కొసరు
అబ్బో !నేను చెప్పేది సుమారు యాభై సంవత్సరాలు పై మాట. అప్పట్లో నిత్యావసర సరుకులు అన్ని కోమటి కొట్టులో అమ్ముతూ ఉండేవారు. అవి ఈ రోజుల్లో లాగా పెద్ద పెద్ద లైట్లు, షట్టర్లు తో దుకాణాలు, దుకాణం పేరుతో ఉన్న పెద్ద బోర్డులు, కస్టమర్లు కూర్చోడానికి కుర్చీలు, సామాన్లు మోసుకెళ్ళడానికి ట్రాలీలు ,రంగురంగుల డ్రస్సులు వేసుకున్న ఉద్యోగస్తులు, మరియు బిల్లు తీసుకోవడానికి ప్రత్యేక సిబ్బంది ప్రత్యేక కౌంటర్లు ఉండేవి కాదు. చెక్కలతో తయారుచేసిన తలుపు, ఎదురుగుండా పెద్ద త్రాసు, ఆ త్రాసులో తూకం రాళ్లు, అక్కడ గల్లా పెట్టి, దాని ఎదురుగుండా స్టూలు మీద అంగ వస్త్రం కట్టుకుని నుదుట నామం పెట్టుకుని కూర్చుని ఉండే షావుకారు గారు, చుట్టుపక్కలంతా నల్లటి తుప్పు పట్టిన డబ్బాలో సరుకులు, అటు ఇటు పరిగెడుతున్న ఎలకలు ఇలా ఉండేది ఆ కిరాణా కొట్టు. తెల్లవారకుండానే కొట్టు తీసి కూర్చుంటే రాత్రి పది గంటల వరకు కొట్టు తెరిచే ఉండేది కాదు. అప్పుడు లేబర్ యాక్ట్ లు ఉన్నాయో లేవో తెలియదు గానీ సెలవు రోజుల్లో కూడా దుకాణాలు తెరిచి ఉండేవి. భోజనానికి వెళ్లిన సమయంలో మధ్యాహ్నం ఒక గంట షావుకారు గారి కుటుంబ సభ్...