మాటలు రాని స్నేహితుడు


అదొక అందమైన సుందర నగరం. ఒకప్పుడు పదవీ విరమణ చేసిన వాళ్లు, “శేష జీవితం ఇక్కడే గడపాలి రా!” అని అనుకునే వాళ్లు. అంత సౌకర్యవంతమైన నగరం అది. ఆ నగరంలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ప్రదేశంలో మా నివాసం.


అప్పుడు అది అక్కడక్కడ ఇళ్లు ఉన్న ప్రదేశం. అయితే ఇల్లు దూరంగా ఉన్నా ఇరుగుపొరుగు వాళ్లు కలిసిమెలిసి ఉండేవారు. ఏ అవసరం వచ్చినా ఒకరికొకరు సహాయం చేసుకునే మనస్తత్వం కలవారు. అలాంటి ప్రదేశంలో ఉండడం నాకు భయంగా ఉండేది కాదు.


జీవితంలో ఎంతో మంది స్నేహితులు ఉంటారు. అమ్మ ఒడిలో ఉన్నప్పుడు అమ్మే పెద్ద స్నేహితురాలు. బడికి వెళ్ళినప్పుడు ఎంతోమంది స్నేహితులు కలుస్తారు. ఆ చిన్న చిన్న స్నేహాల్లోనే మన బాల్యం నవ్వుతుంది.


కానీ బడి దాటిన తర్వాత కొన్ని స్నేహాలు కనుమరుగైపోతాయి. కాలం గడుస్తుంటే కొందరు దూరమవుతారు. కళాశాల దాకా కూడా కొనసాగే స్నేహాలు మరికొన్ని. అక్కడ కూడా కొత్త స్నేహాలు కలుస్తాయి.


అలా జీవిత ప్రయాణంలో స్నేహాలు మారుతుంటాయి. కానీ కొన్ని స్నేహాలు మాత్రం మనసులో చెక్కుచెదరకుండా నిలిచిపోతాయి.


అలాంటి ఊర్లో ఆ అపురూపమైన వీధి నుంచి మెయిన్ రోడ్డు వరకు రావాలంటే ఒక కిలోమీటర్ దూరం నడవాలి. ఆ దారిలో నాకు ఒక ముఖ్యమైన స్నేహితుడు ఉండేవాడు. ఈ స్నేహితుడు నా దృష్టిలో పెద్ద ధనవంతుడు అంటే పెద్ద మేడలో ఉండే స్నేహితుడు కాదు. ప్రాణం ఉంది, కానీ మాటలు రావు.

ఎప్పటినుంచి అక్కడ కాపురం ఉన్నాడో తెలియదు. కానీ ఆకారం చూస్తే వంద సంవత్సరాలు పైగా అక్కడ నిలబడి ఉన్నాడేమో అనిపించేది.


రహదారి పక్కన అంత పెద్ద స్నేహితుడు పైగా అలాంటి నగరంలో ఎలా ఎదిగాడో అనే ప్రశ్న నాకు కూడా వచ్చింది. ఎవరు పెంచి పోషించింది కాదు. సర్కారు వారు అప్పట్లో అంత శ్రద్ధగా చెట్లు పెంచేవారు కాదు. ఆకాశంలో ఎగిరే పక్షి నోటి నుంచి ఏదో పండు జారిపడి మొక్కగా మొలకెత్తి, అది నేడు మహావృక్షమైందని నేను అనుకునేవాడిని.


“నారు పోసిన వాడే నీరు పోస్తాడు” అని సామెత ఉంది కదా. అలాగే ఈ చెట్టుకి ఎవరు నీరు పోసి పెంచింది కాదు. ఆ భగవంతుడు ఏ దిక్కులేని వాళ్లకి పెద్ద దిక్కయ్యి పెంచి పోషించిన మహావృక్షం.


అమ్మ కడుపులో ఉండగా ఊపిరి పోసి ఈ భూమి మీదకు పంపిన ప్రాణులకు, భూమి మీద ఆ ఊపిరి ఆడాలంటే ఎవరు సహాయం చేస్తారు? అనిపిస్తుంది. వెంటనే చెట్టును సృష్టించాడేమో అనిపిస్తుంది నాకు.


ఆకారం పగలు చూస్తేనే చాలా భయంకరంగా ఉండేది. పెద్ద పెద్ద కొమ్మలు, ఆ కొమ్మల నుంచి కిందకు జారే ఊడలు, రాక్షసుడిలా పెద్ద ఆకారం, పెద్ద పెద్ద ఆకులతో ఉండేది.


నాకే కాదు, మనసున్న మనిషి ఎవరైనా తెలుసుకుంటే అతను స్నేహితుడే. ఇంటి నుంచి వెళ్లేటప్పుడు, పని చూసుకుని తిరిగి వచ్చేటప్పుడు అలసటగా అనిపిస్తే తన కింద చోటు ఇచ్చి చల్లటి గాలి పంచేవాడు.


ప్రతి మనిషికి ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు ఎవరికి చెప్పుకోవడానికి వీలు లేనప్పుడు ఆ స్నేహితుడు పక్కన కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంటే గుండె భారం తగ్గేదట. ఓదార్చే అవకాశం ఆ చెట్టుకు లేకపోయినా, ఎవరో మరొక వ్యక్తి ముందు ఉన్న భావన కలిగేది అని చెప్పేవాళ్లు ఎందరో.


నాలాగే ఎంతోమంది స్నేహితులు ఆ చెట్టుకి. ఆ చెట్టు సృష్టించిన బ్రహ్మగారి గురించి తెలియదు. కానీ పక్కనే ఉన్న వినాయకుడు గుడిలో బ్రహ్మగారు ఈ ఆకుల్లో ప్రసాదం పంచుతూ ప్రతిరోజు ఆ చెట్టుని ప్రేమగా చూసుకునేవారు. పరోక్షంగా ఆ చెట్టుకి ఎంత పుణ్యమో కదా! భగవంతుడు ప్రసాదం తన ద్వారా పదిమందికి చేరుతోంది కదా.


అప్పట్లో మన నగరంలో ఇన్ని హోటల్స్ లేవు. జొమాటో, స్విగ్గి వంటి వాటి జోరు లేదు. ఊరు నుంచి నగరానికి వచ్చి కాలేజీల్లో చదువుకునే కుర్రాళ్ళకి కడుపు నిండాలంటే సుబ్బయ్య గారి భోజనం మాత్రమే దిక్కు.


కానీ క్యారేజీలు తీసుకెళ్లే అప్పారావు మిగిలిన అన్నాన్ని ఆ చెట్టు దగ్గర కూర్చుని తిని, కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ పనిలో పడేవాడు. అలా అప్పారావుకి కూడా స్నేహితుడు ఈ చెట్టు.

ఒక అప్పారావు ఏమిటి! తాళాలు బాగు చేసే నూకరాజుకి కూడా ఈ చెట్టు ఆశ్రయం ఇచ్చింది.


“షాపు పెట్టాలంటే అద్దెలు, అడ్వాన్సులు, కరెంట్ బిల్లులు కట్టడానికే నా జీవితం సరిపోతుంది. కానీ ఇక్కడ ఉచితంగా చల్లటి గాలి, వెలుతురు దొరుకుతుంది. నా అడ్రస్సే — కేర్ ఆఫ్ మర్రిచెట్టు, లాల్ బహదూర్ నగర్!” అని అతను నవ్వుతూ చెప్పేవాడు.


రోజు ఆ వీధిలోకి వచ్చే పాలవాళ్లు, కూరగాయల వాళ్లు, పేపర్ వాళ్లు, రిక్షావాళ్లు — అందరూ ఒక క్షణం ఆ చెట్టు కింద నిలబడి అలసట తీర్చుకునేవారు.


పక్షుల గూళ్ళతో నిండిన ఆ చెట్టు ఎప్పుడూ సందడిగా ఉండేది. పగలు మనుషులకి ఆశ్రయం ఇచ్చినట్టు, రాత్రిళ్లు వందల పక్షులకు నివాసం ఇచ్చేది.


పిల్లలకు ఆ ఊడలు ఉయ్యాలలు. కార్మికుల పిల్లలను చీరతో కట్టి ఆ ఊయలలో పడుకోబెట్టి నిద్రపుచ్చిన సందర్భాలు ఎన్నో.

అలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. నగరం మారింది. రోడ్లు మారాయి. కొత్త భవనాలు పుట్టుకొచ్చాయి. మనుషులు మారిపోయారు. కానీ నా స్నేహితుడు మాత్రం అలాగే నిలబడి ఉన్నాడు.


అయితే ఒక రోజు మా వీధిలో కొత్త మాట వినిపించింది — “రోడ్డు విస్తరణ.”

ఒకరోజు ఉదయం అధికారులు వచ్చి రోడ్డు పక్కన తెల్లటి గీతలు గీసి వెళ్లిపోయారు. ఆ గీత నా స్నేహితుడి భవిష్యత్తుకూ గీత వేసినట్టుగా అనిపించింది.

కొన్ని రోజుల తర్వాత యంత్రాలు వచ్చాయి. చిన్న మొక్కలు, గోడలు తొలగించడం మొదలుపెట్టారు. ఆ రోజు ఆ చెట్టు కింద ఎప్పటిలా సందడి లేదు.


“సార్… ఈ చెట్టు చాలా సంవత్సరాలుగా ఉంది,” అని కొందరు చెప్పారు.

“ఇది మా అందరికీ ఉపయోగపడుతుంది,” అన్నారు ఇంకొందరు.

నూకరాజు ముందుకు వచ్చి, “సార్… నా షాపు అడ్రస్సే ఈ చెట్టు,” అన్నాడు.

ఆ అధికారి కొద్దిసేపు చెట్టును చూసి నిలబడ్డాడు. తరువాత అన్నాడు —

“నాకు అప్పగించిన పని రహదారులు వేయడం.”

అంతే. యంత్రాలకు బలి అయిపోయింది ఆ మహావృక్షం.

యంత్రాల శబ్దం ఆగిపోయేసరికి అక్కడ ఒక వింత నిశ్శబ్దం నెలకొంది. కొద్దిసేపటి క్రితం వరకు ఆకాశాన్ని తాకిన నా స్నేహితుడు ఇప్పుడు నేలమీద విరిగిపోయిన కొమ్మలుగా కనిపించాడు.


ఆ రోజు నాకు ఒక నిజం అర్థమైంది.

మనుషులను కోల్పోతే మనం బాధపడతాం. కానీ మన జీవితంలో నిశ్శబ్దంగా భాగమైపోయిన ప్రకృతి భాగాలను కోల్పోయినప్పుడు కలిగే బాధ కూడా అంతే లోతైనది.

ఆ చెట్టు ఇప్పుడు లేదు. కానీ ఆ చెట్టు నీడలో గడిచిన క్షణాలు ఇంకా ఉన్నాయి. నూకరాజు నవ్వు ఉంది. అప్పారావు క్యారేజీ ఉంది. పక్షుల అరుపులు ఉన్నాయి. రాజు గాడు అమ్మిన తినుబండారాల వాసన ఉంది.


అన్నింటికంటే ముఖ్యంగా —

ఆ చెట్టు ఇచ్చిన స్నేహం ఉంది.

ఇప్పుడు ఎప్పుడైనా ఆ రోడ్డుమీదుగా వెళ్తే అక్కడ చెట్టు కనిపించదు. కానీ నా మనసులో మాత్రం ఆ మహా మర్రిచెట్టు ఇంకా అలాగే నిలబడి ఉంది.

కొమ్మలు విప్పి, ఎప్పటిలాగే అందరికీ నీడ ఇస్తూ…

నా జీవితంలో మాటలు మాట్లాడని అత్యంత గొప్ప స్నేహితుడిగా.


రచన

మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు

కాకినాడ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

సామర్లకోట

కుటుంబం