కొంగు చాటు వీరుడు
కొంగు చాటు వీరుడు
ఆ స్వరం వినగానే అందరూ ఆ గదిలోకి పరిగెడతారు. ఏం జరిగిందో అని భయపడిపోతారు. సుశిక్షితులైన సైనికుల్లాగా ఎవరి బాధ్యతలు వాళ్ళు తీర్చడానికి సన్నద్ధమవుతారు.
అక్కడున్నవాడు కండలు తిరిగిన మొనగాడు కాదు. కోడి రామ్మూర్తి గారి శిష్యుడు అసలే కాదు. తీరా చూస్తే పాలకడలిపై శేషతల్పము మీద పడుకున్న శ్రీమహావిష్ణువు కూడా కాదు. నవ మాసాలు ఆ చిమ్మ చీకటిలో ఉండి మన లోకానికి వచ్చిన మహావీరుడు.
అమ్మ కడుపులో ఉన్నంతసేపు గిరగిర తిరుగుతూ అమ్మకు పెట్టిన దానిలో వాటా కోరుతూ చక్కిలి గింతలు పెడుతూ ఈ లోకంలోకి రావడానికి సన్నాహాలు చేసుకుంటూ వచ్చేటప్పుడు అమ్మకు నొప్పి పుట్టించి భూమ్మీదకి వచ్చిన వెంటనే తన ఉనికిని చాటడానికి ఏడుస్తూ బంధువులందరికీ సంతోషాన్ని తెప్పించి నోరు తీపి చేసుకునేలా చేసే చంటి వీడు. వీడు రోజుకో సినిమా చూపిస్తాడు.
మన లోకానికి వచ్చిన మహావీరుడు అన్నారు. మరి వాడి వీరత్వం ఏమిటి ఈ లోకంలోకి రాడానికి వాడు చేసే ప్రయత్నమే వీరత్వం. వాడి తాహతకు అది ఎక్కువే.
భూమి మీదకు వచ్చిన వెంటనే వాడు మనకు బంధువు అయిపోతాడు. మన అమ్మాయి అమ్మగా మారిపోతుంది.
పుట్టిన క్షణం నుంచి వాడు మనకు అతిధి. అతిధి మర్యాదలు కోరడం వాడికి తెలియదు. బుల్లి నోరు తెరిచి బువ్వ పెట్టమని అడగడు.కన్నీరు పెట్టి తన ఆకలిని, అసహనాన్ని, ఒంటరితనాన్ని ప్రకటిస్తాడు. అదే అతని భాష. అదే అతని డిమాండ్. కొంగు చాటుకు చేరి తన బువ్వని మౌనంగా తినేస్తాడు.
వాడికి ఈ లోకంలో ఏ నియమాలూ తెలియవు. పగలు–రాత్రి తేడా తెలియదు. సమయం, సందర్భం, పెద్దలు అనే భావనలే ఉండవు. ఆకలేస్తే ఏడుపు. నిద్ర వస్తే నిద్ర. అసౌకర్యమైతే గొంతెత్తి గగ్గోలు. అంతే.
అయినా అందరూ వాడి చుట్టూ చేరిపోతారు.
అమ్మ అలసట మర్చిపోతుంది.
నాన్న గుండె నిండిపోతుంది.
అమ్మమ్మకు దేవుడు గుర్తొస్తాడు.
తాతయ్యకు తన బాల్యం గుర్తొస్తుంది.
వాడు ఏమీ చేయడు.
చేయాల్సిన పని అంతా మనమే చేసేస్తాం.
వాడి చేతి గుప్పెడు మన వేలు పట్టుకుంటే చాలు —
మన జీవితానికి అర్థం దొరికినట్టు అనిపిస్తుంది.
ఇంత చిన్నవాడు…
ఇంత అశక్తుడు…
ఇంత అసహాయుడు…
కానీ వాడి రాకతో
ఇంట్లో మాటల మారతాయి.
నిద్రల షెడ్యూల్ మారుతుంది.
ప్రాధాన్యతలు మారతాయి.
మనమే మారిపోతాం.
ఇంతకుముందు మనం ఎవరో
ఇప్పుడు మనం వాడికి సేవకులo.
అందుకే వాడు మహావీరుడు.
యుద్ధం చేసి గెలిచినందుకాదు.
శత్రువులను జయించినందుకాదు.
మన లోకంలోకి వచ్చి
మన జీవితాలనే మార్చేసినందుకు.
వాడి రాకతో
ఇంట్లో నిశ్శబ్దానికి అర్థం మారుతుంది.
తనలో తానే నవ్వుకున్నప్పుడు
ఒక యోగిలా అనిపిస్తాడు.
అమ్మ ఒడిలో వాడు పడుకున్నప్పుడు
లోకమే ఆగిపోయినట్టుంటుంది.
నాన్న చేతుల్లోకి వాడిని తీసుకుని గుండెలకు హత్తుకున్నప్పుడు
నాన్న చేతులు వణుకుతాయి.
భయం కాదు…
అంత చిన్న జీవితం తన చేతుల్లో ఉందన్న బాధ్యత.
వాడు నవ్వితే
ఇల్లు పండగైపోతుంది.
వాడు మౌనంగా ఉంటే
అందరూ అప్రమత్తం.
డాక్టర్ దగ్గరకు పరుగులు.
బంధువులకు ఫోన్లు.
“ఏమయ్యిందో” అన్న ప్రశ్నలు.
వాడికి ఇవన్నీ తెలియవు.
వాడు ఎవరి అంచనాలు తీర్చడానికి రాలేదు.
వాడు ఎవరికీ ఏ వాగ్దానం చేయలేదు.
అయినా…
వాడి మీద
అందరి ఆశలూ
అందరి కలలూ
నిదానంగా పేరుకుపోతాయి.
వాడు పెరుగుతాడు.
ఏడుపు మాట అవుతుంది.
మాట నడక అవుతుంది.
నడక పరుగవుతుంది.
కాని ఆ మొదటి ఏడుపు…
ఆ గదిలో అందరూ పరిగెత్తుకొచ్చిన క్షణం…
అదే వాడి తొలి విజయఘంట.
అందుకే వాడు మహావీరుడు.
ఈ లోకంలోకి రావడం మాత్రమే కాదు —
వాడి చుట్టూ మనల్ని బొంగరం లా తిప్పుకున్నందుకు
వాడి నవ్వు
వాడి ఏడుపు
కాళ్లు చేతులు ఆడిస్తూ చేసే కసరత్తు
మన బట్ట తడిపినప్పుడు కలిగే అనుభూతి
మనల్ని లొంగదీసుకునే
వాడి ఆయుధాలు
అందుకే వాడు మహావీరుడు.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి