తీరని కోరిక
ఉదయం తొమ్మిది గంటలు అయింది. అందరి ఆర్థిక అవసరాలు, ఆశలు తీర్చే ఆ కార్యాలయం ముందు ఒక స్కూటర్ వచ్చి ఆగింది. స్కూటర్ దిగి జేబులోంచి తాళాలు తీసి తలుపులు తెరుస్తుంటే, జేబులోని సెల్ఫోన్ మోగితే కుడి చెవిలో పెట్టుకుని తలుపులు తెరుస్తూ మాట్లాడుతూ చెమటలు కారుతుంటే, హడావిడిగా కార్యాలయంలోకి అడుగుపెట్టి తనకు కేటాయించిన ప్రత్యేక గదిలోని సీట్లో కూర్చున్నాడు సదరు కార్యాలయం అధికారి రామారావు.
ఇంతకీ ఆ కార్యాలయం పేరేమిటి అనే సందేహం అందరికీ వస్తుంది. అది ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు శాఖ. ఆ శాఖ ఉండేది ఒక మండల కేంద్రంలో. ఆ ఊరిలో సౌకర్యంగా ఉండే ఇళ్లు దొరకవు. ఆ శాఖలో పనిచేసే వాళ్లు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణం నుంచి రోజు వచ్చి వెళుతుంటారు. రోజు ఉదయం తొమ్మిది గంటలకి ప్రారంభమైన ఉద్యోగ యాత్ర రాత్రి ఎనిమిది గంటలకి ఇల్లు చేరడంతో పూర్తవుతుంది.
బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభమయ్యేయి. బ్యాంకు ప్రాంగణం అంతా కస్టమర్లతో నిండిపోయింది. అందులో తల పాగా చుట్టుకుని పంచ కట్టుకుని చేతిలో కర్ర పట్టుకునే రైతులు దగ్గర నుంచి, తెల్ల బట్టలు వేసుకుని కూలింగ్ గ్లాసులు పెట్టుకుని వచ్చే బడా బాబులు, నిన్న మొన్నటి వరకు ఆ సీట్లో కూర్చుని ఈవేళ మాజీ ఉద్యోగి అని ముద్ర వేయించుకున్న వాళ్లు ఉన్నారు. ఎవరి అవసరాలు వారివి, ఎవరు ఆశలు వాళ్ళవి.
అందరి సందేహాలు, అనుమానాలు, అవసరాలు తీర్చడమే నీ పని అని ఆ అధికారికి ఆ గదిని ప్రత్యేకంగా కేటాయించారు. ఒక్కొక్కరే గది తలుపులు తీసుకుని లోపలకు ప్రవేశిస్తున్నారు. అలాగే కూలింగ్ గ్లాస్ పెట్టుకున్న పెద్దమనిషి లోపలకు ప్రవేశించి, “మేనేజర్ గారు, మా అమ్మాయి పెళ్లి. కొంచెం కొత్త పది రూపాయల నోట్ల కట్టలు రెండు కావాలి” అన్నాడు.
క్షణాల్లో కొత్త పది రూపాయల కట్టలు క్యాషియర్ దగ్గర నుంచి తెప్పించి అతని చేతిలో పెట్టాడు రామారావు. ఆ వ్యక్తి కళ్ళల్లో ఆనందం, కృతజ్ఞతా పూర్వకమైన చూపులతో బయటకు వచ్చాడు. నిజానికి బ్యాంకుల పని డిపాజిట్లు స్వీకరించడం, లోన్లు ఇవ్వడం ముఖ్యం. కానీ ఇది కస్టమర్ సేవలు కింద భావిస్తాడు ఏ బ్రాంచ్ మేనేజర్ అయినా సరే.
ఇంతలో టేబుల్ మీదనున్న ఫోన్ మోగింది. ఫోన్ ఎత్తగానే అవతల నుండి, “మేనేజర్ గారు, నేను రాజిరెడ్డిని” అనగానే, “నమస్కారం చెప్పండి” అన్నాడు రామారావు. “ఏమీ లేదు, రేపు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది. లాకర్ ఓపెన్ చేయాలి. మేము పక్క ఊర్లో ఉన్నాము. వచ్చేటప్పటికి కొంచెం లేట్ అవుతుంది. కొంచెం హెల్ప్ చేసి పెట్టాలి” అన్నాడు రాజిరెడ్డి.
“దానికి ఏముంది, తప్పకుండా” అన్నాడు రామారావు. ఫోన్ పెట్టేసి అందుకు తగిన ఏర్పాట్లు చేసాడు. బ్యాంకులో ప్రతి పనికి నిర్ణీత సమయాలు ఉంటాయి. అయినా కస్టమర్ సేవలో బ్యాంకులు అనధికారంగానే తమ సేవల సమయాన్ని కూడా పెంచుతూ ఉంటాయి. ఇక్కడ సంతృప్తి అనే మాట కోసం తీవ్ర కృషి చేస్తాయి. దానికోసం ఉద్యోగస్తులు తమ సమయంలో కొంత త్యాగం కూడా చేయవలసి ఉంటుంది. దాని గుర్తించే వాళ్లు చాలా తక్కువ మంది.
అంతవరకు తలుపు దగ్గర తచ్చాడుతున్న గోపాల్ రెడ్డి ఒక్కసారి లోపలికి వెళ్లి, “పంటలన్నీ పోయే యి. మీరేమో పంట రుణం కట్టమని పదేపదే కబుర్లు చేస్తున్నారు. ఏమైనా బ్యాంకు కి కోట్లు రుణము అప్పు ఉన్నామా? అలాగని ఎగవేసే వాళ్ళం కూడా కాదు కదా! బ్యాంకు వాళ్లు ఇంటికి వస్తుంటే మాకు ఆ ఊర్లో తల తీసేసినట్టు ఉంటుంది” అంటూ చేతిలోని రుణ పాస్ బుక్కు మేనేజర్ కి అందించాడు.
“అవునండి, రెన్యువల్ టైం అయిపోయింది. మాకేమో హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తున్నాయి. మీకు సహాయం చేద్దామనే పిలిచాను” అంటూ వడ్డీ డబ్బులు కట్టించుకుని అసలు రెన్యువల్ చేసి పంపించేశాడు రామారావు. గోపాల్ రెడ్డి తలుపు తీసుకుని బయటకు వస్తూ మొహానికి పట్టిన చెమట తుడుచుకుని ప్రశాంతంగా బయటికి వెళ్లిపోయాడు.
ఉదయం పది గంటలకి బ్యాంకులో అడుగుపెట్టిన అప్పటికే తన ముందు చాలామంది అధికారి కోసం ఎదురుచూస్తున్నారని తెలుసుకొని ఆఖరి బెంచిలో చివరగా కూర్చున్నాడు డబ్బై ఏళ్ల వృద్ధుడు. మొహంలో అలసట, మాసిపోయిన గడ్డం, దేనికోసమే ఆశగా ఎదురుచూస్తున్న చూపు—ఇది అతని పరిస్థితి.
తన ముందు బెంచిలో కూర్చున్న ఒక వ్యక్తిని అడిగాడు, “మీరు ఎందుకోసం వచ్చారు?” అని. “మేము కష్టపడి స్థలము కొనుక్కున్నాము. అందులో ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాం. అప్పు కోసం వచ్చాము” అన్నాడు. “మీరేం చేస్తుంటారు?” “నేను టీచర్ గా పని చేస్తున్నానండి” అన్నాడాయన.
“ఇంకేముంది, మీకు తప్పనిసరిగా లోను వస్తుంది” అంటూ ఇంటి రుణం గురించి విపులంగా తనకు తెలిసిన విషయం చెప్పాడు. ఆ టీచర్ గారి కళ్ళల్లో సొంత ఇల్లు కనబడింది అనుకుంటాను—ఎక్కడ లేని ఆనందం.
అలాగే ఈ సంభాషణ అంతా వింటున్న ఎదుటి బెంచ్ లోని ఓ కుర్రాడు, తను విదేశాలకు చదువు కోసం వెళుతున్నానని, విద్యా రుణం కోసం వచ్చానని చెబుతూ తన సందేహాలు అన్నిటికీ సమాధానాలు ఆ ముసలాయనను అడిగి తెలుసుకున్నాడు.
ఇంతలో ఇంకో పెద్దాయన, “నేను బ్యాంకులో డిపాజిట్ చేయడానికి వచ్చాను. తీరా మేనేజర్ గారు చాలా బిజీగా ఉన్నారు” అని అన్నాడు. “డిపాజిట్ చేయడానికి మేనేజర్ గారు అక్కర్లేదండి, అకౌంటెంట్ గారు సరిపోతారు” అంటూ ఆ సీటు చూపించాడు.
ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఆ తలుపులు తెరిచి మూసుకున్నాయో లెక్కలేదు. వెళ్లేటప్పుడు ఆందోళనగా వెళ్లిన వాళ్లు, వచ్చేటప్పుడు సంతోషంగా బయటికి వెళ్తున్నారు. అలాగని అందరూ కాదు లెండి—ఎక్కువ శాతం మంది.
ఏదైనా సమస్య వచ్చినప్పుడు సలహాలు చాలామంది ఇస్తారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడేసే వాళ్లు ఎవరూ ఉండరు. కానీ అందరి సమస్యల్ని పరిష్కరించే ఆ బ్యాంకుకు నిజంగా అందరూ రుణపడి ఉంటారు.
ఇంతలో మధ్యాహ్నం రెండు గంటలు అయింది. స్టాఫ్ అంతా లంచ్ కి వెళ్లే సమయం. ఇంకా మేనేజర్ గారి రూమ్ లో ఎవరో కూర్చుని ఉన్నారు. నిజానికి సమస్యలు పరిష్కరించడంలో సమయం తెలియదు.
ఒక్కసారి లోపలికి చూసి నిట్టూర్చాడు ఆ ముసలాయన. వేళాపాల లేకుండా తిండి, సమయం సందర్భం లేకుండా ఫోన్లు, నిద్రలేని రాత్రులు ఎన్నో గుర్తుకొచ్చాయి తన ముప్పై ఐదు ఏళ్ల సర్వీసులో. ప్రతిరోజు ఒక గండం. ఆ రోజుకి గండం గడిచి పిండం బయటికి వస్తే మరునాడు మరొక యమగండం.
అందరూ ఆఫీసులు మూసుకుని కూర్చుంటే కరోనా సమయంలో బ్యాంకు తెరిచి సమాజ సేవకి జీవితం అంకితం చేసిన ఉద్యోగులు ఎంతోమంది. జీవితమంతా అలాగే ఊపిరి సలపని పనులతో, కుటుంబానికి సమయం వెచ్చించలేని అసమర్ధతో జీవితం గడిచిపోయింది.
కొందరు మంచివాడు అన్నారు, కొందరు చెయ్యని తప్పుకు వేలెత్తి చూపించారు. దానికి తోడు టార్గెట్ల ఒత్తిడి. అంచనాలకు మించిన టార్గెట్లను తట్టుకోలేక నిత్యం భయం భయంగా గడిపిన రోజులు గుర్తు వచ్చాయి.
ఒకప్పుడు డిపాజిట్లు కోసం వెంటపడేవాళ్ళం. ఇప్పుడు ఇన్సూరెన్స్ గురించి ఒత్తిడి. ఒకరి చేతి కింద పనిచేసే స్థాయి నుంచి తన చేతి కింద ఎంతోమంది ఉద్యోగులు పనిచేసే స్థాయికి ఎదిగిన విశ్రాంత ఉద్యోగి—ఆయన పేరు రాఘవరావు.
ఒకప్పుడు పుస్తకాలలో ఖాతాదారుల లెక్కలు చూసే స్థాయి నుంచి ఒక అందమైన పెట్టెలో లెక్కలు తేల్చే స్థాయికి పెరిగిన ఉద్యోగులు—ఒత్తిడి అలాగే ఉంది, కొంచెం పెరిగిందేమో కూడా.
ప్రతి మూడేళ్లకు ఒకసారి ట్రాన్స్ఫర్, పిల్లల చదువులు, పెళ్లిళ్లు, కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు—వీటి మధ్య నలిగిపోయిన విశ్రాంతి ఉద్యోగి ఆయన.
నిత్యం తెలియని ఒత్తిడితో నలిగిపోయి ఆరోగ్యాలు పాడైపోయిన ఉద్యోగస్తులు ఎంతోమంది. “మీరు కూడా బ్యాంకులో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు కదా! మీరే ముందుగా వెళ్లి మీ పనులు చేయించుకోవచ్చు కదా?” అని ఎవరైనా అడిగితే—
“ఇప్పుడు మేము ఇంటికి వెళ్లి చేసే పని ఏముంది? నాకంటే ఆ వచ్చిన వాళ్ళు ఎన్నో పనులతో వస్తారు. బ్యాంకుకు వాళ్లే ముఖ్యులు” అనే సమాధానం ఆయన దగ్గర రెడీగా ఉంది. అది ఆయన సమాధానం కాదు—సంస్కారం.
అప్పటికి మధ్యాహ్నం మూడు గంటలు అయింది. ముగ్గురు వృద్ధులు తమ తమ భార్యల సహాయంతో అతి కష్టం మీద లోపలికి అడుగు పెట్టారు. ఆ సమయంలో వీళ్ళు ఎందుకు వచ్చి ఉంటారు అనేది ఆ అనుభవపూర్వకమైన రిటైర్డ్ ఉద్యోగికి బాగా తెలుసు.
బ్యాంకులో ఆస్తులు పెట్టుకుని అప్పు ఇవ్వడమే కాదు, గవర్నమెంట్ వారు ఇచ్చే నెలనెలా పింఛన్ మీద కూడా అప్పులు ఇస్తాయి. ఇలాంటి సమయంలో అలాంటి వాళ్ళకి ఎంతోమందికి సహాయం చేశాడా ఆ సగటు ఉద్యోగి.
అరవై సంవత్సరములు దాటిన తర్వాత అసలు అప్పు ఏమిటి? అంటే—ఆ వయసులో ముఖ్యంగా ఆరోగ్య సమస్యలకు, తీరని కుటుంబ బాధ్యతలకు అప్పు కోసం వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు.
ప్రతి ఏడాది జనవరి నెలలో ఒక ఫ్యామిలీ పెన్షనర్ లోను కోసం వచ్చి అడిగేది. ప్రతి ఏట “పెన్షన్ లోనేమిటి?” అని అడిగితే—“అమ్మాయిని, అల్లుడ్ని, పిల్లల్ని పెద్ద పండక్కి తీసుకురావాలండి” అని చెప్పేది. ప్రతి ఏట అదే మాట.
ఆ మాటలు వింటుంటే, “ఈ వయసులో కూడా నువ్వు బాధ్యతలు తీరడం కోసం అప్పు చేయాలా తల్లి?” అనుకునే వాళ్ళు ఉద్యోగస్తులు.ఇంతకీ పాత అప్పు పోను, ఆవిడకి మిగిలేది ఒక వెయ్యి రూపాయలు మాత్రమే. ఇంతకీ ఆవిడ ఆ బ్యాంకులో పనిచేసి రిటైర్ అయ్యి చనిపోయిన ఉద్యోగి భార్య. ఇలాంటి కథలు ఎన్నో.
నీ అవసరాల కోసం డబ్బు దాచుకోలేదు. ఇప్పుడు నీ ఆరోగ్య సమస్యలకి నువ్వే డబ్బు తెచ్చుకోవాలి అంటే—ఆపద్బాంధవుడిలా ఎదురుగుండా కనిపించేది బ్యాంకు మాత్రమే ఇలాంటి వాళ్లకు.
అప్పటికి సాయంకాలం ఐదు గంటలు అయింది. ఇందులో మేనేజర్ బయటకు వచ్చి, “క్యాషియర్ గారు, క్యాష్ క్లోజ్ చేసేసారా? మన పతాంజలి శాస్త్రి గారికి అర్జెంటుగా ఐదు లక్షలు కావాలట” అన్నాడు.
“లేదండి, రమ్మనమనండి” అని క్యాషియర్ సమాధానం ఇచ్చాడు. రోజు ఇలాంటి సందర్భాలు ఎన్నో. సమయం కాని సమయంలో కూడా కస్టమర్ అవసరం తీర్చడం అనాదిగా బ్యాంకులు చేస్తూనే ఉన్నాయి. పరోక్షంగా ఇది ఉద్యోగస్తులు చేస్తున్న సేవ.
క్రమక్రమంగా బెంచీలన్నీ ఖాళీ అయిపోయాయి. ఈలోగా రాఘవరావు మూడుసార్లు బయటికి వెళ్లి వచ్చాడు తన వ్యక్తిగత అవసరాలకు. అప్పటికి సమయం ఆరు గంటలు అయింది.
ఆ సమయంలో భయం భయంగానే మేనేజర్ గదిలోకి అడుగు పెట్టాడు. రాఘవరావును చూస్తూనే రామారావు, “నమస్కారమండి, బాగున్నారా సార్?” అన్నాడు.
ప్రతి నమస్కారం చేసి, “నీ పేరు ఏమిటి?” అని అడిగాడు రాఘవ. “నా పేరు రామారావు. కాకినాడ బ్రాంచ్ లో మీ దగ్గర పని చేశాను” అని చెప్పాడు.
“గుర్తుపట్టలేకపోయాను. ఉదయం నుంచి నిన్ను చూస్తూనే ఉన్నాను. నా పాత రోజులు గుర్తుకొచ్చాయి. పని ఒత్తిడి ఏమీ తగ్గలేదు. అదేవిధంగా కొనసాగుతోంది” అన్నాడు రాఘవరావు.
మేనేజర్ చిరునవ్వు నవ్వి ప్రశ్నార్థకంగా చూశాడు. అప్పుడు అసలు విషయం చెప్పాడు రాఘవరావు—“నాకు పెన్షన్ లోన్ కావాలి.”
రామారావు పాస్‌బుక్ చూసి, “మీ బేసిక్ చాలా తక్కువ. పెన్షన్ లోన్ ఎంతో రాదండి. మీరు గత సంవత్సరమే లోన్ తీసుకున్నారు” అన్నాడు.
“అవును నిజమే. నా దగ్గర పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు కూడా నాకంటే ఎక్కువ పెన్షన్ తీసుకుంటున్నారు. మా అన్నయ్య రైల్వే డిపార్ట్మెంట్ లో పనిచేసి రిటైర్ అయ్యాడు. వాళ్ళ పే రివిజన్ జరిగినప్పుడల్లా పెన్షన్ పెరుగుతుంది. అలాగే నా స్నేహితులు సెంట్రల్ గవర్నమెంట్ లో పనిచేసిన వాళ్ళది కూడా అలాగే.”
“అప్పటి రోజుల్లో చేత్తో లెక్కలు రాసే రోజులలో ఎంతోమందికి పెన్షన్ లెక్కలు చూసిన రోజులు. మన దగ్గరకు వచ్చేటప్పటికి బ్యాంకు ఉద్యోగం వైట్ కాలర్ ఉద్యోగం అంటూ చెప్పుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మన పెన్షన్ కోసం మనమే తిరగాలి.”
“ప్రతిరోజు ఆశగా ఎదురు చూడాలి. పెరిగే ధరలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ ఒత్తిడి—ఇవన్నీ మధ్య విశ్రాంతి ఉద్యోగి నలిగిపోతున్నాడు. ఇప్పుడు విశ్రాంతి ఉద్యోగం కానీ, ఒకప్పుడు దేశ ఆర్థిక అభివృద్ధికి సేవ చేసిన వాడే.”
“కరోనా వచ్చినా, నోట్ల రద్దు వచ్చినా సేవ చేసిన వాడే. చేసిన పనికి మెప్పులు, చెయ్యని పనికి శిక్షలు అనుభవించిన వాడే. చేసిన పనికి జీతం పుచ్చుకున్నాం, కానీ ఒత్తిడికి వెల కట్టే వాళ్ళు ఎవరూ లేరు.”
రామారావుకి ఇవన్నీ తెలియనివి కాదు. అయినా రాఘవరావు ఆవేశంగా చెప్పాడు—“దేశంలో అనేక సమస్యలు ఉంటాయి. వాటిపై సభల్లో మాట్లాడే వాళ్లు ఉంటారు. కానీ బ్యాంకు ఉద్యోగుల సమస్యలు ప్రస్తావించే వాళ్లు ఎవరూ లేరు.”అన్నాడు.
రాఘవరావు కోరిక ప్రకారం పెన్షన్ లోన్ శాంక్షన్ చేశాడు రామారావు. అయినప్పటికీ అసంతృప్తిగానే బయటకు వచ్చాడు.
“ఎప్పటికీ నా పెన్షన్ పెరుగుతుందో, నేను ఎప్పుడు ఎరియర్స్ తీసుకుంటానో—అప్పుడే ఆనందంగా బయటకు వస్తాను ఈ బ్రాంచ్ నుండి” అని అనుకున్నాడు రాఘవరావు.
రాఘవరావు లాంటి వాళ్లు ఈ దేశంలో ఎంతోమంది ఉన్నారు. వారి కోరిక తీరేది ఎప్పటికి?వేచి చూద్దాం. మంచి కోరుకుందాం.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి