పాఠశాల తెరిచిన తొలి రోజులలో
ప్రతి సంవత్సరం జూన్ నెలతో విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది. అసలు విద్యా సంవత్సరం అంటే ఏమిటి? పాఠశాలలు యూనివర్సిటీలు వేసవి సెలవులు అయిపోయిన తర్వాత తిరిగి మళ్లీ తరగతులు , పరీక్షలు, సెలవులు జరిగే ఒక స్థిరమైన కాలాన్ని సూచిస్తుంది.
ఏ విద్యార్థి కైనా సెలవులు ఉంటే సరదా. అందులో వేసవి సెలవుల తర్వాత తొలిరోజు పాఠశాలకు వెళ్లే పిల్లలు అంత ఉత్సాహంగా ఉండరు. ఇన్నాళ్ళు వేసవి సెలవుల మాధుర్యాన్ని అనుభవించి క్రమశిక్షణ జీవితానికి దూరంగా ఉండి తమ ఇష్టం వచ్చినట్లు ఆటలాడుకుని పాటలు పాడుకుని సినిమాలు షికార్లు వాళ్ళ ఇష్టం. అలా ఆనందంగా గడిపిన వేసవి సెలవు లను మర్చిపోలేక మళ్లీ స్కూలుకి వెళ్లాలంటే బెంగ బెంగగా ఉంటుంది పిల్లలకి. వేసవి సెలవులు అయిపోయి రెండు రోజులు ముందు నుంచి ఇంకా హాలిడేస్ ఇంకా రెండు రోజులే ఉన్నాయి అంటూ రోజు బెంగగా చెబుతుంటారు.
మరి పిల్లల పరిస్థితి ఇలా ఉంటే తల్లి తండ్రి పాత స్కూల్లో కంటిన్యూ చేయాలా కొత్త స్కూలుకు మార్చాలా కట్టవలసిన ఫీజులు కొనవలసిన పుస్తకాలు బస్సు ఫీజులు యూనిఫారం వీటన్నిటిని సమకూర్చుకునే హడావిడిలో ఉంటారు. ఆ ఆర్థిక భారాన్ని తట్టుకోవడానికి రకరకాల ప్రణాళికలు వేసుకుంటూ విద్యా సంవత్సరానికి ఏర్పాట్లు చేసుకుంటారు.
స్కూళ్లు తెరిచే కొద్ది రోజుల ముందు నుంచి తల్లిదండ్రులు పాఠశాల నుండి పుస్తకాలు తీసుకోవడం తీసుకున్న పుస్తకాలకి అట్టలు వేయడం పేర్లు ఉన్న స్టిక్కర్ అతికించడం కూడా ఆ తల్లిదండ్రులకి నిజంగా ఒక పెద్ద పని. ప్రస్తుతం ఉన్న స్కూలు కాకుండా ఇంకొక స్కూలుకు మారిస్తే చెప్పక్కర్లేదు తల్లిదండ్రుల కష్టాలు.
ఈ రోజుల్లో పిల్లల చదువులంటే మామూలు విషయం కాదు. చిన్న చదువులు కూడా లక్షల్లో ఫీజులు. గవర్నమెంట్ వారి పాఠశాలలు ఎంత ఆధునికరించిన కార్పొరేట్ స్కూళ్లతో పోటీ పడుతున్న అతి సామాన్యులు సైతం కార్పొరేట్ స్కూల్ వైపే మొగ్గు చూపుతున్నారు. చిన్న స్థాయి ఉద్యోగులు కూడా అప్పులు చేసి పిల్లల్ని కార్పొరేట్ స్కూల్లో చదివిస్తున్నారు. మధ్యతరగతి వాళ్ళకి పిల్లల చదువు ఒక సమస్యగా మారిపోయింది.
ఇదిలా ఉంటే కొత్తగా స్కూలులో జాయిన్ పిల్లలు కొంతమంది నవ్వుతూ కొంతమంది ఏడుస్తూ కొంతమంది తల్లిదండ్రులను ముప్పు తిప్పలు పెడుతూ క్లాసులోకి వెళ్తారు. అంతవరకు స్కూలుకు వెళ్ళనని పిల్లలు ఏడుపు, ఇంటికి వచ్చిన తర్వాత తల్లి పిల్లను విడిచి పెట్టలేక ఏడుపు ఇది ప్రతి ఇంట్లో జరిగే ప్రహసనం. యూనిఫారం వేసుకుని బూట్లు వేసుకుని టై కట్టుకుని బుజ్జి బుజ్జి చేతులతో బ్యాగ్ భుజానే తగిలించుకుని కొత్తగా స్కూల్ కి వెళుతున్న పిల్లల్ని చూసి తల్లిదండ్రుల కళ్ళల్లో ఎంతో ఆనందం కనిపిస్తుంది .
ఆ ఇంటి ఇల్లాలి బాధ్యతలలో పిల్లల్ని స్కూల్ నుండి ఇంటికి తీసుకురావడం కొత్తగా చేరుతుంది. మొదటి రోజు స్కూలుకు వెళ్లిన పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఏం చెప్పారు స్కూల్లో అని తల్లి అడిగిన ప్రశ్నకి "అన్నీ చెప్పేసారమ్మ" అని పిల్ల చెప్పిన సమాధానానికి ఆ తల్లి ఎంత ఆనంద పడుతుందో వర్ణించ వీలు లేనిది.
ఇంకా పాత విద్యార్థులు అయితే పాత క్లాసు రూమ్ ను వదిలేసి కొత్త క్లాసు రూముని వెతుక్కుంటూ వెళ్లి క్లాసులో కూర్చునేవరకు చాలా ఆందోళనగా ఉంటారు. ఒకసారి క్లాసులో కూర్చున్న తర్వాత అప్పుడే నేను ఈ తరగతులకు వచ్చేసాను అని గర్వంగా ఫీల్ అవుతారు.
పక్కనున్న తన స్నేహితులతో తన వేసవికాలం సెలవులు అనుభవాలన్నీ పూసగుచ్చినట్లు చెబుతూ ఒకరకంగా గర్వంగా ఫీల్ అవుతారు. ఇక విద్యార్థులు ఇలా ఉంటే ఉపాధ్యాయులు కూడా వేసవికాలం సెలవుల అనుభవాలన్నీ తన తోటి టీచర్ల తోటి పంచుకుంటూ కొత్తగా జాయిన్ అయిన వారిని చేర్చుకుంటూ జూన్ నెల ఆఖరి వరకు పాఠాలు మొదలు పెట్టరు.
వేసవి సెలవుల్లో కాస్త విశ్రాంతి తీసుకున్న విద్యార్థుల తల్లిదండ్రుల దినచర్య ఇకనుండి మారిపోతుంది.
అలా విద్యా సంవత్సరం అంతా తల్లి తండ్రులు కష్టపడి పిల్లలు జీవితం లో ఒక స్థాయికి చేరుకోవడానికి చేసే ప్రయత్నాలు అన్నీ ఈ విద్యాసంవత్సరము లోనే.
ఇవన్నీ చూస్తుంటే, విద్యా సంవత్సరం అంటే పుస్తకాలు, పరీక్షలే కాదు—పిల్లల భవిష్యత్తుకి వేయబడే బిగువైన తొలి అడుగులు. తల్లిదండ్రుల ఆశలు, ఉపాధ్యాయుల అంకితభావం, పిల్లల కష్టపడి ఎదగాలనే తపన—all these come together to shape one academic year.
జూన్ మాసం మొదలైతే… ఓ ఇంటి ఆశలు పుట్టుకొస్తాయి, ఓ తల్లిదండ్రుల జీవితం కొత్త దారిలో ప్రవహిస్తుంది, ఓ చిన్నారి తొలి బడిపాఠం మొదలవుతుంది.
ఈలా ప్రారంభమైన విద్యా సంవత్సరం చివరికి ప్రతి ఇంటిలో ఆనందాన్ని, గర్వాన్ని, నమ్మకాన్ని కలిగించే విజయగాధగా నిలవాలని కోరుకుందాం.
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి