శ్రీమతికి అక్షర బహుమతి
అందరూ అడుగుతుంటారు మీ ఆయన ఏం బహుమతి ఇచ్చాడు నీ పుట్టిన రోజుకని! నిజానికి ఏం ఇవ్వాలి? ఇది మా తరానికి ఒక పెద్ద ప్రశ్న. జవాబు దొరకని ప్రశ్న. ఒక గులాబీ పువ్వు చేతిలో పెట్టి ఐ లవ్ యు అంటే హాస్యాస్పదంగా ఉంటుంది. . షాజహాన్ లాగా ఒక తాజ్ మహల్ కట్టించే ఆర్థిక స్తోమత ఉండదు. కొత్త చీర కొనుక్కోమంటే ఇంట్లోనే కొత్త చీరలు ఉన్నాయి అంటారు. అంత పొదుపుగా ఉంటారు ఆడవాళ్లు. పోనీ మనమే ఇష్టమైన స్వీటు తయారుచేసి పెడదామంటే ఆ సామ్రాజ్యం మాది. మీరు మా రాజ్యంలోకి రాకూడదంటారు. బజారు స్వీట్లు ఆరోగ్యానికి మంచిది కాదంటారు. కానీ ఆ కేకు ముక్కలు ఫ్రిజ్‌లో పెట్టుకుని తింటారు. పోనీలెండి వాళ్ళ ఇష్టప్రకారమే కానిద్దాం. అది కూడా ఒక బహుమతి వాళ్లకి.
నిజానికి ఒక యువకుడికి మంచి యువతి తో అలాగే ఒక యువతికి మంచి యువకుడితో వివాహం కుదర్చడం భగవంతుడు ఇచ్చిన ఒక పెద్ద బహుమతి వారిద్దరికీ. యువత జీవితంలో వివాహం అత్యంత ప్రాముఖ్యత ఉన్న షోడశ సంస్కారాల్లో ఒకటి. వివాహం తోటే జీవితం సుఖ సంతోషాలతో గడుస్తుంది. ఒక మంచి భార్య కానీ భర్త గాని దొరికినప్పుడు.
అలాంటి భాగ్యలక్ష్మి లాటరీ నాకు తగిలిందని చెప్పాలి. ఆ విషయంలో నేను అదృష్టవంతుడిని.
అలా నేను సంతృప్తి పడడం కూడా ఆమెకు ఒక బహుమతి. అంటే ఇందులో ఎవరి గొప్పతనం ఉందో అర్థం చేసుకోవాలి.
అయితే ఈ వివాహం పట్ల సంపూర్ణ విశ్వాసం ఉండి తన అసంతృప్తిని ఎప్పుడు వ్యక్తపరచకుండా కుటుంబం పట్ల పూర్తి బాధ్యత వహించి కుటుంబాన్ని ఒక దరికి చేర్చిన ఆ త్యాగశీలికి కూడా ఈ వివాహం దేవుడిచ్చిన బహుమతి.
ఒక బాధ్యతగల భార్యగా ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత ఆ ఇల్లు మైసూర్ ప్యాలెస్ కాకపోయినా , భర్త మైసూరు మహారాజు కాకపోయినా మూడు గదుల ఇంటిలో చాలా సంవత్సరములు పాటు ఆనందంగా కాపురం చేసి భర్త తెచ్చిన దాన్ని ప్రణాళిక ప్రకారం ఖర్చు చేసి కుటుంబ బాధ్యతలను తను నెత్తి మీద వేసుకొని ఇరుగుపొరుగు వారి చేత ఒక మంచి గృహిణిగా పేరుపొందిన ఆమెకి ఇంకేం బహుమతివ్వాలి.
ఎన్నో సంవత్సరంలు కాపురం చేసిన కడుపు పండకుండా సంతానం కోసం తపించి పోయేవారు ఎంతోమంది ఈ దేశంలో. అయితే పెళ్లయిన ఆరు సంవత్సరములు లోపు ఇద్దరు బిడ్డలకు తల్లి అవడం భగవంతుడు ఇచ్చిన పెద్ద బహుమతి. ఇద్దరు బిడ్డలు కాదు ముగ్గురు బిడ్డ లు.
అది ఒక మైనపు ముద్ద. ఆ ముద్దని అందమైన ఆకృతిగా తీర్చిదిద్ది లోకం అంటే ఏమిటో చూపించి అంటే లోకమంతా తిప్పి చూపించి కాదు,లోకం గురించి పాఠాలు చెప్పి అడుగు వేసే ముందు ఆలోచించి అడుగు వేయాలని ముళ్ళు రాళ్లు దాటుకుంటూ వెళ్లాలని చెప్పే భర్త దొరకడం ఆమెకి ఎప్పుడో ఒక మంచి బహుమతిని ఇచ్చాను అని చెప్పాలి. దానికి ఉదాహరణలు చెప్పక్కర్లేదు. సందర్భానుసారం అడిగే సందేహాలకి నేను ఒక మాస్టర్ ని. బెత్తం పుచ్చుకోను. పాఠాలు చెప్పను.
నా ఉద్దేశంలో ఎవరికి ఏ బహుమతి ఇచ్చిన అది వారి జీవితానికి ఉపయోగపడాలి. ఒక పేద విద్యార్థికి బాగా చదువుకోరా అని చెప్పే మాట కంటే అవసరమైన పుస్తకాలు కానీ, కాస్త రెండు ముద్దలతో కడుపు నింపడం కానీ చేయాలి అది చాలా ఉపయోగం వాడికి. పుస్తకాలతో విజ్ఞానం పెంచుకుంటాడు. నిండిన కడుపుతో చదువు మీద దృష్టి పెడతాడు. అది జీవితాన్నే మార్చేస్తుంది.
అందరూ పుట్టుకతోటే తెలివితేటలు కలిగిన వాళ్లు ఉండరు. పెరిగిన వాతావరణం చుట్టుపక్కలు ఉండే మనుషులను చూసి మనం నేర్చుకోవాలి. చూసి నేర్చుకునే వాడు కూడా నా దృష్టిలో అత్యంత తెలివైనవాడు. అలా రోజు మనం చుట్టుపక్కల ఉండే వాళ్ల దగ్గర నుండి మంచి చెడు కూడా నేర్చుకుంటా ము.
అలాంటిది నా సహచర్యం ఆమెకు గొప్ప బహుమతి. ఎందుకో అందరికీ అర్థమయ్యే ఉంటుంది.
మేమిద్దరం మాకు ఇద్దరు అoటు ఒక చిన్న సంసారాన్ని అందంగా ఆనందంగా తీర్చిదిద్దుతూ అద్భుతమైన వంటలు వండి పెడుతూ పిల్లలు నేను కడుపునిండా తిని అమ్మా నీ చేతి వంట అదుర్స్ అంటూ ప్రతిరోజు పొగిడే భర్త పిల్లలు ఉండడం ఆమె కది బహుమతి కదా ఆలోచించుకుంటే.
మంచి ఆరోగ్యకర వాతావరణంలో పిల్లల్ని పెంచాలని ఇంటి శుభ్రతకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి కొవ్వొత్తులా కరిగిపోతూ
ఇంటిని అద్దంలా ఉంచి కుటుంబ సభ్యులు చేత శభాష్ అనిపించుకోవడం నిజంగా ఒక బహుమతే కదా ఇల్లాలికి.
అందరూ ఈ రోజుల్లో సనాతన సాంప్రదాయం గురించి ఎక్కువగా ఉపన్యాసాలు దంచేస్తున్నారు. కానీ సనాతన సాంప్రదాయం ముందు మన ఇంట్లోనే పాటించాలని విషయం మర్చిపోతున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలి కదా! అలాంటి సనాతన సాంప్రదాయాలకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఉదయం లేస్తూనే మడి తడి పూజా పునస్కారం మంచి చెడు తను ఆచరించి కుటుంబ సభ్యులను కూడా సనాతన సాంప్రదాయాన్ని పాటించాలని ధైర్యంగా చెప్పగలగడం కూడా దేవుడిచ్చిన బహుమతి. నాకెందుకులే ఎవరైనా ఎలా పోతే నాకేమిటి అనుకునే తత్వం కాదు. చెప్పదలుచుకున్నదేదో ధైర్యంగా చెప్పేయడమే అక్కడ ఇహపర బేధం లేదు.
నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు మా పెద్దక్క పోలికలు కొన్ని ఉన్నాయని. కానీ అది చాలామందికి నచ్చదు.
మనం చేసే పనులు కొన్ని ఇతరులకు ఆదర్శంగా ఉండడం కూడా బహుమతి లాంటిదే మనకి. ఎప్పుడో 20 సంవత్సరాలు దాటిపోయిందేమో మరి ఎలా అలవాటయిందో తెలియదు షిరిడి సాయిబాబా భక్తురాలుగా మారిపోయి బాబా వారిని ఒక స్నేహితుడిగా భావించి మనసులో ఉన్న భావాలను పంచుకుని ఆయన బోధనలు ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తూ దానిలో భాగంగా బాబా వారికి ఇష్టమైన ప్రతి గురువారం క్రమం తప్పకుండా వర్షం వచ్చినా వరద వచ్చినా బాబావారిని పుష్పమాలతో అలంకరించడమే కాదు ఇద్దరు లేదా ముగ్గురు అన్నార్తులకి కడుపు నింపడం ఒక వ్రతంగా పెట్టుకుని ముందుకు సాగుతోంది. ఒక భర్తగా నేను అందుకు సహకరించడం కూడా ఆమెకు అది ఒక బహుమతి.
ఈ రోజుల్లో స్త్రీలు అందరూ వాహనం నడపని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే అవసరం అటువంటిది. మగవాళ్లు పనులకు వెళ్లిపోతే ఆడవాళ్లు పిల్లల పూర్తి బాధ్యత తీసుకుని వాళ్ల అవసరాలు తీర్చడానికి వాహనాలు నేర్చుకుంటున్నారు. రెండు చక్రాలు వాహనమే కాదు నాలుగు చక్రాల వాహనం కూడా మగవాళ్ళతో పోటీ పడి నడుపుతున్నారు.
అలా కష్టపడి నాలుగు చక్రాల వాహనం నేర్చుకుని అవసరమైనప్పుడు కుటుంబానికి సహాయపడే స్థాయికి ఎదగడం అందుకు అవసరమైన వాహనాలు నేను సమకూర్చడం ఆమెకు నేను ఇచ్చిన బహుమతి కదా!
ఒక కుటుంబంలో అన్ని సవ్యంగా జరిగితే అది మన గొప్పతనం అని విర్రవీగిపోతాం. మన గొప్ప ఏముంది. పైన ఆడించేవాడు ఒకడుంటాడు. ఆయన ఏవిధంగా ఆడిస్తే మనం కూడా అలాగే ఆడతాం. భగవంతుడు ఇచ్చిన మేరకు పిల్లలకు విద్య నేర్పించి మంచి విద్యాబుద్ధులతో పిల్లలు ఎదిగి కాసు బంగారం కాకపోయినా రెండు మెడల్స్ చేతిలో పెట్టినప్పుడు కాలేజీ దాటకుండానే ఉద్యోగాలు తెచ్చుకున్నప్పుడు ఆమెకు కలిగిన ఆనందం భగవంతుడిచ్చిన బహుమతి కదా. ఇంతకన్నా విలువైనది ఏముంటుంది.
నాన్న కన్నా అమ్మని ఎక్కువగా ప్రేమించే పిల్లలు మనసులో ఉన్న భావాలను పంచుకునే పిల్లలు అమ్మకు సహకరించే పిల్లలు ఇవి కూడా బహుమతులే ఒక ఇల్లాలికి.
పిల్లల పెళ్లిళ్లు కలలో జరిగినట్లు జరిగిపోయి అమ్మమ్మ అయిపోయి ముద్దుల మనవరాలు మాటలతో రోజు మురిసిపోయే అదృష్టం అది కూడా ఒక పెద్ద బహుమతి .
కొత్తగా వచ్చిన కుటుంబ సభ్యులను కూడా తన బిడ్డలు లాగే
అనుకునే మనస్తత్వం ఉండడం దేవుడు ఇచ్చిన బహుమానం.
అన్నిటి కి మించి రోజు గుప్పెడు మాత్రలు మింగుతున్న ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా తన బాధ్యతలన్నిటిని సక్రమంగా నెరవేరుస్తూ జీవితం గడపడం కూడా భగవంతుడు ఇచ్చిన బహుమతి.
ఆమె అయితే ఇవాళ పుట్టింది. నేనైతే ఎప్పుడో ముప్పై
మూడు సంవత్సరాల క్రితం ఆమెకు పసిబిడ్డని. జ్ఞానం తెలిసిన పెద్ద బిడ్డని.
భర్తకు ఏమి బాధ్యతలు అప్ప చెప్పకుండా ఉదయం తొమ్మిదిగంటలకు చేతిలో క్యారేజీ పెట్టి సాగనంపి వృత్తిలో నేను ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటే ఆనందపడి దానికి ఆమె సంపూర్ణ సహకారాలు అందించి ప్రశ్నలతో వేధించకుండా ఆదివారం పూట కూడా ఇంట్లో ఉండకపోయినా ఆయన బాధ్యత అటువంటిది అని అనుకుని నన్ను ముప్పై ఐదు సంవత్సరములు పాటు వృత్తికి అంకితం చేసి నేను ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఎంతోమంది పొగిడిన తను మనసులో ఆనంద పడుతూ కించిత్ గర్వం కూడా చూపించకుండా నాతోపాటు కొన్ని కార్యాలయాలకు కూడా వచ్చి సహాయ సహకారాలు అందించి పదవీ విరమణ జీవితం సంతృప్తికరంగా సాగేలా ఏర్పాటు చేసే మనస్తత్వం కలిగి ఉండడం ఆమెకు భగవంతుడు ఇచ్చిన పెద్ద బహుమతి.
ఒక ఇల్లాలికి ఇంతకంటే విలువైన బహుమతులు ఏం కావాలి. ఆరు పదుల వయసు లో అడుగుపెట్టిన ఆమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.
ఇంతకీ మీరు ఇచ్చే బహుమతి చెప్పలేదు అంటారు అందరూ . అందుకే నేను అక్షర రూపంలో ఇచ్చాను. అక్షరం శాశ్వతమైంది.
ఒక భార్య గురించి ధైర్యంగా భర్త ఇలా చెప్పడమే ఆమెకు ఒక బహుమతి అంటూ బంధువులందరి మధ్య ఉపన్యాసం ముగించాడు తన భార్య సౌజన్య అరవై సంవత్సరముల పుట్టినరోజు పండగ సందర్భంలో రాజశేఖర్.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ.9491792279
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి