పోస్ట్‌లు

2025లోని పోస్ట్‌లను చూపుతోంది

నాన్నని దాచుకున్న బీరువా

 నాన్నని దాచుకున్న బీరువా ఒకటో తారీకు జీతం అందుకుని ఆ బీరువాలో పెడుతుంటే ప్రతి నెల నాన్న గుర్తుకు వస్తాడు. ఆ బీరువా అంటే నాన్నకు అంత ఇష్టం. ఆరడుగుల పొడవు ఉండి, గచ్చకాయ రంగులో స్టీల్ హ్యాండిల్‌తో, పైన ఏడుకొండల వాడి స్టిక్కర్ అతికించి నాన్న గదిలో నిలబడి ఉండే బీరువా—నాన్న ఉన్నంతకాలం మెరిసిపోతూ ఉండేది. బీరువాలోపల ఏమున్నా లేకపోయినా, ఎప్పుడూ తాళాలు వేసుకుని మొలతాడుకు కట్టుకుని తిరిగేవాడు నాన్న. నాన్నకి ఈ అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది అంటే—వాళ్ల తాతయ్య ఇనపపెట్టికి తాళాలు అలాగే మొలతాడు కట్టుకుని తిరిగేవాడట. నాన్న చేత ఇనపపెట్టి తాళాలు తీయించి డబ్బులు లెక్క చూసుకుని మురిసిపోయేవాడట నాన్న వాళ్ల తాతయ్య. నాన్న వాళ్ల తాతయ్య ఒక పెద్ద భూస్వామి. కాలం కొట్టిన దెబ్బలకి ఎకరాలు కరిగిపోయి, ఇనపపెట్టి పాత సామాన్లు వాడి తూకానికి వెళ్లిపోయి, నాన్నకి జ్ఞానం వచ్చేటప్పటికి రెండు ఎకరాల భూమి మిగిలింది. అంతవరకు పాలేరులతో వ్యవసాయం చేయించే కుటుంబం, పొలానికి వెళ్లి పని చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిన్నప్పుడు ఇస్త్రీ బట్టలు తొడుక్కుని సరదాగా పొలానికి వెళ్లే నాన్న, ముతక పంచ కట్టుకుని గట్టు దిగి పొలం పనులు చేయవలసి...

కోరిక

  అది రద్దీ ఎక్కువగా ఉండే రాజధానినగరంలోని ఒక వీధి లో  ఉండే హోటల్ ప్రాంగణం. సుమారుగా 80 సంవత్సరాల నుండి ఆ హోటల్ అదే వీధిలో ఉంది. భోజనం హోటల్స్ చాలా  ఉంటాయి. కానీ కస్టమర్ల్ని ఆదరించి ఆప్యాయంగా కొసరి  కొసరి వడ్డించి సంతృప్తిగా భోజనం పెట్టే ఆ హోటల్ ఒక్కటే. అందుకే దూరప్రాంతాల నుండి వచ్చినవారు తప్పనిసరిగా ఈ  హోటల్ లో భోజనం చేసి వె డతారు. చక్కగా అరిటాకు వేసి వడ్డించి తెలుగువారి భోజనం పెట్టె ఏకై క భోజనశాల. కమ్మగా వేయించిన కందిపప్పు పప్పులోకి ఒక చిన్న పాత్రలో వేడివేడి నెయ్యి పనసపొట్టు కూర గుత్తి వంకాయ మజ్జిగ పులుసు గోంగూర పచ్చడి గడ్డ పెరుగు  ఆవకాయ దప్పుళo ఆకులో మెరిసిపోతూ ఆకాశంలోని హరి విల్లులా ఉంటాయి. ఆకు చూడగానే నోరూరిపోతుంది. నోట్లో పెట్టుకోగానే చేతులెత్తి మొక్కాకనిపిస్తుంది. అందుకే ఎక్కడ లేని రద్దీ. ఎప్పటిలాగే ఆరోజు కూడా హోటల్ ప్రాంగణం చాలా రద్దీగా  ఉంది. లంచ్ సమయం కావడంతో సీట్లు ఖాళీ లేక కస్టమర్లు  వెయిటింగ్ హాల్లో కూర్చున్నారు. వెయిటర్లు అటు ఇటు  బిజీబిజీగా తిరుగుతూ వచ్చిన కస్టమర్లకు ఏం కావాలో   చూస్తున్నారు. ఆ హోటల్ యజమాని ప్రత...

బహుమతి

 బహుమతి " నాన్న అమ్మ బర్తడే దగ్గరకు వచ్చేస్తుంది. అమ్మకి ఇది స్పెషల్ బర్తడే. అరవై సంవత్సరాలు వస్తున్నాయి. ఏదైనా స్పెషల్ గిఫ్ట్ ఇవ్వు నాన్న అంటూ విదేశాల్లో ఉంటున్న రామారావు పిల్లలు ఒకరి తరువాత ఒకరు ఫోన్ చేస్తూ హడావుడి చేస్తున్నారు రెండు రోజుల నుంచి. ఏం గిఫ్ట్ ఇవ్వాలి ?ఎంత ఆలోచించినా రామారావుకి ఏమి ఆలోచన తట్టలేదు. వెండి బంగారాల మీద మమకారం లేదు రామారావు భార్య సీతాదేవి కి. ఖరీదైన పట్టు చీరలు అంటే అసలు ఇష్టం లేదు. ఈ వయసులో గిఫ్ట్లు ఏం చేసుకుంటుంది. పుణ్యక్షేత్రాలు టూర్లు అంటే అసలు ఇంట్రెస్ట్ లేదు సీతాదేవికి. భర్త తెచ్చిన సంపాదనని పొదుపుగా వాడుకుని పిల్లలందరికీ పెళ్లిళ్లు చేసి పేరంటాలు చేసి కుటుంబానికి గౌరవ మర్యాదలను తీసుకొచ్చిన సగటు భారతీయ మహిళ సీతాదేవి. రామారావు గవర్నమెంట్ ఆఫీసులో ఒక చిరుద్యోగి. వెనక ఆస్తిపాస్తులు ఏమీ లేవు. మూడు గదుల కొంపలో ముగ్గురు ఆడపిల్లలతో పొదుపుగా సంసారం చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ కష్టపడి జీవితంలో పైకి వచ్చిన వ్యక్తి రామారావు.  రామారావుకి సీతాదేవికి కూడా బంధువులు ఎక్కువ. ఎవరో ఒకరు బంధువులు రామారావు ఇంట్లో విస్తరి వేయని రోజు ఉండదు. అయినప్పటికీ సీతా...

చిరుగు దుప్పటి

రాత్రి 9 గంటలు అయింది. నవంబర్ నెల చలి గజగజ వణికించేస్తోంది. ఆఖరి సవారిని దింపేసి రాజయ్య రిక్షా తొక్కుకుంటూ తన గుడిసె దగ్గర ఆపి, రిక్షా లోపలి నుంచి కవరు తీసి కప్పి గుడిసెలో అడుగుపెట్టాడు. గుడిసెలో గుడ్డి దీపం వెలుగులో చాప మీద పడుకున్న పిల్లలను కేసి ఒకసారి చూశాడు. పిల్లలు కప్పుకున్న దుప్పటి మీదున్న చిరుగులోంచి పిల్లల మొహం కనబడుతోంది. అది దుప్పటి కాదు; చిరుగుల దుప్పటి ముక్క అంటే బాగుంటుందేమో! ఆ దుప్పటి కప్పుకున్న వాళ్ల వయసు ఎంతుంటుందో అన్ని చిరుగులే ఉన్నాయి పాపం. కాళ్లదాకా కప్పుకుంటే మొహానికి సరిపోదు; మొహం దాకా కప్పుకుంటే కాళ్లకు సరిపోదు. అలా ఉంది దుప్పటి పరిస్థితి. మరి శీతాకాలం, వర్షాకాలంలో ఆ కుటుంబానికి అవే దిక్కు. అసలే గుడిసె. గుడిసె సందు తలుపుల నుంచి చలిపులి పంజా విసురుతుంటే అడ్డుకునేది పాపం ఆ చిరుగుల దుప్పట్లే. ఆ ఇంట్లో ఉన్న రెండు దుప్పట్లు పరిస్థితి కూడా అదే. చలేస్తోందని అర్ధరాత్రి పిల్లలు లేచి ఏడుస్తుంటే సమాధానం ఏం చెప్పాలో తెలియక సతమతమయ్యేవాడు రాజయ్య. వానాకాలం వచ్చే ముందు ప్రతి ఏటా దుప్పట్లు కొనమని చెప్పే భార్య మాటలకు తల ఊపడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి రాజయ్యది. రిక్షా బండి ఎంత లా...

ఆణిముత్యం

మనిషి భావాలను ప్రత్యక్షంగా ఆవిష్కరించే సమగ్ర కళ నాటకం. కేవలం చదివే సాహిత్యంతో పోలిస్తే, నాటకం కళ్ల ముందు కదిలే కవిత్వం. ఇందులో కథ, సంభాషణ, నటన, సంగీతం, వేషధారణ, వేదిక—అన్నీ కలిసిపోతాయి. అందుకే దీనిని దృశ్యకావ్యం అంటారు. ఈ కళ ప్రధాన ఉద్దేశం ప్రేక్షకుడికి వినోదం అందించడమే కాకుండా సమాజ ప్రయోజనం కూడా రచయిత ఆశించేవాడు అప్పట్లో. ఆనాడు సమాజంలో ఉండే దురాచారాలు కథా వస్తువుగా తీసుకుని నాటకాలు వ్రాసేవారు. గురజాడ వారి కన్యాశుల్కం ఒక సామాజిక ప్రయోజనం కోసం ఉద్దేశించబడింది అయితే కాళ్ళకూరి నారాయణరావు గారి వరవిక్రయం నాటకం మరొక సాంఘిక దురాచారం గురించి సమాజానికి తెలియజేసింది.  ఒక రచయిత రచన గురించి మనం చెప్పుకునేటప్పుడు ఆ రచయిత గురించి కూడా మనం తెలుసుకోవడం ముఖ్యం. ఈ నాటక రచయిత శ్రీ కాళ్ళకూరి నారాయణరావు గారు గోదావరి జిల్లాలలో జన్మించిన రచయితలలో ఒకరు. వృత్తిరీత్యా అధ్యాపకుడైనప్పటికీ సంఘసంస్కరణ అంటే మక్కువ.  అందుకే ఆనాటి సంఘంలోని దురాచారాల్ని ఖండిస్తూ వరవిక్రయం నాటకం తో పాటు వేశ్యవృత్తిని ఇతివృత్తంగా చేసుకుని చింతామణి అనే నాటకం కూడా వ్రాశారు. ఈ చింతామణి అనే నాటకం తెలుగు నాట ప్రదర్శించబడని వీధి ఉ...

పండుగ వచ్చినపుడు పసితనం

ఏదైనా పండగ వచ్చిందంటే అరవై ఏళ్ళ వాడిని పదేళ్ల పసివాడిగా మారిపోతాను. ఊరిలో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడినో అలా అయిపోతాను. బాల్యపు అనుభూతులన్నీ చక్రం తిరిగినట్లు నా కళ్ళ ముందు తిరుగుతాయి. ఇవాళ సుబ్రహ్మణ్య షష్టి. నగరంలో ఉంటే పండగల హడావుడి ఉండదు. పల్లెటూర్లోనే పండగ వాతావరణం తెలుస్తుంది. గోదావరి జిల్లాలో ఉండే చిన్న చిన్న గుడులు దగ్గర కూడా తీర్థాలు జరుగుతాయి. మనది అసలే గోదావరి జిల్లా. ఇంకేముంది! పండగలు, పబ్బాలు, సంస్కృతి, సాంప్రదాయాలు అచ్చంగా పాటించే పల్లె సీమలు ఉన్న ప్రదేశం. పవిత్ర గోదావరి ప్రవహించే ప్రదేశాలతో పాటు పుణ్యక్షేత్రాలు ఎన్నో. ఆ పుణ్యక్షేత్రాల్లో ఉన్న దేవుళ్లకి జరిగే ఉత్సవాలు, తీర్థాలు లెక్కలేనన్ని. అప్పట్లో తీర్థాలు, ఉత్సవాలు మాకు ఎక్కువ ఉత్సాహాన్ని, వినోదాన్ని ఇచ్చేవి. ఆ తీర్థాలకు వెళ్లడం అంటే ఒక సరదా. ఇంట్లో ఉన్న పెద్దవాళ్లు “తీర్థంలో ఏదైనా కొనుక్కో” అంటూ ఇచ్చే సొమ్ము జేబులో పెట్టుకుని, సైకిళ్లు తొక్కుకుని ఊరికి దూరంలో ఉండే దేవాలయాల దగ్గరికి వెళ్లడం—అదొక పెద్ద సరదా. దేవాలయం ప్రాంగణం పచ్చటి తాటాకు పందిళ్లతో, ఆ పందిళ్లు చిన్న చిన్న ఎలక్ట్రిక్ బల్బులతో అలంకరించబడి చాలా అందంగా ఉండేది. అ...

సాంబయ్య

శివరాత్రి పండుగ శివ శివ అంటూ గజగజ వణికించే చలిని కూడా తీసుకుని వెళ్లిపోయింది. ఒక్కసారిగా భానుడు తన ప్రతాపం చూపించడం మొదలుపెట్టాడు. మనిషి నిలువునా నిలబడితే మునిగిపోయేంత లోతుగా ఉండి ఎప్పుడూ నీళ్లతో ఉండే ఆ ఊరికి ఈ ఊరికి మధ్య ఉండే పెద్ద కాలువకి నీళ్లు ఇవ్వడం ఆపేసారు గవర్నమెంట్ వారు. ఈ పెద్ద కాలువ తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని ఆర్థర్ కాటన్ బ్యారేజీ ముద్దుబిడ్డ. పంటల కాలం అయిపోయింది కదా. ఇప్పుడు ఆ కాలువ నీటితో పనిలేదు. సాధారణంగా గవర్నమెంట్ వారు ఈ వేసవికాలంలో కాలువలకు నీరు ఆపేసి మరమ్మత్తులు చేస్తారు. మామూలుగా పంటల కాలంలో ఆ పచ్చటి పొలాలకు ఇరవై నాలుగు గంటలు నీళ్లు సరఫరా చేసే ఆ పెద్ద కాలువ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ తాలూకాలోని ఒక కుగ్రామం వెళ్ళాలంటే ఆ పెద్ద కాలువ దాటవాల్సిందే. ఆ పెద్ద కాలువ ఆ పక్క ఈ పక్క పెద్ద గట్లు ఉండి, ఆ గట్లు వెంబడి రకరకాల పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. కాలువ దాటాలంటే చెక్కలతో తయారుచేసిన ఒక బల్లకట్టు ఆధారం. ఆ బల్లకట్టు నడుపుతూ సాంబయ్య కుటుంబం తరతరాల నుంచి అదే వృత్తిలో జీవిస్తూ ఉండేవారు. సాధారణంగా ఉదయం ఐదు గంటల నుంచి చీకటి పడే వరకు ఆ బల్లకట్టును నడిపే సాంబయ్య, అర్ధరాత్రి అ...

అమ్మమ్మ గారి ఇల్లు

“రేపటి నుంచి నా కాలేజీకి సెలవులు!” అని ఉత్సాహంగా చెప్పాడు కిరణ్. “రేపు నేను అమ్మమ్మగారి ఊరికి వెళ్లిపోతున్నా” అనగానే, కిరణ్ మాటలు విని నవ్విపోయింది తల్లి సంధ్య. “కాలేజీకి సెలవిస్తే ఒక్కరోజు కూడా ఇక్కడ ఉండవు. అమ్మమ్మగారి ఊరు వెళ్తా అనావు. అక్కడ ఏముంది రా? నాకంటే నీకు అమ్మమ్మ ఎక్కువా?” అని అంది సంధ్య. “అవును అమ్మ! అమ్మమ్మ… కావాల్సినవన్నీ చేసిపెడుతుంది. ఆ రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రేమగా మాట్లాడుతుంది. ఆప్యాయంగా దగ్గర తీసుకుంటుంది. ఆ ఇల్లు చూస్తే స్వర్గంలా ఉంటుంది…” అని అమ్మమ్మ–తాతయ్యల గురించి చెప్పుకుంటూ ఆ రాత్రే నిద్రపోయాడు కిరణ్. --- మరుసటి ఉదయం మొదటి బస్సులోనే కిరణ్‌ని రావులపాలెం దగ్గర ఉన్న వాడపల్లిలోని అమ్మమ్మగారి ఇంటికి పంపించాడు తండ్రి రామారావు. సంధ్య తండ్రి పరంధామయ్య ఇంకా ఆ ఊరిలోనే ఉంటాడు. వృద్ధాప్యం వచ్చినా చిన్నపాటి వ్యవసాయం కౌలుకి ఇచ్చి రోజులు గడుపుతుంటాడు. పరంధామయ్యకి నలుగురు ఆడ పిల్లలు. మూడు అమ్మాయిలు హైదరాబాదులో ఉంటే, చిన్న కూతురు సంధ్య మాత్రం తునిలో ఉంది. సంధ్య భర్త రామారావు హంసవరం హైస్కూల్ హెడ్మాస్టర్. వారికి కిరణ్ ఒక్కరే కొడుకు. ఇంటి ముందు ఆగిన ఆటోలోంచి దిగిన కిరణ్‌ను...

ఆధునిక పురుషుడు

ఒకప్పుడు ఆ కుటుంబ సామ్రాజ్యానికి ఆయనే రారాజు. ఆయన మాట రాజ శాసనం. కాలు మీద కాలేసుకుని కుర్చీలో కూర్చుని ఆజ్ఞలు జారీ చేస్తే పాటించే భార్యామణి భయభక్తులతో మెలిగే పిల్లలు, యజమానిగా గౌరవం ఇచ్చే దాస దాసి జనం, సమాజంలో పురుషుడిగా ఒక గౌరవం ఉండేవి.  పురుషుడు అంటే ఒక చైతన్యం. కుటుంబానికి పునాది. కనిపించని ఒత్తిడి, దాచుకున్న కన్నీరు, చెప్పని బాధ, మౌనమైన ప్రేమ పురుషుడి లక్షణాలు. ఇరవై ఒకటో శతాబ్దం సమాజాన్ని మాత్రమే మార్చలేదు— పురుషుడి స్వరూపాన్ని కూడా లోతుగా మార్చింది. ఇప్పటి పురుషుడు గత శతాబ్దపు నిర్వచనానికి పూర్తిగా భిన్నం.ఇంతకుముందు బలం, బాధ్యత, సంపాదన, ఆధిపత్యం—ఇవి పురుషుడి ప్రధాన గుర్తింపులు. కానీ ఆధునిక సమాజం పురుషుని పాత్రను మరింత విభిన్నంగా, మరింత మానవీయంగా చూస్తోంది. ఇప్పుడు ఆయన పాత్ర కేవలం సంపాదనకే పరిమితం కాదు; అతను ఒక భార్య యొక్క సహచరి, పిల్లలకి స్నేహితుడు, తల్లిదండ్రులకు మద్దతు, సమాజానికి మార్గదర్శి, తనకు తానే మానసికంగా నిలబడే మనిషి. మునుపటి కాలంలో పురుషుని విలువ అతని ఆదాయం. ఇంటి మొత్తం బరువు అతని భుజాలపై. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది: పురుషుడు ఎంత సంపాదిస్తున్నాడన్న దానికంటే అ...

గాజుల గానం

హృదయం లోకి తొంగి చూస్తే వట్టి గాజు ముక్క అయినా, అవి అతివల చేతులకు అద్భుత సౌందర్యం ఇచ్చే ఆభరణం. అవి వెలకట్టలేని ఆభరణం — ఒక స్త్రీ సౌభాగ్యానికి గుర్తు. ఆడపిల్లగా పుట్టిన రోజు మొదలు, సౌభాగ్య స్త్రీగా జీవితం చాలించే వరకూ చేతికి అందమైన అలంకారం. ఆధునిక అలంకారాలు ఎన్ని ఉన్నప్పటికీ గాజులు ధరించడం అన్నది ఒక భావోద్వేగం, ఒక శుభప్రదమైన అలంకారం. ధనిక–పేద భేదం లేకుండా అందరికీ గాజులు ఉంటాయి; హిందూ సాంప్రదాయంలో వాటికి ఎనలేని మక్కువ. శైశవ దశలో ఉన్నప్పుడు, ఆడ–మగ తారతమ్యం లేకుండా అందరికీ నల్ల గాజులు తొడుగుతారు — పరుల దృష్టిని మార్చడానికీ, శిశువుకు రక్షణకోసం. అక్కడి నుంచే మొదలైన ఈ గాజులు స్త్రీని ప్రతి సందర్భంలోనూ ఆనందింప చేస్తూనే ఉంటాయి. గాజులు ధరించడం అనేది ఒక సాంప్రదాయం, ఒక భావోద్వేగం, ఒక నమ్మకం. గాజుల్లో రకరకాలు ఎన్ని ఉన్నప్పటికీ అన్ని సందర్భాల్లోనూ అందం ఇచ్చేది మట్టి గాజులు మాత్రమే. చేతినిండుగా గాజులు ధరించే సాంప్రదాయం నుంచి ఒక బంగారు గాజు మాత్రమే ధరించే అలవాటుకి స్త్రీ మారిపోయింది. అప్పట్లో స్త్రీ ఒక గృహిణిగా ఇంటిపట్టునుండేది. కాలక్రమేణా రకరకాల వృత్తుల్లో ముందుకు దూసుకుపోతూ, వృత్తిలో సౌకర్యం కోసం ఈ ...

రాజు గారి కోట

 రాజరికం చరిత్రలో కలిసిపోయింది రాజ్యాలు దేశంలో కలిసిపోయే యి గతించిన చరిత్రకు సాక్షిగా రాజులు కట్టిన కోటలు మిగిలిపోయాయి. రాజుల జ్ఞాపకాలు, రాజ్యాల వైభవాలకు గుర్తుగా మిగిలిపోయిన కోటలు ఎప్పటికీ మనకి అపురూపమే. అవి ఈనాడు శిధిలమై ఉండొచ్చు, దుమ్ము పేరుకుపోయి ఉండొచ్చు అవి మన చారిత్రక సంపద అనడంలో సందేహమే లేదు.  ఆ కాలపు వైభవాన్ని తనివి తీరా అనుభవించిన అది భవనం  కాదు రాజుల గత వైభవం తనివి తీరా దర్శించి ప్రశ్నిద్దాం. అది మాటలు వచ్చిన మనిషి కాదు సమాధానాలు ఎలా చెబుతుందని అనుకుంటే అది మన పొరపాటే అవుతుంది. ఆ కోటలో ప్రతి గదికి ఒక చరిత్ర. ప్రతి గది ఒక ప్రయోజనం కోసం నిర్మించబడింది. ఇది ఒక రాజ్యానికి సంబంధించిన కోట కాదు . రాజు గారి కోట అంటే రాళ్లతో కట్టిన భవనం కాదు. అది ఒక యుగపు గౌరవం, జీవన విధానం, కళాత్మకత, అన్నీ అందులో కనిపిస్తాయి. ఆ కోట దగ్గరికి వెళ్లి ప్రాకారాలు నిమిరి ఎలా ఉన్నావ్ అని ఆప్యాయంగా పలకరిస్తే ఇదిగో ఇలా ఉన్నానని దుమ్ము కొట్టుకుపోయిన గదిని చూపిస్తూ కథ చెప్పడం ప్రారంభించింది. నేను — ఒక కోటను. రాళ్లతో, సున్నంతో, చెమటతో, శౌర్యంతో పుట్టిన జీవిని.శతాబ్దాల క్రితం, ఒక గర్విత రాజు నన...

ఆనాటి అతిధి

ఆ జీవన విధానం వేరు. ఆ తరం పద్ధతులు వేరు. ఆ ఆప్యాయతలు వేరు. అనుబంధాలు వేరు. తరం మారుతున్న కొద్దీ ఆ అతిధి మర్యాదలు మరుగున పడిపోతున్నాయి. ఒకప్పుడు ఇంటి ముందు రిక్షా ఆగిందంటే, రిక్షాలోంచి దిగుతున్న అతిధిని చూసి ఎదురు వెళ్లి స్వాగతం చెప్పేవారు. “రండి రండి” అంటూ ప్రేమపూర్వకమైన ఆహ్వానం. అప్పట్లో సాంకేతికంగా అభివృద్ధి చెందిన రోజులు కావు. సమాచారం కొరకు ఉత్తరాల మీద ఆధారపడి ఉండేవారు. మరీ ముఖ్య అవసరాల కోసం టెలిగ్రామ్. ఉత్తరం రాస్తే నాలుగు రోజులు కానీ వచ్చేది కాదు. అతిధి చెప్పా పెట్టకుండా వచ్చిన — “ఏదో పని ఉండి ఊర్లోకి వచ్చాను, మిమ్మల్ని చూసి పోదామని రావడం జరిగిందంటూ” — తన ముందస్తు కబురు చెప్పకుండా వచ్చినందుకు సంజాయిషీ చెప్పుకునేవాడు అతిధి. అతిధి తన దగ్గర బంధువు కావచ్చు, లేదంటే దూరపు బంధువు, లేదంటే స్నేహితుడు అయినా ఒకే రకమైన ఆహ్వానం. అతిధి మర్యాదలో భాగంగా ముందుగా గుమ్మo ల్లోనే ఒక బకెట్‌తో నీళ్లు, చెంబు రెడీగా ఉండేవి. పల్లెటూర్లో అప్పటి జీవన విధానానికి అనుకూలంగా ఇళ్లు ఉండేవి కాబట్టి ఆ రకమైన సౌకర్యం కల్పించగలిగేవారు. వచ్చిన అతిధి సరాసరి ఇంట్లోకి వచ్చేయకుండా, కాళ్లు కడుక్కుని రావడం ఒక ఆరోగ్యకరమైన అలవా...

రీల్స్

 “ప్రపంచం ఇప్పుడు చేతి అంచున ఉంది” అని వింటే అతిశయోక్తిగా అనిపించవచ్చు. కానీ ఈరోజుల్లో అది వాస్తవం. ఒక చిన్న మొబైల్ ఫోన్ స్క్రీన్‌లో ప్రపంచం మొత్తం సజీవంగా ఉంటుంది. అందులోనూ, కేవలం పదిహేను సెకండ్ల వీడియోలు — రీల్స్ — ఇప్పుడు కోట్లమందిని ఆకర్షిస్తున్నాయి. చిన్న వీడియోలు, పెద్ద ప్రభావం — ఇదే రీల్‌ ప్రపంచం యొక్క ప్రత్యేకత. ఒక చూపు, ఒక మాట, ఒక స్వరమాత్రమే చాలు… మన మనసు దాని వశం అవుతుంది. 🎬 క్షణాల వినోదం, కొత్త సంభాషణ ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్ అన్నీ రీల్స్‌కు వేదికలే. చిన్న వీడియోల్లో నవ్వులు, నృత్యాలు, ప్రేరణ, వ్యాపారం, ఫ్యాషన్ — అన్నీ కలగలిసి ఉంటాయి. ఇది ఒక కొత్త భాష, కొత్త తరహా కవిత్వం. మాటలకన్నా చూపులు ఎక్కువ చెప్పే యుగంలో ఇది సహజమైన పరిణామం. 🌿 ప్రతిభకు కొత్త దారులు రీల్స్ వల్ల ఎన్నో కొత్త ప్రతిభలు వెలుగుచూశాయి. ఒక పల్లెటూరి బాలిక నృత్య వీడియో ప్రపంచం నలుమూలలకూ చేరుతోంది. ఒక రైతు తన పంటను చూపిస్తున్నాడు. ఒక ఉపాధ్యాయుడు తన పాఠాన్ని సరదాగా బోధిస్తున్నాడు. ఇవి అన్నీ ఒక కొత్త సృజనాత్మక విప్లవానికి నాంది. మన తెలుగు గేయాలు, పద్యాలు, పల్లెలు, వంటలు — ఇవన్నీ మళ్లీ పునర్జీవం పొంద...

దొంగలు

ఒకప్పుడు దొంగతనం అంటే రాత్రి చీకట్లో జరిగే పని అర్థం   ఇప్పుడు పగలు రాత్రి తేడా లేదు— కానీ కనపడదు! మన చేతిలోని ఫోన్‌ద్వారా, మన కళ్ల ముందే, మన ఖాతాలోని సొమ్ము జారిపోతుంది. మొబైల్ లేకపోతే నిమిషం గడవదు. ఆదమరిస్తే దానంత కష్టం లేదు. మన సొమ్ము పరాయి సొత్తు అయిపోతుంది. మన సమాచారం పరుల పాలైపోతుంది. మునుపు దొంగతనాలు రాత్రిపూట జరిగేవి. దొంగల భయంతో తాళాలు వేసుకుని నిద్రపోయేవాళ్లం. కానీ ఈ కొత్త దొంగకి తాళాలతో పనిలేదు. ఇంట్లో ఉన్న బంగారం, నగదు జోలికి రాడు. దర్జాగా ఏసీ గదిలో, లేదంటే పొలం గట్ల మీద కూర్చుని — పార్ట్‌టైం జాబ్‌లా దొంగతనం చేస్తాడు. తాళాలు వేసినవే ఉంటాయి, కానీ బ్యాంకు ఖాతాల నుంచి కోట్ల రూపాయలు గోడలు దాటి పారిపోతాయి. మనం చేయగలిగేది గగ్గోలు పెట్టడమే తప్ప, వాటిని ఆపడం కష్టమే. తాళం లేకుండా సొమ్ము ఎలా తీస్తున్నాడు? అదే — సాంకేతికత! ఒకప్పుడు బ్యాంకులో ఉన్న సొమ్ము మన చేతికి రావాలంటే బ్యాంకుకి వెళ్లాలి. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. ఎక్కడ పడితే అక్కడ సొమ్ము ఇచ్చే యంత్రాలు, మొబైల్‌లో ఉన్న చిన్న చిన్న యాప్‌లు — ఇవన్నీ సౌకర్యం కోసం. కానీ ఈ సౌకర్యం మధ్యలో మాయగాళ్లు దూరి ఖాతాదారులకి అన్యాయం...

సత్య

ఉదయం పది గంటలు అయ్యింది. వృద్ధాశ్రమంలో తన గదిలో మంచం మీద పడుకున్న సత్యకి, పక్క మంచం మీద పడుకున్న రాఘవమ్మ దగ్గరకి ఇద్దరు రావడం గమనించింది. ఇద్దరూ కవల పిల్లలు అనుకుంటా — ఒకే పోలిక, ఒడ్డు పొడుగు సమానంగా ఉన్నారు. ఇద్దరికీ పెళ్లి అయిపోయింది అనిపించింది. అంతవరకు మంచం మీద మూలుగుతూ పడుకున్న రాఘవమ్మ, ఆ పిల్లలు రాగానే లేచి కూర్చుని నవ్వుతూ మాట్లాడడం సత్య గమనించింది. రాఘవమ్మ ఆ పిల్లల్ని పరిచయం చేస్తూ — “ఇంతవరకు అమెరికాలో ఉండేవారు, ఇప్పుడు ఇండియా వచ్చేసారు. అందుకే నన్ను తీసుకువెళ్లడానికి వచ్చారు” — అని చెప్పింది. అది విన్న సత్య మనసులో — “నా అదృష్టం ఎప్పుడు వస్తుందో?” — అనిపిస్తూ గతజీవితం గుర్తుకొచ్చింది. --- “కంగ్రాట్యులేషన్స్ పార్వతమ్మ గారు! మీ అమ్మాయి సత్యకి కవల పిల్లలు పుట్టారు. తల్లి పిల్లలు అంతా క్షేమం. కాసేపట్లో రూముకు పంపిస్తాను” అంటూ లేడీ డాక్టర్ సరోజ చెప్పిన మాటలు లీలగా వినబడ్డాయి సత్యకి. ఒక్కసారి ఆనందం ముంచుకొచ్చింది. పిల్లలను చూసి ఎత్తుకుని ముద్దాడాలనిపించింది. కానీ ఒళ్లంతా మత్తుగా ఉంది, కళ్ళు తెరవబుద్ధి కావడం లేదు. చంటి పిల్లల ఏడుపులు లీలగా వినిపిస్తున్నా, ఏమీ చేయలేక పడుకుని ఉండిపోయింద...

మా ఊరి జ్ఞాపకం

చూడ్డానికి క్రికెట్ వీరుడులా, పొట్టిగా గవాస్కర్ లా ఉండేవాడు మా వెంకన్న. ఆ గవాస్కరు ఎప్పుడు చేతిలో క్రికెట్ బ్యాట్ పట్టుకుంటే, ఈయన నోట్లో పొగాకు చుట్ట — చేతిలో ఎప్పుడు పదమూడు ముక్కల పేక పట్టుకుని ఉండేవాడు. లుంగీ, పంచ కట్టుకుని, దానిమీద చొక్కా తొడుక్కుని, నోట్లో చుట్ట పెట్టుకుని ఉదయమే లేచి సైకిల్ ఎక్కాడంటే — ఏ అరుగుదగ్గర ఆగుతాడో ఎవరికీ తెలిసేది కాదు. అరుగు దగ్గర ఆగాడంటే భాగవతం, భారతం, రామాయణం వినడానికి కాదు. ఈయన పారాయణం వేరే ఉంది. అదే చతుర్ముఖ పారాయణం. --- అందరూ సంక్రాంతి పండుగకి, పెళ్లిళ్లకి, వేసవికాలం సెలవులకి పేకాట ఆడడం మామూలే ఆ ఊర్లో. కానీ మన వెంకన్న 365 రోజులు అదే ప్రవృత్తి. వృత్తి వ్యవసాయం అంటాడు. ఎప్పుడు పొలం గట్టు ఎక్కిన పాపాన పోలేదు. తలపాగా చుట్టిన సందర్భం చూడలేదు. “ఏవండీ వెంకన్న గారు ఉన్నారా ఇంట్లో?” అంటూ మూడు వందల అరవై ఐదు రోజులలో ఎప్పుడు ఎవరు అడిగినా — “లేదండి, పేకాటలో ఉన్నారండి” అని ఇంట్లోంచి అదే సమాధానం. అదేదో పెద్ద ఉద్యోగం లాగా చెప్పేవారు. చివరికి ఏ వీధిలో ఉన్నాడు, ఎవరు అరుగు మీద ఉన్నాడు వెతుక్కుని ఆ వచ్చిన పెద్దమనిషి తన పని పూర్తి చేసుకునేవాడు. ఆ ఊర్లో నాలుగైదు అరుగులు ప్...

సాయి

సాయి ఈ సృష్టి అంతా పరమేశ్వర ప్రసాదమే. అన్ని జన్మల్లోకి ఉత్కృష్టమైనది మానవజన్మ. ఎందుకంటే అన్ని జీవులకీ ఇంద్రియాలు ఉంటాయి. కానీ మానవుడు మాత్రమే మాట్లాడగలడు. మాట మనిషికి దేవుడిచ్చిన వరం. నోరు ఆత్మీయంగా పలకరిస్తుంది; అవాకులు చవాకులు పలికిస్తుంది. అలాగే ఇంద్రియములన్నీ కూడా సక్రమంగా నడిస్తే ఏ బాధ ఉండదు. దారి తప్పితే మనిషి అధోగతిపాలవుతాడు. మనిషి తన నడవడికలో ఏది మంచి, ఏది చెడు తెలియజెప్పడానికి వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు తోడ్పడతాయి. అలాగే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకి భగవంతుడు అనేక అవతారాలు ఎత్తుతూ ప్రజలను రక్షిస్తూ వచ్చాడు. రామకృష్ణ పరమహంస, వివేకానందుడు వంటి ఆధ్యాత్మిక గురువులు తమ బోధనల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేశారు. మదర్ తెరిసా వంటి కరుణామూర్తి పేదలకు సేవ చేస్తూ ఆదర్శవంతంగా నిలిచారు. అలాగే హిందూ, ముస్లిం మతాలను రెండింటిని సమన్వయపరుస్తూ “అందరికీ ప్రభువు ఒక్కడే” అనే నినాదంతో ప్రతి ఒక్కరూ భగవంతునిపై విశ్వాసం ఉంచాలని, శ్రద్ధతో ఏ పనైనా పూర్తి చేయాలని బోధించి ప్రజల చేత ఆరాధించబడుతున్న మహాయోగి, కరుణామూర్తి — షిరిడి సాయి బాబా వారు. --- శ్రద్ధ, సబూరి అనేవి ఆయన బోధనలో ముఖ్యమై...

ప్రసాదం

"అయ్యా, నేను రేపటి నుంచి ఐదు రోజులపాటు మన రాములోరి గుడి దగ్గరే ఉంటాను" అంటూ తండ్రితో చెప్పాడు పది సంవత్సరముల వయసున్న రాముడు. "ఏరా! ఎందుకు? నువ్వు గుడి దగ్గర కూర్చుంటే మనకు బువ్వ ఎవరు పెడతారు?" అంటూ ప్రశ్నించాడు తండ్రి పిచ్చయ్య. "మర్చిపోయావా ఏమిటి నాన్నా? మన రాములు వారి గుడిలో ఎల్లుండి శ్రీరామనవమి కదా! సీతారాముల కళ్యాణం చేస్తారుగా. ఆ రోజు నుంచి ఐదు రోజులు పాటు ఊరందరికీ సంతర్పణ చేస్తారు కదా. ప్రతి ఏటా చేస్తారుగా. మర్చిపోయావా ఏమిటి?" అంటూ చెప్పుకొచ్చాడు రాము. "మరి ఆ సందర్భంగా మనకి ఆకు వేసి భోజనం పెడతారా ఏమిటి?" అంటూ సందేహం వెలిబుచ్చాడు పిచ్చయ్య. "అవును నాన్న! ఇక్కడ కులమతభేదం లేకుండా వచ్చిన వాడిని తిరిగి పొమ్మనకుండా అందరికీ చక్కగా భోజనాలు పెడతారు. ప్రతి ఏట జరుగుతోంది కదా. అయినా నువ్వు ఎప్పుడూ చూడలేదా? నేనే నీకు భోజనం అడిగి తెచ్చి పెడతాను ప్రతి ఏడాదిలాగే," అంటూ తుర్రుమని వీధిలోకి పారిపోయాడు రాము. --- రాము పిచ్చయ్యకి ఒక్కగానొక్క కొడుకు. ఒంట్లో ఓపిక ఉన్నంతకాలం రిక్షా లాగి, పక్షవాతం వచ్చి ఈ మధ్యనే మంచం మీద పడ్డాడు పిచ్చయ్య. రాముని చదివించే స్తో...

భగినీ హస్త భోజనం

“తమ్ముడు, ఎల్లుండి తప్పకుండా భోజనానికి రా” అంటూ ఫోన్ చేసింది — ప్రతి సంవత్సరం లాగానే దీపావళి నాడు పక్క ఊర్లో ఉన్న మా అక్క. ఆరోజు భగినీ హస్త భోజనం. అందుకే మా అక్క ఆహ్వానం. ఉదయం లేచి ఫస్ట్ బస్సులో ఆ ఊరు బయలుదేరాను. మేమిద్దరం పుట్టి పెరిగింది అదే ఊరు. అక్క నా కంటే రెండేళ్లు పెద్దది. చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో చదువుతూ, ఆడుతూ, పాడుతూ, కలిసిమెలిసి పదో తరగతి వరకు పెరిగాము. నేను ఇంటర్మీడియట్ చదువుల కోసం హైదరాబాద్ వెళ్ళిపోయాను. అక్క పదవ తరగతి తోటే చదువు ఆపేసింది. మేనమామకు ఇచ్చి పెళ్లి చేసేశారు. ఆ ఊర్లోనే కాపురం. బావగారు ఏదో కంపెనీలో చిన్న ఉద్యోగం. ఇప్పుడు ఇద్దరు పిల్లల తల్లి అయింది. అయినా ప్రతి ఏటా నన్ను భగినీ హస్త భోజనానికి పిలుస్తూనే ఉంటుంది. దాని పరిస్థితి చూసి ఏదైనా సహాయం చేద్దాం అంటే ఎంతో మొహమాటం. ఒక చిన్న మాట కూడా తన సంసారం గురించి చెప్పదు. తన లేనితనం గురించి అసలు చెప్పదు. బావగారు బాగా చూసుకుంటున్నారని అంటుంది. ఎప్పుడూ ఆ మూడు గదుల కొంపలోనే కాపురం. ఇంట్లో కుర్చీ కూడా ఉండదు కూర్చోడానికి. ఇద్దరు పిల్లలు చదువులు. ఎలా నెట్టుకొస్తుందో ఏమిటో! పెద్దయ్యాక ఎవరి జీవితాలు వాళ్ళవే. చిన్నప్పుడు ఎంత ...