సహాయం
జీవితం క్షణ భంగురం అంటారు. ఒక్క క్షణం కాలం నిడివి గల జీవిత సంఘటనలు కొన్ని మనకి కనువిప్పు కలిగిస్తాయి. మనిషి గా ఉండవలసిన బాధ్యత గుర్తు చేస్తాయి. సమాజంలో అనేక సంఘటనలు జరుగుతుంటాయి. కానీ స్పందించే హృదయాలు కొన్నే ఉంటాయి. అవసరమైనప్పుడు ఆదుకోవడం అనేది అందరికీ చేతకాదు. ఎంతసేపు డబ్బు చుట్టూ పరిగెత్తే మనిషి తన చుట్టుపక్కల చూడడం మానేశాడు. చుట్టుపక్కల చూడరా చిన్నవాడా అని సిరివెన్నెల వారు అమృతమైన మాటలు చెప్పిన బాలు గారు గొంతులో ఆ పాట ఆనందంగా విని అర్థం మరుగున పడేసారు జనం ఆ పాట సంగతి అలా ఉంచి మనం కథలోకి వెళ్ళిపోదాం. అవి కరోనా దేశాన్ని కుదిపేస్తున్న రోజులు. రోడ్డుమీద ఎక్కడ జనసంచారం కనబడే వారు కాదు కానీ ఆసుపత్రిలోనూ మందుల షాపుల దగ్గర బాగా రద్దీగా ఉండేది. అన్ని మందుల షాపుల్లాగా ఆ మందుల షాపు దగ్గర కూడా రద్దీ ఎక్కువగా ఉంది. మందుల కోసం వచ్చినవాళ్లలో రకరకాల వయసులో వాళ్ళు ఉన్నారు. అందులో ఒక 10 సంవత్సరాల పాప చేతిలో బ్యాగు, మందుల చీటీతో వచ్చి నిలబడి ఉంది ఇంతలో ఒక వృద్ధుడు చేతిలో కర్ర పట్టుకుని నడుస్తూ ఒక మందుల చీటీ మందుల షాపు యజమాని చేతులో పెట్టాడు. ఆ ముసలాయనకి వయస్సు 70 ఏళ్ల వరకు ఉండొచ్చు. వ...