తెల్ల జుట్టు
తెల్ల జుట్టు
" ఏవండీ మీకు తెల్ల జుట్టు వచ్చేస్తోంది. అప్పుడే మీరు ముసలోళ్ళు అయిపోతున్నారు. నలభై ఐదు ఏళ్ల వయసులోనే తెల్ల జుట్టు రావడం ఏమిటి నాకు ఏదోలా ఉంది అంటూ చెప్పిన భార్య సుమతి మాటలకు వెనుక తిరిగి చూసాడు శంకర్ అద్దం ముందు తల దువ్వుకుంటూ. వయస్సు పెరుగు తోంది కదా తెల్ల జుట్టు రాక నల్ల జుట్టు వస్తుంది ఏమిటి? అయినా ఈ వయసుకి ఈ జుట్టు అందం అంటూ శంకర్ సమాధానం ఇచ్చాడు.
"లేదండి దీనికి ఏదో మార్గం యూట్యూబ్‌లో చూస్తా. ఈమధ్య తెల్ల జుట్టుకి చాలామంది చిట్కాలు పెడుతున్నారు. ఎన్నో ఆయిల్స్ కూడా వచ్చే యి. ఒక ప్రముఖ డాక్టర్ గారు కూడా ఒక చిట్కా చెప్పారు. "లేదు అవి ఏమీ నాకు ఇష్టం లేదు అవన్నీ సరిగా పని చేయవు. పైగా ఎలర్జీలు కూడా లేనిపోని పైగా బోల్డు ఖర్చు కూడా. ఒకసారి రంగు వేసే వదిలేస్తే కుదరదు. ప్రతి 15 రోజులకు ఒకసారి లేదంటే నెల రోజులకు ఒకసారి వేసుకుంటూ ఉండాలి. నాకు ఇలాగే బాగుంటుంది అన్న భర్త శంకర్ మాటలు వినిపించుకోకుండా "లేదండి దీనికి ఏదో ఉపాయం ఆలోచిస్తాను అంటూ వంటింట్లోకి వెళ్లిపోయింది సుమతి.
మన నిత్యజీవితంలో ఉన్న సమస్యలు చాలక చాలామందికి తెల్ల జుట్టు సమస్య పట్టుకుంది. పాపం కొంతమంది పాతికేళ్లు కూడా ఉండవు జుట్టు నెరిసిపోతోంది.
అలాంటి వాళ్ళు కొంత వయస్సు మళ్లే వరకు రంగులు వాడినా అర్థం ఉంది. మధ్య వయసు నుంచి కొంతమందికి జుట్టు నెరవడం ప్రారంభిస్తుంది. ఇది చాలా సహజం. కొంత తెల్లగాను కొంత నల్ల రంగులోను జుట్టు ఉంటుంది. అది చూడడానికి ఏమీ ఎబ్బెట్టుగా ఉండదు. వయసు పెరిగే కొద్దీ సౌందర్యం గురించి కాంక్ష ఏమిటి. ఎవరి ఇష్టం వారిది. ఎవరిని ఏమీ అనలే ము.
భర్త ఆఫీస్ కి వెళ్ళిపోయిన తర్వాత సుమతి టీవీలో యూట్యూబ్ పెట్టుకుని ప్రతిరోజు చూస్తుంది. ఇదే కాలక్షేపం. అందులో వచ్చే రకరకాల వంటలు. రోజుకో కొత్త రకం చెయ్యకపోతే సుమతికి తోచదు. అది చేసి భర్తని రోజు తినమని చంపుతుంది. ఈ వంటల కార్యక్రమాలు అన్ని చానళ్లు లోను వస్తున్నాయి. అంటే మామూలుగా మన ఇంట్లో చేసుకునే వంటలు మానేసి యూట్యూబ్ వంటలు తయారుచేసి పెడుతోంది శంకర్ కి. మామూలు వంటలు తిని చాలా రోజులు అయింది శంకర్ కి .సుమతికి ఆ అలవాటు మానుకోమని చాలాసార్లు చెప్పినా అది తన హాబీ అని చెప్పి రోజుకో వెరైటీ చేస్తుంది. ఇంక చేసేది ఏమీ లేక శంకరు నోరు చచ్చిపోయి మధ్యలో మంచి హోటల్ కి వెళ్లి భోజనం చేసి వస్తు ఉంటాడు. ఆఫీసులో పార్టీ అయిందని అబద్ధo ఆడతాడు. ఏమి చేస్తాడు పాపం చెప్పినా వినకపోతే.
సినిమాలు చూసి ఆ సినిమాల్లో హీరో హీరోయిన్లు వాడే బట్టలు వేసుకుంటున్నారు మన కుర్ర కారు. అలాగే ఆ సినిమాలోని సంభాషణలు కూడా చాలాచోట్ల మాట్లాడుకుంటారు .
అలాగే జుట్టు పెంచుకోవడం తల కత్తిరించుకోవడం కూడా ఆ సినిమా మాదిరిగానే చేస్తున్నారు.
అలాగే ఇప్పుడు యూట్యూబ్ లు చూసి వంటలు మొదలుపెట్టారు మనవాళ్ళు. వీడియో లో చూసి చేసే వంటలు అన్ని రకాల వయసుల వాళ్ళకి సరిపోతాయా లేదా పడతాయో పడవో తెలియదు. ఇది కేవలం కొత్తరకం వంట తయారు చేయాలని ఉత్సాహం తప్పితే మరి ఏమి కాదు. వీడియోలు పెట్టే వాళ్ళది ఏమి తప్పులేదు. వాళ్లకి వచ్చిన విద్య వాళ్లు ప్రదర్శిస్తున్నారు. ఎంతమంది ఈ వీడియో చూసారు అనే లెక్కల కోసం వాళ్ళు తంటాలు పడతారు తప్పితే వాళ్లు మనల్ని ఆ వంట తయారు చేసుకుని రుచి ఎలా ఉందో చెప్పమని సందేశం పంపమని అడగరు. వినోదం కోసం విజ్ఞానం కోసం పెట్టే వీడియోలు ప్రజలందరికీ ఉపయోగమే. ప్రత్యేకంగా ఈ వంటలు తయారు చేసే వీడియోలు నిపుణులైన వాళ్ళు కొలతల ప్రకారం ఆ వంట తయారు చేసే వీడియోలు పెడితే తప్పేమీ లేదు. మరి ఆ వంటలు ఆరోగ్యo మీద ప్రభావం ఎలా చూపుతాయో తెలియదు అని అంటాడు శంకర్. అందుకే వాటికి కాస్త దూరంగా ఉంటాడు. ఇది సుమతికి నచ్చదు. మీరు తింటారని చేశానని నిష్టూరo ఆడుతుంది. ప్రతిరోజు ప్రత్యేకమైన వంటలు ఏం తింటాం అంటాడు శంకర్. ఇలా ఉంది శంకర పరిస్థితి.
ఆఫీస్ కి వెళ్ళాడన్నమాట కానీ ఈ జుట్టుకి సుమతి కొత్త కొత్త ప్రయోగాలు ఏం చేస్తుందో అని ఆలోచిస్తూ సాయంకాలం ఇంటికి చేరేసరికి ఆరు గంటలయింది. బాత్రూంలోకి వెళ్లి స్నానం చేసి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేటప్పటికి టేబుల్ మీద కొత్తరకం బాటిల్ ఒకటి కనపడింది. ఏమిటాని చూసి దాని లేబుల్ మీద ఉన్న మేటర్ చదివేటప్పటికీ అది తెల్ల జుట్టు నల్ల జుట్టుగా చేసే ఒక రకమైన నూనె అని అది మామూలుగా కొబ్బరి నూనె మాదిరిగా ఒకసారి రాసుకుంటే జుట్టు నల్లబడుతుందని వ్రాసి ఉంది. ఖరీదు చూసేటప్పటికి గుండె గుభేలు మంది శంకర్ కి. ఈలోగా వెనక నుండి టీ కప్పు తోటి వచ్చి సుమతి రేపు శనివారం నాడు తల అంటుకునే రెండు గంటల ముందు ఈ నూనె రాసుకోండి జుట్టు రంగు మారిపోతుందంటూ నవ్వుతూ చెప్పింది.
కాల చక్రం ఎక్కడ ఆగుతుంది ఆ శనివారం రానే వచ్చింది. ఉదయమే కాఫీ తాగిన తర్వాత శంకర్ తలకి ఆ బాటిల్ లోని నూనె సుమతి మర్దన చేసింది. అలా రెండు గంటల తర్వాత బాత్రూంలోకి వెళ్లి స్నానం చేసి వచ్చాడు శంకర్. తర్వాత టిఫిన్ తినేసి ఆఫీస్ కి బయలుదేరి వెళ్ళిపోయాడు. సాయంకాలం ఇంటికి వచ్చిన శంకర్ తలని పరీక్షగా చూసింది సుమతి. జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి మరీ వెతికింది. ఎక్కడి తెల్ల జుట్టు అక్కడే ఉంది. పరిస్థితుల్లో మార్పు ఏమి లేదు. కానీ సుమతి మొహం మాడిపోయింది. హమ్మయ్య అనుకున్నాడు శంకర్. అయినా కానీ మనసులో అనుమానం తొలిచేస్తుంది. సుమతి మటుకు దీంతోటి ఊరుకోదు.
మళ్లీ ఏదో చిట్కా వెతుకుతుంది అనుకుంటూ హాల్లో వచ్చేటప్పటికి వంటింట్లో నుంచి ఏదో మాడు వాసన వస్తోంది. మూకుడు లోంచి పొగలు వస్తున్నాయి . సుమతి కూర మాడిపోతుందంటూ గట్టిగా కేక పెట్టాడు. అది కూర కాదండి పసుపు మాడ పెట్టాను. ఎందుకు అని అడిగాడు శంకర్ . అది చల్లారిన తర్వాత నూనెలో కలిపి మీ తలకు రాస్తాను అంటూ చెప్పింది సుమతి. మర్నాడు ఆ కార్యక్రమం కూడా పూర్తి చేసేసింది. సుమతి చాలా పట్టుదల గల మనిషి. ఒకసారి అనుకుంటే వదిలిపెట్టదు. మూడో రోజు మళ్ళీ జుట్టు అంతా వెతికిన తెల్ల జుట్టు మామూలుగానే వెక్కిరించింది.
అలా కనబడిన చిట్కాలు అన్ని ఒకదాని తర్వాత ఒకటి ప్రయత్నించింది సుమతి డబ్బులు ఖర్చు పెట్టి. కొద్ది రోజులు హెన్నా పెట్టింది. కొద్ది రోజులు కాటుక రాసింది. యూట్యూబ్ లో ఉన్న వీడియోలన్నీ చూసి వారానికి ఒకటి ప్రయత్నం చేసింది. అయినా ఫలితం కనపడలేదు పాపం. చివరికి ఇవేమీ నమ్మకూడదు అండి మీరు సెలూన్ షాప్ కెళ్ళి రంగు వేయించుకోండి అని సుమతి బలవంత పెడితే డబ్బులు ఖర్చు పెట్టుకుని తలకి నల్ల రంగు పూయుంచుకుని వచ్చాడు శంకర్. స్నానం చేసి వచ్చి అద్దంలో చూసుకుంటే తన మొహం తనకే ఎబ్బెట్టుగా కనిపించింది శంకర్ కి. అయినా చేసేదేముంది. అలా ప్రతినెల జుట్టుకు రంగు వేయించుకుంటూ వస్తున్నాడు. ఒకరోజు ఉన్నట్టుండి ఒంటినిండా మొహం నిండా దద్దుర్లు వచ్చాయి. దానికి తోడు విపరీతమైన దురద. అలా నాలుగు రోజులు బాధపడి చర్మవ్యాధుల డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు.
డాక్టర్ గారు ఫీజు డాక్టర్ గారు రాసి ఇచ్చిన మందులు ఖరీదు చూస్తే దిమ్మతిరిగిపోయింది శంకర్ కి. అలా నెలకు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తూనే ఉన్నాడు. డాక్టర్ గారు మందులు మారుస్తూనే ఉన్నారు. పాపం తల ఆస్తమాను గోకుతూ ఉండడంతో జుట్టు ఊడి పోవడం మొదలుపెట్టింది. భర్త అవస్థ చూసి భర్త చూస్తుండగా యూట్యూబ్ చూడడం మానేసింది సుమతి. మళ్లీ అలాంటి చిట్కాల మాట ఎత్తలేదు సుమతి. ఒకరోజు ఉన్నట్టుండి శంకర్ తిరుపతి వెళ్ళిపోయి వెంకటేశ్వర స్వామికి తలనీలాలు మొక్కు తీర్చుకుని అప్పటినుండి గుండు తోటే ఉండిపోయాడు.
ఈమధ్య ఎక్కువగా యూట్యూబ్‌లో ఇటువంటి వీడియోలు రోజు చూస్తున్నాము. అది వైద్యశాస్త్రం చదువుకున్న వాళ్ళు పెట్టిన వీడియోలైతే పరవాలేదు. శాస్త్ర ప్రమాణంగా ఉంటాయి. నిజానికి ఈ వీడియోలు చూసి చాలామంది రకరకాలుగా జుట్టు నల్లగా అవ్వడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దాని మూలంగా చర్మవ్యాధులు కూడా వస్తున్నాయి. ఈరోజుల్లో సోషల్ మీడియా అత్యంత శక్తివంతమైన ప్రచార సాధనం. ఏదైనా వీడియో కానీ వార్త కానీ పెట్టేముందు అవి శాస్త్ర ప్రమాణంగా ఆధారాలు ఉంటేనే పెట్టడం మంచిది. చిట్కా వైద్యం ఎవరో చెప్పింది మనం పెట్టకూడదు. అలాగే రాజకీయ నాయకులకు ప్రభుత్వాలకు సంబంధించిన వార్తలు కూడా ఆధారాలు లేకుండా పెట్టకూడదు. ఈ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తా యి. ఆ ఛానల్ మీద ఉన్న అభిప్రాయం ప్రజలు మార్చుకునేలా చేస్తా యి. ప్రస్తుతం ఇది చాలా అవసరం.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి