ప్రేమ ఋణo



వాళ్లు పాలు తాగే పసిపిల్లలు కాదు.
నడక నేర్చుకునే నవ్వుల పాపాయిలు కాదు.
మాటలు రాని ముద్దుల బిడ్డలు కాదు.

అయితే… ఈ రోజు మన కళ్ల ముందు కనిపిస్తున్న వాళ్లు —
మన తల్లిదండ్రులే.

ఒకప్పుడు మనం తడబడుతూ అడుగులు వేస్తే, మన వేళ్లను పట్టుకుని నడిపించిన వాళ్లు వాళ్లే. కిందపడితే కన్నీళ్లు తుడిచి, మళ్లీ లేవమని ధైర్యం చెప్పినవాళ్లు వాళ్లే.
మాట రాని మన పెదవులకు “అమ్మ”, “నాన్న” అనే మధురమైన శబ్దాలు నేర్పినవాళ్లు వాళ్లే. మన నవ్వుల్లో ప్రపంచాన్ని చూసినవాళ్లు వాళ్లే.

కాలం… ఎంత నిశ్శబ్దంగా తన పని చేస్తుందో!
ఒకప్పుడు మనల్ని మోసిన చేతులు, ఇప్పుడు మన సహాయం కోసం ఎదురు చూస్తున్నాయి.

ఒకప్పుడు మన అవసరాలన్నీ ముందే తెలుసుకున్న వారు, ఈ రోజు తమ అవసరాల్ని చెప్పడానికి కూడా కొంచెం వెనుకాడుతున్నారు.

వాళ్లు వయసులో మనకంటే పెద్దవాళ్లే… కానీ పరిస్థితులు, కాలం కలిసొచ్చి వాళ్లను మళ్లీ పసిబిడ్డలుగా మార్చేశాయి.
ఇది ప్రకృతిసిద్ధమైన చక్రం.

నిన్న మనం పిల్లలం — వాళ్లు ఆధారం.
ఈ రోజు వాళ్లు పిల్లలు — మనమే ఆధారం.
ఈ మార్పును అర్థం చేసుకున్నప్పుడు, మన బాధ్యత కేవలం కర్తవ్యంగా ఉండదు… అది ప్రేమగా మారుతుంది.
వాళ్లు మళ్లీ పసివాళ్లయితే, మనము మళ్లీ వాళ్ల తల్లిదండ్రులమవ్వాలి — ఆప్యాయతతో, ఓర్పుతో, ప్రేమతో.
అడుగులు తడబడితే ఊతకర్రలా నిలబడాలి.

చేతులు వణికితే మన చేతులు ముందుకు చాపాలి.
పదేపదే చెప్పినదే చెప్తే, వయసు మహత్యం అని సరిపెట్టుకోవాలి.

నీ చిన్న వయసులో నీతోటి ఎన్ని బాధలు పడ్డారో చెప్పడానికి మాటలు తప్ప సాక్ష్యాలు లేవు.
జీవితమంతా పిల్లల గురించే ఆలోచించిన వాళ్లు, ఆ మాట చెబితే — “నీ బాధ్యత కదా” అంటారు… కానీ ఆ బాధ్యత వెనుక ఉన్న త్యాగాల్ని ఎవరూ లెక్కపెట్టరు.

నిద్రలేని రాత్రులు,
తినకుండా గడిపిన రోజులు,
మన కోసం మానేసిన చిన్న చిన్న కోరికలు —
అవి అన్నీ వాళ్ల మనసులోనే దాచుకున్న కథలు.

మన విజయాల్లో వాళ్ల కష్టం శాతం ఎంత ఉందో మనకు పూర్తిగా తెలియకపోవచ్చు. కానీ మన ఒక్క నవ్వు కోసం వాళ్లు ఎంత బాధ భరించారో వాళ్ల హృదయమే చెబుతుంది.
ఇప్పుడు… వాళ్లు మళ్లీ చిన్న పిల్లలయ్యారు.

మాట మళ్లీ మళ్లీ అడుగుతారు…
వస్తువు ఎక్కడ పెట్టారో మర్చిపోతారు…
కొన్ని సార్లు మన పేర్లు కూడా గందరగోళం అవుతాయి…
అప్పుడు మనం కోపపడకూడదు… ఎందుకంటే మన చిన్నప్పుడూ అదే ప్రశ్నలు వందసార్లు అడిగింది మనమే.
మన చేతిని వదిలిపెట్టకుండా పట్టుకున్న వాళ్లే, ఇప్పుడు మన చేయి కోసం చూస్తున్నారు.

మనము చేయాల్సింది పెద్ద పని కాదు…
కొంచెం సమయం,
కొంచెం ఓర్పు,
కొంచెం ప్రేమ…
అదే వాళ్లకు ప్రపంచం అవుతుంది.
వాళ్లు మెల్లగా నడుస్తే మన అడుగులు కూడా నెమ్మదించాలి.
వాళ్లు మాట్లాడితే మనము ఆపి వినాలి.
వాళ్లు నవ్వితే మన హృదయం నిండాలి.
ఇది సేవ కాదు… ఇది ఋణం తీర్చుకోవడం కూడా కాదు…
ఇది ప్రేమకు ఇచ్చే ప్రతిస్పందన.
జీవితం ఒక వలయం…
ప్రారంభంలో వాళ్లు మన ప్రపంచం,
చివరికి మనమే వాళ్ల ప్రపంచం.
వాళ్లు మళ్లీ పిల్లలైతే…
మనము మళ్లీ తల్లిదండ్రులవ్వాలి —
అదే నిజమైన జీవితం, అదే నిజమైన మానవత్వం.

మన ఇంట్లోకి ప్రేమగా ఆహ్వానించాల్సిన వారిని, అతిథి గృహానికి అడ్రస్ చెబితే… ఏ తల్లి తండ్రి ఇకముందు ఒక బిడ్డకు జన్మనివ్వడానికి భయపడతారు. ఆలోచించుకోవాల్సింది మనమే.

వీలున్నప్పుడల్లా తల్లిదండ్రులతో గడపడం ఒక మధుర క్షణం. ప్రేమగా ఫోన్లో పలకరించడం ప్రతిరోజు చేయవలసిన ముఖ్య కార్యక్రమం.

ఏమో చెప్పలేం…
ఏదో ఒక రోజు ఆ ఫోన్ మోగదు…
ఆ మాట వినిపించదు…
కోట్ల ఖర్చుపెట్టినా కొనలేని సత్యం —
మళ్లీ దొరకని అవకాశం.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు 
కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట