కాకినాడ కాజా _ఒక ఊరి తీపి గర్వం



నోరు మెచ్చిన రుచులు ఒక ఊరికి ప్రత్యేకతను, సంస్కృతిని, వారసత్వాన్ని తీసుకొస్తాయనే మాట అతిశయోక్తి కాదు. అది అక్షరాలా నిజం. కళ్లముందు కనిపించే సత్యం. ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాల విస్తరణతో ప్రతి ప్రాంతం తన ప్రత్యేకతను నిలబెట్టుకున్న వంటకాల ద్వారా ప్రపంచానికి మరింత చేరువైంది. ఒక ప్రాంతాన్ని గుర్తు చేసే ఆలయాలు, నదులు, పంటపొలాల మాదిరిగానే అక్కడి రుచులు కూడా ఆ ఊరి గుర్తింపుగా నిలుస్తున్నాయి.


హైదరాబాద్ అంటే దమ్ బిర్యానీ గుర్తొస్తుంది. తిరుపతి అంటే లడ్డూ గుర్తుకు వస్తుంది. అన్నవరం ప్రసాదం రుచి చూసినవారు ఆ ఆకు కూడా వదలకుండా తినేస్తారు. బందరు లడ్డు, ఆత్రేయపురం పూతరేకులు, రాజమండ్రి రోజ్ మిల్క్, గంగరాజు పాలకోవా, కాకినాడ కాజా...


ఇలా ఎన్నో రుచులు తరతరాలుగా మన నాలుకలపై మధుర జ్ఞాపకాలుగా నిలిచిపోయాయి. కాలం మారినా, తరాలు మారినా వాటి ప్రత్యేకత మాత్రం ఏమాత్రం తగ్గలేదు.

రుచి అనేది కేవలం ఆహారానికి సంబంధించినది కాదు. అది ఒక ప్రాంతం ఆత్మను ప్రతిబింబిస్తుంది. సంస్కృతిని మోస్తుంది. చిన్ననాటి జ్ఞాపకాలను మళ్లీ మన కళ్ల ముందు నిలబెడుతుంది. ఒక ఊరి పేరు వినగానే అక్కడి ప్రత్యేక రుచి కూడా మనసులో మెదలడం యాదృచ్ఛికం కాదు. అది ఆ ప్రాంతం జీవనశైలికి, అక్కడి మనుషుల కష్టానికి ప్రతీక.

కొన్ని వంటకాలు కేవలం పదార్థాలతో తయారవ్వవు. వాటిలో మనుషుల కలలు ఉంటాయి. కష్టం ఉంటుంది.


 ఓటములను దాటి ముందుకు సాగిన పట్టుదల ఉంటుంది. ఒక ఊరిని దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చిన సాధన దాగి ఉంటుంది. అందుకే కొన్ని రుచులు నాలుకపై మాత్రమే కాదు... కాలం గడిచినా మనసులోనూ నిలిచిపోతాయి.

అలాంటి కథే కాకినాడ కాజాది.


ఎక్కడో పక్క జిల్లాలో పుట్టి, జీవనోపాధి కోసం కాకినాడకు వలస వచ్చిన ఒక సాధారణ వ్యక్తి చేతుల్లో పుట్టిన తీపి అద్భుతం అది. విభిన్న రుచితో, ప్రత్యేకమైన తయారీ విధానంతో అందరి మనసులు గెలుచుకున్న ఆ కాజా, కాలక్రమంలో "కోటయ్య కాజా"గా పేరు సంపాదించింది.


దాదాపు వందేళ్లకు పైగా తరతరాలుగా తీపిని పంచుతూ, కాకినాడ పేరును దేశమంతా వినిపించేలా చేసింది.

ఆ చిన్న తీపి ముక్కలో కేవలం పంచదార పాకం మాత్రమే లేదు. ఒక మనిషి కల ఉంది. కష్టం ఉంది. సాధించాలనే సంకల్పం ఉంది. ఒక వ్యక్తి జీవిత ప్రయాణం ఉంది. అందుకే కాకినాడ కాజా కేవలం ఒక మిఠాయి కాదు... అది ఒక ఊరి గర్వం. ఒక మనిషి పట్టుదలకు నిలువెత్తు నిదర్శనం.


"ఏముంది... మైదాపిండి ముద్దలో కొంత శనగపిండి కలిపి కాజాగా ఆకారం తీర్చిదిద్ది, పంచదార పాకంలో ముంచడమే కదా!" అని ఎవరైనా అనుకోవచ్చు. కానీ కాకినాడ వాళ్లు ఆ మాటను అంత తేలికగా ఒప్పుకోరు.


"అందరూ తయారు చేసే పద్ధతే అయితే ఇన్ని లక్షల మంది అభిమానాన్ని ఎలా సంపాదించింది?" అని ఎదురు ప్రశ్న వేస్తారు.నిజమే. ఏదో ప్రత్యేకత ఉంది కాబట్టే కాకినాడ వచ్చినవాళ్లు ప్రధాన రహదారి మార్గంలో ఉన్న కోటయ్యగారి కాజా దుకాణంలో అడుగుపెట్టకుండా ఉండరు. తెలిసినవాళ్లు ఎవరైనా కాకినాడ వస్తున్నారని తెలిస్తే చాలు..."కాస్త ఒక కేజీ కోటయ్యగారి కాజా తెచ్చిపెట్టండి" అని అడుగుతుంటారు.


అదే కాకినాడ కాజా గొప్పతనం.


ఇక్కడ ప్రతి విందు భోజనంలోనూ, ప్రతి శుభకార్యంలోనూ, బంధువుల రాకపోకల్లోనూ కోటయ్యగారి కాజా తప్పనిసరిగా పలకరిస్తుంది. పెళ్లిళ్లు అయినా, పేరంటాలు అయినా, పుట్టినరోజులు అయినా, బయట ఊళ్ల నుంచి వచ్చే అతిథులకు కానుకగా ఇవ్వాలన్నా... కాకినాడ కాజా ముందుంటుంది.


ఆకారంలో పొట్టిగా కనిపించే కాజా, రుచిలో మాత్రం ఎంతో గొప్పది. బయటకు సాధారణంగా కనిపించినా, ఒకసారి కొరికి చూస్తే లోపల దాగి ఉన్న తీపి పాకం నాలుకను తాకుతూ మనసును హత్తుకుంటుంది.


పాకం నిండిన పొరలు నోటిలో కరిగిపోతూ చిన్ననాటి జ్ఞాపకాలను మళ్లీ కళ్లముందు నిలబెడతాయి. చిన్నప్పుడు ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు తీసుకొచ్చిన తీపి పొట్లాలు గుర్తుకొస్తాయి. పండుగ రోజుల్లో భోజనం చివరలో కాజా కోసం ఎదురుచూసిన రోజులు గుర్తొస్తాయి.


కాకినాడలో పెరిగిన వాళ్లకు కాజా ఒక తీపి పదార్థం మాత్రమే కాదు. అది జీవితంలో ఒక భాగం.

కాలం మారింది. తినే అలవాట్లు మారాయి. విదేశీ వంటకాలు వచ్చాయి. కొత్త కొత్త స్వీట్లు మార్కెట్లోకి వచ్చాయి. కానీ కొన్ని రుచులు కాలాన్ని జయిస్తాయి. తరాలు మారినా వాటి స్థానం మారదు.కాకినాడ కాజా కూడా అలాంటి రుచే.


అందుకే ఎక్కడ ఉన్నా... విదేశాల్లో ఉన్నా... ఏళ్ల తరబడి ఊరికి దూరంగా ఉన్నా... కాకినాడ పేరు వినగానే చాలామందికి ముందు గుర్తొచ్చేది ఆ తీపి రుచే.


కాకినాడను తలుచుకున్న ప్రతిసారి సముద్ర గాలి గుర్తుకొస్తుంది. గోదావరి ప్రాంతపు పరిమళాలు గుర్తుకొస్తాయి. రద్దీ రోడ్లు గుర్తుకొస్తాయి. 

పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి.వాటితో పాటు మనసు మూలల్లో మెల్లగా తట్టిలేపే మరో జ్ఞాపకం కూడా ఉంటుంది.

అదే... "కోటయ్య కాజా" తీపి జ్ఞాపకం.


రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు 

కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కుటుంబం

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

సామర్లకోట