యేకమైన ప్రదేశం. ఒకే సంస్థలో పనిచేసిన ఉద్యోగస్తులందరూ కలసి కట్టుకున్న అందమైన కాలనీ అది. ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం నిర్మించుకున్న ఒకేలా కనిపించే ఇళ్లు; వాటిలో నివసించే వాళ్లందరూ ఇప్పుడు వయసు మీద పడి పదవీ విరమణ చేసిన ఉద్యోగస్తులు. అయినా కలిసిమెలిసి కాపురం చేస్తూ, ఒక కుటుంబంలా జీవించే మనుషులు అక్కడ ఉంటారు.
నగరంలో కాలనీలు చాలా ఉంటాయి. కానీ ఒకరి గురించి ఒకరు పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉన్న ఈ నగరంలో, తెల్లవారితే చాలు—ఆ కాలనీలోని సీనియర్ సిటిజన్లు అందరూ కలిసి మనసు విప్పి కబుర్లు చెప్పుకుంటూ వాకింగ్‌కు వెళ్తారు. సామూహికంగా జరిగే పూజలు, పునస్కారాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. అవసరమైన వాళ్లకు సహాయం చేయడాన్ని తమ బాధ్యతగా భావిస్తారు.
“మానవసేవే మాధవసేవ” అని నమ్మి జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు.
గుండెల్లోనూ, గూడు లోనూ ఎన్నో దిగుళ్లు ఉన్నా, గుడిలోని దేవుణ్ని నమ్ముకుని ముందుకు సాగే అందమైన వయసు మళ్లిన వాళ్లు ఉన్న కాలనీ అది.
ఆ కాలనీలో ప్రతి ఉదయం ముందుగా కనిపించే మనిషి ఒకడున్నాడు. ఆరడుగుల పొడుగు, తెల్లటి జుట్టు, నెత్తి మీద టోపీ, పెదవుల మీద చిరునవ్వు—రామారావు గారు కాలనీలో అందరికీ తెలిసిన వ్యక్తి.
ఎవరి ఇంట్లో చిన్న సమస్య వచ్చినా ముందుగా వెళ్లేది ఆయనే. ఎవరికైనా మందులు గుర్తు చేయాలి అన్నా, ఆసుపత్రికి తీసుకెళ్లాలి అన్నా—
“నేను వస్తాను” అని ముందుకు వచ్చేది ఆయనే.
మాటల్లో హడావిడి ఉండదు; చేతల్లో మాత్రం సహాయం ఉంటుంది.
రామారావును చూస్తే వయసులో ఉన్న వాళ్లకే ఉత్సాహం వస్తుంది. రామారావు గారు కూడా అలాగే. నవ యువకుల్లా క్రికెట్ ఆడతారు. మనవళ్లతో పార్కులో ఆడుకుంటారు.
సాయంత్రం అయితే బజ్జీలు కొట్టు దగ్గర కూర్చుని,
“ఇప్పటి బజ్జీల్లో అప్పటి రుచి లేదు” అని నవ్వుతారు.
ఆయన్ని చూసిన వాళ్లు ఒకటే అంటారు—
“వయసు మీద పడింది కానీ… ఇంకా కుర్రతనం పోలేదు!”
దానికి తోడు, రాత్రి 8:00 అయితే చాలు. ఎండైనా, వానైనా, చలికాలం అయినా సరే—ఆ సమయంలో ఎవరికి కనపడడు. ఎప్పుడు ఇంటికి వస్తాడో తెలియదు.
చాలామంది ఆయన గురించి తప్పుగా అనుకున్న వాళ్లు ఉన్నారు.
స్నేహితులు,
“ఏరా, ఎక్కడికి వెళ్తున్నావు?”
అని అడిగితే, నవ్వుతూ సమాధానాన్ని దాటేస్తాడు.
అది వాళ్లలో అనుమానాన్ని ఇంకా పెంచుతుంది.
అయినా అవన్నీ ఏమి పట్టించుకోకుండా, ఎప్పటిలాగే కారు తీసుకుని పక్క కాలనీలో ఉన్న అపార్ట్మెంట్ ముందు ఆపి, మొదటి ఫ్లాట్ దగ్గర కాలింగ్ బెల్ కొట్టాడు.
తలుపు తీసిన ఒక యాభై ఏళ్ల స్త్రీ,
“రండి అన్నయ్య గారు,”
అని నవ్వుతూ లోపలికి ఆహ్వానించింది.
“లేదమ్మా,” అంటూ నసుగుతూ నిలబడే సరికి పరిస్థితి అర్థమై, లోపలికి వెళ్లి గ్యారేజీ పట్టుకొచ్చి ఇచ్చింది.
రామారావు తన చేతిలోని ఖాళీ క్యారేజీని ఆ స్త్రీ చేతిలో పెట్టి,
“ఇది రేపటి కోసం,”
అంటూ పక్క ఫ్లాట్ ముందు నిలిచాడు.
ఒక కుర్రవాడు అందించిన క్యారేజీని పుచ్చుకుని, అలా ఆ అపార్ట్మెంట్లో ఉన్న ఇరవై ఫ్లాట్లు తిరుగుతూ క్యారేజీలు పుచ్చుకున్నాడు.
అన్నింటినీ కారులో పెట్టుకుని, ఆ కాలనీకి పక్కనే ఉన్న బలహీన వర్గాల కాలనీ—రామాలయం దగ్గర కారు ఆపాడు.
ఇది ఏమిటి?
రామారావు ఏమైనా క్యాటరింగ్ బిజినెస్ చేస్తున్నాడా?
అనే అనుమానం అందరికీ రావచ్చు.
ఒకవేళ క్యాటరింగ్ బిజినెస్ చేస్తే—తన కాలనీ ఉంది కదా, ఈ అపార్ట్మెంట్ ఎందుకు?
అనే ప్రశ్న కూడా సహజమే.
రామారావుకి పెళ్లయిన కొత్తలో ఈ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్‌లో కాపురం ఉండేది. మొదటినుంచి అందరితో కలిసిమెలిసి ఉండే మనస్తత్వం ఉన్న రామారావు, వచ్చిన కొద్ది రోజులకే అందరితో స్నేహం పెంచుకున్నాడు.
ప్లాట్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నారు అందరూ.
సేవాభావం ఎక్కువ ఉన్న రామారావుకి అది పెద్ద కష్టం కాలేదు.
ప్రతిరోజూ పార్కింగ్ ప్లేస్‌లో వాకింగ్ చేస్తున్నప్పుడు గమనించిన ఒక విషయం ఆయన మనసును చాలా బాధ పెట్టింది. చెత్తబుట్టలో పడే పరబ్రహ్మ స్వరూపం—బలహీన వర్గాల కాలనీలో కొంతమందికి పరమాన్నం అవుతుందని గ్రహించాడు
ఆ అద్భుతమైన ఆలోచనకు శ్రీకారం చుట్టినవాడే, ఆ అద్భుత కార్యానికి సేవకుడయ్యాడు. పూర్తిగా అంకితం అయిపోయాడు.
ప్రతిరోజూ రాత్రి ఎంతోమంది ఆకలిని తీర్చేవాడు అయ్యాడు.
ఆ అపార్ట్మెంట్లో ఉన్నంత సేపు ఏదో సేవ చేశాడు. సొంత ఇల్లు కట్టుకుని ఈ కాలనికి వచ్చినా,
“మీరు రిటైర్ అయిపోయారు కదా… ఇంకా పనులెందుకు? హాయిగా విశ్రాంతి తీసుకోండి,”
అని భార్య చెప్పిన మాటలను కూడా లెక్కపెట్టలేదు రామారావు.
తన దీక్షను అలాగే కొనసాగిస్తూనే వచ్చాడు.
రామారావు కారు ఆగగానే ప్రతిరోజూ పిల్లలు పాపం కారు చుట్టూ మూగుతారు. తన చేతిలో ఉన్న క్యారేజీలను వాళ్లకు అందించి, వాళ్లను చూసి ఆనందపడతాడు.
ఆ క్యారేజీల్లో ఉన్నది పంచపక్ష పరమాన్నం కాదు. మనకు మిగిలినది—వాళ్లకు కడుపు నింపేది.
ఆ గుప్పెడు అన్నం కోసం ఆ కాలనీలో రెక్కలు నమ్ముకుని జీవించే కుటుంబాలు చాలా ఉన్నాయి.
మొదట్లో కొన్ని ఫ్లాట్లలో అన్నం మిగలకపోయినా, క్రమేపీ రామారావు చేస్తున్న సహాయాన్ని చూసి—
“అన్నయ్య గారు, మా ఇంట్లో అన్నం మిగిలేలా వండుకోము. అయినా వాళ్ల కోసమని ఒక గుప్పెడు బియ్యం ఎక్కువగా వండుతున్నాము,”
అని చెప్పే మాటలు రామారావుకి ఎంతో ఆనందం కలిగించేవి.
ఇందులో అతిశయోక్తి లేదు. సేవాభావం అలవాటు చేసుకున్న వాళ్లకి ఇది పెద్ద విషయం కాదు.
మొదట్లో పిల్లల కడుపు కేసి చూసిన రామారావు దృష్టి, క్రమేపి వారి బోసిగా ఉన్న శరీరాల వైపుకూడా మళ్లింది.
ఇంకేముంది—అపార్ట్మెంట్లో నివసించే కుటుంబాల పాత బట్టలన్నీ, ఆరు నెలలకు ఒకసారి పిల్లల చేతుల్లోకి చేరేవి.
ఆయన ఎప్పుడూ తాను చేస్తున్నది గొప్ప పని అనుకోలేదు.
ఎవరికీ చెప్పలేదు.
ఎవరి ప్రశంసలూ కోరుకోలేదు.
కడుపు నిండిన పిల్లల నవ్వుల్లో,
చలికాలంలో వణకని చిన్న శరీరాల్లో,
తన జీవితానికి అర్థం కనుగొన్నాడు.
అలా కొంతకాలం గడిచింది.
ఒక రోజు రాత్రి, రామారావు గారి ఇంటి ముందు అపరిచితమైన నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ కొంతమంది జనం గుమిగూడి ఉన్నారు.
లోపలికి వెళ్లి చూసిన కాలనీవాసుల గుండెలు ఒక్కసారిగా ఆగిపోయాయి.
రామారావు గారు నేలపై నిశ్చలంగా పడి ఉన్నారు.
“సడన్‌గా గుండె నొప్పి వచ్చింది…”
అని ఆయన భార్య చెప్పిన మాటలు గొంతులోనే ఆగిపోయాయి. కన్నీళ్లు మాటల్ని ముంచేశాయి.
ఆయన పక్కనే—ఎప్పటిలాగే—క్యారేజీలు ఉన్నాయి.
ఖాళీగా కాదు… నిండుగా.
ఎవరో ఆకలితో ఎదురుచూస్తున్నట్టుగా.
“ఇన్ని క్యారేజీలు ఎందుకు?”
అని ఎవరో నిశ్శబ్దాన్ని ఛేదించారు.
అప్పుడే బయట నిలుచున్న వాళ్లు నెమ్మదిగా లోపలికి వచ్చారు. వాడిపోయిన ముఖాలు. కన్నీళ్లతో నిండిన కళ్ళు. వణుకుతున్న చేతులు.
మాటల్లో మాత్రం ఒకే సత్యం—
“ఇదే ఆయన పని…”
“ప్రతిరోజూ మా పిల్లల ఆకలి తీర్చేవాడు…”
“ఈ అన్నమే మా జీవితం…”
ఆ మాటలు వినిపిస్తున్న కొద్దీ, కాలనీవాసుల గుండెల్లో ఏదో ముద్దగా నలిగిపోయింది.
ఎన్నో రాత్రులు తమ అనుమానాల్ని మోస్తూ గడిపిన వాళ్లకు, ఆ క్షణంలో ఒకే ఒక్క నిజం స్పష్టమైంది.
రామారావు గారు రాత్రిళ్లు ఎక్కడికి వెళ్లేవారో కాదు—
ఎందుకు వెళ్లేవారో.
అనుమానాలు కన్నీళ్లయ్యాయి.
సిగ్గు తల వంచింది.
గర్వం గుండెల్లో నిండింది.
ఆ రోజు రామారావు గారి శరీరం నిశ్చలంగా ఉన్నా,
ఆయన చేసిన సేవ మాత్రం ఆ కాలనీ శ్వాసలో కలిసిపోయింది.
ఆయన పేరు పలకనక్కర్లేదు.
ఆకలి తీరిన ప్రతి పిల్లవాడి నవ్వే ఆయన పేరు.
చలికాలంలో వణకని ప్రతి చిన్న శరీరమే ఆయన విగ్రహం.
రామారావు గారు వెళ్లిపోయారు.
కానీ ఆకలిపై గెలిచిన మనిషిగా—
ఆ కాలనీ హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయారు.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి