పోస్ట్‌లు

ఆవకాయ ముద్ద_ఒక బంధం

అమ్మా, నీకు ఏం తినాలి ఉందో చెప్పు! ఈ మూడు నెలలలో నీకు కావాల్సింది వండి పెడతాను. మళ్లీ పురుడు వస్తే ఐదు నెలల వరకు తినడం కుదరదు కదా… అని అడిగింది సీతమ్మ, పురిటికి పుట్టింటికి తీసుకువచ్చిన తన కూతురు భారతిని. పెద్దాపురం చేంతాడు లాంటి కోరికల చిట్టా చెప్పింది భారతి. రోజుకో వెరైటీ—ఆ చిట్టాలో టిక్కు పెట్టుకుంటూ చేస్తూనే ఉంది సీతమ్మ. అయితే ఆ కోరికల చిట్టాలో ఒక కోరిక పేరు చూసి సీతమ్మ ఆశ్చర్యపోయింది. “ఇదేమి కోరికే తల్లి! వాడిని ఇప్పుడు ఎక్కడ తీసుకురాను నేను? వాడు ఉండేదేమో గోదావరి జిల్లా. మనం ఉండేది తెలంగాణ రాష్ట్రం. బావుంది నీకోసం పనిగట్టుకుని ఇక్కడికి రావాలా వాడు?” అంటూ నవ్వుతూ అడిగింది. “ఏమో, నాకు తెలీదు. నాకు అది తినాలని ఉంది. అది రోజూ నేను తింటాను. కానీ ఆ చేతిముద్దలో ఏదో అమృతం ఉంది,” అంది భారతి. ఇంతకీ ఆ కోరిక ఏమిటని ఆత్రంగా చిట్టా చూశాడు భారతి తండ్రి సుబ్బారావు. ఆ కోరిక పేరు చూసి నవ్వు ఆపుకోలేకపోయాడు. “మావయ్య చేతితో పెట్టిన ఆవకాయ ముద్ద!” “నేను నీకు ఆవకాయ అన్నంలో కలిపి నోట్లో పెడతాను,” అన్నాడు సుబ్బారావు. “లేదు నాన్న. మావయ్య ఆవకాయ బాగా కలుపుతాడు. ఆ కలుపుతున్న విధానం చూస్తూనే నాకు నోరూరిపోతుంది...

నా కోసం రెండు అడుగులు

ఒరేయ్ ప్రసాదు… అమలాపురానికి బస్సు రిజర్వేషన్ చేయించు. ఇప్పటినుంచి చేయించుకోపోతే టికెట్లు దొరకవు. ఆఖరి సమయంలో వేలకు వేలు పోసి కొనుక్కోవాలి… అన్నాడు రామారావు ఉదయం లేస్తూనే. “ఇంకా నెలరోజులు టైం ఉంది కదా నాన్న! అయినా అందరం ఇక్కడే ఉన్నాం. పండగ ఇక్కడే చేసుకుందాం,” అన్నాడు ప్రసాద్. “లేదురా… పండగ అంటే మన ఊర్లోనే. ఆ సందడే వేరు,” అంటూ, “నేను అలా బజారుకు వెళ్లి వస్తాను,” అని చెప్పి బయలుదేరాడు రామారావు. “ఇంత పొద్దున్నే షాపులు తీయరు నాన్న,” అంటూ, “అయినా ఇప్పుడు బజారుకెందుకు?” అని అడిగాడు ప్రసాదు. “నేను పండగ బట్టలు కొనుక్కోవాలి రా. లేదంటే నా బట్టలు కుట్టి ఇవ్వరు,” అన్నాడు రామారావు. “అదేమిటండీ! ఇంట్లో పిల్లలకి ఎవరికి ముందుగానే బట్టలు కొనలేదు. మీరు మాత్రం ఇలా కంగారు పడిపోతున్నారు,” అన్న భార్య సుమతి మాటలకు నవ్వుతూ, రామారావు బజారుకి వెళ్లి తిరిగి వచ్చి కొనుక్కున్న గుడ్డ ముక్కలని అందరికీ ఆనందంగా చూపించాడు. “ఇదేమిటండీ ఈ బట్టలు! అరవై ఏళ్లు దాటిన తర్వాత ఈ పువ్వుల చొక్కాలు ఏం బాగుంటాయి మీకు? ఊరంతా నవ్వుతారు, ఇవి వేసుకుంటే,” అంది సుమతి.ఆ మాటలకు సమాధానం చెప్పకుండా రామారావు టైలర్ దగ్గరికి వెళ్లిపోయాడు. రామారావు...

అక్కడ ఏముంది?

ఏమో… మాటల్లో చెప్పలేని ఏదో ఆకర్షణ శక్తి ఉంది ఊరికి. మన ఊరు కదా! అందుకే పండగొస్తే చాలు — నగరం మొత్తం కదలిపోతుంది. రహదారిపై అష్టకష్టాలు పడుతూ, గంటల కొద్దీ ప్రయాణం చేస్తూ అయినా ఆ ఊరు చేరాలనే తపన. రహదారిపై ఎన్ని లైన్లు ఉన్నా, ఏ లైన్ వైపు చూసినా సొంత ఊరికి వెళ్లే వాహనాలే. బస్సులు… కార్లు… బైకులు… రైళ్లు… ఎవరి స్తోమతకు తగినట్లు వాళ్లు. ట్రాఫిక్ జామ్ అవుతుందన్న భయం ఉన్నా, ఆ భయాన్ని మించిన ఉత్సాహం ప్రతి ముఖంలో మెరిసిపోతుంది. ఈ మూడు రోజుల పండక్కి సొంత ఊరి దారి పడతారు. అమ్మానాన్నలు… బాల్యస్నేహితులు… బంధువులు… వాళ్లందరిని కలుసుకుంటామన్న ఆనందం ప్రతి ఒక్కరి కళ్లల్లో కొట్టొచ్చినట్టే కనిపిస్తుంది. నగరంలో పనుల ఒత్తిడితో అలసిపోయిన, విసిగిపోయిన జనం ఏదో కాస్తంత మనసుకు ఊరట, విశ్రాంతి కోసం ఊరి వైపు పరుగులు పెడతారు. “ఎక్కడున్నా పండగే కదా” అంటే కాదు — పండగ సౌరభం పల్లెటూర్లోనే తెలుస్తుంది అంటారు. అసలు పండగ మూడు రోజులే. కానీ మాకు నెలరోజులు ముందు నుంచే ఆకాశంలోని చుక్కలు ప్రతిరోజూ వాకిట్లోకి వచ్చి వెలుగు తెస్తాయి. ఊరంతా మంచు దుప్పటి కప్పుకుని ఉండగా, ఈ నెల రోజులు కోడి కూతతో కాదు — నగర సంకీర్తనతో పల్లె మేలుకుంటుంద...

వేసవి అల్లుడు

వేసవికాలం వచ్చిందంటే ఆ ఊరి అగ్రహారo ఒక్కసారిగా ప్రాణం పోసుకున్నట్టయ్యేది. ప్రతి ఏటా సెలవులకు వచ్చిన పిల్లల అరుపులు, కేకలు, నవ్వులు—వీటన్నిటితో ఇళ్లన్నీ ఉలిక్కిపడేవి. అమ్మమ్మ గారి ఊరికి వచ్చిన పిల్లలు ఊరికే ఉంటారా? తోటలూ, దొడ్లూ, పొలాలూ—వాళ్లకు ఆటస్థలాలే. ఎక్కడ చూసినా వాళ్లే, వాళ్ల సందడే. కానీ ఆ అగ్రహారంలో ఒక ఇంటి సందడి మాత్రం కొంచెం ప్రత్యేకం. పిల్లల గోలతో పాటు, భాగ్యనగరం నుంచి ప్రతి వేసవికీ వచ్చే అల్లుడు గారి సందడి కూడా అక్కడ కలిసిపోయేది. వేసవి అంటే పిల్లల సెలవులే కాదు—ఆ ఇంటికి అల్లుడు రావడంతో పండగలా ఉండేది. పిల్లలకైతే పాఠశాల సెలవులు ఇస్తారు. మరి అల్లుడు గారికి? అప్పటి రోజులు కాబట్టి నెలరోజులు సెలవు పెట్టుకుని, బ్యాంకు గుమ్మం దాటి అత్తగారింటి గడప తొక్కేవాడు సదరు అల్లుడు అచ్యుతరావు. భాగ్యనగరం నుంచి ఆ ఊరు రావడం అంటే ప్రయాణం కాదు—ఒక తపన. పన్నెండు గంటలు బస్సులో కూర్చుని, కాకినాడలో దిగి, అక్కడి నుంచి ఇంకో బస్సు, ఇంకో మార్గం. అష్టకష్టాలు పడి ఊరికి చేరేవాడు. అది అత్తగారి ఊరే కాదు—తను పుట్టి పెరిగిన ఊరు కూడా అదే. మట్టి వాసన, నీటి రుచి, మనుషుల పలకరింపులు—అన్నీ అతనికి తెలిసినవే. అందుకే ఆ ఊరంటే ...

ఫ్రెండ్ రిక్వెస్ట్

ఉదయం కాఫీ చేతిలో పెట్టుకుని ముఖపుస్తకం తెరిచిన రామారావుకు ఒక కొత్త నోటిఫికేషన్ కనిపించింది. పేరు – సంధ్య. సాధారణ చిరునవ్వుతో ఉన్న ఫోటో. ఫ్రెండ్ రిక్వెస్ట్. “ఎవరో?” అనుకుంటూ ఒక క్షణం ఆగాడు. తెలుసున్న వాళ్లు కాదు. పాత స్నేహితులు అసలే కాదు. పైగా ఆడపిల్ల. నాతో స్నేహం ఎందుకు? నా గురించి ఆమెకి ఏం తెలుసు? ప్రొఫైల్లో తన వివరాలన్నీ కరెక్ట్‌గానే ఇచ్చాడు రామారావు. వాటిని చూస్తే నాతో స్నేహం చేసే వయసు ఆమెది కాదు అనిపించింది. అయినా నాతోనే స్నేహం ఎందుకు? ఒక్కటే కారణం గుర్తొచ్చింది. నేను పెద్ద రచయితను కాదు. కానీ మనసును తాకే చిన్న చిన్న కథలు ముఖపుస్తకంలో వ్రాస్తూ ఉంటాను. ఇది నా అభిప్రాయం కాదు. ముఖపుస్తకంలోని కథాపాఠకులు వెలిబుచ్చే మాటల ద్వారా తెలుసుకున్న సత్యం. ఒక వ్యక్తిగా కాదు… రచయితగా నాతో స్నేహం చేద్దామనుకుంటుందేమో అనుకున్నాడు రామారావు. పరస్పర స్నేహితులు కూడా చాలామందే ఉన్నారు. “సరే… భయం లేదు” అనుకుంటూ అంగీకారం తెలుపుతూ బటన్ నొక్కాడు. అంతే. ఆ రోజు సాయంత్రం ఒక మెసేజ్ వచ్చింది. “నమస్తే… మీ కథలు చాలా బాగుంటాయి.” రామారావు ఆశ్చర్యపోయాడు. ఫేస్‌బుక్‌లో రాసే ఈ చిన్న కథలు ఇలా పరిచయాలకు దారి తీస్తాయని ఊహించలేద...

పరంధామయ్య కథ

ఉదయం పన్నెండు గంటలు అయింది. “పోస్ట్…” అనే కేకతో వాలు కుర్చీలో పడుకుని కళ్ళు తెరిచిన పరంధామయ్యకి, పోస్ట్‌మాన్ ఒక శుభలేఖ అందించి వెళ్లాడు. “ఎవరిది అబ్బా ఈ శుభలేఖ?” కార్డు చూస్తే చాలా పెద్దదిగా ఉంది. బాగా డబ్బున్న వాళ్లది అయి ఉంటుంది, అని అనుకుంటూ శుభలేఖ తెరిచి చూశాడు. పూర్తిగా చదివేసరికి — “అబ్బో! రవికి ఇంత పెద్ద కూతురు ఉందా!” అని లోలోపల సంబరపడ్డాడు. అంతలో వంటింట్లో నుంచి శారద బయటికి వచ్చింది. “ఎవరిదండి ఆ శుభలేఖ?” అని అడిగింది. “మా మేనల్లుడు రవి కూతురు పెళ్లిట. శుభలేఖ పంపించాడు,” అన్నాడు పరంధామయ్య ఆనందంగా. “వెళ్లి వస్తే బాగుంటుందేమో,” అని కూడా అన్నాడు. శారద నిట్టూర్చింది. “ఏదో పై వాళ్లల్లాగా శుభలేఖ పంపించి ఊరుకున్నాడు. ఏనాడైనా మన ఇంటికి వచ్చాడా? ఎప్పుడైనా ఫోన్ చేశాడా? కనీసం పెళ్లి కుదిరిందని కూడా చెప్పలేదు. వాళ్ల అమ్మానాన్న ఉన్నంతకాలం బంధుత్వాలు బానే మెయింటైన్ చేశారు. ఆ తర్వాత మీ అక్క పిల్లలందరూ మేనమామను మర్చిపోయారు,” అంది నిష్టూరంగా. శారద మాటల్లో నిజం లేకపోలేదు అని పరంధామయ్యకి అనిపించింది. అయినా… రక్తసంబంధం కదా! ఇన్నాళ్లూ ఆ చేదు నిజాన్ని కడుపులోనే దాచుకున్నాడు. అంతలో గతం కళ్ల ముందుకు వచ...

కొంగు చాటు వీరుడు

 కొంగు చాటు వీరుడు ఆ స్వరం వినగానే అందరూ ఆ గదిలోకి పరిగెడతారు. ఏం జరిగిందో అని భయపడిపోతారు. సుశిక్షితులైన సైనికుల్లాగా ఎవరి బాధ్యతలు వాళ్ళు తీర్చడానికి సన్నద్ధమవుతారు.  అక్కడున్నవాడు కండలు తిరిగిన మొనగాడు కాదు. కోడి రామ్మూర్తి గారి శిష్యుడు అసలే కాదు. తీరా చూస్తే పాలకడలిపై శేషతల్పము మీద పడుకున్న శ్రీమహావిష్ణువు కూడా కాదు. నవ మాసాలు ఆ చిమ్మ చీకటిలో ఉండి మన లోకానికి వచ్చిన మహావీరుడు.  అమ్మ కడుపులో ఉన్నంతసేపు గిరగిర తిరుగుతూ అమ్మకు పెట్టిన దానిలో వాటా కోరుతూ చక్కిలి గింతలు పెడుతూ ఈ లోకంలోకి రావడానికి సన్నాహాలు చేసుకుంటూ వచ్చేటప్పుడు అమ్మకు నొప్పి పుట్టించి భూమ్మీదకి వచ్చిన వెంటనే తన ఉనికిని చాటడానికి ఏడుస్తూ బంధువులందరికీ సంతోషాన్ని తెప్పించి నోరు తీపి చేసుకునేలా చేసే చంటి వీడు. వీడు రోజుకో సినిమా చూపిస్తాడు.  మన లోకానికి వచ్చిన మహావీరుడు అన్నారు. మరి వాడి వీరత్వం ఏమిటి ఈ లోకంలోకి రాడానికి వాడు చేసే ప్రయత్నమే వీరత్వం. వాడి తాహతకు అది ఎక్కువే. భూమి మీదకు వచ్చిన వెంటనే వాడు మనకు బంధువు అయిపోతాడు. మన అమ్మాయి అమ్మగా మారిపోతుంది.  పుట్టిన క్షణం నుంచి వాడు మనకు అతి...

నిశ్శబ్ద సేవ

ఆ నగరంలో ఆ కాలనీ ఒక ప్రత్యేకమైన ప్రదేశం. ఒకే సంస్థలో పనిచేసిన ఉద్యోగస్తులందరూ కలసి కట్టుకున్న అందమైన కాలనీ అది. ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం నిర్మించుకున్న ఒకేలా కనిపించే ఇళ్లు; వాటిలో నివసించే వాళ్లందరూ ఇప్పుడు వయసు మీద పడి పదవీ విరమణ చేసిన ఉద్యోగస్తులు. అయినా కలిసిమెలిసి కాపురం చేస్తూ, ఒక కుటుంబంలా జీవించే మనుషులు అక్కడ ఉంటారు. నగరంలో కాలనీలు చాలా ఉంటాయి. కానీ ఒకరి గురించి ఒకరు పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉన్న ఈ నగరంలో, తెల్లవారితే చాలు—ఆ కాలనీలోని సీనియర్ సిటిజన్లు అందరూ కలిసి మనసు విప్పి కబుర్లు చెప్పుకుంటూ వాకింగ్‌కు వెళ్తారు. సామూహికంగా జరిగే పూజలు, పునస్కారాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. అవసరమైన వాళ్లకు సహాయం చేయడాన్ని తమ బాధ్యతగా భావిస్తారు. “మానవసేవే మాధవసేవ” అని నమ్మి జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు. గుండెల్లోనూ, గూడు లోనూ ఎన్నో దిగుళ్లు ఉన్నా, గుడిలోని దేవుణ్ని నమ్ముకుని ముందుకు సాగే అందమైన వయసు మళ్లిన వాళ్లు ఉన్న కాలనీ అది. ఆ కాలనీలో ప్రతి ఉదయం ముందుగా కనిపించే మనిషి ఒకడున్నాడు. ఆరడుగుల పొడుగు, తెల్లటి జుట్టు, నెత్తి మీద టోపీ, పెదవుల మీద చిరునవ్వు—రామారావు గారు కాలనీలో ...

నాన్నని దాచుకున్న బీరువా

 నాన్నని దాచుకున్న బీరువా ఒకటో తారీకు జీతం అందుకుని ఆ బీరువాలో పెడుతుంటే ప్రతి నెల నాన్న గుర్తుకు వస్తాడు. ఆ బీరువా అంటే నాన్నకు అంత ఇష్టం. ఆరడుగుల పొడవు ఉండి, గచ్చకాయ రంగులో స్టీల్ హ్యాండిల్‌తో, పైన ఏడుకొండల వాడి స్టిక్కర్ అతికించి నాన్న గదిలో నిలబడి ఉండే బీరువా—నాన్న ఉన్నంతకాలం మెరిసిపోతూ ఉండేది. బీరువాలోపల ఏమున్నా లేకపోయినా, ఎప్పుడూ తాళాలు వేసుకుని మొలతాడుకు కట్టుకుని తిరిగేవాడు నాన్న. నాన్నకి ఈ అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది అంటే—వాళ్ల తాతయ్య ఇనపపెట్టికి తాళాలు అలాగే మొలతాడు కట్టుకుని తిరిగేవాడట. నాన్న చేత ఇనపపెట్టి తాళాలు తీయించి డబ్బులు లెక్క చూసుకుని మురిసిపోయేవాడట నాన్న వాళ్ల తాతయ్య. నాన్న వాళ్ల తాతయ్య ఒక పెద్ద భూస్వామి. కాలం కొట్టిన దెబ్బలకి ఎకరాలు కరిగిపోయి, ఇనపపెట్టి పాత సామాన్లు వాడి తూకానికి వెళ్లిపోయి, నాన్నకి జ్ఞానం వచ్చేటప్పటికి రెండు ఎకరాల భూమి మిగిలింది. అంతవరకు పాలేరులతో వ్యవసాయం చేయించే కుటుంబం, పొలానికి వెళ్లి పని చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిన్నప్పుడు ఇస్త్రీ బట్టలు తొడుక్కుని సరదాగా పొలానికి వెళ్లే నాన్న, ముతక పంచ కట్టుకుని గట్టు దిగి పొలం పనులు చేయవలసి...

కోరిక

  అది రద్దీ ఎక్కువగా ఉండే రాజధానినగరంలోని ఒక వీధి లో  ఉండే హోటల్ ప్రాంగణం. సుమారుగా 80 సంవత్సరాల నుండి ఆ హోటల్ అదే వీధిలో ఉంది. భోజనం హోటల్స్ చాలా  ఉంటాయి. కానీ కస్టమర్ల్ని ఆదరించి ఆప్యాయంగా కొసరి  కొసరి వడ్డించి సంతృప్తిగా భోజనం పెట్టే ఆ హోటల్ ఒక్కటే. అందుకే దూరప్రాంతాల నుండి వచ్చినవారు తప్పనిసరిగా ఈ  హోటల్ లో భోజనం చేసి వె డతారు. చక్కగా అరిటాకు వేసి వడ్డించి తెలుగువారి భోజనం పెట్టె ఏకై క భోజనశాల. కమ్మగా వేయించిన కందిపప్పు పప్పులోకి ఒక చిన్న పాత్రలో వేడివేడి నెయ్యి పనసపొట్టు కూర గుత్తి వంకాయ మజ్జిగ పులుసు గోంగూర పచ్చడి గడ్డ పెరుగు  ఆవకాయ దప్పుళo ఆకులో మెరిసిపోతూ ఆకాశంలోని హరి విల్లులా ఉంటాయి. ఆకు చూడగానే నోరూరిపోతుంది. నోట్లో పెట్టుకోగానే చేతులెత్తి మొక్కాకనిపిస్తుంది. అందుకే ఎక్కడ లేని రద్దీ. ఎప్పటిలాగే ఆరోజు కూడా హోటల్ ప్రాంగణం చాలా రద్దీగా  ఉంది. లంచ్ సమయం కావడంతో సీట్లు ఖాళీ లేక కస్టమర్లు  వెయిటింగ్ హాల్లో కూర్చున్నారు. వెయిటర్లు అటు ఇటు  బిజీబిజీగా తిరుగుతూ వచ్చిన కస్టమర్లకు ఏం కావాలో   చూస్తున్నారు. ఆ హోటల్ యజమాని ప్రత...

బహుమతి

 బహుమతి " నాన్న అమ్మ బర్తడే దగ్గరకు వచ్చేస్తుంది. అమ్మకి ఇది స్పెషల్ బర్తడే. అరవై సంవత్సరాలు వస్తున్నాయి. ఏదైనా స్పెషల్ గిఫ్ట్ ఇవ్వు నాన్న అంటూ విదేశాల్లో ఉంటున్న రామారావు పిల్లలు ఒకరి తరువాత ఒకరు ఫోన్ చేస్తూ హడావుడి చేస్తున్నారు రెండు రోజుల నుంచి. ఏం గిఫ్ట్ ఇవ్వాలి ?ఎంత ఆలోచించినా రామారావుకి ఏమి ఆలోచన తట్టలేదు. వెండి బంగారాల మీద మమకారం లేదు రామారావు భార్య సీతాదేవి కి. ఖరీదైన పట్టు చీరలు అంటే అసలు ఇష్టం లేదు. ఈ వయసులో గిఫ్ట్లు ఏం చేసుకుంటుంది. పుణ్యక్షేత్రాలు టూర్లు అంటే అసలు ఇంట్రెస్ట్ లేదు సీతాదేవికి. భర్త తెచ్చిన సంపాదనని పొదుపుగా వాడుకుని పిల్లలందరికీ పెళ్లిళ్లు చేసి పేరంటాలు చేసి కుటుంబానికి గౌరవ మర్యాదలను తీసుకొచ్చిన సగటు భారతీయ మహిళ సీతాదేవి. రామారావు గవర్నమెంట్ ఆఫీసులో ఒక చిరుద్యోగి. వెనక ఆస్తిపాస్తులు ఏమీ లేవు. మూడు గదుల కొంపలో ముగ్గురు ఆడపిల్లలతో పొదుపుగా సంసారం చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ కష్టపడి జీవితంలో పైకి వచ్చిన వ్యక్తి రామారావు.  రామారావుకి సీతాదేవికి కూడా బంధువులు ఎక్కువ. ఎవరో ఒకరు బంధువులు రామారావు ఇంట్లో విస్తరి వేయని రోజు ఉండదు. అయినప్పటికీ సీతా...

చిరుగు దుప్పటి

రాత్రి 9 గంటలు అయింది. నవంబర్ నెల చలి గజగజ వణికించేస్తోంది. ఆఖరి సవారిని దింపేసి రాజయ్య రిక్షా తొక్కుకుంటూ తన గుడిసె దగ్గర ఆపి, రిక్షా లోపలి నుంచి కవరు తీసి కప్పి గుడిసెలో అడుగుపెట్టాడు. గుడిసెలో గుడ్డి దీపం వెలుగులో చాప మీద పడుకున్న పిల్లలను కేసి ఒకసారి చూశాడు. పిల్లలు కప్పుకున్న దుప్పటి మీదున్న చిరుగులోంచి పిల్లల మొహం కనబడుతోంది. అది దుప్పటి కాదు; చిరుగుల దుప్పటి ముక్క అంటే బాగుంటుందేమో! ఆ దుప్పటి కప్పుకున్న వాళ్ల వయసు ఎంతుంటుందో అన్ని చిరుగులే ఉన్నాయి పాపం. కాళ్లదాకా కప్పుకుంటే మొహానికి సరిపోదు; మొహం దాకా కప్పుకుంటే కాళ్లకు సరిపోదు. అలా ఉంది దుప్పటి పరిస్థితి. మరి శీతాకాలం, వర్షాకాలంలో ఆ కుటుంబానికి అవే దిక్కు. అసలే గుడిసె. గుడిసె సందు తలుపుల నుంచి చలిపులి పంజా విసురుతుంటే అడ్డుకునేది పాపం ఆ చిరుగుల దుప్పట్లే. ఆ ఇంట్లో ఉన్న రెండు దుప్పట్లు పరిస్థితి కూడా అదే. చలేస్తోందని అర్ధరాత్రి పిల్లలు లేచి ఏడుస్తుంటే సమాధానం ఏం చెప్పాలో తెలియక సతమతమయ్యేవాడు రాజయ్య. వానాకాలం వచ్చే ముందు ప్రతి ఏటా దుప్పట్లు కొనమని చెప్పే భార్య మాటలకు తల ఊపడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి రాజయ్యది. రిక్షా బండి ఎంత లా...

ఆణిముత్యం

మనిషి భావాలను ప్రత్యక్షంగా ఆవిష్కరించే సమగ్ర కళ నాటకం. కేవలం చదివే సాహిత్యంతో పోలిస్తే, నాటకం కళ్ల ముందు కదిలే కవిత్వం. ఇందులో కథ, సంభాషణ, నటన, సంగీతం, వేషధారణ, వేదిక—అన్నీ కలిసిపోతాయి. అందుకే దీనిని దృశ్యకావ్యం అంటారు. ఈ కళ ప్రధాన ఉద్దేశం ప్రేక్షకుడికి వినోదం అందించడమే కాకుండా సమాజ ప్రయోజనం కూడా రచయిత ఆశించేవాడు అప్పట్లో. ఆనాడు సమాజంలో ఉండే దురాచారాలు కథా వస్తువుగా తీసుకుని నాటకాలు వ్రాసేవారు. గురజాడ వారి కన్యాశుల్కం ఒక సామాజిక ప్రయోజనం కోసం ఉద్దేశించబడింది అయితే కాళ్ళకూరి నారాయణరావు గారి వరవిక్రయం నాటకం మరొక సాంఘిక దురాచారం గురించి సమాజానికి తెలియజేసింది.  ఒక రచయిత రచన గురించి మనం చెప్పుకునేటప్పుడు ఆ రచయిత గురించి కూడా మనం తెలుసుకోవడం ముఖ్యం. ఈ నాటక రచయిత శ్రీ కాళ్ళకూరి నారాయణరావు గారు గోదావరి జిల్లాలలో జన్మించిన రచయితలలో ఒకరు. వృత్తిరీత్యా అధ్యాపకుడైనప్పటికీ సంఘసంస్కరణ అంటే మక్కువ.  అందుకే ఆనాటి సంఘంలోని దురాచారాల్ని ఖండిస్తూ వరవిక్రయం నాటకం తో పాటు వేశ్యవృత్తిని ఇతివృత్తంగా చేసుకుని చింతామణి అనే నాటకం కూడా వ్రాశారు. ఈ చింతామణి అనే నాటకం తెలుగు నాట ప్రదర్శించబడని వీధి ఉ...

పండుగ వచ్చినపుడు పసితనం

ఏదైనా పండగ వచ్చిందంటే అరవై ఏళ్ళ వాడిని పదేళ్ల పసివాడిగా మారిపోతాను. ఊరిలో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడినో అలా అయిపోతాను. బాల్యపు అనుభూతులన్నీ చక్రం తిరిగినట్లు నా కళ్ళ ముందు తిరుగుతాయి. ఇవాళ సుబ్రహ్మణ్య షష్టి. నగరంలో ఉంటే పండగల హడావుడి ఉండదు. పల్లెటూర్లోనే పండగ వాతావరణం తెలుస్తుంది. గోదావరి జిల్లాలో ఉండే చిన్న చిన్న గుడులు దగ్గర కూడా తీర్థాలు జరుగుతాయి. మనది అసలే గోదావరి జిల్లా. ఇంకేముంది! పండగలు, పబ్బాలు, సంస్కృతి, సాంప్రదాయాలు అచ్చంగా పాటించే పల్లె సీమలు ఉన్న ప్రదేశం. పవిత్ర గోదావరి ప్రవహించే ప్రదేశాలతో పాటు పుణ్యక్షేత్రాలు ఎన్నో. ఆ పుణ్యక్షేత్రాల్లో ఉన్న దేవుళ్లకి జరిగే ఉత్సవాలు, తీర్థాలు లెక్కలేనన్ని. అప్పట్లో తీర్థాలు, ఉత్సవాలు మాకు ఎక్కువ ఉత్సాహాన్ని, వినోదాన్ని ఇచ్చేవి. ఆ తీర్థాలకు వెళ్లడం అంటే ఒక సరదా. ఇంట్లో ఉన్న పెద్దవాళ్లు “తీర్థంలో ఏదైనా కొనుక్కో” అంటూ ఇచ్చే సొమ్ము జేబులో పెట్టుకుని, సైకిళ్లు తొక్కుకుని ఊరికి దూరంలో ఉండే దేవాలయాల దగ్గరికి వెళ్లడం—అదొక పెద్ద సరదా. దేవాలయం ప్రాంగణం పచ్చటి తాటాకు పందిళ్లతో, ఆ పందిళ్లు చిన్న చిన్న ఎలక్ట్రిక్ బల్బులతో అలంకరించబడి చాలా అందంగా ఉండేది. అ...

సాంబయ్య

శివరాత్రి పండుగ శివ శివ అంటూ గజగజ వణికించే చలిని కూడా తీసుకుని వెళ్లిపోయింది. ఒక్కసారిగా భానుడు తన ప్రతాపం చూపించడం మొదలుపెట్టాడు. మనిషి నిలువునా నిలబడితే మునిగిపోయేంత లోతుగా ఉండి ఎప్పుడూ నీళ్లతో ఉండే ఆ ఊరికి ఈ ఊరికి మధ్య ఉండే పెద్ద కాలువకి నీళ్లు ఇవ్వడం ఆపేసారు గవర్నమెంట్ వారు. ఈ పెద్ద కాలువ తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని ఆర్థర్ కాటన్ బ్యారేజీ ముద్దుబిడ్డ. పంటల కాలం అయిపోయింది కదా. ఇప్పుడు ఆ కాలువ నీటితో పనిలేదు. సాధారణంగా గవర్నమెంట్ వారు ఈ వేసవికాలంలో కాలువలకు నీరు ఆపేసి మరమ్మత్తులు చేస్తారు. మామూలుగా పంటల కాలంలో ఆ పచ్చటి పొలాలకు ఇరవై నాలుగు గంటలు నీళ్లు సరఫరా చేసే ఆ పెద్ద కాలువ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ తాలూకాలోని ఒక కుగ్రామం వెళ్ళాలంటే ఆ పెద్ద కాలువ దాటవాల్సిందే. ఆ పెద్ద కాలువ ఆ పక్క ఈ పక్క పెద్ద గట్లు ఉండి, ఆ గట్లు వెంబడి రకరకాల పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. కాలువ దాటాలంటే చెక్కలతో తయారుచేసిన ఒక బల్లకట్టు ఆధారం. ఆ బల్లకట్టు నడుపుతూ సాంబయ్య కుటుంబం తరతరాల నుంచి అదే వృత్తిలో జీవిస్తూ ఉండేవారు. సాధారణంగా ఉదయం ఐదు గంటల నుంచి చీకటి పడే వరకు ఆ బల్లకట్టును నడిపే సాంబయ్య, అర్ధరాత్రి అ...

అమ్మమ్మ గారి ఇల్లు

“రేపటి నుంచి నా కాలేజీకి సెలవులు!” అని ఉత్సాహంగా చెప్పాడు కిరణ్. “రేపు నేను అమ్మమ్మగారి ఊరికి వెళ్లిపోతున్నా” అనగానే, కిరణ్ మాటలు విని నవ్విపోయింది తల్లి సంధ్య. “కాలేజీకి సెలవిస్తే ఒక్కరోజు కూడా ఇక్కడ ఉండవు. అమ్మమ్మగారి ఊరు వెళ్తా అనావు. అక్కడ ఏముంది రా? నాకంటే నీకు అమ్మమ్మ ఎక్కువా?” అని అంది సంధ్య. “అవును అమ్మ! అమ్మమ్మ… కావాల్సినవన్నీ చేసిపెడుతుంది. ఆ రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రేమగా మాట్లాడుతుంది. ఆప్యాయంగా దగ్గర తీసుకుంటుంది. ఆ ఇల్లు చూస్తే స్వర్గంలా ఉంటుంది…” అని అమ్మమ్మ–తాతయ్యల గురించి చెప్పుకుంటూ ఆ రాత్రే నిద్రపోయాడు కిరణ్. --- మరుసటి ఉదయం మొదటి బస్సులోనే కిరణ్‌ని రావులపాలెం దగ్గర ఉన్న వాడపల్లిలోని అమ్మమ్మగారి ఇంటికి పంపించాడు తండ్రి రామారావు. సంధ్య తండ్రి పరంధామయ్య ఇంకా ఆ ఊరిలోనే ఉంటాడు. వృద్ధాప్యం వచ్చినా చిన్నపాటి వ్యవసాయం కౌలుకి ఇచ్చి రోజులు గడుపుతుంటాడు. పరంధామయ్యకి నలుగురు ఆడ పిల్లలు. మూడు అమ్మాయిలు హైదరాబాదులో ఉంటే, చిన్న కూతురు సంధ్య మాత్రం తునిలో ఉంది. సంధ్య భర్త రామారావు హంసవరం హైస్కూల్ హెడ్మాస్టర్. వారికి కిరణ్ ఒక్కరే కొడుకు. ఇంటి ముందు ఆగిన ఆటోలోంచి దిగిన కిరణ్‌ను...

ఆధునిక పురుషుడు

ఒకప్పుడు ఆ కుటుంబ సామ్రాజ్యానికి ఆయనే రారాజు. ఆయన మాట రాజ శాసనం. కాలు మీద కాలేసుకుని కుర్చీలో కూర్చుని ఆజ్ఞలు జారీ చేస్తే పాటించే భార్యామణి భయభక్తులతో మెలిగే పిల్లలు, యజమానిగా గౌరవం ఇచ్చే దాస దాసి జనం, సమాజంలో పురుషుడిగా ఒక గౌరవం ఉండేవి.  పురుషుడు అంటే ఒక చైతన్యం. కుటుంబానికి పునాది. కనిపించని ఒత్తిడి, దాచుకున్న కన్నీరు, చెప్పని బాధ, మౌనమైన ప్రేమ పురుషుడి లక్షణాలు. ఇరవై ఒకటో శతాబ్దం సమాజాన్ని మాత్రమే మార్చలేదు— పురుషుడి స్వరూపాన్ని కూడా లోతుగా మార్చింది. ఇప్పటి పురుషుడు గత శతాబ్దపు నిర్వచనానికి పూర్తిగా భిన్నం.ఇంతకుముందు బలం, బాధ్యత, సంపాదన, ఆధిపత్యం—ఇవి పురుషుడి ప్రధాన గుర్తింపులు. కానీ ఆధునిక సమాజం పురుషుని పాత్రను మరింత విభిన్నంగా, మరింత మానవీయంగా చూస్తోంది. ఇప్పుడు ఆయన పాత్ర కేవలం సంపాదనకే పరిమితం కాదు; అతను ఒక భార్య యొక్క సహచరి, పిల్లలకి స్నేహితుడు, తల్లిదండ్రులకు మద్దతు, సమాజానికి మార్గదర్శి, తనకు తానే మానసికంగా నిలబడే మనిషి. మునుపటి కాలంలో పురుషుని విలువ అతని ఆదాయం. ఇంటి మొత్తం బరువు అతని భుజాలపై. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది: పురుషుడు ఎంత సంపాదిస్తున్నాడన్న దానికంటే అ...