చద్దన్నం

చద్దన్నం – పల్లె జీవన శైలిలో ఒక పోషక సంపద

అవును, అది కేవలం అల్పాహారం కాదు. అది ఒక జీవనశైలి. ఒక సంప్రదాయం. ఒక ఆరోగ్య రహస్యం కూడా!

ఒకప్పుడు గ్రామీణ జీవన శైలిలో ఉదయాన్నే అందరూ తీసుకునే ఆహారం చద్దన్నం. అప్పటి రోజుల్లో కాఫీలు టీలు టిఫిన్లు ఉండేవి కాదు. ఇవి ఉన్నప్పటికీ కొంతమందికి చద్దన్నం తింటే కానీ ఆకలికి ఆగలేకపోయేవారు. ముఖ్యంగా ప్రతి రైతు వంటింట్లో ఒక గిన్నెలో చద్దన్నం, దాని పక్కనే ఉల్లిపాయ ముక్కలు, నంచుకోవడానికి మెంతికాయి లేదా మాగాయి లేదంటే ఏదో ఒక ఊరగాయ తప్పనిసరిగా ఉండి నోరూరించేవి.

చద్దన్నం అంటే నిన్నటి ఉడికిన అన్నాన్ని నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయాన చల్లగా తీసుకునే ఆహారం. వేసవి మండుటెండలో పొలంలో పని చేసి వచ్చే రైతుకి ఇది ప్రాణదాయకం. శరీరాన్ని చల్లబరుస్తుంది. అలసటను తగ్గిస్తుంది. ఆకలి తీర్చడమే కాదు, శక్తిని కూడా ఇస్తుంది.

ఇది పేదల ఆహారంగా పరిగణించబడినప్పటికీ, చద్దన్నంలో దాగిన ఆరోగ్య విలువలు అనేకం. నానబెట్టిన అన్నంలో ఫెర్మెంటేషన్ వల్ల బీ-విటమిన్లు (B vitamins), ముఖ్యంగా బీ-12 అభివృద్ధి అవుతాయి. 
ఇవి జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తాయి. అంతేగాక, ప్రోబయోటిక్స్‌ ద్వారా పేగులకు అవసరమైన మంచి సూక్ష్మజీవులు అందుతాయి. ఇవి నేచురల్‌ కూలెంట్లాగా పని చేస్తాయి.

చద్దన్నంతో పాటు వచ్చే మజ్జిగ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మెంతికూర లేదా చింతపండు చట్నీ... ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మేలు చేసే సహజ పదార్థాలే. ఇవి ఆహారాన్ని రుచిగా చేసే తోడు, శరీరానికి తేమనివ్వడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

ఈ తరహా సంప్రదాయ ఆహారాలను మనం మరిచిపోతున్నాం. ప్యాకెట్లలో వచ్చే ఫాస్ట్‌ఫుడ్‌కు బానిసలమవుతున్నాం. కానీ చద్దన్నం లాంటి వంటకాలే మనకు శాశ్వత ఆరోగ్యం అందించే పాతకాలపు పాఠాలు. ఇవి కేవలం తిండి కాదు. ఇవి అనుబంధాల ప్రతీకలు. ఇంటి పెద్దలు పిల్లలతో కలిసి తినే సంస్కృతిని సూచించే చిన్న భోజన వేళలు.

ఒక చిన్న గిన్నె చద్దన్నంలో... ఆరోగ్యం ఉంది, ఆనందం ఉంది, ఆత్మీయత ఉంది. అలాంటి సంపదను మళ్లీ మన జీవనశైలిలోకి తీసుకురావాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట