రుచిలో రారాజు _అతిధి మర్యాదలో మహారాజు
అల్లుడు గుమ్మంలోకి అడుగుపెట్టాడో లేదో, ఆ క్షణమే మర్యాదలు మొదలవుతాయి మా గోదారోళ్లింట్లో. అల్లుడైనా, ఆత్మీయ అతిథులైనా—ముందుగా వండి పెట్టేది కరకరలాడే మినప గారెలే.
మినుము తింటే కండబలం పెరుగుతుందన్న నమ్మకం ఒకటి; పిండి వంటలలో అది మహారాజులాంటిదన్న విశ్వాసం మరొకటి. అందుకే పెద్దలు—
“తింటే గారెలే తినాలి, వింటే మహాభారతం వినాలి”
అని అలా నిశ్చితంగా చెప్పేవారు.
అంతేకాదు, ఈ లోకంలో ఉన్న వాళ్లకే కాకుండా పరలోకంలో ఉన్న వాళ్లకి కూడా ఈ గారెలు అంటే మహా ప్రీతి. ఏ పితృకార్యమైనా గారెలు లేకుండా ఉండదు. ఎర్రగా నూనెలో వేగిన గారె ముక్క విరుచుకుని, అల్లపు చెట్నీతో నంజుకుని తింటే స్వర్గమే కనపడుతుంది.
తినేవాళ్లకి స్వర్గం కనబడుతుంది గానీ, పాపం వండే వాళ్ల పరిస్థితి తలుచుకుంటే బాధేస్తుంది. ఒకప్పుడు యంత్రాలు వంటింట్లోకి ప్రవేశించని కాలంలో, రుబ్బురోలుతో కుస్తీపట్టి, చెమటలు కక్కుతూ, పీకల లోతు నీళ్లలో నానబెట్టిన మినప గుండును కర్కశంగా తోలువలచి, కసి కొద్దీ రుబ్బురోలు పత్రాన్ని తిప్పుతూ, ఇనప గుండులాంటి మినప గుండును పాలనురుగు రంగులో ఉన్న మినప రుబ్బుగా మార్చేవారు.
రుబ్బు తయారయ్యాక హమ్మయ్య అనుకునేవారు.
పిండి రుబ్బుతూ అడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సొలుపు ఉండదనే పాట పాడుకోవడానికి అది సినిమా; మనది జీవితం. ఒకసారి రుబ్బితే తెలుస్తుంది అసలు రంగు అని మండిపడేవారు.
సరే… రుబ్బు అతి కష్టం మీద తయారైంది. ఇంక కట్టెల మంట పొగలు కళ్ల మంట తెప్పిస్తుంటే, చేతిలో ఒక పిండి తీసుకుని గుండ్రంగా చేసి, మధ్యలో చిల్లు పెట్టి, వేడి వేడి నూనెలో కర్కశంగా వేయించి—హమ్మయ్య అనుకునేవారు.
యంత్రాలు వచ్చాక పని సులువు అయింది గానీ, గారె రుచి మాత్రం కొండెక్కిపోయింది. రుబ్బురోలులో రుబ్బిన పప్పుతో చేసిన గారె రుచి మరిచిపోయి చాన్నాళ్లయింది. ఇప్పుడు పప్పు నానడం తరువాయి—గారె తయారైపోతుంది. అప్పట్లో ఒక పూట పట్టేది.
ఆ రోజులు వేరు…
గారెలు తినడానికి సమయం ఏమైనా ఉందా అంటే—ఏమీ లేదు. ఉదయం అల్పాహారంలో ఇడ్లీకి తోడుగా నిలిచి కడుపు నింపుతుంది. మధ్యాహ్నం పూట లంచ్‌లో పిండి వంటగా మారిపోయి, ఆహారానికి మధురమైన రుచినిస్తుంది. తద్దినం రోజున పరమాన్నంతో కలిసి పితృదేవతలను సంతృప్తి పరుస్తుంది.
బూరి ముక్కపై నెయ్యి పోసుకుంటే అదిరిపోతుంది. ఇది నూనెతో ఉడికిన గారె—అల్లం పచ్చడి, కొబ్బరి పచ్చడితో జత కడితే ఇంకేముంది? రెండు పుంజీల గారెలు అవలీలగా నోట్లోకి వెళ్లిపోతాయి.
ఎప్పుడూ వట్టి గారెలేనా అంటే ఎందుకు? గారెలు చేసుకున్నప్పుడల్లా నాలుగు బెల్లం పాకంలోనూ, మరో నాలుగు పెరుగులోనూ పడేసుకుంటే నోటికి వెరైటీగా ఉంటుంది రా అబ్బాయి—అనేది బామ్మ. ఆవిడకి పాకం గారెలు అంటే ఇష్టం.
మరి హోటల్లో వడ అని పిలుస్తారు.
“ఏమిటి?” అని అడిగితే—
“అవ్వ పేరే ముసలమ్మ రా”
అంది నవ్వుతూ.
హోటల్ వడ, ఇంటి గారె మధ్య తేడా బామ్మకి బాగా తెలుసు.
“అక్కడ నూనె వాసన ఎక్కువ, ఇక్కడ ఆప్యాయత ఎక్కువ”
అనేది ఆమె తీర్పు.
హోటల్లో ప్లేట్లో వచ్చి పడే వడను చూసి,
“ఇది గారె కాదు రా… గారె జ్ఞాపకం”
అని పెదవి విరిచేది.
“గారె అంటే చేతి చెమట ఉండాలి, కళ్ల మంట ఉండాలి, కడుపులో ఆకలి ఉండాలి. అవి లేకపోతే అది వడే”
అని తేల్చేసేది.
ఇంట్లో అయితే మాత్రం లెక్కలు ఉండవు.
ఎన్ని గారెలు వేసామో ఎవరికీ తెలియదు.
ఎన్ని తిన్నామో అడగరు.
“ఇంకోటి వేసుకో” అన్న మాట తప్ప.
పిల్లలు స్కూల్‌కి వెళ్లేముందు ఒక గారె.
పనికి వెళ్లేవాళ్లకి రెండు.
అల్లుడు వచ్చాడంటే—లెక్కే ఉండదు.
“వాళ్ల ఇంటి పరువు మన గారెల మీదే నిలబడి ఉంది”
అని బామ్మ చెప్పిన మాట ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు.
ఇప్పుడు ఆ వంటగది లేదు.
రుబ్బురోలు మూలకు చేరింది.
బామ్మ మాటలు జ్ఞాపకాలయ్యాయి.
గారెలు మాత్రం ఇంకా ఉన్నాయి—
కానీ ఆ రుచి కాదు…
ఆ శ్రమ లేదు…
ఆ ప్రేమ అంతకన్నా లేదు.
కానీ ఎప్పుడైనా గారె నూనెలో పడగానే,
ఆ చటుక్కున అన్న శబ్దం వినిపిస్తే చాలు—
బామ్మ నవ్వు,
అత్తయ్య పిలుపు,
అల్లుడి మొహమాటం…
అన్నీ ఒక్కసారిగా మనసులోకి వచ్చి కూర్చుంటాయి.
అందుకే గారె వంటకం కాదు.
అది ఒక జ్ఞాపకం.
ఒక కాలం.
ఒక జీవితం.
రచన: మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ
9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి