శ్రమజీవి
.
ఆ శ్రమజీవి చెమట చిందించకపోతే మన రోజు గడవదు… ఈ వాక్యం కేవలం మాట కాదు—మన జీవన సత్యం. మనం ఉదయం నిద్రలేవగానే కనిపించే శుభ్రత, మనం తినే ఆహారం, మనం ప్రయాణించే వాహనం, మనం నివసించే ఇల్లు—ఇవన్నీ ఒక శ్రమజీవి చెమటతో నిర్మితమైనవే. మనం చూస్తున్న సౌకర్యం వెనుక, అతను చూడని కష్టాల చరిత్ర దాగి ఉంటుంది.
శ్రమకు మనం ధర కడతాం. కానీ ఆ శ్రమ విలువను మాత్రం ఎప్పటికీ కొలవలేము. మనం ఇచ్చే జీతం అతని కష్టానికి ఒక చిన్న ప్రతిఫలం మాత్రమే. కానీ అతను వెచ్చించే శక్తి, అతను మోసే బాధ్యతలు, తన కుటుంబం కోసం చేసే త్యాగాలు—ఇవి అన్నీ కలిపితే అది ఒక అమూల్యమైన రుణంగా మారుతుంది. ఆ రుణం మనం డబ్బుతో తీర్చలేము… గౌరవంతో మాత్రమే కొంతైనా చెల్లించగలం.
ఉదయం లేవగానే “అమ్మగారు…” అనే పిలుపు వినిపిస్తే, అది ఒక సాధారణ శబ్దం కాదు—ఒక నమ్మకం. ఒక శ్రమజీవి తన ఇంటి పనులు పక్కన పెట్టి, మన ఇంటిని శుభ్రంగా మార్చడానికి వస్తుంది. మనకు అది ఒక పని మాత్రమే అనిపించవచ్చు… కానీ ఆమెకు అది జీవనాధారం. ఆమె చెమటలో తన పిల్లల భవిష్యత్తు దాగి ఉంటుంది.
తెల్లవారక ముందే సైకిల్ తొక్కుకుంటూ ఇంటింటికి తిరిగి సమయానికి పాల ప్యాకెట్లు అందించే వ్యక్తి, నెత్తిమీద తట్ట మోసుకుంటూ ఆకుకూరలు అమ్మే అమ్మాయి—వారి చెమటలో మన ఆరోగ్యం దాగి ఉంటుంది.పొలంలో పంట పండించే రైతు—అతని చెమటలో మన ఆకలి తీరే అన్నం ఉంది.
వంటగదిలో రుచికరమైన భోజనం తయారు చేసే గృహిణి—ఆమె శ్రమలో ప్రేమ ఉంటుంది.స్టీరింగ్ పట్టుకుని మనలను గమ్యానికి చేర్చే డ్రైవర్—అతని శ్రమలో బాధ్యత ఉంటుంది.
మనసు పడిన ప్రతి వస్తువును మన ఇంటికి చేర్చే డెలివరీ బాయ్స్—జొమాటో, అమెజాన్ వంటి సంస్థల ద్వారా పనిచేసే వారు—వీరు కూడా శ్రామికులే.
దుకాణాల్లో కనిపించే ప్రతి వస్తువు వెనుక కూడా ఎన్నో కనిపించని చేతుల శ్రమ దాగి ఉంటుంది. మనకు తెలియకపోయినా, మనం వారికి రుణపడి ఉంటాం.
పరిశ్రమల్లో విషపు పొగల మధ్య, యంత్రాల గర్జనల మధ్య జీవితం గడిపే ప్రతి శ్రామికుడు—దేశ ప్రగతికి అసలు పునాది.
తన బాధలను గుండెల్లో దాచుకుని, కుటుంబ శ్రేయస్సు కోసం శ్రమించే ఇంటి యజమాని కూడా ఒక కార్మికుడే.
ఆ కర్మవీరుల స్వేదజలం నగరాలను అద్దంలా మెరిసేలా చేస్తుంది. స్వచ్ఛతను కాపాడుతుంది. వ్యాధుల నుంచి రక్షిస్తుంది. ప్రజల ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది.
మన ముందు కనిపించే ఆ శ్రమజీవి కేవలం ఒక పనివాడు కాదు… మన జీవనయాత్రలో నిశ్శబ్దంగా తోడుగా నడిచే ఒక మహానుభావుడు. అతని చెమట బిందువులో అతని కష్టం మాత్రమే కాదు—మన సౌఖ్యానికి అతను చెల్లిస్తున్న మూల్యం దాగి ఉంటుంది.
మనము కొన్నిసార్లు వారికి “ధన్యవాదాలు” చెప్పడానికీ వెనుకడుగు వేస్తాం. కానీ నిజంగా చూస్తే… మనం వారికి ఋణపడి ఉన్నవాళ్లం. ఆ ఋణం డబ్బుతో తీరదు. అది గౌరవంతో, మనసుతో మాత్రమే కొంతైనా తీర్చగలం.
ఒక చిన్న మాట, ఒక చిరునవ్వు, ఒక గౌరవప్రదమైన చూపు—ఇవే వారికి ఇచ్చే గొప్ప బహుమతులు.
మన సమాజం అభివృద్ధి చెందాలంటే, శ్రమకు గౌరవం పెరగాలి. శ్రమజీవిని చిన్నచూపు చూడటం ఆపాలి. అతని పని చిన్నది కాదు—మన జీవితం నిలబడే బలమైన ఆధారం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి