భారం కాదు ! ప్రాణం
“ఏవండీ... మీరు రాకపోతే బాగుండదేమో! దగ్గర వాళ్లు కదా!” అంది సుమతి చేతిలోని శుభలేఖను చూస్తూ.
“ఎలా రమ్మంటావు సుమతి? మన విజయ్ ని ఎవరో ఒకరు చూసుకోవాలి కదా! నువ్వూ, రాజేష్ వెళ్లి రండి...” అన్నాడు రాజారావు.
“క్రితం సారి పండక్కి వెళ్లినప్పుడు మన విజయ్ చేసిన అల్లరి చూసి గట్టిగా కసిరారు ” అని ఇంటికి వచ్చి బాధపడ్డావు. ఆ పిల్లాడికి ఏమీ తెలియక అల్లరి చేస్తున్నాడని, అలాంటి పనులు చేస్తున్నాడని మనకు తెలుసు. తల్లిదండ్రులుగా మనకు తప్పదు.
పై వాళ్లకు మాత్రం అది చిరాకుగా ఉంటుంది. ఏం చేస్తాం? మన కర్మ ఇలా ఉంది. భగవంతుడు ఇలాంటి శిక్ష వేశాడు...” అని బాధపడ్డాడు రాజారావు.
సుమతికి ఒక్కసారిగా సంక్రాంతి పండక్కి అన్నగారింటికి వెళ్లినప్పుడు జరిగిన దృశ్యం గుర్తుకొచ్చింది. ఏదో సరదాగా ఉందామని వెళ్తే, విజయ్ చేసిన పనులతో బాధ, సిగ్గు ముంచుకొచ్చాయి.
ఏది పడితే అది, సమయం సందర్భం లేకుండా వంటింట్లోకి వెళ్లి తినడం, ప్రతి సామాను కింద పడేయడం, మలమూత్రాలన్నీ గదిలో, మంచం మీద చేసి పాడు చేయడం...ఒకటి కాదు... ఎవరి దగ్గర వస్తువు కనిపించినా వాళ్ల దగ్గరికి వెళ్లి లాక్కోవడం, పెద్దగా అరవడం, ఎవరు మందలించినా నవ్వుతూ మళ్లీ అదే పని చేయడం...
విజయ్‌ను అదుపు చేయడానికి సుమతి, రాజారావు ఇద్దరూ పడిన బాధ అంతా ఇంతా కాదు. వచ్చిన వాళ్లందరి మధ్య నిలబడలేక, నవ్వుతున్న వాళ్లను చూసి బాధతో తలదించుకున్నారు సుమతి ,రాజారావు.
" అమ్మా సుమతి ! ఇలాంటి వాళ్ళకి హాస్టల్స్ ఉంటాయి. ప్రత్యేకమైన స్కూళ్లు ఉంటాయి "అన్నాడు సుమతి అన్నయ్య సుధాకర్. *ఇలాంటి వాళ్లు* అనే మాటని గట్టిగా పలుకుతూ ! . నిజమే విజయ్ ఒక ప్రత్యేకమైన పిల్లవాడు. ఇలాంటి వాడిని అమ్మా ,నాన్న తప్ప ఎవరు బాగా చూడగలరు . అమ్మో హాస్టల్ లో వేస్తే ఇంకేమైనా ఉందా! అక్కడ వాళ్ల మాట వినకపోతే తాడుతో కట్టి పడేయడం, బెల్టుతో కొట్టడం లాంటివి చేస్తారట. తల్లి కాబట్టి మూడు పూటలా కడుపు నింపుతోంది. మరి అక్కడ వాళ్లకు బాధ్యత ఏముంటుంది . సుధాకర్ మాటలకి బాధపడి ఆ రోజు ఇంటికి తిరిగి వస్తున్నంతసేపూ ఆ దంపతులు ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు బాధతో.
" నలుగురిలోకి తీసుకెళ్లకుండా పిల్లవాడిని ఎప్పుడు ఇంట్లో ఉంచకూడదు. నలుగురిని చూసుకొని నేర్చుకుంటాడు" అని డాక్టర్ గారు చెప్పిన మాటలకు వెంటబెట్టుకుని వెళితే ఇదిగో ఇలాంటి అవమానాలు వస్తున్నాయి.
" లేదండి మీకంటే నా అవసరమే వాడికి ఎక్కువ. అవన్నీ మీరు పడలేరు. నేను కూడా వెళ్లకుండా ఉండిపోతాను అంది సుమతి.
" లేదు సుమతి నువ్వు వెళ్లకపోతే మీ అన్నయ్య బాధపడతాడు అన్నాడు రాజారావు.
" లేదండి ఎవరు నా బిడ్డ కంటే ఎక్కువ కాదు. అయినా నేను అలాంటి సరదాలు ఎప్పుడో వదిలేసుకున్నాను. మనిద్దరం కూడా సరదాగా సినిమాకి వెళ్లి ఎన్నో రోజులు అయింది. మీరు నా పరిస్థితి చూసి ఏ కోరిక కోరడం లేదు.
అవన్నీ నాకు అర్థమవుతున్నాయి. ఏం చేస్తాము తలరాతలు అలా ఉన్నాయి అని బాధపడింది సుమతి.
నిజమే ఆ పిల్లవాడి మీద బెంగతో వయసులో ఉన్న దంపతులు జీవితం ఆనందంగా అనుభవించడానికి అవకాశం లేకుండా చేశాడు.
రెండో కాన్పులో కూడా మగపిల్లాడి పుట్టాడని సుమతి రాజారావు చాలా సంతోషించారు. కాలం గడిచే కొద్ది పసిపిల్లల్లో జరగవలసిన మార్పులు రావటం లేదని డాక్టర్ దగ్గరకు వెళితే డాక్టర్ చెప్పిన మాటలకి వణికిపోయారు. ఎప్పటికో మార్పు రావచ్చు అప్పటివరకు ఓపిగ్గా ఉండాలి అని చెప్పిన డాక్టర్ మాటలకి తిరగని గుడి లేదు ,గోపురం లేదు ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయ్ విషయంలో విజయం సాధించలేకపోయింది సుమతి.
ఇప్పుడు తెల్లవారిందంటే భయం. సుమతి , విజయ్ రెండు శరీరాలు కానీ అన్నింటికీ సుమతి మీదే ఆధారం
విజయ్ కి. విజయ్ పాలు తాగే పసిపాప లాంటివాడు. ఆకలేస్తుందని అడగడం తెలియదు. ఆకలిగా ఉన్నా లేకపోయినా తినడమే తెలుసు. కాలకృత్యాలు సొంతంగా చేసుకోలేడు. తల్లి తప్ప తోటి అన్నగారితో కూడా ఆడుకోడు. బయట పిల్లలతోటి దెబ్బలాటలు. అందరూ విజయ్ కి పిచ్చి అని చెప్పుకోవడం విని బాధపడుతూ ఉంటారు తల్లిదండ్రులు.
బయటకు తీసుకెళ్తే బజార్లో వస్తువులు చూసిందల్లా అడిగిన ఖరీదు ఎంత అయినా కొని ఇస్తుంటారు. ఏ పుట్టలో ఏ పాముందో అని డాక్టర్ దగ్గరికి, ఆసుపత్రులకు తిప్పుతూ ఉంటారు. ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా పాపం విజయ్ విషయంలో అసలు తేడా చేయరు. దేనికి వెనుకాడరు ఆ దంపతులు. ఎప్పటికైనా వాడి జీవితం బాగుపడుతుందేమో అనే ఆశతో ప్రయత్నాలు చేస్తుంటారు. సుమతి పరిస్థితి చూసి పక్కింటి వాళ్ళు అంటూ ఉంటారు "సుమతి నీకు చాలా ఓపిక ఎక్కువ అని ఆ మాటలకు సుమతి పేలవంగా నవ్వుతుంది. నేను ఉన్నంతకాలం పర్వాలేదు.
తర్వాత ఎవరు చూస్తారు అదే రాత్రింబవళ్లు వాళ్లని వెంటాడే ప్రశ్న.
నిజమే ఎవరి మీద పెడతారు ఈ బాధ్యత. బాధ్యత అనేది ఎవరైనా మోయడానికి ముందుకు రావాలి కానీ ఎవరికి అప్ప చెప్పకూడదు. అప్పచెప్పిన బాధ్యతలన్నీ బరువు అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు.
ఆ ఒక్క లోపం తప్ప వీడికి ఏమి తక్కువ! తెల్లగా, బొద్దుగా, ఎత్తుగా, గిరజాల జుట్టుతో సినిమా హీరోలా ఉంటాడు పాపం అంతా రాజారావు పోలిక అని అనేవారు ఇరుగు పొరుగు వారు విజయ్ ని చూసినప్పుడల్లా .
కాలం ఎవరి గురించి ఆగదు. మనిషి ఎలా ఉన్నా సరే వయసు వచ్చి మీద పడిపోతూనే ఉంటుంది. అలాగే ప్రపంచం గురించి తెలిసిన తెలియకపోయినా విజయ్ కి నూనూగు మీసాలు వచ్చే వయసొచ్చేసింది.
ఎంత కొడుకైన ఆ వయసులో విజయ్ కి స్నానం చేయించి బట్టలు మార్చాలంటే పాపం సిగ్గుగా ఉండేది సుమతికి.
ఆ బాధ్యత అంతా ఇప్పుడు రాజేష్ , రాజారావు పంచుకున్నారు. విజయ్ పరిస్థితి ఇలా ఉంటే రాజేష్ చదువులో చురుకుగా ఉండి ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి హైదరాబాదులో ఉద్యోగం సంపాదించాడు. ఇప్పుడు విజయ్ పూర్తి బాధ్యత అంతా రాజారావు మీద పడింది.
బాధలతోటి, భయాలు తోటి, బెంగలతోటి కాలం గడుపుతున్న ఆ కుటుంబానికి రాజారావు హఠాత్తు మరణం సుమతిని బాగా కృంగదీసింది. రాజారావు బతికున్నంత కాలం బాధలతో గడిచిపోయింది. రాజేష్ ని ఒక ఇంటివాడి గా చేసే బాధ్యత ఇంకా పూర్తిగా తీరలేదు. విజయ్ సమస్యకి పరిష్కారం దొరకలేదు. అయినా ఎవరి సమయం అయిపోతే వారు వెళ్ళిపోతారు. తీరని బాధ్యతలతోటి ,బంధాలతోటి సంబంధం ఏమీ ఉండదు.
రాజారావు పోయిన దగ్గర నుంచి రాజేష్ ప్రతినెల హైదరాబాదు నుంచి వచ్చి తమ్ముడిని, తల్లిని చూసి వెళ్తుంటాడు. వచ్చినప్పుడల్లా "నాతో పాటు నువ్వు తమ్ముడు హైదరాబాద్ వచ్చేయండి. అందరూ అక్కడే కలిసి ఉందాం అని గొడవపెట్టిన ఎందుకురా! ఇక్కడైతే సొంతిల్లు అక్కడ ఇలాంటి పిల్లవాడిని పెట్టుకుని అద్దె ఇళ్లలో చాలా కష్టం. చుట్టుపక్కల వాళ్లతో సమస్యలు వస్తాయి "
అని సున్నితంగా తిరస్కరించేది సుమతి.
రాజేష్ ఇంటికి వచ్చినప్పుడల్లా "ఒరేయ్ సంబంధాలు వస్తున్నాయి నువ్వు సరే అంటే నేను ముందుకు వెళ్తాను అని చెప్పగా చెప్పగా రాజేష్ ఆలోచనలో పడ్డాడు.
ఇప్పుడు పెళ్ళికి ఒప్పుకుంటే రేపు అమ్మ తర్వాత తమ్ముడి పరిస్థితి ఏమిటి? ఆ వచ్చిన అమ్మాయి చూస్తుందని గ్యారెంటీ ఏమిటి? నా స్వార్థం నేను చూసుకుంటే రేపు తమ్ముడునీ హాస్టల్లో పడేవలసి వస్తుంది. హాస్టల్లో పడేసి చేతులు దులుపుపోవడానికి వాడు నా తమ్ముడు. అయినా అందరిలాంటి వాడు కాదు . వాడి గురించి వాడికే తెలీదు. తెలుసున్న నేను ఈ బాధ్యతల నుండి పారిపోలేను. ఎవరి మీద నమ్మకాలు పెట్టుకుని బాధ్యతలు అప్ప చెప్పే రోజులు కావు ఇవి అనుకుంటూ సుమతికి విడమర్చి చెప్పాడు రాజేష్.
ఈ విషయాలన్నీ సుమతికి తెలియనివి కాదు. ఎంత చెప్పినా రాజేష్ వినిపించుకోకపోవడంతో సుమతి ఏమీ చేయలేకపోయింది. కానీ విజయ్ లాంటి పిల్లాడి భవిష్యత్తు రాజేష్ చేతిలో బాగుంటుందని ఆశతో మౌనంగా ఊరుకుంది.
“కొద్దిరోజుల తర్వాత విజయ్ తీవ్ర జ్వరానికి గురయ్యాడు. ఆసుపత్రులు తిరిగారు. దేవుడిని వేడుకున్నారు. కానీ ఈసారి సుమతి చేతులు ఖాళీ అయ్యాయి. ఇన్నాళ్లు గుండెల్లో పెట్టుకుని పెంచుకున్న విజయ్, తల్లి కళ్ల ముందే శాశ్వత నిద్రలోకి జారిపోయాడు. విజయ్ బ్రతికున్నప్పుడు ఒక్కరోజైనా అతన్ని భారంగా అనుకోలేదు సుమతి. కానీ ఇప్పుడు ఖాళీ అయిన ఇల్లు, మూలన పడి ఉన్న అతని బొమ్మలు, అతను కూర్చునే చోటు... ఆమె మనసుని ముక్కలు చేశాయి.
తెల్లవారితే వాడి పనులు, రాత్రి పడుకునే వరకు వాడి చుట్టూనే జీవితం తిరిగేది. అలసట ఉండేది... బాధ ఉండేది... భయం ఉండేది... కానీ వాడు ఉండేవాడు.
ఇప్పుడు బాధ లేదు... కానీ ప్రశాంతత కూడా లేదు.
మూలన పడి ఉన్న విజయ్ బొమ్మలు చూస్తే గుండె పిండేసినట్టు ఉంటుంది. ఎప్పుడూ అరుస్తూ, పరుగులు పెడుతూ, ఏదో ఒక అల్లరి చేస్తూ ఇల్లంతా తిరిగే విజయ్ లేక ఆ ఇల్లు నిశ్శబ్దంగా మారిపోయింది.
‘అమ్మా...’ అని పిలిచే శబ్దం లేదు.
వాడి కోసం వండిన ఆహారం లేదు.
వాడి కోసం తలుపు వేసి కాపలా కాయాల్సిన అవసరం లేదు.
కానీ ఆ అవసరమే ఇప్పుడు సుమతికి కావాలి.
‘పిల్లలు భారం కాదు... వాళ్లు ఎలా ఉన్నా మన ప్రాణంలో భాగం’ అని జీవితం నేర్పిన గొప్ప పాఠంలా విజయ్ జ్ఞాపకం మిగిలిపోయింది.
మామూలు పిల్లల్ని పెంచడమే ఈ రోజుల్లో చాలా కష్టతరమైన పని. అలాంటిది భిన్నమైన పిల్లవాడిని ఇంతవరకు ఏ లోటు లేకుండా పెంచుకుంటూ వచ్చిన సుమతికి రెండు చేతులెత్తి నమస్కారం పెట్టాలి అని చెప్పుకునేవారు అందరూ.
‘నేను విజయ్ కి జీవితం ఇచ్చాను అనుకోవడం లేదు... విజయ్ నాకే జీవిత అర్థం నేర్పించాడు...’ ” అని అనుకుంటూ ఉంటుంది సుమతి విజయ్ జ్ఞాపకం వచ్చినప్పుడల్లా
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి