మరో తిరుపతి
తిరుపతి అనగానే ముందు మనకు గుర్తుకు వచ్చేది చిత్తూరు జిల్లాలోని పెద్ద తిరుపతి. అది కాదంటే ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుమల గుర్తుకొస్తుంది. ఒకటి పెద్ద తిరుపతి, రెండోది చిన్న తిరుపతి.
పెద్ద తిరుపతిలో వెలిసిన స్వామిని దర్శించాలంటే ఏడుకొండలు ఎక్కవలసిందే. ద్వారకుడు అనే భక్తుడి కోరిక మేరకు స్వామి చిన్న తిరుపతిలో కొలువై ఉన్నాడు.
ఏడుకొండలు ఎక్కలేని వారు చిన్న తిరుపతిలో స్వామిని దర్శించి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు.
సప్తగిరులు ఎక్కినా, ద్వారకా తిరుమల స్వామిని దర్శించినా, "గోవిందా!" అని పిలిస్తే స్వామి భక్తుల మొర ఆలకిస్తూ ఉంటాడు. అంత మహిమ గలవి ఈ రెండు పుణ్యక్షేత్రాలు.
అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లా, ఇప్పుడు కాకినాడ జిల్లాలోని పెద్దాపురం మండలం చదలవాడ గ్రామంలో మరో తిరుపతి కూడా ఉంది.
ఇక్కడ శ్రీ శృంగార వల్లభ స్వామి దేవాలయం ఉంది. ఈ దేవాలయం సుమారు తొమ్మిది వందల సంవత్సరాల క్రితం నిర్మించబడినట్లు అక్కడి సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అందుకేనేమో ఈ ప్రాంతాన్ని "తొలి తిరుపతి" అని అందరూ పిలుస్తారు.
ప్రతి పుణ్యక్షేత్రం వెనుక ఒక చారిత్రక కథ ఉంటుంది. అది కథగా మనం చెప్పుకుంటున్నాం కానీ, అది కాలం ఒడిలో మరుగున పడిపోయిన నిజం.
రాజు ఉత్తానపాదుడికి ఇద్దరు భార్యలు — సునీతి, సురుచి. సునీతి కుమారుడు ధ్రువుడు. సురుచి కుమారుడు ఉత్తముడు.
ఒక రోజు ధ్రువుడు తన తండ్రి ఒడిలో కూర్చోవాలని వెళ్లాడు. కానీ సురుచి అతడిని అడ్డుకుని ఇలా అంది:
"నా కడుపున పుట్టలేదు కాబట్టి రాజు ఒడిలో కూర్చునే అర్హత నీకు లేదు. భగవంతుడిని ప్రార్థించి నా కుమారుడిగా పుట్టిన తర్వాతే ఆ స్థానం పొందగలవు."
ఆ మాటలు ధ్రువుని చిన్న మనసును చాలా బాధించాయి. ఏడుస్తూ తల్లి సునీతి దగ్గరకు వెళ్లాడు.సునీతి ఇలా చెప్పింది:
"నాయనా! ఈ లోకంలో అందరికంటే గొప్పవాడు మహావిష్ణువు. ఆయన్ని ప్రార్థించు. ఆయనే నీకు దారి చూపుతాడు."
అప్పుడు ఐదేళ్ల చిన్నవాడైన ధ్రువుడు అడవికి వెళ్లి భగవంతుని కోసం తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు.
మార్గమధ్యలో నారద మహర్షి కనిపించాడు.
ధ్రువుడి సంకల్పాన్ని తెలుసుకుని "ఓం నమో భగవతే వాసుదేవాయ" అనే మంత్రాన్ని ఉపదేశించాడు.
ధ్రువుడు ఘోర తపస్సు ప్రారంభించాడు. మొదట పండ్లు తిన్నాడు. తర్వాత ఆకులు మాత్రమే తీసుకున్నాడు. చివరకు ఆహారం, నీరు కూడా మానేసి ధ్యానంలో మునిగిపోయాడు.
ఆరు నెలల ఘోర తపస్సు తర్వాత మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. కానీ ధ్రువుడు ఆయన దివ్య తేజస్సును తట్టుకోలేక కళ్లు తెరవలేకపోయాడు.
అప్పుడు మహావిష్ణువు కరుణతో తన శంఖాన్ని ధ్రువుడి చెంపకు తాకించాడు. వెంటనే ధ్రువుడికి దివ్యజ్ఞానం కలిగింది.
మహావిష్ణువు అడిగాడు:"ధ్రువా! ఏ వరం కావాలి?"
దానికి బదులుగా ధ్రువుడు ఇలా అన్నాడు:"స్వామీ! నాకు మీ భక్తి తప్ప మరేమీ వద్దు."
ధ్రువుడి అచంచల భక్తికి సంతోషించిన మహావిష్ణువు అతనికి శాశ్వత కీర్తిని ప్రసాదించాడు.భగవంతుడు తనను భక్తుడు ఎంతగా కోరుకుంటాడో, అంత రూపంలో దర్శనం ఇస్తానని వరం ఇచ్చాడని చెబుతుంటారు. ఆ దర్శనం జరిగిన స్థలమే తొలి తిరుపతి అని చెబుతారు.
చాలా స్థల పురాణాలు భక్తి, విశ్వాసం, స్థానిక సంప్రదాయం, పురాణ కథల ఆధారంగా తరతరాలుగా వినిపిస్తూ ఉంటాయి.
ఇక్కడ స్వామి ఎప్పుడూ నవ్వుతూ ఉన్నట్లుగా కనిపిస్తాడు. అందుకే "శృంగార వల్లభ స్వామి" అని పిలుస్తారు.తూర్పు చాళుక్యుల కాలంలో ఈ ఆలయం ద్రావిడ శైలిలో నిర్మించబడినట్లు తెలుస్తోంది.
ద్రావిడ శైలి అంటే దేవాలయ ప్రవేశద్వారం వద్ద ఎత్తైన గోపురం, గర్భగుడి పైన పిరమిడ్ ఆకారంలో పైకి ఎగురుతూ ఉండే విమానం, ప్రధాన దేవత ఉండే గర్భగుడి, ఉత్సవాలు లేదా భక్తులు కూర్చునేందుకు మండపం, దేవాలయం చుట్టూ ప్రాకారాలు, రాతి మీద చెక్కబడిన అద్భుతమైన శిల్పకళ — ఇవన్నీ కలిపి ద్రావిడ శైలి అంటారు. భారతదేశంలో దక్షిణాది ప్రాంతంలోని దేవాలయాలు ప్రధానంగా ద్రావిడ శైలిలోనే నిర్మించబడ్డాయి.ఈ దేవాలయంలో శ్రీ శృంగార వల్లభ స్వామి, శ్రీదేవి–భూదేవి సమేతుడై కొలువై ఉంటాడు.వైష్ణవ సంప్రదాయం ప్రకారం పూజాదికాలు నిర్వహిస్తారు.గర్భగుడిలో ఉన్న స్వామిని దర్శించాలంటే ఏడు ద్వారాలు దాటి వెళ్లవలసి ఉంటుంది
ఇక్కడ అద్భుతమైన శిల్ప–వాస్తు రహస్యం ఉంది.
బహుశా ఏ దేవాలయంలోనూ ఇలాంటిది ఉందని వినలేదు. ధ్వజస్తంభం దగ్గర నిలబడి స్వామిని చూస్తే, భక్తుడి ఎత్తుకు సరిపడినట్లుగా స్వామి కనిపించడం ఒక ముఖ్య విశేషం.
సాధారణంగా వెంకటేశ్వర స్వామి కుడి భుజం వైపు సుదర్శన చక్రం, ఎడమ భుజం వైపు పాంచజన్యం అనే శంఖం ఉంటాయి. కానీ ఈ స్వామికి అందుకు భిన్నంగా శంఖు–చక్రాల స్థానాలు మారి ఉంటాయి.
ఆలయంలో ఉండే బావి మూడు వందల అరవై ఐదు రోజులు నీటితో ఉంటుందని చెబుతారు. సాధారణంగా బావులు ఎండాకాలంలో ఎండిపోతుంటాయి కదా! సంతానం లేనివారు ఈ బావిలో స్నానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని ఒక నమ్మకం.
ఈ ఆలయంలో చాలా ప్రాచీన శిలా శాసనాలు ఉన్నాయి. పూర్వకాలంలో రాజులు, పాలకులు, దేవాలయ నిర్వాహకులు ముఖ్యమైన విషయాలను రాళ్లపై చెక్కించి వాటిని భవిష్యత్ తరాలకు అందించేవారు. వాటిని శిలా శాసనాలు అంటారు.
ఈ శిలా శాసనాల్లో రాజుల పేర్లు, వంశ చరిత్ర, యుద్ధ విజయాలు, దేవాలయ నిర్మాణ విషయాలు, భూమి దానాలు వంటి వివరాలు పొందుపరుస్తారు. ప్రాచీన చరిత్రను తెలుసుకోవడానికి చరిత్రకారులకు ఇవి ముఖ్యమైన ఆధారాలు.
ఈ దేవాలయం ఉత్తర భాగంలో 27 నక్షత్రాలకు గాను 27 వృక్షాలు ఉన్న మండపం ఉంది. దానిని నక్షత్ర మండపం అంటారు.
ఇక్కడ క్షేత్రపాలకుడు పరమశివుడు. ఈ ప్రాంతాన్ని, భక్తులను కాపాడేది పరమశివుడు. కోరిన కోరికలు తీర్చేది శృంగార వల్లభుడు.ఇంక భక్తులకు చింత ఏముంది? క్షేత్ర సందర్శనం చేస్తే అన్ని సమస్యలు తీరిపోతాయనేది ఒక నమ్మకం.
ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ ఏకాదశి నాడు స్వామివారి దివ్య కళ్యాణం జరుగుతుంది. ఆరు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు.
ఇంకా బ్రహ్మోత్సవాలు, ధనుర్మాస పూజలు, వసంతోత్సవం, కార్తీకమాస విశేష పూజలు ప్రత్యేకంగా నిర్వహిస్తారు.
ప్రతి శనివారం, ఏకాదశి పర్వదినాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.
"శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు" అంటారు. అలాగే భగవంతుని అనుగ్రహం లేకపోతే ఈ పుణ్యక్షేత్ర దర్శనం జరగదు.
ఏ పుణ్యక్షేత్రమైనా అంతే. భగవంతుని అనుగ్రహం ఉండి, చూసే యోగం ఉంటే రవాణా సౌకర్యాలకు కొదవలేదు.
దూర ప్రాంతవాసులకు దగ్గరగా ఉన్న సామర్లకోట రైల్వే స్టేషన్ నుంచి ఆటోలు చాలా ఉంటాయి. పెద్దాపురం వరకు బస్సు సౌకర్యం ఉంది. రాజమండ్రి విమానాశ్రయం సుమారు యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది.
భక్తి, చరిత్ర, శిల్పకళ, స్థల పురాణం అన్నీ కలిపిన పవిత్ర క్షేత్రం చదలవాడ శ్రీ శృంగార వల్లభ స్వామి వారి ఆలయం.
తప్పక దర్శించవలసిన దేవాలయం.
ఆ నవ్వు చూస్తే చాలు మనసు ప్రశాంతం అవుతుంది. భక్తి పరవశిస్తుంది. బాధలన్నీ మరిచిపోతాం. భయాలను విడిచి పెట్టేస్తాం. మనసు గోవింద నామాన్ని జపిస్తుంది. అది స్వామివారి మహిమ.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి