ఆ ఊరు మాకు వరమే



విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్లే రత్నాచల్ ఎక్స్ప్రెస్ నెమ్మదిగా నడుస్తూ అన్నవరం స్టేషన్ లోకి వచ్చి ఆగింది. ప్రయాణికులంతా లగేజ్ చేత పట్టుకుని గబగబా దిగే ప్రయత్నంలో ఉన్నారు. ఆ ప్రయాణికులను ఒకసారి చూస్తే కొత్తగా పెళ్లయిన జంట దగ్గర నుంచి ఎనభై ఏళ్ల వృద్ధుల వరకు ఉన్నారు. అక్కడే సగం బండి ఖాళీ అయిపోయింది. స్టేషన్లో నిలబడి ఉన్న ప్రయాణికులను గమనిస్తే ఎక్కువ శాతం మంది నుదుటన కుంకుమ బొట్టు పెట్టుకుని గుండు చేయించుకునీ తలకి గంధం పూత పూసుకున్న వాళ్ళు ఎక్కువగా కనబడ్డారు. అవును ఇది పుణ్యక్షేత్రం కదా ఇక్కడ ఎక్కువ స్వామివారి భక్తులే ఉంటారు. చెన్నై కలకత్తా రైలు మార్గంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు కనబడుతూ ఉంటాయి అలాంటి వాటిలో అన్నవరం ఒకటి 


ఎప్పుడూ రెండు నిమిషాలకు మించి ఆగని రైలు బండి సిగ్నల్ ఇవ్వని కారణంగా స్టేషన్లో నిలిచిపోయింది. రైలు స్టేషన్ అంత ఒక్కసారి చూస్తే దూరంగా అనంత లక్ష్మీ సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఫోటో దూరంగా కనబడుతోంది. ప్రతి ప్రయాణికుడు ఆ స్వామికి దండం పెట్టుకుని ముందుకు సాగుతున్నారు.


 ఆ రైలు మార్గంలో ప్రయాణం చేస్తుంటే దూరాన్నించి కొండమీద కనబడే స్వామికి నమస్కారము చేయని వాళ్ళు ఎవరు ఉండరు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు ఈ రైలు బండి కూడా స్వామి వారు కొలువై ఉన్న రత్నగిరి పేరు పెట్టుకుంది. అలాగే తూర్పు పశ్చిమగోదావరి జిల్లాలలో స్వామి వారి పేరు పెట్టుకున్న వాళ్ళు ఎక్కువగా కనబడుతుంటారు. తూర్పు పశ్చిమగోదావరి జిల్లా వాసులకి నిజంగా వరం లాంటిదే ఆ ఊరు. ఏ ఆపద వచ్చిన స్వామికి మొక్కుకుంటూ ఉంటారు.


 

ప్రతి పుణ్యక్షేత్రం సందర్శించిన అనుభవం ఒక మధురానుభూతిని మిగులుస్తుంది. ఆ ఊరి గుండా ప్రయాణం చేస్తుంటే ఆ పాత అనుభవాలు గుర్తుకొస్తాయి. దానికి సంబంధించిన చరిత్రలు జ్ఞప్తికి వస్తాయి.


విచిత్రం ఏమిటంటే మన కోరికలు తీర్చడానికి భగవంతునికి పూజలు, వ్రతాలు, నోములు చేస్తుంటాం. కానీ కొత్తగా పెళ్లయిన జంటలు, ఇల్లు కట్టుకున్న దంపతులు తప్పనిసరిగా మొట్టమొదట చేసే వ్రతం అనంతలక్ష్మి సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వ్రతం. నిత్యం ఎంతోమంది భక్తులు కొండ మీదకి వచ్చి వ్రతాలు చేసుకుంటూ తమ కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటారు. ఇక్కడున్న స్వామి చాలా మహిమాన్వితుడు . త్రిమూర్తి స్వరూపం. అనంతలక్ష్మి సమేతంగా రత్నగిరిపై కొలువై ఉంటాడు. 


  స్వామిని ప్రతినిత్యం మోసే ఈ రత్నగిరిది చాలా అదృష్టం. దీనికి ఒక పురాణ కథ చెబుతుంటారు. పర్వతాలలో శ్రేష్టుడైన మేరు పర్వతం, మేనకులకు భద్రకుడు రత్నకుడని ఇద్దరు కుమారులు జన్మిస్తారు. అందులో రత్నకుడు శ్రీమహావిష్ణువు మహా భక్తుడు. రత్నకుడు కోరిక మీద శ్రీమహావిష్ణువు వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి రూపంలో వెలుస్తాడు.


స్వామి వారి కొండకు చేరుకోవాలంటే మార్గాలు ఎన్ని ఉన్నప్పటికీ అదృష్టం ఉండాలి. ఏదైనా భగవంతుడు దర్శనం ఊరికే జరగదు. రాసిపెట్టి ఉండాలి. దేవుళ్ళకి ఎన్నో మొక్కులు మొక్కుతూ ఉంటాం. ఆ మొక్కులు తీరే సమయం వచ్చినప్పుడే మనకి భగవంతుడి దర్శన భాగ్యం కలుగుతుంది. 


దూరప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి ప్రధాన రైలు మార్గం లోనే ఉంది ఈ పుణ్యక్షేత్రం. రైలు దిగగానే స్టేషన్ బయట కొండ దగ్గరకు తీసుకెళ్తానంటూ పిలిచే ప్రయాణ సాధనాలు దేవస్థానం వారి బస్సులతో సహా ఎన్నో ఉన్నప్పటికీ ఈ బండిలో ప్రయాణం చేస్తే ఒక వింత అనుభూతి కలుగుతుంది. కళ్ళకు గంతలు కట్టుకుని యజమాని చేతిలో కళ్లెం పెట్టి పచ్చటి పంట పొలాల మధ్య పరిగెత్తే గుర్రపు బండి ప్రయాణం ఒక మధురానుభూతిని మిగులుస్తుంది. దారిలో ఉన్న వాళ్లని తప్పుకోమన్నట్లుగా చక్రాలకు తగిలించే చర్నాకోలు కర్ర చేసే వింత శబ్దం ఏదో పాత సంగతులను గుర్తు చేస్తుంది. అలాంటి కొద్దిపాటి ప్రయాణ అనుభూతిని ఆస్వాదించి తేరుకునేటప్పటికీ స్వామివారి మెట్ల దగ్గరకు చేరుతాం.

అమ్మో ఇన్ని మెట్లు ఎక్కాలా అని అనిపించదు . అదొక రకమైన ఉత్సాహం. కొత్తగా పెళ్ళైన జంటలు చెయ్యి చెయ్యి పట్టుకుని ముందుకు మధురోహలతో నడుస్తూ ఉంటే అలసట అసలు తెలియదు. మొక్కుకున్న వాళ్లు స్వామిని తలుచుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే అప్పుడే ఇన్ని మెట్లు ఎక్కేసామా అని అనిపిస్తుంది. స్వామి అన్ని రకాల వయసు వాళ్ళకి అవకాశాలు కల్పించాడు తన దగ్గరికి రావడానికి. 


ఈ దేవాలయం నాలుగు చక్రాలు కలిగిన రధం వలె నిర్మించబడింది. రెండు అంతస్తులు కలిగిన దేవాలయంలో క్రింది అంతస్తులో యంత్రం మరియు స్వామివారి పీఠం ఉంటుంది. మొదటి అంతస్తులో స్వామివారి మూలవిరాట్ ,శివుడు అనంతలక్ష్మి సత్యవతి దేవి ఉంటారు. యంత్రానికి నాలుగు వైపులా గణపతి ,సూర్యనారాయణ స్వామి, బాలా త్రిపుర సుందరి, మహేశ్వరుడు పంచాయతనం కలిగి ఉంది. ప్రధాన ఆలయానికి కుడివైపున రామాలయo నిర్మించబడి ఉంది. ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి క్షేత్రపాలకుడు. రామాలయం పక్కన భోజన శాల, వ్రత మండపాలు , ఎడమవైపు విశ్రాంతి మందిరం కళ్యాణ మండపం నిర్మించబడి ఉన్నాయి. కొద్ది దూరంలో వన దేవత గుడి. రాత్రిపూట ఆ దేవత ఇక్కడ సంచరించి ఈ ప్రాంతాన్ని సంరక్షిస్తూ ఉంటుందట.


అనేక రకాల మ్రొక్కులతో భక్తులు అక్కడికి చేరుకుంటారు. కొందరు స్వామి వారి దర్శనానికి, మరికొందరు తల నీలాలు సమర్పించడానికి, స్వామి వారి వ్రతం చేసుకోవడానికి వస్తుంటారు 


 రుసుము చెల్లిస్తే దేవస్థానం వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేస్తారు . తలనీలాలు సమర్పించిన వాళ్ళకి ఒక రకమైన బాధ్యత తీర్చుకున్నట్లుగా అనిపిస్తుంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. కొండకు దిగువున ప్రశాంతంగా పంపానది ప్రవహిస్తూ భక్తుల పాపాలను కడుగుతూ ఉంటుంది. పంపా నదిలో స్నానం చేసి స్వామివారి వ్రత మండపానికి చేరుకుంటారు భక్తులు. ఎన్నో కోరికలతో మ్రొక్కులతో అక్కడ భక్తులు స్వామివారి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. సంకల్పం చెప్పిన తర్వాత మండపారాధన ,శతనామాలతో స్వామివారిని పూజించి స్వామి వారి మహత్యం తెలియచెప్పే ఆ ఐదు కథలు విన్న తర్వాత హారతి కళ్ళకు అద్దుకుని ఒక విధమైన సంతృప్తికరమైన మనసుతో స్వామివారి దర్శనానికి బయలుదేరతారు భక్తులు. బయటకు వచ్చి చూసేటప్పటికి కిటకటలాడుతున్నారు భక్తులు. ఇంక పుణ్య దినాల్లో ప్రత్యేక ఉత్సవ సమయాల్లో ఎలా ఉంటారో ఊహించుకోవచ్చు. ప్రతి ఎటా వైశాఖ శుద్ధ ఏకాదశినాడు స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు, చైత్ర శుద్ధ నవమి నాడు సీతారామ కళ్యాణం, కార్తీక పౌర్ణమి నాడు గిరి ప్రదక్షణ ఉత్సవాలు తిలకించడానికి వచ్చే భక్తుల సంఖ్యల లక్షల్లో ఉంటుంది. అంత మహత్యం గలది ఈ కొండ. ఇంక దర్శనం కోసం గర్భగుడి వైపు కదిలితే

గర్భగుడిలో స్వామివారి విగ్రహం స్థూపాకారంగా ఉంది. దీని పీఠం బ్రహ్మను, మధ్యభాగం శివుడిని, పై భాగం విష్ణు రూపాన్ని సూచిస్తూ త్రిమూర్తి రూపంగా వెలుగొందుతూ ఉంది. ఎక్కువ రద్దీ లేకుంటే మన అదృష్టం బాగుంటే స్వామిని కొన్ని నిమిషాలు ఎక్కువ చూడొచ్చు. స్వామిని దర్శించే కన్నులే కన్నులు, పూజించే చేతులే చేతులు, సత్యనారాయణ స్వామి కథలు విన్న చెవులే చెవులు, అలాంటి అదృష్టం భగవంతుడి ఆశీర్వాదం మూలాన్ని మనకు కలుగుతుంది. 


ముగ్గురు స్వాములు అక్కడే ఉన్నారు . వారి ముగ్గురిని చూసినా ఆనందంతో బయటకు వచ్చినప్పుడు కొండ చుట్టూరా ఉండే పంట పొలాల మీద నుంచి, కొండమీద ఉండే రకరకాల వృక్షాల నుంచి, కొండ దిగువన ఉన్న పంపానది మీద నుండి వీచే చల్లని గాలి మనసుకి ఒక వింత అనుభూతిని హాయిని సమకూరుస్తుంది. 


ఇంకా అక్కడ ఉన్న శ్రీరామచంద్రమూర్తిని దర్శనం చేసుకుని వనదేవతకు నమస్కారం చేసుకొని ఒక్క క్షణం అలా మెట్ల మీద కూర్చుని ఆ కట్టడాల కేసి తల పైకెత్తి చూస్తే అబ్బా ఏమి నిర్మాణాలు మహానుభావులు ఎవరు కట్టించారో ఈ గుడి అని అనుకుని ఆ సమయంలో అటుగా వెళుతున్న ఒక వృద్ధ పురోహితుడిని పలకరిస్తే ఆయన చెప్పిన చరిత్ర వింటే ఒళ్ళు జలదరించిపోతుంది .. శ్రీమహావిష్ణు భక్తులైన అన్నవరం గ్రామ నివాసులు ఈరంకి ప్రకాశ రావు , రాజా ఇనుగంటి వెంకట రామా

రాయనిం వారికి ఏకకాలంలో కలలో కనబడి ఆలయం నిర్మాణం చేయమని స్వామి ఆదేశించారట . అలా ఆలయం 1891 వ సంవత్సరంలో నిర్మించబడింది .


హమ్మయ్య దర్శనం అయిపోయింది. అబ్బా అక్కడ అంత మంది జనం క్యూలో నిలబడున్నారేమిటి ? ఏదైనా దేవాలయం చూడడం మర్చిపోయామా అని అనుకుంటూ ఉంటే ఒక పిల్లవాడు చేతిలో ప్రసాదం పొట్లం పట్టుకుని పరిగెత్తుకుంటూ వస్తుంటే అప్పుడు అది ప్రసాదాలు అమ్మే స్థలం కదా అని గుర్తుకొచ్చింది . తాటికేయంత అక్షరాలతో బోర్డు ఉన్నప్పటికీ దూరం నుంచి అది కనపడలేదు.

ఇలాంటి ప్రదేశమే మెట్ల దగ్గర కూడా కనబడింది కదా అని అనుకుని ముందుకు సాగి అన్నవరం వెళ్లి వస్తాము అని పక్కింటి వాళ్లకి ఎదురింటి వాళ్ళకి చెప్పి బయలుదేరుతున్న సమయంలో వాళ్లు చేతిలో సొమ్ము పెట్టి వచ్చేటప్పుడు నాలుగు ప్రసాదం ప్యాకెట్లు పట్టుకు రండి అని ఎంతో భక్తితో అడిగిన కోర్కెలు కూడా గుర్తు చేసుకుని ప్రసాదం ప్యాకెట్లు కొనుక్కొని మళ్లీ మెట్ల మీద కూర్చుని ఆత్రుతగా అడ్డాకు లో ఉన్న పొట్లం విప్పి చూసేటప్పటికి అబ్బ నెయ్యి కారుతూ ఎర్రటి గోధుమ నూక ప్రసాదం కాస్త నోట్లో వేసుకునేటప్పటికీ స్వర్గం కనబడింది. అది స్వామి రుచి చూసిన ప్రసాదం. అప్పుడు గుర్తుకొచ్చింది కళ్ళకు అద్దుకోకుండా ప్రసాదం తినేసాము అని మరొకసారి కళ్ళకు అద్దుకుని ఇంకొక చిన్న ఉండ నోట్లో వేసుకునేటప్పటికీ నాలిక మాటిమాటికి మారు అడిగింది. చివరికి ఆకుని నాలికతో నాకి నాకి మధురానుభూతిని పొంది మరొక పొట్లం వైపుకు చెయ్యి సాగింది. ఇందులో ఏదో అమృతం కలుపుతారు అందుకునే ఇంత రుచిగా ఉంటుంది అని అనుకుంటే తప్పు ఇందులో వాడే వస్తువులు నిత్యం మన ఇంట్లో దొరికే ఎర్రటి గోధుమ నూక బెల్లం జీడిపప్పు ,యాలకులు నెయ్యి అయినప్పటికీ మనం ఎంత శ్రద్ధగా తయారుచేసినప్పటికీ ఈ రుచి తీసుకురాలేము. స్వామివారే స్వయంగా ఈ తయారీలో పాల్గొంటారేమో అని అనిపిస్తుంది. స్వామి వారి ప్రసాదం కొండమీదనే కాకుండా కొండ దిగున మెట్ల దగ్గర అటు రహదారి మీద కూడా ప్రసాదాల అమ్మకం సాగుతూ ఉంటుంది. స్వామివారి ప్రసాదం అంటే అంత మక్కువ ప్రజలకి. అక్కడ స్వామివారి వ్రతం పట్టిన సమయంలో ప్రసాదంగా ఇచ్చిన కొబ్బరి చెక్కలు ఆ మెట్ల మీద కొడుతున్నప్పుడు వచ్చిన శబ్దం అదొక వింత అనుభూతి. ముక్క నోట్లో వేసుకుంటే మరిచిపోలేని ఆనందం. ఇంక ఎక్కడకు వచ్చిన ఇవాళ రేపు అక్కడి దృశ్యాలను తమ మొబైల్ ఫోన్లో బంధిస్తూ ఉంటారు పిల్లలు. అక్కడికి దగ్గర్లో ఉన్న అందమైన ఉద్యానవనం లో ఎన్నో ఫోటోలు తీసుకుని పిడపర్తి వారి సూర్య గడియారం సందర్శించుకుని సమయం చూసుకునేటప్పటికీ అబ్బో రైలు సమయం దగ్గరకు వస్తోందనే విషయం గుర్తుకొచ్చింది. 


  స్వామివారి ప్రసాదం తిన్నాం బానే ఉంది ఇంతవరకు ఆకలి తెలియలేదు ఇప్పుడు ఆత్మ రాముడు గోల పెడుతున్నాడు అని అనుకునేసరికి ఎదురుగుండా ఉచిత అన్న ప్రసాదానికి దారి అనే బోర్డు కనబడేసరికి స్వామి వారి అన్నప్రసాదం చూసేసరికి ఎక్కడలేని ఆకలి ముంచుకొచ్చింది. పచ్చటి అరిటాకులో అన్న ప్రసాదం. ప్రతిరోజు విసుగు విరామం లేకుండా వండి వార్చి పెడుతున్న ఆలయ సిబ్బందికి మహా నమస్కారం. తన దర్శనం చేసుకున్న వాళ్ళకి మానసిక శాంతిని, ఆకలిని తీర్చాలని స్వామివారి సంకల్పం.

కొండమీద గడిపిన ఆ కొన్ని గంటలు ఎలా గడిచిపోయాయో తెలియలేదు. ప్రతి మూలలో ఒక శాంతి, ప్రతి గాలిలో ఒక పవిత్రత, ప్రతి క్షణంలో ఒక ఆధ్యాత్మిక ఆనందం కలిసిపోయి మనసును నింపేశాయి. కిందకి దిగుతూ ప్రతి మెట్టూ ఒక జ్ఞాపకంగా మారింది. ఎక్కేటప్పుడు ఉన్న ఉత్సాహం, దర్శనం తర్వాత వచ్చిన ప్రశాంతత—ఇవి రెండూ కలిసిపడి ఒక అపూర్వమైన అనుభూతిని ఇచ్చాయి.

కిందికి చేరేసరికి సూర్యుడు కొంచెం ఒదిగిపోయి, చల్లని గాలి వీచడం మొదలైంది. స్టేషన్ వైపు నడుస్తూ తిరిగి ఒకసారి కొండపైకి చూసాను. అక్కడ వెలుగొందుతున్న స్వామివారి గుడి కనిపించింది. మనసులోనే నమస్కారం పెట్టుకుని— పక్కకు తిరిగి చూసేటప్పటికి పునర్దర్శన ప్రాప్తిరస్తు అనే బోర్డు కనబడింది. అది స్వామి వారి ఆశీర్వచనంలా భావిస్తారు.


రైలు స్టేషన్‌లోకి వచ్చేసరికి మళ్లీ ఆ పరుగులు, ఆ కేకలు, ఆ ప్రయాణ హడావిడి మొదలైంది. కానీ ఈసారి మనసు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. చేతిలో ప్రసాదం పొట్లాలు, హృదయంలో భక్తి నిండిన అనుభూతి, కళ్లలో ఇంకా మెదులుతున్న స్వామివారి రూపం—ఇవి అన్నీ కలిసి ఆ ప్రయాణాన్ని మరపురాని యాత్రగా మార్చేశాయి.

రైలు నెమ్మదిగా కదలడం మొదలయ్యింది. కిటికీ బయటకి చూస్తూ ఉండగా రత్నగిరి కొండ క్రమంగా దూరమవుతోంది. కానీ మనసులో మాత్రం ఆ అనుభూతి మరింత దగ్గరవుతోంది…


అన్నవరం యాత్ర—ఇది ఒక ప్రయాణం కాదు, ఒక అనుభవం. ఒక దర్శనం కాదు, ఒక దైవస్పర్శ. ఇది నా ఒక్కడే మనోభావమే కాదు ఆ పుణ్య స్థలాన్ని సందర్శించిన ప్రతి యాత్రికుడి అంతరంగం. జీవితంలో ఒక్కసారి కాదు వీలైనప్పుడల్లా వెళ్ళవలసిన పుణ్యక్షేత్రం.


రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు 

కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట