అలలు మధ్య ఆత్మీయ నగరం_ విశాఖ

 


ఏముంది అక్కడ ప్రత్యేకత

అన్ని ఊళ్లలాగానే అదీ ఒక ఊరే అని ఎవరైనా అంటే ముక్తకంఠంతో వ్యతిరేక స్వరం వినిపిస్తుంది.

“కాదు… ఆ ఊరి అందమే వేరు” అనే మాట గాలిలో మారుమ్రోగిపోతుంది.

అన్ని ఊళ్లల్లో ,మా ఊరి లాగా సహజసిద్ధమైన అందాలు ఉంటాయా అని ఎదురుప్రశ్న వేస్తారు.

కొండలు సముద్రాన్ని కౌగిలించుకున్న దృశ్యం ఎక్కడ కనిపిస్తుంది?

ఉదయించే సూర్యుడి కిరణాలు అలల మీద బంగారు చీర పరచినట్టు మెరిసే తీరం ఎక్కడ ఉంటుంది?

వాన పడితే మబ్బులు కొండలపై దిగివచ్చి నగరంతో మాటలాడే అందం ఎక్కడ దొరుకుతుంది?

అందుకే అందరూ పిల్లలతో సహా మా ఊరు చూడడానికి వస్తారు అంటారు విశాఖవాసులు. 


ఉక్కు లాంటి పట్టుదల, సాగరం లాంటి మనసు ఉన్న ప్రజలు జాతీయ రహదారిలో తిష్ట వేసుకుని కూర్చున్న మా ఊరికి ఒకసారి వచ్చినవారు మళ్లీ రావాలనుకునే ఊరు అది.

చూసిన కళ్లలో నీలి జ్ఞాపకాలు మిగిల్చే నగరం అది. మాది ఉక్కునగరం కాదు. ఉర్రూతలు ఊగించే నగరం. 


బాధ వచ్చినా…

కష్టం వచ్చినా…

కన్నీళ్లు వచ్చినా…

సంతోషం పంచుకోవాలన్నా…

మేము ఆ సముద్రుడి దగ్గరికి చేరకుండా ఉండలేం.

అలలు ఎప్పటిలాగే ముందుకు వస్తూనే ఉంటాయి.

మాతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టుగా…

మనసులో దాచుకున్న బాధలన్నీ విని తీసుకెళ్లాలని వచ్చినట్టుగా…

ఆ అలలను చూస్తూ కూర్చుంటే కాలమే ఆగిపోయినట్టు అనిపిస్తుంది.

మనసులోని గందరగోళం నెమ్మదిగా తగ్గిపోతుంది.

ఎన్ని సమస్యలున్నా ఆ సముద్రం ముందు అవన్నీ చాలా చిన్నవిగా కనిపిస్తాయి.

అందుకేనేమో…విశాఖ మా కోసం కేవలం ఒక నగరం కాదు.

అది ఓ ఊరట.ఓ జ్ఞాపకం.ఓ అనుభూతి. మనసు అలసిపోయిన ప్రతిసారి ఒడి చాపే తల్లి లాంటి ఊరు.


దేవుళ్ళ పేరు పెట్టుకున్న సాగర తీరంలో నడిచి వెళ్తుంటే మనసు ఉరకలేస్తుంది. ఆరోగ్యం అందంగా ముందుకు నడుస్తుంది. అందుకేనేమో జలాంతర్గామి ఏకంగా ఇక్కడ కాపురం పెట్టేసింది. దగ్గరికి వచ్చిన వారికి తన విజయాలన్నీ చెబుతుంది. ఎదురుగా ఉన్న కాళీమాత సముద్రుడుని చూస్తూ , ముందుకు రావద్దని హెచ్చరిస్తూ ప్రతిరోజు విశాఖ ప్రజల్ని కాపాడుతూ ఉంటుంది. 


 ఆ గుడిలో నిత్యం మోగే గంటానాదం ఆ సాగర తీరానికి వచ్చే వారికి ఆధ్యాత్మికత భావం పెంపొందిస్తుంది. చీకటి పడిన తర్వాత దూరంగా ఉన్న నౌకల మీద నుంచి వచ్చే దీపాల కాంతి నక్షత్రాలు ఆకాశం నుంచి కిందికి దిగివచ్చినట్టుగా అనిపిస్తుంది. 


ఇక్కడ సముద్రుడు ఇంత అందంగా ఉరకలేస్తుంటే మూడు కొండల మధ్య కాపురం పెట్టిన యారాడ సముద్రుడి అందం వర్ణించలేము.


ఎప్పుడూ ఉరకలు వేసే సాగరానికి, నిశ్చలంగా ఉండే కొండలకి ఇక్కడ అవినాభావ సంబంధం కనబడుతుంది. రెండు ప్రకృతి బిడ్డలే. స్వభావాలే వేరు. ఎన్ని ఆటుపోట్లు వచ్చిన కదలకుండా మెదలకుండా ఉండే ఆ కొండ నిత్యం తన పాదాలు కడిగే సాగరంలో ఉండే జలకాలాడే చేప పేరు పెట్టుకుని తన రుణం తీర్చుకుంది. అదే డాల్ఫిన్ నోస్.


ఒకప్పుడు ముక్కు మూసుకుని తపస్సు చేసేవాడిని ఋషి అనేవారు. ఇప్పుడు మనశ్శాంతి కోసం ఆ సాగర తీరం చేరి ప్రకృతి అందాలను తిలకిస్తుంటే ఋషిలా మారిపోతారు. కానీ అది ఋషులు లేని కొండ ఋషికొండ.


అది మంచు కొండ కాదు. మదిని దోచే కొండ. అయ్యవారు అమ్మవారు నివాసం ఉండే కొండ. ఆకాశంలో ఎగిరే విమానం, పట్టాల మీద పరిగెత్తే రైలు బండి, రోడ్డు మీద నడిచే బస్సు అన్నింటి మీద ఎక్కి విశాఖ నగరం చూసాం. ఇప్పుడు తాడు మీద నడిచే ట్రాలీ ఎక్కి గిరిప్రదక్షిణ చేసి అదేనండి కైలాసగిరి, విశాఖ అందాలన్నీ చూడొచ్చు. ట్రాలీలో ప్రయాణం చేస్తుంటే ఒక పక్క భయం, మరొక పక్క ఉరకలు వేస్తున్న సముద్రం, అందంగా మెరిసిపోతున్న నగరం, పిట్టల్లా కనబడుతున్న జనం, అమ్మో ఇక్కడి నుంచి పడిపోతే అనే భయం మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. అన్నిటికీ నేనే అండగా ఉంటాను అంటూ దూరంగా కనబడుతున్న పార్వతీ పరమేశ్వరులు అభయం ఇస్తారు.


ఎక్కడినుంచి ఆ జంతువుల అరుపులు ఒకవేళ కైలాసగిరి మెట్లకి ఆ పక్కన ఈ పక్కన ఉన్న చెట్ల గుంపులోంచి జంతువుల అరుస్తున్నాయా కాదు అడవి అంతా నగరానికి వచ్చేసింది. అరుపులు అక్కడి నుంచే . జంతువులన్నీ ప్రదర్శన కి వరుసగా బోనులో నిలబడి అరుస్తున్నాయి. బందీలుగా ఉన్న జంతువులను చూస్తే మనకు ఆనందం . అవి స్వేచ్ఛగా తిరిగితే భయం. అందుకే నగరానికి వచ్చిన వాళ్ళు ఊరు చివరన ఉన్న ఆ ప్రదర్శనశాలను చూడకుండా ఉండరు. 


. గత చరిత్ర వైభవo ,సంస్కృతి మనకు ఎలా తెలుస్తుంది. ఆనాటి జ్ఞాపకాలను అందంగా భద్ర భరిస్తే ఈనాటి తరానికి మన వైభవం ఏమిటో తెలుస్తుంది. అలా సాగర తీరంలో నావికాదళం పాకిస్థాన్ పై సాధించిన యుద్ధ విజయానికి గుర్తుగా పెట్టినది "విక్టరీ ఎట్ సి వార్ మెమోరియల్ "మ్యూజియం చూడవలసిందే. 


ఈ విమానం గాల్లోకి ఎగరదు. ఒకప్పుడు ముప్పై వేల అడుగుల ఎత్తులో ఆకాశాన్ని చీల్చుకుంటూ ప్రయాణించిన, జీవితమంతా గాలిలో గడిపిన ఆ విమానం ఇప్పుడు సాగర తీరంలో ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంలో విశ్రాంతి తీసుకుంటోంది. గత వైభవానికి సాక్ష్యంగా నిలిచింది.


విశాఖ కేవలం కొండలు, సముద్రం, ప్రకృతి అందాలతోనే కాదు… ఆధ్యాత్మికతతో కూడా మనసును హత్తుకునే నగరం. ఉదయం వేళ సముద్ర అలల శబ్దం ఎంత ప్రశాంతతను ఇస్తుందో, దేవాలయాల్లో వినిపించే ఘంటానాదాలు అంతే ఆత్మశాంతిని కలిగిస్తాయి. 


ఈ నగరానికి ప్రకృతి ఒక వైపు అందం ఇస్తే… దేవాలయాలు మరో వైపు దివ్యత్వాన్ని అందిస్తాయి.


కొండ మీద కొలువై భక్తుల్ని కరుణగా చూసే సింహాచలం అప్పన్న స్వామివారు విశాఖ గుండెల్లో కొలువైన ఆధ్యాత్మిక శక్తి. కొండ ఎక్కుతూ వెళ్తుంటే వీచే చల్లని గాలి, దారిపక్కన కనిపించే చెట్ల గుంపు, ఆ గుంపులో నుంచి వచ్చే సంపంగి పూల సువాసన, గుడి గంట శబ్దాలు,మనసులో ఒక ప్రశాంతతను నింపేస్తాయి. అక్కడికి వెళ్లాక కనిపించే శిల్పకళ, ఆలయ వైభవం, నిత్య పూజలు… ఇవన్నీ చూసినవారికి ఒక దివ్య అనుభూతి కలుగుతుంది. చందనం పూతతో దర్శనం ఇచ్చే అప్పన్న స్వామివారి ప్రత్యేకత మరెక్కడా కనిపించదు. స్వామిని దర్శించుకుని కప్ప స్తంభాన్ని కౌగిలించుకుని కొండ దిగివస్తుంటే గుండె బరువు తగ్గి మనసు దూదిపింజి వలె తేలిపోతుంది


నగరం నడిబొడ్డున ప్రజల ఆరాధ్య దైవంగా నిలిచిన కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం విశాఖ ప్రజల హృదయ స్పందన లాంటిది. పండుగలు వస్తే ఆలయం పరిసరాలు భక్తులతో నిండిపోతాయి. అమ్మవారి దర్శనం చేసుకుని బయటకు వచ్చే ప్రతి ఒక్కరి ముఖంలో కనిపించే ప్రశాంతత చూడాలి. ఏ పని ప్రారంభించినా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకునే ప్రజల విశ్వాసం ఆ ఆలయ గొప్పతనాన్ని చెబుతుంది.


ఈ స్వామి కొండ మీద ఉండే కోనేటి రాయుడు కాదు.ఇది కైలాసంలో ఉండే ఆదిదంపతుల గుడి అసలే కాదు. భారీ విగ్రహం అసలే కాదు . విగ్రహం చూస్తే జానెడు మహిమ చూస్తే బారెడు అన్నట్టు ఉంటుంది ఇక్కడ. ఇక్కడ స్వామి అభిషేక ప్రియుడు. సంపత్ వినాయకుడు. అభిషేకం కోసం బారులు తీరి ఉంటారు భక్తజనులు. 


అన్ని నగరాలు మాదిరిగానే చుట్టుపక్కల ఉండే గ్రామాలను కలుపుకుని సముద్రమంత అయిపోయింది విశాఖ నగరం. అబ్బాఇంత మంది జనం ఎక్కడి నుంచి వచ్చారు ఏం చేస్తున్నారు అని ఆలోచిస్తే ఎన్నో భారీ పరిశ్రమలు , విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు, కింగ్ జార్జ్ హాస్పిటల్ ఇవి కాకుండా ఎన్నో చిన్న ,మధ్య తరగతి పరిశ్రమలు అన్ని వాణిజ్య బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులు గవర్నమెంట్ వారి ఆఫీసులు ఈ ప్రజలను ఆదరిస్తున్నాయి అనే విషయం అందరికీ తెలిసిన విషయం. మరింత ఇంతమంది జనాలకు కావలసిన సామగ్రి ఎక్కడ దొరుకుతుందంటే ఎక్కడపడితే అక్కడ సూపర్ మార్కెట్లు కిరాణా షాపులు ఉన్న అన్ని సరుకులు సంపూర్ణంగా దొరికే చోటు పూర్ణ మార్కెట్. 


ఎప్పుడూ సాగర తీరమేనా అని పిల్లలు గొడవ చేస్తే హృదయాన్ని రంజింపజేసే తెన్నేటి పార్కు, వైయస్సార్ పార్క్ ,హుడా పార్కు కళ్ళ ముందు కనపడతాయి. స్వాతంత్ర సమరయోధులను, రాజకీయ నాయకులను మర్చిపోకుండా వారి పేర్లు పెట్టుకున్నాయి ఈ పార్కులు.


ఏ ఊరు వెళ్ళిన దేవాలయాలు, మసీదులు చర్చిలు, ఉంటాయి కానీ ఈ ఊరికి దగ్గరగా ఉన్న బొజ్జన్న కొండల్లోకి దూరితే గౌతమ బుద్ధుడిని చూడొచ్చు. కంబాల కొండ ఎక్కితే అభయారణ్యం తిలకించవచ్చు. 


అబ్బా ఆకలేస్తుంది కదా అనుకుంటే అతి పురాతనమైన సాయిరాం పార్లర్ వంటకాల రుచి ఎవరైనా ఎలా మర్చిపోతారు. 


"విశాఖ కేవలం ఒక నగరం కాదు… అది ప్రకృతి ఒడిలో పెరిగిన ఒక అనుభూతి. సముద్రం నేర్పే సహనం, కొండలు చెప్పే స్థిరత్వం, దేవాలయాలు పంచే ప్రశాంతత, ప్రజలు చూపే ఆప్యాయత… ఇవన్నీ కలిసి విశాఖను ప్రత్యేకంగా నిలబెడతాయి. జీవిత పరుగులో మనసు అలసిపోయిన ప్రతిసారి పిలిచి ఓదార్చే స్నేహితుడిలా… కన్నీటి వేళ భుజం అందించే తల్లిలా… సంతోష సమయంలో నవ్వుల్లో కలిసిపోయే బంధువులా ఉంటుంది విశాఖ. ఒకసారి వచ్చిన వారు మళ్లీ రావాలనుకునే నగరం… చూసిన వారి హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే నగరం… అదే మా విశాఖ."


ఈ నగరాన్ని సందర్శించిన కుర్ర కారు రామకృష్ణ బీచ్ పట్టుకుని వదలరు. వయసు మళ్ళిన వాళ్ళు సింహాచలం అప్పన్నని, కనకమహాలక్ష్మిని పదే పదే మనసులో స్మరించుకుంటారు. ఎగిసిపడే అలలను చూసి పిల్లలు కేరింతలు కొడతారు. వయసులో ఉన్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఈ ప్రదేశానికి రావాలని అనుకుంటారు. అక్కడ నివాసం ఉండే ప్రజలు ఇంత ప్రకృతి సహజ సిద్ధమైన రమణీయత ఉండే ప్రదేశంలో ఉండడం నిజంగా పూర్వజన్మ సుకృతం అనుకుంటారు. 


"సముద్రం అలలతో మాట్లాడే నగరం… కొండలు నిశ్శబ్దంగా కథలు చెప్పే నగరం… భక్తి, ప్రకృతి, ప్రగతి ఒకే చోట కలిసిన నగరం… అదే విశాఖ. ఇక్కడికి వచ్చినవారు అందాలను చూసి వెళ్తారు. కానీ ఇక్కడి జ్ఞాపకాలు మాత్రం వారిని వదిలిపోవు. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన నగరం ఏదైనా ఉందా అంటే… మనసు వెంటనే చెప్పే పేరు — విశాఖ.


రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు 

కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కుటుంబం

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

సామర్లకోట