మధ్యతరగతి మహాభారతం_ఆధునికతలో చిక్కుకున్న జీవితం.



ప్రగతిశీల ప్రపంచంలో టెక్నాలజీ రోజురోజుకూ మారుతోంది. ఈ మార్పుల వెనుక మన అవసరాలకన్నా ఎక్కువ ఆశలు పరుగులు తీస్తున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు – తమ స్థాయికి మించి జీవించాలని ప్రయత్నిస్తూ, ఆధునికత అనే మాయా ప్రపంచంలో ఆర్థికంగా చిక్కుకుపోతున్నాయి.

ఒకప్పుడు ఉదయం లేస్తూనే వేప పుల్లదంత ధావనం ప్రారంభమైన దినచర్య ఇవాళ రకరకాల బ్రష్షులు మార్కెట్లోకి వచ్చాయి. టూత్ పేస్ట్ లు అందుబాటులోకి వచ్చాయి. పంటి సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు పలానా టూత్ పేస్ట్ మీరు వాడండి అoటు సిఫార్సులు కూడా ప్రారంభమయ్యాయి.  

దొడ్లోని బావి దగ్గర చేదతో నీళ్లు తోడు పోసుకుని శరీరం శుభ్రం చేసుకుని స్థాయి నుంచి బాత్రూములలో అనేక రకాలైన సబ్బులు మరియు ఆ బాత్రూం క్లీన్ చేయడానికి రకరకాల పరికరాలు లోషన్లు మరుగుదొడ్లు క్లీన్ చేయడానికి రకరకాల బ్రష్లు, లోషన్లు ఇవన్నీ కూడా ప్రతినెల మధ్యతరగతి దిగువ మధ్యతరగతి జీవితాల ఆర్థిక పరిస్థితి మీద విపరీతమైన ప్రభావం చూపిస్తున్నాయి.

ఇక శరీర అలంకరణ సామాగ్రి, బట్టలు, కాళ్ళకి తలకి అలంకరణ ఇలా ఒకటేమిటి బయటకి ఉద్యోగానికి వెళ్లే మానవుడికి అన్నీ పెట్టుబడులే. 

స్మార్ట్‌ఫోన్... స్మార్ట్ జీవితం?
ఒకప్పుడు ఫోన్ ఉండడం విశేషం, ఇప్పుడు 5జీ ఫోన్ లేకపోతే మనిషే కాదు అన్నట్టుగా మారింది. ప్రతి రెండేళ్లకో కొత్త మోడల్, మెరుగైన కెమెరా, మెమొరీ, డిస్‌ప్లే పేరుతో ఫోన్లు మారుస్తూ లక్షల రూపాయల్ని ఖర్చు చేస్తున్నాం. కాని వాటి వాడకం – కాల్, వాట్సాప్, ఫోటో తీసుకోవడం మాత్రమే. అవసరమో లేదో తెలుసుకోకుండా “అవకాశం ఉంది కదా” అనే తత్వంతో కొనుగోలు.

EMI – ఆరంభంలో ఆనందం, అనంతరం ఆగమనం
ఇంటి నుంచి కారువరకు, ఫ్రిజ్ నుంచి టీవీ వరకు ప్రతిదీ EMI పద్ధతిలో వస్తోంది. నెలకు కాస్త ఎక్కువ వేతనం వచ్చిందంటే వెంటనే కొనుగోలు. కానీ ఆ వడ్డీ భారం, మాసవారీ ఇన్‌స్టాల్‌మెంట్‌లు అనుకున్నంత సులువుగా ఉండవు.
 కొంతకాలానికే ఆ భారం జీవన శైలిని మింగేస్తుంది.

ఆన్‌లైన్ షాపింగ్ – అవసరమా, ఆకర్షణా?
ఇంటర్నెట్‌లో వచ్చిన ఆఫర్లు మనసు కుదిపేస్తున్నాయి. “బై 1 గెట్ 2”, “బిగ్ బిలియన్ డేస్” వంటి మార్కెటింగ్ మాయాజాలంలో పడిపోయి అవసరం లేని వస్తువుల్ని కొనడం నిత్యకృత్యంగా మారింది.
 దానికి తోడు క్రెడిట్ కార్డు వాడకం – కొంతకాలానికి చెల్లింపుల ఒత్తిడితో విలవిలలాడే పరిస్థితి. ఒకప్పుడు చేతి గుడ్డ పెట్టుకుని ఇంటికి తడి బట్ట పెట్టేవారు. అట్లాంటిది రోజుల్లో తడిబట్ట పెట్టడానికి రకరకాల సాధనాలు వచ్చేసాయి ,వస్తున్నయి కూడా. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ లో ఈ పరికరాలు చూసి మోజుకొద్ది కొనేస్తున్నారు. 

పిల్లల కోసం ఆధునిక వినోదం

పిల్లల చదువుపేరుతో ట్యాబ్లెట్, ఆన్‌లైన్ కోర్సులు, రోబోటిక్ టాయ్స్… ఇలా ఎన్నో ఖర్చులు. ఇతర పిల్లలతో పోల్చే తల్లిదండ్రుల తత్వం వల్ల అవసరం లేనివి కొనాల్సి వస్తోంది. దీనివల్ల కుటుంబ బడ్జెట్ పాడవుతుంది.

OTT, సబ్స్క్రిప్షన్ల ఊబిలో మధ్యతరగతి

ఒకప్పుడు టీవీ చూడడo తోటే సరిపెట్టుకునేవారు 
. ఇప్పుడు Netflix, Prime, Hotstar, YouTube Premium – ఇలా 4–5 OTTలకూ నెలసరి చందాలు. వాటిని పూర్తిగా వినియోగించకపోయినా – “వాళ్లందరూ చూస్తున్నారు కదా!” అన్న మనస్తత్వంతో కొనసాగించటం.

బ్రాండెడ్ జీవితం – అసలు లక్ష్యం మరవడం
బ్రాండెడ్ దుస్తులు, షూస్, మొబైల్, వాచీలు – ఇవన్నీ ఒక రకమైన స్టేటస్ సింబల్‌లుగా మారాయి. “మనవాళ్లతో సమానంగా ఉండాలి” అనే తాపత్రయం కుటుంబ ఖర్చులను చుట్టేస్తోంది.

ఆరోగ్య భద్రతల పేరుతో ఖర్చులు
ఫిట్‌నెస్ ట్రాకర్స్, స్మార్ట్ వాచ్‌లు, వర్కౌట్ యాప్‌లకు చందాలు – ఇవన్నీ ఆరోగ్యంగా ఉండాలనే మంచి ఉద్దేశంతో మొదలయినప్పటికీ, అవి అలవాటు కావడం వల్ల నెలవారీ ఖర్చులుగా మారుతున్నాయి.

గేటెడ్ కమ్యూనిటీల గమ్మత్తు – గదిలో బంధనమా?
నగరాల్లో మధ్యతరగతి కుటుంబాలు “ఫ్లాట్ తీసుకుంటే భవిష్యత్తుకు మేలంటూ” పెద్దగా అప్పులు చేసి కొనుగోలు చేస్తున్నారు. అయితే గేటెడ్ కమ్యూనిటీ పేరుతో వచ్చే మెయింటెనెన్స్ ఛార్జీలు, గార్డెనింగ్, జిమ్, క్లబ్ హౌస్ ఖర్చులు నెలనెలా పెరుగుతున్నాయి.

ఇవన్నీ అలా ఉంచితే ప్రతినిత్యం వాడే ఏసీలు , గీజర్లు, వాషింగ్ మిషన్లు ,వాటర్ ఫిల్టర్లు , ఎలక్ట్రికల్ సామాన్లు, పని చేసినంత కాలం బాగానే ఉంటుంది. ఒక్కసారి రిపేర్ వచ్చింది అంటే ఖర్చులు విపరీతంగా ఉంటున్నాయి. ప్రతి వస్తువుకి యాన్యువల్ మెయిన్ చార్జెస్ కడుతుంటారు. ఇవి కూడా మన సొమ్ము అనవసరంగా ఖర్చు పెట్టినట్లే. 
దానికి తోడు ఒక ఎయిర్ కండిషనర్ ని తీసుకుంటే కనీసం రెండు సంవత్సరాలకు ఒకసారి అయినా గ్యాస్ పోతుంది. అది మార్చాలంటే ఐదు వేలు వరకు చార్జి వసూలు చేస్తున్నారు. అది కాకుండా మెకానిక్ చార్జీలు. ఇలా నాలుగు చక్రాలు వాహనం రెండు చక్రాల బండి వీటిని ఆరు నెలలకు ఒకసారి కనీసం సర్వీసింగ్ చేయించుకోవాలి. ఇది కూడా మన జేబుకు చిల్లు. మన ఖర్చులకు తగినట్లుగా ఆదాయం లేకపోతే అనవసరమైన మానసిక అశాంతి. ఇది ప్రస్తుతం మధ్య తరగతి మహాభారతం

ఉపసంహారం

సాంకేతికత అభివృద్ధి చెయ్యాలే కానీ, మన జీవితాలను మింగేస్తూ ముందుకు పోవడం మంచిదేనా? మధ్యతరగతి కుటుంబాల సాదా జీవితం ఇప్పుడు ఆధునిక మాయాజాలంలో చిక్కుకుని ఆర్థిక సంక్షోభాలకు లోనవుతోంది. మన అవసరాలను తెలుసుకొని, సామర్థ్యానికి తగ్గట్టు ఖర్చు చేయడం నేర్చుకుంటేనే సరికొత్త జీవితం సరైన దిశలో నడుస్తుంది.

సాంకేతికత మన జీవనశైలిని సులభతరం చేయడానికి ఉపయోగించాలి. ఆకర్షణలకు బానిసలుగా మరి ఆర్థిక సంక్షోభంలో పడకూడదు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట