సంధ్యా రాగం
“ఒసేయ్ రమ్య, ఒసేయ్ సంధ్య … వచ్చే నెలలోనే నాన్న రిటైర్మెంట్,” అంది రమ్య, సంధ్యల తల్లి సరస్వతి.
“అవునమ్మా! మొన్ననే కదా చెప్పావు. నాన్నకు అరవై ఏళ్లు నిండుతున్నాయని వెటకారం కూడా ఆడావు. అయినా ఇప్పటికి ఐదు సార్లు నుంచి ఇదే మాట చెబుతున్నావ్!” అంది రమ్య నవ్వుతూ.
రమ్య తండ్రి భాస్కరరావు ఒక ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో మేనమామ చేరదీసి పెంచి, చదువు చెప్పించి, పెళ్లి కూడా చేశాడు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయినా, “బిడ్డ చదివితే భవిష్యత్తు వెలుగుతుంది” అనే నమ్మకంతో మేనమామ పడిన కష్టం భాస్కరరావు జీవితానికి బలమైన పునాది అయింది.
అందుకే చిన్ననాట అతనికి ముద్దు ముచ్చట్లు, పుట్టినరోజు సరదాలు తెలియనే తెలియలేదు.
పెళ్లైన తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత, ఇద్దరు పిల్లలకు తండ్రయ్యాడు. పిల్లల పుట్టినరోజులు ఎంత ఘనంగా జరిపేదో, అంతే ప్రేమతో భర్త పుట్టినరోజును కూడా పండుగలా మార్చేది సరస్వతి.
పొదుపు అతని అలవాటు, సంతోషం ఆమె స్వభావం—ఆ రెండు కలిసి ఆ ఇంటిని సంతోషంగా నిలబెట్టాయి.
తెలుగు ఉపాధ్యాయుడిగా జీవితాన్ని అక్షరాలకు అంకితం చేస్తూ, సంసారాన్ని జాగ్రత్తగా నడిపిస్తూ, పిల్లలిద్దర్నీ ప్రయోజకులను చేసి, మనుమలతో “తాతయ్య” అనిపించుకునే దశకు చేరుకున్నాడు భాస్కరరావు.
పెళ్లైన ప్రతి మగవాడి జీవితంలో అరవై ఏళ్లు నిండే వేళ ఒక ప్రత్యేకమైన మలుపు. చాలామంది దంపతులు ఆ శుభతరుణం కోసం ఎదురు చూస్తారు. కానీ ఎవరికి వారే ఆ వేడుక చేసుకుంటే ఆ ఆనందంలో సగం మాత్రమే ఉంటుంది; బాధ్యతలు తెలిసిన పిల్లలు పెళ్లి పెద్దలైతే ఆ వేడుకకు అసలైన వెలుగు వస్తుంది.
ఎన్నిసార్లు పిల్లలకు తండ్రి వయస్సు గురించి గుర్తు చేసినా, వారు ఆ మాట ఎత్తడం లేదు.
“నేను ఎలా గుర్తు చేయను? సిగ్గు విడిచి చెబితే బాగుంటుందా? పిల్లల నోటివెంట ఆ మాట వస్తే ఎంత ఆనందంగా ఉంటుంది!” అయినా పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఇలా తల్లిదండ్రులకు షష్టిపూర్తి వేడుక చేయాలంటే అల్లుళ్లు కూడా ఇష్టం ఉండాలి. అనుకుంటూ తనలో తాను మధనపడసాగింది సరస్వతి.
భాస్కరరావు స్నేహితుడు కామేశ్వరరావు షష్టిపూర్తికి వెళ్లి వచ్చినప్పటి నుంచి, ఎలాగైనా భర్తకు కూడా అలాంటి వేడుక జరగాలని ఆమె మనసులో ఒక చిన్న కోరిక మొలకెత్తింది.
కానీ పిల్లలు ఎవరూ ఆ మాట ప్రస్తావించకపోవడంతో, ఒక రాత్రి ధైర్యం చేసి తన మనసులోని మాట భర్తతో చెప్పింది.
“చూడు సరస్వతి… నాకు అలాంటి కోరికలు గాని సరదాలు గాని లేవు. ఆడపిల్లల డబ్బుతో మన సరదాలు తీర్చుకోవడం మంచి పద్ధతి కాదు,” అని అంటూ ఈ వయసులో మన సొంత డబ్బు కూడా పాడు చేసుకోవడం మంచిది కాదు అని మృదువుగా తిరస్కరించాడు భాస్కరరావు.
ఆయనకు ఇలాంటి సంబరాలు ఇష్టం ఉండవని తెలిసినా అడిగిన సరస్వతి, మాటలకు బాధపడ్డా పైకి మాత్రం నవ్వుతూ “మీ ఇష్టం” అని చెప్పి అటు తిరిగి పడుకుంది.
“ఏమి సరదాలు తీరని జీవితం కదా! ఆయన గురించే కదా నేను సిగ్గు విడిచి అడిగింది… పిల్లలు అర్థం చేసుకోలేదు… కట్టుకున్న భర్త అర్థం చేసుకోలేదు…” అనుకుంటూ నిద్రలోకి జారుకుంది.
సరస్వతి అటు తిరిగి పడుకోవడం చూసి “పాపం… మనసు కష్టపెట్టుకున్నట్టుంది,” అనుకున్నాడు భాస్కరరావు. వెంటనే రెండు రోజుల క్రితం పిల్లలు ఇద్దరితో జరిగిన సంభాషణ గుర్తొచ్చి అతని పెదవులపై చిరునవ్వు మెరిసింది.
“నాన్న, అమ్మకు చెప్పకండి. మీకు షష్టిపూర్తి చేద్దాం అనుకుంటున్నాం,” అన్నారు రమ్య, సంధ్య
“ఎందుకు అనవసర ఖర్చులు?” అన్నాడు భాస్కరరావు.
అయినా మీ భర్తల అంగీకారం తీసుకున్నారా అని అడిగాడు . పిల్లలు ఇద్దరు ఒకరు ముఖాలు ఒకళ్ళు చూసుకుని తల అడ్డంగా తిప్పి కన్నీళ్లు పెట్టుకున్నారు. దానికి ఏం పరవాలేదు ఆ విషయాలన్నీ మేము చూసుకుంటాం. ఇదే కొడుకుల అయితే నువ్వు వాళ్ళు చెప్పిన మాట వింటావా లేదా. మేము ఆడపిల్లలం కాబట్టి రకరకాల ప్రశ్నలు వేస్తున్నావ్ అన్నారు నిష్టూరంగా.
“అరవై ఏళ్లు దాటిన ప్రతి తల్లిదండ్రి జీవితంలో ఇది ఒక పండుగ నాన్న! చిన్నప్పుడు తల్లిదండ్రులు పిల్లల సరదాలు తీరుస్తారు. పెద్దయ్యాక భార్య ఆ బాధ్యత తీసుకుంటుంది. వయసు మళ్లిన దశలో పిల్లలే కదా తల్లిదండ్రుల కోరికలు తీర్చాల్సింది! ముప్పై ఏళ్ల క్రితం జరిగిన మీ పెళ్లి నేను చూడలేదు… కానీ ఇప్పుడు మేమంతా మీ పెళ్లి పెద్దలమే!” అన్నారు నవ్వుతూ.
మా భర్తలు ఒప్పుకోకపోయినా కన్న పిల్లలుగా ఇది మా బాధ్యత అన్నారు. పిల్లల సరదా చూసి “పెళ్లి పెద్దలు మీరే గాని, పెళ్లి ఖర్చు మాత్రం ఈ ముసలి పెళ్లికొడుకుదే !” అన్నాడు భాస్కరరావు సరదాగా.
నిజానికి భాస్కరరావుకి ఈ షష్టిపూర్తి చేసుకోవాలని సరదా ఉన్న ఆడపిల్లల భర్తలు ఒప్పుకోలేదు అంటున్నారు. భర్తలను కాదని ఈ పిల్లలు ఈ వేడుక జరిపిస్తే ఏం గొడవలు వస్తాయో అని భయం వేసింది భాస్కర్ రావు కి
భర్తతో జరిగిన సంభాషణ మరుసటి రోజు నుంచి సరస్వతి మౌనంగా తన పనులు చేసుకుంటూ ఉండిపోయింది. పిలిస్తేనే పలుకుతోంది.
ఒక సాయంకాలం స్కూల్ నుంచి వచ్చిన భాస్కరరావు,
“వచ్చే వారమే నా రిటైర్మెంట్ ఫంక్షన్. ఇవాళ స్కూల్ వాళ్లు ఆహ్వాన పత్రిక ఇచ్చారు,” అంటూ కార్డు అందించాడు.
“ఫంక్షన్ ఎక్కడండి?” అని అడిగింది సరస్వతి.
“కృష్ణానగర్ బ్యాంక్ కాలనీ దగ్గర ఉన్న కరుటూరి కళ్యాణ మండపంలో. పాత విద్యార్థులు చాలామంది వస్తున్నారట,” అన్నాడు.
అంతలో గేటు తీసుకుని లోపలికి వస్తూ,
“మన ఫంక్షన్ కూడా అక్కడే నాన్న!” అన్నారు రమ్య , సంధ్య
“మన ఫంక్షన్ ఏమిటి?” ఆశ్చర్యపోయింది సరస్వతి.
“నీ మనసులో ఉన్న కోరికే మన ఫంక్షన్!” అన్నారు చిరునవ్వుతో.
ఆ మాట వినగానే సరస్వతి కళ్లలో ఆనందం తేలిపోయింది.
“ఎంత టెన్షన్ పెట్టారూ! ఏమీ చెప్పకుండా అన్నీ ఏర్పాట్లు చేసేశారూ…” అని ఆనందంతో చెప్పినా, సరస్వతి గళం కొద్దిగా కంపించింది. ఆ క్షణంలో ఆమె కళ్లలో మెరిసింది కేవలం సంతోషం మాత్రమే కాదు—తన మనసులో దాచుకున్న కోరికను పిల్లలు మాటలకన్నా ముందే చదివేసిన ఆనందం.
“మీరు ఎప్పుడూ మాకు ఇచ్చిందే తప్ప, ఏదీ అడగలేదు. ఇప్పుడు మేము ఇచ్చే ఆనందాన్ని మీరు అంగీకరించాలి,” అంది రమ్య.
భాస్కరరావు కళ్లలో నీరు మెరిసింది.
“నిజంగా నేను ధనవంతుడినే… డబ్బుతో కాదు, మీలాంటి పిల్లలతో,” అని గర్వంగా అన్నాడు.
రిటైర్మెంట్ రోజున కళ్యాణ మండపం పండుగలా మెరిసిపోయింది. పాత విద్యార్థులు వచ్చి “మా జీవితాలను అక్షరాలతో తీర్చిదిద్దిన గురువు” అని నమస్కరించగా, భాస్కరరావు హృదయం నిండిపోయింది.
కొంతసేపటికి వేదికను అలంకరించి, మంగళవాయిద్యాల మధ్య సరస్వతి–భాస్కరరావులను మళ్లీ పెళ్లికొడుకు, పెళ్లికూతురుల్లా కూర్చోబెట్టారు.
తాళిబొట్టు మళ్లీ కట్టే వేళ, సరస్వతి తలవంచి నవ్వింది.
“ముప్పై ఏళ్ల క్రితం నిన్ను చూసి ఎంత సిగ్గుపడ్డానో… ఇప్పుడూ అదే అనిపిస్తోంది,” అని మెల్లగా చెప్పింది.
భాస్కరరావు చిరునవ్వుతో,
“అప్పట్లో జీవితాన్ని ప్రారంభించాం… ఇప్పుడు దాన్ని ఆస్వాదించే దశకు వచ్చాం,” అన్నాడు.
పిల్లలు, మనుమలు అంతే కాదు అన్నిటికన్నా ఆశ్చర్యం అల్లుళ్లు, వియ్యాల వారు చుట్టూ నిలబడి అక్షింతలు వేసే వేళ, ఆ క్షణం కాలం కాసేపు ఆగినట్టుగా అనిపించింది.
సాయంత్రం వేళ మండపం బయట ఆకాశం సంధ్యారాగంతో ఎర్రబడింది.
ఆ వెలుగులో సరస్వతి మెల్లగా చెప్పింది—
“మన జీవితం కూడా ఇదే సంధ్యారాగంలాంటిదే కదా! ఉదయం ఉత్సాహం, మధ్యాహ్నం బాధ్యతలు… ఇప్పుడు ఈ ప్రశాంతమైన సాయంత్రం.”
భాస్కరరావు తల ఊపాడు.
“అవును… కానీ ఈ సంధ్య తర్వాత చీకటి కాదు సరస్వతి—మన పిల్లల ప్రేమ వెలుగుతో నిండిన కొత్త ఉదయం ఉంటుంది.”
సరస్వతి అతని చేతిని గట్టిగా పట్టుకుంది.
ఆ రోజు వారికి షష్టిపూర్తి మాత్రమే కాదు—
ప్రేమకు, సహనానికి, కుటుంబ బంధాలకు జరిగిన ఒక నిశ్శబ్ద వేడుక.
జీవిత సంధ్యారాగం…
అస్తమయం కాదు,
అందమైన మరో ఆరంభం.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి