చాట్ బండి

 చాట్ బండి


సాయంకాలం నాలుగు గంటలు అయితే చాలు అన్ని వయసు వాళ్ళ ఆకలి తీర్చే నాలుగు చక్రాల బండి నాలుగు వీధులలో కనబడే బండి. నలుగురు మెచ్చే మిర్చి బండి.అదే పిడత కిందపప్పు బండి. యువతను కట్టిపడేసే చాట్ బండి. 


ఒకసారి సరదాగా అలా చాట్ బండి చూసి వద్దాం పదండి.

ఈ బండి కి నాలుగు చక్రాలు ఉండి చుట్టూ రంగురంగుల అద్దాల

 డబ్బా లుతో మెరిసిపోతూ పైన ఒక స్టూలు ,కాగితoముక్కలు

 ఒక అరలో అలంకరించుకుని సందుల్లో గొందుల్లో పార్కు దగ్గర

 పాఠశాల దగ్గర ఆఫీస్ దగ్గర ఆసుపత్రి దగ్గర అందంగా నిలిచి

 ఉంటుంది. మన చాట్ బండి. 


ఉదయం నుంచి శ్రమపడి కావాల్సిన ముడి సరుకులు తెల్లగా మల్లెపూలులా ఉండే మరమరాలు కారం ఉప్పు అటుకులు నిమ్మరసం ఉడికించిన బటాని బుల్లి సమోసాలు మిర్చి బజ్జీలు అరటికాయ బజ్జీలు వాసన వీధి అంతా అదరగొడుతుంటే ఏ మూలకైనా చేరిపోయి అందంగా నిలిచి ఉండి మంచి వాసనలతో అందర్నీఆహ్వానిస్తుంది అనేకంటే ఆకర్షిస్తుందని చెప్పడం మేలు

బండి మధ్యలో ఉడుకుతున్న బటాని . కింద గ్యాస్ బండ

 పెట్టుకోవడానికి ఒక ప్రత్యేకమైన ప్రదేశం. ఇంత సౌకర్యవంతంగా తయారుచేసిన ఈ బండి రూపశిల్పికి

ముందుగా నమస్కారం. 


మన ఇంట్లో కిచెన్ లో అనేక హంగులుఉంటే గాని ఉప్మా కూడా తయారు చేయలేరు మనవాళ్ళు. మరి మొబైల్ కిచెన్ లో ఎలా చేస్తున్నాడో పాపం.


 ఏo మాయ ఉందో బండి వాడి చేతిలో సాయంకాలం

 అయ్యేసరికి మాటలు రాని పసి గుడ్డు దగ్గర నుంచి పండు

 ముసలి వరకు బండి చుట్టూ ప్రదక్షిణమే.


బండి దూరడానికి కాస్త సందు ఉంటే చాలు నిమిషాల్లో తయారు చేసేస్తాడు ఫలహారం మన హీరో.రోడ్డు పక్కనే నిలబడే ప్లేటు మీద ప్లేటు లాగిo చేస్తారు మన జనం.


 ఈ ఫలహారం తయారు చేయడానికి బహుళ అంతస్తుల భవనం

 అక్కర్లేదు. జనానికి కుషన్ కుర్చీల ప్రసక్తే లేదు. అందమైన

 టేబుల్ అవసరం లేదు. ఎయిర్ కండిషన్ ఊసే లేదు.

 పరంథాముడు ఇచ్చే పైరగాలి.నగరపాలక సంస్థ వారి నల్ల 

 (నల్లా) నీళ్లు. 


పనులన్నీ పూర్తి చేసుకుని బజారు నుంచి వచ్చే వాళ్ళు స్కూల్

 నుంచి కాలేజీ నుంచి వచ్చే కుర్రగాళ్ళు . ఆఫీసు నుంచి 

 అలసిపోయి వచ్చే ఉద్యోగులకి వాకింగ్ చేయడానికి వచ్చే

 వృద్ధులకి మహిళలకి సాయంకాలం పది రూపాయలకు దొరికే

ఫలహారం. ఏం కావాలండి అంటూ ఆత్మీయంగా పలకరింపు.


బజ్జి మిక్చర్ లేదంటే చాట్ లేదంటే మిర్చి బజ్జి అది కాకపోతే

అరటికాయ బజ్జి ఛాయిస్ మనదే. మన నాలుక కోరుకుంటే

నోరు బజ్జి మిక్చర్ చేయండి అని అడుగుతుంది. ఎంతకి బండివాడి ప్రశ్న. పది రూపాయలు కి. తింటారా పార్సెలా .

 పార్సిల్ కాదు. మన సమాధానం విన్న వెంటనే ముడి సరుకులు

అంటే మరమరాలు, చాకుతో కోసిన బజ్జి ముక్కలు , అటుకులు

నిమ్మరసం వేయించిన వేరుశనగ గుళ్ళు చాట్ మసాలా ,కారం

ఒక స్టీలు గిన్నెలో పోసి చేతితో వేగంగా తిప్పుతాడు.

పైన అరలోఉన్న పేపర్ ముక్క అందుకుని పేపర్ గుండ్రంగా చుట్టి అందులో తేలికగా ఉంటే కర్ర స్పూను వేసి ఆర్డర్ ఇచ్చిన

 అయిదు నిమిషాల్లో అందజేస్తాడు. ఆవు రావురు మంటూ తినేసి మళ్లీ మన చూపు శెనగపిండిలో మునిగి తేలి ఒళ్ళు

 మండిపోతున్న నూనె చేత వాతలు పెట్టించుకుని అందంగా

 మెరిసిపోతున్న మిర్చి బజ్జి వైపు పడి అది ఆర్డర్ చేస్తాం. 


బండి వాడు నిర్ధాక్షిణ్యంగా దాని గుండె చీల్చి నిమ్మరసం పిండి  

 తల్లిలా మేలు చేసే ఉల్లిపాయ ముక్కలు వేసి అందంగా కాగితం లో పెట్టి ఇస్తాడు. మనకి జిహ్వ చాపల్యం ఎక్కువ కదా

గబగబా కొరికి తింటే కళ్ళకు నీళ్లు తెప్పించి గ్లాస్ మీద గ్లాస్

నీళ్లు తాగించే స్తుంది. ఇవాల్టికి చాలు వెళ్ళిపోదాం అనుకుంటాం.

పక్క వాళ్ళు ఎవరో అరటికాయ బజ్జీ చాలా బాగుంది అంటారు.

పైన బంగారం రంగు గుండె తెరిచి చూస్తే తెలుపు రంగు దానికి

 రుచి తెచ్చే సరుకు నిమ్మరసం చాట్ మసాలా కారం. కథ

 అంతా మామూలే. 


ఆరోగ్య విషయానికొస్తే ఉడికించిన బఠాణి చిరుతిండి చాట్ కి ప్రధానం. బఠానీలో కొవ్వు శూన్యం. బంగారు రంగులో మెరిసిపోతుంది బంగాళాదుంప. మదిని మురిపించే మసాలా చలువచేసే నిమ్మరసం. ఆకలి ఇట్టే తీరుస్తుంది. వెయిట్ లాస్ మాట దేవుడెరుగు. ఈ బండి దగ్గర వెయిటింగ్ అసలు ఉండదు.

ఆ పూటకి కడుపు నిండిందా లేదా. లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుందో మనకు డాక్టర్ గారు చెప్తారు.


 కడుపు నొప్పి వచ్చిందని ఒళ్ళు వెచ్చగా ఉందని డాక్టర్ గారు దగ్గరకు పెడితే ఏం తిన్నారు అని ప్రశ్నిస్తే సిగ్గుపడి సమాధానం చెప్పకుండా నవ్వుతూ దాటవేసే పౌరులు ఎంతోమంది. 


దాన్ని అలా పక్కన పెట్టండి .హమ్మయ్య మన ఆత్మ రాముడు సంతోషించాడు. అప్పుడు గుర్తుకొస్తుంది మనకు ఇంటి దగ్గర ఉన్నవాళ్లు. ఎప్పుడైనా తొందరగా ఇంటికి వెళ్తే స్నాక్స్ తింటారని అడిగితే వద్దని సమాధానం చెప్తాం. ఏం పార్కు దగ్గర ఆగారా ఒక రకమైన ఉక్రోషంతో ప్రశ్నించే శ్రీమతి ,పిల్లలు కి ఒక ఐటమ్ ప్యాకింగ్ చేయించి వాళ్ళని సర్ప్రైజ్ చేసే బంగారు భర్తలు ఎంతమందో.


ఈ చాట్ బండి ప్రేమికుల్లో బాటసారులు సైకిల్ మీద వచ్చేవాళ్ళు స్కూటర్ మీద వచ్చేవాళ్ళు నాలుగు చక్రాల వాహనం మీద వచ్చేవాళ్ళు పెద్దపెద్ద వాహనాలను దూరంగా నిలుపుకొని నడుచుకుంటూ బండి దగ్గరకు వచ్చేవాళ్ళు ఇలా ఎంతమందో.


ఒక స్టార్ హోటల్ లో రుచికరమైన భోజనం తయారు చేసేవారు నాలుగు సంవత్సరములు తర్ఫీదు పొందితే గాని ఆ స్టార్ హోటల్ వంటశాలలోకి ప్రవేశించలేడు. మన బండి వాడి చేతిలో

పట్టాలు ఏమి ఉండవు. అనువంశికంగా నేర్చుకున్న విద్య. పొట్ట పోసుకోవడానికి చేపట్టిన విద్య. బ్రతుకుతెరువు కోసం వెతుకులాడుతుంటే దారి చూపించిన నాలుగు చక్రాల బండి.

తన బ్రతుకు బండి ఆ నాలుగు చక్రాలు బండిమీద నడిపిస్తూ ఉంటా డు. బాస్ కోప్పడతాడనే భయం లేదు. ఆ బండి వాడే బిగ్ బాస్. మనసుకు నచ్చిన దుస్తులు వేసుకోవచ్చు. డ్రెస్ కోడ్ అసలు లేదు. అలసటగా ఉంటే దుకాణం తలుపులు మూసి మూసి వేయొచ్చు. నెలవారీ అద్దెలు లేవు. దళారీలు సంగతి తెలియదు. కరెంటు ఖర్చు లేదు. పనివేళలు ఉండవు. లెక్కలోకి రానీ ఇన్కమ్. ఇంక టాక్స్ ఎక్కడిది. మనకి కాలు కదపాలంటే కారు ఉండాలి. ఈ నాలుగు చక్రాలు బండి చాట్ బండి వాడికి

కడుపు నింపుతోంది. వసూలు కానీ బాకీలు ఉండవు. డబ్బు ఇచ్చి సరుకు తిను ఇది నినాదం. లాభనష్టాలు సంగతి నాకు తెలియదు. అయినా పైకి హ్యాపీగా బతికేస్తున్నాడు ఈ బండి వాడు.

పీ త కష్టాలు పీతవి. కష్టం లేకుండా ఏ పని నడవదు. అందులో

స్వయం ఉపాధి పథకం. రోజు బండి దగ్గర ఆగే ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు మనకేం తెలుసు మనం కస్టమర్లనుకుంటాం. అయినా ఆనందంగా ప్రతిరోజు సాయంకాలం తన కార్యక్రమం ప్రారంభిస్తూనే ఉంటాడు మన బండి వాడు. 


రాత్రి 11 గంటలకుగల్లా పెట్టి లెక్కలు చూసి మిగిలిపోయిన చాట్ గోతిలో పడేసి ఇంటికి ఆనందంగా బండిని తోసుకుని వెళ్ళిపోతాడు. ఇలా ఎన్నో జీవితాలు చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుని ప్రభుత్వ ఉద్యోగాల మీద ఆధారపడకుండా జీవనం సాగిస్తున్నారు.


పండగ నాడు ఇంట్లో పంచభక్ష పరమాన్నాలు ఉన్న పండగ సెలవులకి నగరానికి వచ్చిన యువత ఈ నాలుగు చక్రాల బండి దగ్గర కడుపు నింపుకొని ఆత్మసంతృప్తి పొంది ఇంస్టాగ్రాముల్లోనూ యూట్యూబ్ లో ఫేస్బుక్లో ఆ పదార్థాన్ని పొగిడేస్తూ చదివిన వారికి చూసిన వారికి నోటిలో నీళ్లూరిస్తూ ఆత్మసంతృప్తి పొందుతున్నారు. ఒంట్లో షుగర్ ఉండి ఇంటిలో గరిట తిప్పే వాళ్ళే లేకపోతే పది రూపాయలతో ఆ పలహారం తినే ముసలి వాళ్లు ఎంత మందో. తోటి స్నేహితులతో ఆడ మగ తేడా లేకుండా చెట్టా పట్టాలేసుకుని నవ్వుతూ జోకులు వేసుకుంటూ పక్క ఊర్లో ఉన్న స్నేహితుడికి తన కేరాఫ్ అడ్రస్ చెబుతూ ఆనందంగా కాలక్షేపం చేసే యువత ఎంతోమంది.

వీళ్ళందరికీ సాయంకాలం అడ్డా నాలుగు చక్రాల చాట్ బండి.


నాలుకతో మంచి వంటకం తిన్నా మనితృప్తి. అందమైన సాయంకాలం హాయిగా గడి పా మని మనసుకు తృప్తి. బండి చుట్టూ నిలబడిన కస్టమర్లను చూసి ఇస్తున్న ఆర్డర్లు చూసి కరిగిపోతున్న సరుకు చూసి మన బండి వాడికి ఎక్కడలేని సంతృప్తి. కింద పడేసిన ఆకుల్లో మిగిలిపోయిన చాట్ తిని 

కడుపు నింపుకునే జీవాలను చూసి మనకు తృప్తి . బండి పక్కన స్కూటర్ ఆపే మున్సిపాలిటీ వారిని చూసి బండి వాడి కళ్ళల్లో

మొదట్లో భయం కనబడిన తర్వాత వాళ్ళ పద్ధతులు తెలుసుకొని అలవాటు పడిపోతాడు. ఇది వ్యాపార రహస్యం. చిన్న వ్యాపారమైన పెద్ద వ్యాపారమైన కావలసింది వ్యాపార సూత్రాలు. మెలుకువతో వ్యాపారం చేసి లాభనష్టాలు బే రీజు చేసుకుంటూ ఉండాలి . ఇంతకన్నా చెప్పేదేముంది. ఎదుటివాడిని మోసం చేయకుండా చేసే వ్యాపారం ఏదైనా మంచిదే.


రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు

         కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట