జానకమ్మ


ఇల్లంతా పెళ్లి సందడితో హడావుడిగా ఉంది. పందిట్లో సన్నాయి మోగుతోంది. పెరడంతా పందిళ్లతో, పందిళ్లు తోరణాలతో మెరిసిపోతున్నాయి. బంధువులు ఒక్కొక్కరు రావడం మొదలైంది. వచ్చిన బంధువుల్ని, స్నేహితుల్ని ఒక నలభై ఐదు ఏళ్ల స్త్రీ, “రండి… రండి…” అని ఆప్యాయంగా పలకరిస్తూ టిఫిన్ టేబుళ్ల ముందు కూర్చోబెట్టింది. వడ్డన ప్రారంభమైంది.


“ఇదిగో ఇంకొక ఇడ్లీ వేసుకోండి… మరో వడ వేసుకోండి… మా ఇందుపల్లి వాళ్ల వంటలు చాలా బాగుంటాయి…” అంటూ కొసరి కొసరి వడ్డిస్తూ హడావుడిగా అటూ ఇటూ తిరుగుతోంది.

ఇంతలో ఎవరో, “బీరువా తాళాలు ఎక్కడ పెట్టావ్, జానకమ్మ?” అని గట్టిగా అరిస్తుంటే,“ఇదిగో… మీరు పారేస్తారని నేను పట్టుకుని తిరుగుతున్నాను,” అంటూ తాళాలు అందించి మళ్లీ టేబుల్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది.


అందరూ టిఫిన్లు పూర్తి చేయడంతో,“టిఫిన్లు పూర్తయ్యాయి… కాఫీలు ఇవ్వండి,” అంటూ వంట బ్రాహ్మణులకు ఆజ్ఞలు జారీ చేసింది.కాఫీలు తాగిన తర్వాత,


“ఎదురింటి కరణం గారింట్లో మీ అందరికీ బస ఏర్పాటు చేశాం. అక్కడికి వెళ్దాం, పదండి. మీ సామానంతా మా వాళ్లు తీసుకువస్తారు,” అంటూ ముందుకు దారి తీసింది.

అప్పటికే అక్కడ హాలంతా పరుపులు పరిచి ఉన్నాయి. హాలులో ఒక మూల పెద్ద గుండిగతో మంచినీళ్లు పెట్టి ఉన్నాయి.

“కాఫీలు మరొకసారి తాగాలని ఉంటే కబురు పెట్టండి… పంపిస్తాను,” అంటూ గబగబా చెప్పి మరోసారి ఏర్పాట్లు అన్నీ చూసుకుని బయటకు వెళ్లడానికి సిద్ధమవుతుండగా, ఎవరో అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి,

“జానకి మామ్మ… పెళ్లివారు వచ్చేస్తున్నారట. అమ్మ చెప్పమంది,” అంటూ చెప్పి పారిపోయింది.


“అయ్యో! పెళ్లివారు వచ్చేస్తున్నారట… హారతి పళ్లెం రెడీ చేయాలి,” అనుకుంటూ జానకమ్మ కూడా హడావుడిగా బయలుదేరింది.


పెళ్లికొడుకుని చూద్దామని నేను కూడా మళ్లీ పెళ్లివాళ్ల ఇంటికి వచ్చాను. అక్కడ కూడా జానకమ్మ సందడే. పెళ్లికూతురు తల్లికి వెనక నుంచి సలహాలు ఇస్తూ అందరినీ మర్యాదగా ఆహ్వానించారు. ఏ సమయానికి ఏం చేయాలో అన్నీ దగ్గరుండి ఒకటి రెండు సార్లు సరిచూసుకుని, పాత పద్ధతిలో మర్యాదలు అవి చేయించింది.


నిజమే… మర్యాదలు తెలియడం కూడా ఒక కళ. అది ఇలా పదిమంది కలుసుకునే ఇలాంటి చోట రక్తికట్టించే వాళ్లు ఉండడం ఒక అదృష్టం.


పెళ్లివారు విడిదిలోకి తరలి వెళ్లారు. కాఫీ కావిడీ, టిఫిన్ కావిడీ వెనక నుంచి వస్తుంటే, ముందు జానకమ్మ పెళ్లికూతురు తల్లి తండ్రిని తీసుకుని విడిదిలోకి వెళ్లింది. అక్కడ కూడా జానకమ్మ విశ్వరూపం మామూలే. ఆడపిల్ల వారి మర్యాదలకు మగపెళ్లివారి మొహాలు వెలిగిపోయాయి.


విడిదిలో నుంచి వెళ్లేముందు సంచిలోంచి రెండు పేక కట్టలు తీసి,

“ఎవరైనా ఆడుకునే వాళ్లు ఉంటే వాళ్లకి ఇవ్వండి,” అంటూ పెళ్లికొడుకు తండ్రికి అందించింది జానకమ్మ.ఆ పేకలను చూడగానే పెళ్లికొడుకు తండ్రి మొహంలో వెలుగు చూసి,

“మా అమలాపురం వాళ్లతో సంబంధం కలుపుకునే వాళ్లు పేకాట ఆడకుండా ఎలా ఉంటారు!” అంటూ నవ్వుతూ బయటికి నడిచింది.


ఈ మధ్యకాలంలో పెళ్లిలో మర్యాదలు మర్చిపోయారు. జానకమ్మకి ఎవరికి ఎలాంటి మర్యాద ఇవ్వాలో, ఎవరి చేత ఇప్పించాలో అన్నీ బాగా తెలుసు.


పెళ్లికూతురు తల్లి ,తండ్రిని తీసుకుని విడిది ఇంట్లోకి వెళ్లి ప్రతి ఒక్కరికి బొట్టు పెట్టి మధ్యాహ్న భోజనానికి పెళ్లివారిని, బంధువులను గౌరవంగా పిలిపించింది. అందులోనూ ఆరేళ్ల పసిపాప నుంచి అరవై ఏళ్లు దాటిన వాళ్లందరికీ ఒకటే మర్యాద.


కోనసీమ పెళ్లి… బంతి భోజనాలు… కొసరి కొసరి వడ్డింపులు… బంతి ప్రారంభంలో గోవింద నామస్మరణ… వంట రుచి చెప్పక్కర్లేదు. మధ్యలో చలోక్తులు — ఇంకేముంది! ఆడపెళ్లివారు, మగపెళ్లివారు అనే తేడా లేకుండా కలిసి మెలిసి భోజనాలు చేశారు.


అందంగా పళ్లెంలో అమర్చిన తమలపాకులు, సున్నం, వక్కపొడి తీసుకుని నోరు పండించుకుని విడిదికి తరలి వెళ్లారు మగపెళ్లివారు, బంధువులు, స్నేహితులు.ఏ మాట రాకుండా మొదటి పూట భోజనాలు పూర్తయ్యాయని ఆనందపడుతూ పెళ్లికూతురు తల్లి తండ్రి, జానకమ్మ, వంట బ్రాహ్మణులు కలిసి భోజనం చేశారు.


“జానకమ్మ గారు, రాత్రి వంటకాలు ఏమిటి? ఇప్పుడే చెప్పండి. రాత్రి పెళ్లికి చాలా మంది వస్తారు. భోజనాలు కూడా చాలామందికి ఉంటాయి,” అని వంట బ్రాహ్మణులు అడిగితే, పర్సులో నుంచి లిస్ట్ తీసి వాళ్లకు సూచనలు ఇచ్చింది.


ఒక్క క్షణం వీధిలోకి తొంగి చూసి,

“ఎవరైనా భోజనాలు చేయకుండా మిగిలిపోయారా?” అని అడిగి తెలుసుకుంది.


ఈరోజుల్లో డబ్బు ఖర్చు పెడుతున్నారు; కానీ గౌరవ మర్యాదలు అంటే తెలిసిన వాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారు.


సాయంకాలం ఎదురు సన్నాహాల కార్యక్రమం ఒక వేడుకగా నిర్వహించింది జానకమ్మ. ఎక్కడా పెళ్లివారికి కోపతాపాలు గానీ, మర్యాదల లోపాలు గానీ జరగకుండా ముందుండి పాతతరం చేసే పెళ్లిలా పెళ్లి పూర్తి చేయించింది. సరదాలకు సరదాలు, పాటలు, పద్యాలు — ఒకటి కాదు — ఆ రాత్రి ఆనందంగా గడిచిపోయింది.

అప్పగింతల కార్యక్రమంలో,

“నిన్నటి వరకు ఈ పిల్ల మా గుండెల మీద ఆడుకున్నట్టే ఉంది… అప్పుడే ఓ ఇంటిదైపోయింది…” అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది జానకమ్మ.

ఆమెకు ఒక్కసారిగా తన పెళ్లి రోజు గుర్తొచ్చింది — ఆ పందిరి… ఆ సన్నాయి… తన తండ్రి కళ్లలోని గర్వం… గోదావరి గాలిలో ఊగిన తన జడ…

తర్వాతి క్షణమే — ఆ గోదావరి ప్రవాహంలో తన జీవితము కొట్టుకుపోయింది.

కానీ ఈరోజు…

పెళ్లికూతురు తల్లి ఆమె చేతులు పట్టుకుని,

“అక్కా… మా అమ్మాయి పెళ్లి ఇలా అందంగా జరగడానికి మీరు కారణం. మీరు మా ఇంటి పెద్దలలో ఒకరు,” అంది.

ఆ మాట విన్న జానకమ్మ ఒక్క క్షణం స్థబ్దురాలైంది. ఇంతవరకు అందరికీ సేవ చేసిన ఆమెను మొదటిసారి ఎవరో కుటుంబ సభ్యురాలిగా గుర్తించారు.

అప్పుడే మగపెళ్లివారు వెళ్లే ముందు పెళ్లికొడుకు తండ్రి ముందుకు వచ్చి,

“సత్యనారాయణ వ్రతానికి మీరు తప్పకుండా రావాలి. మా ఇంటి మొదటి ఆహ్వానం మీకే,” అన్నాడు.

అది ఆహ్వానం కాదు… ఆమెకు ఇచ్చిన గౌరవ పత్రం.

పెళ్లి పూర్తయింది. అతిథులందరూ వెళ్లిపోయారు. పందిరి ఖాళీ అయింది.

పెళ్లికొడుకు తండ్రి తన వియ్యంకుడు భుజం మీద చేయి వేసి,

“పెళ్లి బాగా చేశారు. మర్యాదలు మేము అనుకున్న దాని కంటే ఎక్కువగా ఉన్నాయి. మాకు చాలా సంతృప్తిగా ఉంది. చాలా రోజుల తర్వాత మంచి భోజనం తిన్నాం. అందులోనూ అరిటాకు వేసి వడ్డించిన భోజనం — చాలా ఆనందంగా ఉంది,” అని చెప్పాడు.

అది వింటూ పెళ్లికూతురు తండ్రి కళ్ళు దూరంగా నిలబడి ఉన్న జానకమ్మ వైపు కృతజ్ఞతగా చూశాయి.

“మీకు పదిమంది బలగం ఉంది,” అన్నప్పుడు,

‘పదిమంది కాదు… ఒక్కరే. ఆ ఒక్కరే పదిమంది,’ అనుకున్నాడు మనసులో పెళ్లికూతురు తండ్రి.

ఆ రాత్రి జానకమ్మ ఒంటరిగా ఆ పందిరి మధ్య నిలబడి చూసింది — చెదిరిపోయిన పూలదండలు… నిశ్శబ్దంగా వేలాడుతున్న మామిడాకులు…

అప్పుడే పెళ్లికూతురు తండ్రి వచ్చి ఆమె పాదాలకు నమస్కారం చేశాడు.

“అమ్మా… మీరు లేకపోతే పెళ్లి ఇలా జరిగేది కాదు. మీరు నాకు అమ్మలాంటివారు. ఆడపిల్ల పెళ్లి అందంగా చేయాలని ఎప్పటినుంచో కలలు కన్నాను. దేవుడికి మొక్కుకున్నాను. ఇదిగో ఈ సీతమ్మ తల్లి రూపంలో నాకు సహాయం చేశాడు,” అన్నాడు.

ఆ మాట విన్న జానకమ్మ కళ్లలో ఆనందబాష్పాలు జారాయి. ఆమెకు ఒక్కసారిగా అర్థమైంది — తన జీవితంలో కోల్పోయింది ఒక్క కుటుంబమే; కానీ సంపాదించింది ఎన్నో కుటుంబాలు.

“ఎవరండీ… ఆవిడ చాలా చలాకీగా పనులన్నీ చేస్తున్నారు. మీ బంధువా?” అని ఎవరో పెళ్లికూతురు తల్లిని అడిగితే,

“అవసరానికి ఆదుకునే ఆపద్బాంధవురాలు. ఎవరూ లేని ఏకాకి. తన మంచితనంతో అందరితో బంధుత్వాలు కలుపుకుని జీవించే మనిషి. గుండెలోని బాధను ఎవరికీ చెప్పకుండా, ఆ బాధ మర్చిపోవడానికి మనసుకు నచ్చిన పని చేసుకునే మహనీయురాలు,” అని చెప్పింది.

ఆ మాటలకు జానకమ్మ నవ్వుకుంది.

“నేనేం పెద్ద ఉపకారం చేయలేదు. నాకు తెలిసిన విషయాన్ని అందరికీ సలహాలు ఇచ్చి సహాయం చేశాను. అంతే కదా… దానికి ఎందుకంత పెద్ద బిరుదులు?” అనుకుంది.

కాదు… ఈ బిజీ ప్రపంచంలో మనిషి ఒకరికొకరు సహాయం చేసుకునే స్థితిలో లేని పరిస్థితిలో, పెళ్లి వంటి పెద్ద కార్యక్రమాలలో కన్యాదాతకు అందంగా పాత పద్ధతుల్లో పెళ్లి జరిపించడానికి సహాయం చేసే జానకమ్మలాంటివాళ్లు ఎవరుంటారు చెప్పండి?

ఈ రోజుల్లో అందరూ ముహూర్తం సమయానికి వచ్చి వెళ్లిపోయే బంధువులే గాని, ఎవరికి సహాయం చేయగల శక్తి గానీ, స్తోమత గానీ, సమయం గానీ లేదు. ఒకప్పుడు అది చాలా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో జానకమ్మ లాంటి వ్యక్తులు కోనసీమలో ఉండడం అందరి అదృష్టం.


రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు 

కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

సామర్లకోట

కుటుంబం