ఆ ఊరు

 ఆ ఊరు


మన జీవన యాత్రలో ఎన్నో ఊర్లు తిరుగుతూ ఉంటాం. పుట్టినఊరు , చదువు కోసం వెళ్ళిన ఊరు, పొట్ట చేత పట్టుకుని తిరిగే ఊరు, అత్తవారి ఊరు అందులో ముఖ్యమైనవి.


 పుట్టిన ఊరు స్వర్గంతో సమానం అంటారు. మనం పుట్టిన ఊరు తలుచుకున్నప్పుడల్లా నవమాసాలు మోసి కని పెంచిన తల్లిదండ్రులు, గడిచిపోయిన బాల్య మధుర స్మృతులు, బంధువులు, స్నేహితులు గుర్తుకు వస్తూనే ఉంటారు. అది సహజమే. పుట్టినప్పటినుంచి ఆ గాలి ఆ నీరు ఆ వాతావరణం ఆ మనుషులు తో మమేకమై కలిసిమెలిసి ఉన్నాం కాబట్టి.


అక్కడ ఉండేది కొద్ది రోజులే కానీ మన జీవితం ఆ కాలేజీ , స్నేహితుల మధ్య తిరుగుతుంది. జీవితంలో ఆ ఊరి పేరు తలుచుకున్నప్పుడల్లా మన విద్యార్థి జీవితం గుర్తుకొస్తుంది.


మరి ఉపాధి కోసం మనం వెళ్లిన ఊర్లు జీవితంలో చాలా మధుర జ్ఞాపకాలు మిగులుస్తాయి. కష్టాలు కూడా ఉంటాయి లెండి.ముఖ్యంగా కొన్ని వృత్తుల వాళ్ళు అంటే అక్కడ ఉండే ప్రజలతో సంబంధం ఉండే ఉద్యోగాలు చేసే వాళ్ళకి ప్రజలతో అనుబంధం పెరుగుతుంది. ఉదాహరణకి గవర్నమెంట్ ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు పోస్ట్ ఆఫీస్ ఉద్యోగులు వీరికి నిత్యం అక్కడ ఉండే ప్రజల తోటే మమేకమై పని చేస్తుంటారు. 


కానీ మన జీవన సమరంలో మనకి మధురమైన జ్ఞాపకాలు మిగిల్చే ఊర్లు కొన్ని ఉంటాయి. ఎందుకో తెలియదు—ఆ ఊరి నుంచి వచ్చేసినా, అక్కడున్న వ్యక్తులు మనకి రక్తసంబంధీకులు కాకపోయినా, ఆ అనుబంధం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది.


ఏదో ఒక సందర్భంలో మళ్లీ ఆ ఊరిని సందర్శిస్తూనే ఉంటాం. ఇంచుమించుగా ఆ ఊరి కబుర్లు తెలుసుకుంటూనే ఉంటాం. జన్మభూమి మీద మమకారం ఉండడం సహజం. ఏదో తెలియని బంధంతో మనల్ని కట్టిపడేసిన ఆ ఊరితో అనుబంధం పూర్వజన్మ సుకృతం అనుకుంటాను. ఇంతకీ నాకు ఆ ఊరికి సంబంధం ఏమిటి ? ఆ ఊర్లో పబ్లిక్ సెక్టార్ బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ గా ఆ ఊరితో అనుబంధం మొదలైంది. చాలా ఊళ్ళల్లో పని చేస్తుంటాం. కానీ పరోక్షంగా భగవంతుడికి సేవ చేసే అదృష్టం కొన్ని బ్యాంకు బ్రాంచ్ లో పనిచేసే వాళ్ళకి కలుగుతుంది. ఆ ఊరి పేరు అయినవిల్లి. అలా అయినవిల్లి వినాయకుడికి మేము సేవకులు అయ్యాం. ఒక బ్యాంకు బ్రాంచ్ కి ముఖ్యమైన కస్టమర్లు జాబితా ఉంటుంది. అందులో ప్రథమ స్థానం మా అయినవిల్లి వినాయకుడిదే.  


మండల కేంద్రమైన ఆ ఊరు చుట్టూ అందమైన గోదావరి, ఎక్కడ చూసినా కొబ్బరి తోటలు, వరి చేలు, పిల్ల కాలవలు అందమైన ఇళ్ళు, రకరకాల విద్యాసంస్థలు, అన్నింటికన్నా ముఖ్యం ఈ గణపతి దేవాలయం , పల్లెకి ఎక్కువ పట్టణానికి తక్కువ అన్నట్టు ఉంటుంది ఆ ఊరు. ఇంకా మండల కేంద్రంలోని ఊర్లు సందర్శిస్తే ఎంతో మానసిక సంతృప్తి. ఎందుకంటే అవి ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. పక్కా కోనసీమ ఊర్లు.  


కోటిపల్లి రేవు మీదుగా పంటిలో గోదావరి నది మీద ఆ ఊరు చేరుకునే ప్రయాణం జీవితంలో దివ్యానుభూతిని మిగిల్చింది 

స్వచ్ఛమైన గోదావరి నీళ్లు, గోదావరి మీద నుంచి వచ్చి చల్లటి గాలి, పంటిలో హుషారు కొలిపే పాటలు, పంటిలోని పల్లె జనం మాటలు అదొక రకమైన అనుభూతి.


నిత్యం వేలాది మంది భక్తులు కొలిచే ఆ గణపతి ఆ అందమైన దేవాలయంలో దక్షిణాభిముకుడై నిత్యం పూజలు అందుకుంటూ ఉంటాడు. ఆ ప్రాంగణం కేశవ స్వామి, అన్నపూర్ణాదేవి వంటి ఉప దేవాలయాలతో చాలా అందంగా ఉంటుంది. స్వయంభువుడుగా వెలసిన ఆ స్వామి సిద్ధి వినాయకుడిగా కోరిన కోరికలు తీర్చే స్వామిగా ప్రసిద్ధి పొందాడు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రముఖ గణపతి దేవాలయాల్లో ఇదొకటి. కొబ్బరికాయ కొడితే కోరిన కోరికలు తీర్చే స్వామికి భాద్రపద మాసంలో చవితి ఉత్సవాలు, కార్తీకమాస ఉత్సవాలు, ప్రతిరోజు సుప్రభాత సేవ నుంచి అభిషేకాలు అష్టోత్తర శత నామార్చన, గణపతి హోమం శైవాగమ పద్ధతిలో జరుగుతూ ఉంటాయి. ఇక్కడ స్వామివారికి రవ్వ లడ్డు, పులిహోర ప్రసాదం నైవేద్యం పెడతారు. ఎవరైనా పుణ్యక్షేత్రాలకు పెడుతున్నామని చెబితే ప్రసాదం తెచ్చి పెట్టమని హుండీలో డబ్బులు వేయమని వాళ్ల చేతికి కొంత సొమ్ము ఇస్తుంటాం మనం. కానీ కోరినప్పుడు అల్లా ఆ స్వాఈమి ప్రసాదం తినే అదృష్టం ఆ ఊరిలో పనిచేసిన మాకు కలగడం నిజంగా పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవాలి. ఏ దేవుడి ప్రసాదమైన రుచిగానే ఉంటుంది కానీ ఇక్కడ రవ్వ లడ్డు పులిహార ప్రసాదం రుచి మరువలేనిది. అది ఆ స్వామి మహిమ.మన బ్రాంచ్ కి వచ్చే ఆడిటర్లు , వివిధ ప్రదేశాలలో పనిచేసే మన బ్యాంకు ఉద్యోగులు, తెలిసిన బంధువులు స్నేహితులు ప్రతిరోజు ఫోన్ చేసి దర్శనానికి ఏర్పాటు చేయమని అడగడం పరోక్షంగా మాకు అది భగవంతుడు సేవగా భావించే వాళ్ళం. . ఇది నాకే కాదు అక్కడ పనిచేసిన ఉద్యోగస్తులు అందరికీ మన బ్యాంకు అభివృద్ధిలో ఆ వినాయకుడు పాత్ర ఎప్పుడూ మొదటి స్థానమే. ఆ దేవాలయం ఉద్యోగులతో ఉన్న సంబంధ బాంధవ్యాలు మర్చిపోలేనివి . ఈనాటికి అవి కొనసాగుతున్నాయి అంటే అది భగవంతుడు కృప. సుదూర ప్రాంతాల నుంచి దర్శనం వచ్చి దర్శనం చేసుకుని కోరికలు స్వామికి విన్నవించుకుని నిత్యాన్నదానంలో స్వామి ప్రసాదం స్వీకరించి తేలికబడిన మనసుతో ఇంటికి తిరిగి వెళ్లడం చాలామంది భక్తులు చెప్తూ ఉండేవారు. ఈ ఉచిత అన్నదానంలో ప్రత్యేక ఆకర్షణ కొబ్బరి పచ్చడి. ఆ రుచి జీవితంలో మర్చిపోలేం. అదొక్కటే కాదు అన్నదానంలో పెట్టే ప్రతి వంటకం నిజంగా అద్భుతం . ప్రతిరోజు ఒకే రకమైన రుచితో శుచిగా,శుభ్రంగా వంటలు చేయడం అంతా స్వామి మహిమ. ఎంతోమంది భక్తులు నిత్యాన్నదానంలో సేవలు చేస్తుంటారు. అటువంటి సేవలో మా శ్రీమతి ప్రతిరోజు పాల్గొని దివ్యానుభూతిని పొందేది. దానికి తగినట్లుగా నేను నివాసం ఉండే ఇల్లు గుడికి దగ్గర లోనే . బ్రాంచ్ కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు స్వామిని దాటుకుంటూ నే వెళ్లాలి. గుడి ముందు కొబ్బరి కొట్లు, బొమ్మల దుకాణం, దూరప్రాంతాల నుండి వచ్చే భక్తుల కోలాహలం వాహనాలతో ఆ రోడ్డు ఎప్పుడు రద్దీగానే ఉండేది.ఇంకా పుణ్య తిధులలో చెప్పేదేముంది. . 


అయినవిల్లి వినాయక స్వామి గుడికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే క్షణముక్తేశ్వర స్వామి ఆలయానికి కనుమ పండుగ నాడు వచ్చే ప్రభలు చూసే అదృష్టం ఆ ఊర్లో ఉన్నప్పుడు కలిగింది. రకరకాల పుష్పాలతో అలంకరించిన ప్రభలను మోసుకుంటూ వెళ్లే వారిని చూస్తే నిజంగా ఒళ్ళు జలదరిస్తుంది. 


ఎప్పుడైనా ఖాళీ దొరికితే ఆ గోదావరి దగ్గరికి వెళ్లి అలా ప్రవహించే గోదావరిని చూస్తూ కాలం గడిపితే మనసు ప్రశాంతంగా ఉండేది. కనుచూపుమేరలో అంతా గోదావరి దూరంగా కనిపిస్తూ ఉండేది కోటిపల్లి గోదావరి గట్టు. మధ్యలో అటువైపు నుంచి వచ్చే పంటి, ప్రయాణికులతో ఇటువైపు నుంచి వెళ్లే పంటి కనబడుతూ ఉంటే కాలక్షేపం అయిపోయేది. 


ఇక్కడ వ్యవసాయం ప్రధాన వృత్తిగా చెప్పబడిన కొబ్బరి చెట్టు లేని ఇల్లు గాని పొలం కానీ ఉండదంటే అతిశయోక్తి కాదు. కొబ్బరి మీద ఆధారపడి కుటీర పరిశ్రమలు కూడా చాలా ఉన్నాయి. అక్కడ స్వామికి కొబ్బరికాయ మొక్కులతో కోరిన కోరికలు తీరుస్తాడు. మరి ఇక్కడ ఉన్న రైతు విపణి లో కొబ్బరికాయ ధర పెరిగితే కళ్ళలో సంతోషం వ్యక్తం చేస్తాడు. అది ఆ రైతుకి అదనపు ఆదాయ మార్గం. 


ఆ రైతుల తోటే మన ప్రధాన వ్యాపారం కూడా అక్కడ. మన బాధ్యతలు నెరవేర్చడంలో రైతుతో జరిపిన సంభాషణలలో వారి కష్టాలు గుండె చెరువు చేసే వి.


 అక్కడ మనసుతో పని చేస్తే కుదరదు. బాధ్యతగా పని చేయాలి. మన నెత్తి మీద పెట్టిన బాధ్యతను నెరవేర్చాలి. ఆ బాధ్యతలు నెరవేర్చడంలో నాకు రామ బంటు లాగా ఆ ఊరి ఆటో డ్రైవర్ దొరబాబు సహాయం చేసేవాడు. అలా మా కుటుంబ సభ్యుడు అయిపోయాడు. ఎంతోమంది ఫోన్ చేసి సమాచారం తెలుసుకుంటూ ఉంటారు ఇప్పటికీ కూడా. పిల్లల పెళ్లికి మొదటి శుభలేఖ స్వామి వారికి ఇవ్వడం , కోరిన కోర్కెలు తీరిన తర్వాత కొబ్బరికాయ మొక్కులు తీర్చుకోవడం కోసం, ఆ దేవుడితో అనుబంధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ ఊరు వెళ్లినప్పుడల్లా ఒక తీయని అనుభూతి మిగులుస్తూనే ఉంటుంది ఎప్పుడు. పుణ్యక్షేత్రంలో పనిచేయడం ఒక వరం. అది భగవంతుడి సంకల్పం.  


ఆ ఊరిలో ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే గోదావరి పుష్కరాలు వచ్చాయి. సుదూర ప్రాంతాల నుంచి ఆ ఊరికి ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులొస్తుండేవారు. ఆ భక్తులకి ఒకరోజు మన బ్రాంచ్ తరపున ప్రసాదం పంచిపెట్టడం ఒక దివ్యమైన అనుభూతి.  


జీవితంలో మనం ఎన్నో ఊర్లు చూసినా, కొన్ని ఊర్లు మాత్రం మన హృదయంలో శాశ్వతంగా స్థానం సంపాదించుకుంటాయి. అక్కడ గడిపిన రోజులు, కలిసిన మనుషులు, చూసిన ప్రకృతి, పొందిన అనుభవాలు కలిసి మన జీవితంలో ఒక అమూల్యమైన జ్ఞాపకంగా మిగిలిపోతాయి. నాకు అలాంటి ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఊరు అయినవిల్లి. అక్కడ చేసిన ఉద్యోగం ఒక విధంగా బాధ్యత అయితే, ఆ వినాయక స్వామి సన్నిధిలో గడిపిన రోజులు ఒక వరం. గోదావరి గాలి, కొబ్బరి తోటలు, భక్తుల సందడి, స్వామివారి ప్రసాద రుచి—ఇవన్నీ ఇప్పటికీ జ్ఞాపకాలలో తేలియాడుతూనే ఉంటాయి. జీవితం మనల్ని ఎక్కడికి తీసుకెళ్లినా, మనసు మాత్రం అప్పుడప్పుడు ఆ ఊరిని చేరి, ఆ వినాయకుడి సన్నిధిలో నిలబడి నమస్కరిస్తూనే ఉంటుంది. బహుశా అది ఆ ఊరితో ఏర్పడిన పూర్వజన్మ బంధమే కావచ్చు.


రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు 

కాకినాడ 9491792279 


  


.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట