కావమ్మ కథ
రాత్రి 8:00 అయింది.
ఆకాశంలో పూర్ణచంద్రబింబం ముద్దుగా మెరిసిపోతోంది. ఆ పున్నమి వెలుగులో పుడమి అంతా పులకించిపోతోంది. చెరువు నీరు నిశ్శబ్దంగా ఉండి, ఆ వెన్నెల వెలుగులో పున్నమి చంద్రుడి ప్రతిబింబాన్ని ముద్దాడుతోంది. చెట్ల నీడలు పొడవుగా పడుతూ ఒక రహస్య కథ చెబుతున్నట్టుగా ఉన్నాయి.
. ఒక స్త్రీ—నలభై సంవత్సరాలు వయసుంటుందేమో—ఆ చంద్రుడిని చూస్తూ, ఆ వెన్నెల రాత్రి తనకు తోచని రీతిలో అడుగులు వేస్తూ, నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతూ నృత్యం చేస్తోంది. బొట్టు లేని నుదురు, తల మీద వేసుకున్న ముసుగు, బోసిపోయిన చేతులు ఇష్టం వచ్చినట్లు గట్టి గట్టిగా మాట్లాడుతున్న మాటలు విని
వీధి అరుగు మీద కూర్చున్న ఆమె ఇద్దరు తమ్ముళ్లు అది చూసి నిట్టూర్చారు.
“మా అక్క ఏమైనా తిందా?” అని పెద్ద తమ్ముడు రామారావు తన భార్య సీతమ్మని అడిగాడు.
“లేదండి, నోరు అసలు విప్పడం లేదు. దానికి తోడు ఇవాళ ఉదయం నుంచి అలా వాగుతూనే ఉన్నారు. ఇప్పుడు ఇలా ఎంత ప్రయత్నం చేసినా లోపలికి రావడం లేదు,” అంటూ బాధపడుతూ చెప్పింది.
మామూలు మనుషుల్లో ఉన్నప్పుడు అందరితో మంచిగా మాట్లాడుతుంది కావమ్మ. ఆ లోకంలోకి మారిపోయినప్పుడు తనలో తాను మాట్లాడుకుంటూ, గంటల తరబడి నోటికొచ్చినవన్నీ వాగుతూ, తన శరీరం మీద, మనసు మీద ఏమి శ్రద్ధలేని దానిలా అలా కూర్చుండిపోతుంది. ఏమిటో ఈ కర్మ! బొగ్గు కనపడితే చాలు, అది అరగదీసి కాటుకలు పెట్టుకుంటుంది. రోజుల తరబడి పచ్చి మంచినీళ్లు అయినా ముట్టుకోదు. కూర్చున్న చోటనే కాలకృత్యాలు.
ఎంతోమంది పుట్టిన చంటి పిల్లలు పుట్టిన ఇల్లు అది.. ఆ ఇంటి యజమానురాలికి ఆమె ఒక చంటి పిల్లలాంటిదే.జీవితంలో అన్నీ దురదృష్టాలే వెంటాడినా, భగవంతుడికి జాలి కలిగిందేమో—ఈ ఒక్క అదృష్టాన్ని ఇచ్చాడు.
నిజమే. రక్తసంబంధం ఉన్న ఇద్దరు తమ్ముళ్లు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న డాక్టర్లు అందరి దగ్గరికి తిప్పినా, ఆమె మామూలు మనిషి కాలేకపోయింది. ఇంక చేసేదేమీ లేక తీర్థయాత్రలకు తిప్పుతూ, మంచి కాలం కోసం ఎదురు చూస్తూ వచ్చారు. ఎన్ని యాత్రలు చేసినా కావమ్మ జీవిత యాత్రలో మార్పు ఏమీ లేదు.
రాజారావు—అంటే కావమ్మ తండ్రికి—నలుగురు పిల్లలు. రాజారావు ఆ ఊర్లో ఉండే కొద్దిపాటి భూమితో వ్యవసాయం చేయించుకుంటూ, పశువులను పెంచుకుంటూ, ఒక సంస్థానంలో పన్ను వసూలు అధికారిగా పనిచేస్తుండేవాడు ఇద్దరు మగ పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. ఆడపిల్లలలో పెద్దది మన కావమ్మ.
తెల్లగా, ఎత్తుకు తగ్గ బరువుతో కావమ్మ చాలా అందంగా ఉండేది. ఆ ఊర్లో ఉండే ప్రాథమిక విద్య పూర్తి చేసిన తర్వాత, యుక్త వయసు రాకుండానే పక్క ఊర్లో ఉండే గోపాలరావుతో పెళ్లి జరిపించారు. గోపాలరావు కావమ్మ కంటే పదేళ్లు పెద్ద. మంచి సంబంధం అని ముందు వెనక చూడకుండా, పక్క ఊర్లోనే పిల్ల ఉంటుందని అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు.
అప్పుడు రోజుల్లో అన్ని బాల్యవివాహాలే. గోపాలరావు చాలా ఎత్తుగా, లావుగా, తెల్లగా యువరాజులా ఉండేవాడు.
చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో తండ్రి గారాబంగా పెంచాడు. దానికి తోడు సవతి తల్లి క్రమశిక్షణ లేకపోవడంతో గోపాలరావు స్వేచ్ఛ జీవిగా పెరిగాడు. ఆ సవతి తల్లికి ఒక కొడుకు ఉండడంతో గోపాలరావుని పట్టించుకోవడం మానేసింది.
రాత్రిపూట పొలం పనులు ఉన్నాయని బయట తిరుగుతూ ఉండేవాడు. కావమ్మది తెలిసీ తెలియని వయసు. గోపాలరావు బయటకు ఎందుకు వెళ్తున్నాడో తెలిసినా తల్లిదండ్రులు మౌనంగా ఉండిపోయారు.
కానీ గోపాలరావు ప్రవర్తన చూస్తే ఏదో తేడాగా ఉందని చాలా రోజులకి కావమ్మకు అర్థమైంది.ఒకటి రెండు సార్లు ప్రశ్నించినా సరైన సమాధానం చెప్పకుండా మాట దాటేసి వెళ్లిపోయేవాడు గోపాలరావు. పైగా అనుమానం మనిషి—పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా ఉన్నట్లు. కావమ్మ ఏ మగవాడితో కూడా మాట్లాడడానికి వీలు లేదు. ఒకవేళ మాట్లాడవలసి వస్తే రకరకాల ప్రశ్నలతో వేధించేవాడు.
ఈలోగా కావమ్మ గర్భవతి అయింది. పుట్టింటికి వెళ్లిన కావమ్మకి పురిట్లోనే పిల్లవాడు పుట్టి చనిపోయాడు. ఆ తర్వాత అత్తవారింటికి వెళ్లిన కావమ్మను సూటిపోటి మాటలతో సవతి అత్తగారు, భర్త బాధించేవారు.
ఇంతలో గోపాలరావు సవతి తమ్ముడు భార్య మగపిల్లాడికి జన్మనివ్వడంతో కావమ్మకు ఇంకా సాధింపులు ఎక్కువయ్యాయి. ఇంటి పని అంతా కావమ్మ మీద వదిలేసి వారు. బండెడు చాకిరీ చేసి వచ్చిన భార్యకి ఓదార్పు ఇవ్వకుండా, ఏదోరకంగా బాధించేవాడు గోపాలరావు.
ఆ తర్వాత నాలుగైదు కాన్పుల్లో కూడా పిల్లలు నిలబడలేదు. కొందరు పురిటి మంచంలోనే, మరికొందరు నడక వచ్చిన వయసులో కాలం చేశారు. అదేం దురదృష్టమో ఏమో—పుట్టింట్లో తల్లి తండ్రి ఒకే సంవత్సరంలో కాలం చేయడం, తమ్ముళ్లు చిన్నవాళ్లు అవ్వడం—ఆ కుటుంబ బాధ్యతని మోయవలసి రావడంతో తరచూ గోపాలరావుతో గొడవలు వచ్చేవి.
గోపాలరావుకి కావమ్మ చేస్తున్న పనులు ఇష్టం ఉండేవి కాదు. చూస్తూ చూస్తూ తన కంట చిన్నవాళ్ళైనా తమ్ముళ్లను ఎలా వదిలేస్తుంది? తన ఆరోగ్య పరిస్థితులు బాగోలేకపోవడంతో గోపాలరావుని దూరం పెట్టేది కావమ్మ.
ఆస్తి నిలబడాలంటే అనాధ పిల్లలను దత్తత తీసుకోమని గోపాలరావు తండ్రి ఒత్తిడి చేసేవాడు. కానీ కావమ్మ తన ఆఖరి తమ్ముడ్ని దత్తత తీసుకుందామని చెప్పగానే, “ఆ దరిద్రపు వంశం మన ఇంట్లో కలుపుకోవద్దు,” అంటూ కోప్పడ్డాడు.
పాపం, కావమ్మకి పిల్లలు అంటే చాలా ప్రేమ. మరిది కొడుకుని దగ్గరకు తీసుకుంటే తోటి కోడలు కోపంగా చూసేది. ఎవరైనా “మీ పెద్ద కోడలుకి ఏమైనా విశేషమా?” అని అడిగితే, “అంత అదృష్టం మాకు లేదు,” అంటూ సవతి అత్తగారు మూతి మూడు వంకరలు తిప్పేది.
ఇవన్నీ కావమ్మ మనసులో దిగులు పుట్టించేవి. మనసంతా భారంగా ఉండి, గదిలో పడుకుని కుళ్ళి కుళ్ళి ఏడ్చేది.
ఒకరోజు అలా ఏడుస్తున్న కావమ్మను చూసి గోపాలరావు చెయ్యెత్తి కొట్టడానికి సిద్ధమయ్యాడు. ఏ ఆడదానికైనా భర్త దగ్గర నుంచి సరైన ఆదరణ లభించకపోతే, ఆమె మనసు ఎలా బాగుంటుంది?
క్రమేపీ కావమ్మలో మార్పులు వచ్చాయి—ఎవరో పిలిచినా పలకకపోవడం, పరధ్యానంగా ఉండడం. కావమ్మ పరిస్థితి ఇలా ఉంటే, ఎప్పుడూ బయటికి వెళ్లిపోయే గోపాలరావు ఇంటిపట్టునే ఉండిపోవడం ప్రారంభించాడు.
ఒకరోజు వంటింటి నుంచి తన గదిలోకి వెళ్తుంటే, పక్క గదిలో నుంచి నవ్వులు వినిపించాయి. ఆ గొంతులు ఎవరివో తెలిసిన కావమ్మకి తలలో నరాలు చిట్లినట్టు అనిపించింది. ఆమె అడుగుల చప్పుడికి నవ్వులు ఆగిపోయి, గోపాలరావు బయటకు రావడం చూసిన క్షణం—కావమ్మకి బుర్ర తిరిగిపోయింది.
ఆ తర్వాత కావమ్మ మనుషుల్లో లేదు. తన బాధలన్నీ ఎవరికో చెబుతున్నట్టుగా తనలో తానే మాట్లాడుకుంటూ ఉండిపోయింది. తిండి లేదు, నిద్ర లేదు. “కావమ్మకి పిచ్చెక్కింది” అని ఊరంతా చెప్పుకుంది.
కావమ్మ ఇలా మారిపోవడంతో గోపాలరావు స్వేచ్ఛకి అడ్డూ ఆపు లేకుండా పోయింది. కానీ కొద్దిరోజులకు ఏమైందో ఏమో—గోపాలరావు చనిపోయాడు. తోటి కోడలు ఆస్తి కోసం విషప్రయోగం చేసిందని అప్పట్లో చెప్పుకునేవారు.
ఏ ముహూర్తంలో కావమ్మ అత్తవారింట్లో అడుగు పెట్టిందో తెలియదు గానీ, అన్ని తీరని బాధలతో పుట్టిల్లు చేరిపోయింది. రామారావు అక్క భవిష్యత్తు కోసం ఆస్తి గురించి అడగడానికి వెళ్లగా, గోపాలరావు తన ఆస్తి అంతా తన తమ్ముడు పేరుమీద రాసేశాడని తెలిసింది.
అక్కకు అన్యాయం జరిగిందని రామారావు బాధపడుతూ కనీసం ఆరోగ్యం అయినా బాగు చేయాలని తిరగని ఆసుపత్రి లేదు. అన్ని ప్రయత్నాలు చేసి, భగవంతుడిపై నమ్మకం పెట్టుకుని తీర్థయాత్రలు చేసినా ప్రయోజనం లేదు. కావమ్మ ఆ లోకంలోనే ఉండిపోయింది.
ఆ తర్వాత పెద్ద తమ్ముడు చనిపోయాడు. ఆ లోకంలో ఉన్న కావమ్మకి ఈ విషయం తెలీదు. చిన్న తమ్ముడు వేరేగా వెళ్లిపోయాడు. ఆ తర్వాత కావమ్మ జీవితం ఏమిటని అందరూ అనుకుంటూ ఉంటే కావమ్మ మేనల్లుడుకి, భార్యకి చంటిపిల్ల అయిపోయింది కావమ్మ. ఒకరోజు దేవుడికి జాలి కలిగిందేమో ఆమెను తన లోకానికి తీసుకెళ్లి పోయాడు .తల్లిదండ్రుల్లాగే మేనత్తకి కూడా అంత్యక్రియలు చేసి, ప్రతి ఏటా తద్దినాలు పెడుతూ తమ బాధ్యత నిర్వర్తిస్తున్నారు మిగిలిన కుటుంబ సభ్యులు.
ఇది జరిగిన కథ. కథ కోసం చిన్న చిన్న మార్పులు చేయడం జరిగింది. యధాతధంగా రాస్తే ఆమె జీవితం పెద్ద కావ్యం అయిపోతుంది. ప్రతి ఒక్కరి జీవితం ఒక కథ. నా కథలు అన్ని నేను ఎరుగున్న మనుషుల జీవితాలే. అవి దేవుడు రాసిన కథలు. నేను కాపీ చేసి ఫేస్బుక్లో పోస్ట్ చేస్తున్నాను అంతే.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి